Trump Tariff War: అమెరికాపై సగటున 18 శాతం సుంకాలు! టారిఫ్ వార్.. ఎవరికి లాభం?

ఏప్రిల్ 2 నుంచి పరస్పర సుంకాలు తప్పవని పునరుద్ఘాటించారు. దీని ప్రభావం మనపై ఏ మేరకు ఉండనుందంటూ జోరుగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే అమెరికా మనకు అతి పెద్ద వాణిజ్య భాగస్వామి. అందుకే అగ్ర రాజ్యంతో టారిఫ్‌ల రగడకు తెర దించేందుకు భారత్ ప్రయత్నిస్తోంది.
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఇప్పటికే అమెరికాలో పర్యటిస్తున్నారు. ఇరు దేశాలకు ఆమోదయోగ్యమైన ద్వైపాక్షిక వర్తక ఒప్పందం (బీటీఏ)పై చర్చలు జరుపుతున్నారు. ఈలోగా పలు అమెరికా ఉత్పత్తులపై టారిఫ్‌లను వీలైనంతగా తగ్గిస్తూ భారత్ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ తదితర ఉత్పత్తులపైనా టారిఫ్ కోతలు ప్రకటించే అవకాశం కన్పిస్తోంది.
ఏ మేరకు సుంకాలు?
సుంకమంటే ఒక దేశం మరో దేశం నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై విధించే పన్ను. భారత ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న సుంకాలు సగటున 4 నుంచి 5 శాతం మించడం లేదు. భారత్ మాత్రం అమెరికా ఉత్పత్తులపై సగటున 18 శాతం పై చిలుకు దిగుమతి సుంకాలు విధిస్తోంది.
లగ్జరీ కార్లు, కెమికల్స్, ఎల్రక్టానిక్స్‌పై 125 శాతం, మద్యం మీదైతే ఏకంగా 150 శాతం దాకా వసూలు చేస్తోంది! ఈ తేడాలను సరిచేయకుంటే ఏప్రిల్ 2 నుంచి తామూ అంతే మొత్తం బాదుతామని ట్రంప్ బెదిరిస్తున్నారు. అమెరికాపై ప్రధానంగా ఆధారపడ్డ భారత ఎగుమతిదారులపై ఇది గట్టి ప్రభావమే చూపనుంది.
Friedrich Merz: అలుపెరుగని పోరాటం చేసిన ఫ్రెడరిక్ మెర్జ్.. జర్మనీ చాన్స్‌లర్ ఈయనే..
ముఖ్యంగా మన ఇనుము, ఉక్కు, జౌళి ఎగుమతులపై ప్రభావం తీవ్రంగా ఉండనుంది. దిద్దుబాటు చర్యలేవీ తీసుకోని పక్షంలో 25 బిలియన్ డాలర్ల విలువైన భారత ఎగుమతులపై ప్రభావం పడవచ్చని అంచనా. అయితే మన జీడీపీలో అమెరికా ఎగుమతుల వాటా కేవలం 2.2 శాతమే. కనుక భారత్ మరీ అంతగా బెంబేలెత్తిపోవాల్సిన పని లేదన్నది ఆర్థికవేత్తల మాట.
‘‘భారత్ వంటి అతిపెద్ద మార్కెట్‌ను అమెరికా విస్మరించలేదు. అక్కడి ఈ కామర్స్ కంపెనీలు, బ్యాంకులు, ఆర్థిక సేవలు, టెక్నాలజీ సంస్థలకు భారత మార్కెట్ అంటే భారీ ఆసక్తి. సోషల్ నెట్‌వర్కింగ్ కంపెనీలకూ భారత్ ప్రధానమే’’ అని వారంటున్నారు.
అమెరికాతో భారత్ వాణిజ్యమెంత?
అమెరికాకు అతి పెద్ద ఎగుమతిదారుల్లో భారత్ ఒకటి. 2024లో ఆ దేశానికి 87.4 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేసింది. అమెరికా నుంచి 41.8 బిలియన్ డాలర్ల దిగుమతులు మాత్రమే చేసుకుంది. ఈ వాణిజ్య లోటునూ ట్రంప్ ప్రశ్నిస్తున్నారు. దీన్ని పూడ్చాల్సిందేనని పట్టుబడుతున్నారు.
మనకు మేలే!
ట్రంప్ తెర తీసిన టారిఫ్ వార్ అంతిమంగా భారత్‌కే లబ్ధి చేకూరుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. చైనా, కెనడా, మెక్సికో తదితర దేశాలపై అమెరికా ఇప్పటికే సుంకాలను పెంచడం తెలిసిందే. బదులుగా అమెరికాపై ప్రతీకార సుంకాలు తప్పవని ఆ దేశాలు కూడా స్పష్టం చేశాయి.
ఈ నేపథ్యంలో ఆయా దేశాల నుంచి అమెరికాకు ఎగుమతులు బాగా తగ్గేలా కనిపిస్తున్నాయి. ఇది భారత్‌కు సానుకూలంగా మారుతుందని, మనం మరిన్ని ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేసేందుకు వీలు కలుగుతుందని ఆర్థికవేత్తలు అంటున్నారు. ట్రంప్ తొలి హయాంలో కూడా చైనాపై సుంకాలు పెంచడంతో భారత్ బాగా లాభపడింది. ఈసారి కూడా అమెరికాకు మన మిర్చి, జౌళి తదితర ఉత్పత్తుల ఎగుమతులు బాగా పెరిగే అవకాశముంది.
Corrupt Country: ప్రపంచంలో అత్యంత అవినీతి దేశాలివే.. భారత్ స్థానం..?
ఇప్పటికే చర్యలు
అమెరికాపై విధిస్తున్న సుంకాల తగ్గింపుకు భారత్ ఇప్పటికే చర్యలు తీసుకుంటోంది..
- ఇటీవలి బడ్జెట్‌లో స్మార్ట్ ఫోన్ దిగుమతులపై ప్రకటించిన 15–16 శాతం సుంకాల నుంచి అమెరికాను మినహాయించాలని కేంద్రం భావిస్తోంది.
- వైద్య పరికరాలు, లగ్జరీ మోటార్ సైకిళ్ల వంటి పలు అమెరికా ఉత్పత్తులపై టారిఫ్‌లను తగ్గించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.
- వాణిజ్య లోటును తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా అమెరికా నుంచి రక్షణ, చమురు తదితర ఉత్పత్తుల దిగుమతులను ఇతోధికంగా పెంచేందుకు ట్రంప్–మోదీ భేటీలో అంగీకారం కూడా కుదిరింది.
- ఏఐజీ వంటి అమెరికా బీమా దిగ్గజాలకు లబ్ధి చేకూర్చేలా ఆ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 100 శాతానికి పెంచుతూ తాజా బడ్జెట్లో కేంద్రం నిర్ణయం తీసుకుంది.
- భారత ఔషధాలపై అమెరికా ఎలాంటి సుంకాలూ వసూలు చేయడం లేదు. కనుక అమెరికా ఔషధ దిగుమతులపై భారత్ విధిస్తున్న 10 శాతం సుంకాన్ని కూడా ఎత్తేయాలని ఫార్మా సంస్థలు సూచిస్తున్నాయి.
- అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న పలు వ్యవసాయోత్పత్తులపై ఏకంగా 42 నుంచి 120 శాతం దాకా సుంకాలున్నాయి. వీటిని కూడా బాగా తగ్గించే అవకాశముంది.
అమెరికాకు మన ప్రధాన ఎగుమతులు
- ముత్యాలు, విలువైన రాళ్లు
- ఎలక్ట్రానిక్ యంత్రాలు, పరికరాలు
- ఔషధాలు, అనుబంధ ఉత్పత్తులు
- అణు రియాక్టర్లు, మెషీనరీ
- పెట్రోలియం ఉత్పత్తులు,
- టెలీకమ్యూనికేషన్ పరికరాలు
- నూలు వస్త్రాలు
అమెరికా నుంచి మన దిగుమతులు
- ముడిచమురు, అనుబంధ ఉత్పత్తులు
- ఆర్టిఫిషియల్ జ్యుయెలరీ
- న్యూక్లియర్ రియాక్టర్లు, బాయిలర్లు
- పవర్ ప్లాంట్ పరికరాలు
- విమానాలు, వాటి విడిభాగాలు
- వైద్య, రక్షణ పరికరాలు
☛ Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)