Skip to main content

10 Lakh Jobs: యువతకు దాదాపు 10 లక్షల శాశ్వత ఉద్యోగాలు: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: గడచిన ఏడాదిన్నర స్వల్పకాలంలోనే రికార్డుస్థాయిలో దాదాపు 10 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పించామని ప్రధాని మోదీ ప్రకటించారు. రోజ్‌గార్‌ మేళా కార్యక్రమంలో భాగంగా మరో 71వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందించిన సందర్భంగా వర్చువల్‌గా డిసెంబ‌ర్ 23న‌ ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. ‘‘కేవలం ఒకటిన్నర సంవత్సరాల కాలంలో 10లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాం. గతంలో ఏ ప్రభుత్వమూ ఇంత తక్కువకాలంలో ఇంతటి భారీస్థాయిలో ఉద్యోగ కల్పన చేపట్టలేదు.
Record recruitments in one and a half years

మిషన్‌ మోషన్‌లో చేపట్టిన ఈ నియామక ప్రక్రియ నిజంగా ఒక రికార్డ్‌. యువతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ మా ప్రభుత్వ విధాన నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రభుత్వ పాలసీలు, కార్యక్రమాలు, పథకాల్లో యువతకు పెద్దపీటవేస్తున్నాం.

అత్యంత పారదర్శకంగా, నిజాయతీగా నియామక క్రతువు కొనసాగుతోంది. రోజ్‌గార్‌ మేళాలు యువత సాధికారత పెంపొందిస్తూ వారిలోని సామర్థ్యాలను వెలికితీస్తున్నాయి. నేటి భారతీయ యువత పూర్తి ఆత్మవిశ్వాసంతో తొణికిసలాడుతోంది. ప్రతి రంగంలోనూ విజయపతాక ఎగరేస్తోంది.
ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారిలో మహిళలు అధికంగా ఉన్నారు.

సాకారమవుతున్న మహిళా సాధికారతకు ఇది ప్రబల నిదర్శనం. ప్రతి రంగంలో మహిళల స్వావలంబనే మా ప్రభుత్వ ధ్యేయం. 26 వారాల ప్రసూతి సెలవులు మహిళలు కెరీర్‌కు ఎంతగానో దోహదపడుతున్నాయి. పీఎం ఆవాస్‌ యోజన కింద నిర్మించిన గృహాల్లో మెజారిటీ ఇళ్లకు మహిళలే యజమానులుగా ఉన్నారు. మహిళల సారథ్యంలో అభివృద్ధి దేశంలో సాకారమవుతోంది. భారతీయ యువత నైపుణ్యాలు, శక్తియుక్తులను పూర్తి స్థాయిలో సద్వినియోగంచేసుకునేందుకు ప్రభుత్వం కృషిచేస్తోంది.

చదవండి: 5600 JRO Jobs: గ్రామాల్లో ‘జూనియర్‌ రెవెన్యూ అధికారుల’.. డిగ్రీ చదివిన 5,600 మందికి నేరుగా ఉద్యోగ అవకాశం..
స్టార్టప్‌ ఇండియా కావొచ్చు, డిజిటల్‌ ఇండియా కావొచ్చు, అంతరిక్ష రంగంలో, రక్షణ రంగంలో సంస్కరణల్లో ప్రతి విభాగంలో యువతకు ప్రాధాన్యత కల్పిస్తున్నాం. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడేలా నూతన జాతీయ విద్యా విధానం తీసుకొచ్చాం. విద్యాభ్యాసం మాతృభాషలో జరిగితేనే మెరుగైన విద్యాసముపార్జన సాధ్యం. రిక్రూట్‌మెంట్‌ పరీక్షల్లో నెగ్గుకురావడానికి భాష అనేది ఒక అవరోధంగా ఉండకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 13 ప్రధాన భారతీయ భాషల్లో ప్రవేశ, పోటీ పరీక్షలను నిర్వహిస్తోంది’’అని మోదీ అన్నారు.  

గ్రామీణ భారతం కోసం చరణ్‌ సింగ్‌ కృషిచేశారు 

‘‘మాజీ ప్రధాని దివంగత చరణ్‌ సింగ్‌ జయంతి డిసెంబ‌ర్ 23న‌ జరుపుకున్నాం. గ్రామీణ భారతావని అభివృద్ధి కోసం చరణ్‌ సింగ్‌ ఎంతగానో శ్రమించారు. ఆయన చూపిన స్ఫూర్తిపథంలో మా ప్రభుత్వం నడుస్తోంది. గ్రామాల్లోనూ ఉపాధి కల్పిస్తూ స్వయంఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తున్నాం.
ఈ ఏడాదిలోనే మా ప్రభుత్వం చరణ్‌ సింగ్‌కు భారతరత్న ఇవ్వడం మాకెంతో గర్వకారణం’’అని మోదీ అన్నారు. ‘‘శ్రమించే తత్వం, తెగువ, యువత నాయకత్వ లక్షణాలే నేటి భారత్‌ను ముందుకు నడిపిస్తున్నాయి.
ప్రతిభ గల యువతలో సాధికారతను పెంచుతూ 2047కల్లా అభివృద్ధి చెందిన భారత్‌ను సాకారంచేసే దిశగా మా ప్రభుత్వం విధానపర నిర్ణయాలను అమలుచేస్తోంది. ఇప్పుడు ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్‌ త్వరలో మూడోస్థానానికి ఎదగడం ఖాయం’’అని మోదీ అన్నారు. 

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 24 Dec 2024 01:32PM

Photo Stories