What after BiPC: ఫిజియోథెరపీ కోర్సుతో ఉన్నత విద్య, ఉపాధి మార్గాల గురించి తెలపండి?
ప్రజల జీవనశైలీలోవచ్చిన మార్పులు, రోజుకు రోజుకు పెరుగుతున్న ప్రమాదాల సంఖ్య వెరసి ఫిజియోథెరపిస్టులకు డిమాండ్ నెలకొంది. ప్రమాదాలకు గురైన వ్యక్తులకు పలు అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. వీరికి ఫిజియోథెరపిస్టుల అవసరం తప్పనిసరిగా మారింది. దాంతో ఈ విభాగంలో పెరుగుతున్న రోగులకు సేవలందించే ఫిజియోథెరపిస్టులకు డిమాండ్ ఏర్పడింది. ఆర్థెయిటిస్, నడుము నొప్పులు, మోకాళ్ల నొప్పులు, గాయాలు, అవయవాలు పట్టేసినట్టు ఉండటం, ప్రమాదాల ద్వారా వచ్చిన వైకల్యాలను సరిచేయడం వంటి వాటికి ఫిజియోథెరపీ సేవలు అత్యంత అవసరం.
అర్హతలు
ఇంటర్ బైపీసీ లేదా తత్సమాన విద్యార్హత ఉన్న విద్యార్థులు బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపపీ(బీపీటీ) కోర్సుల్లో చేరొచ్చు.
బీపీటీ ఇలా
- ఇంటర్ తర్వాత బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ(బీపీటీ)కోర్సులో చేరొచ్చు. ఈ కోర్సు కాలవ్యవధి నాలుగేళ్లు ఉంటుంది. మరో 6 నెలలు ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుంది. ఫిజియోథెరపీకి సంబంధించి బీపీటీ కోర్సుల్లో ప్రవేశం పొందిన వారికి కోర్సులో భాగంగా శరీర నిర్మాణం, ఎముకలు, కండరాలు, అవయవాల పనితీరును గురించి తెలుసుకుంటారు. అనాటమీ, ఫిజియాలజీ, పాథాలజీ, ఫార్మాకాలజీ, సైకాలజీ, మెడికల్, సర్జికల్ కండిషన్లు వంటి వాటిని కోర్సులో భాగంగా బోధిస్తారు. ఈ కోర్సులో థియరీతోపాటు ప్రాక్టికల్స్‌కు సమాన ప్రాధాన్యం ఉంటుంది.
- కోర్సు చదువుతున్నప్పుడే ఫిజియాలజీ, అనాటమీ, ఎక్సర్‌సైజŒ థెరపీ, ఎలక్ట్రో థెరపీ విభాగాలపై పట్టు సాధించాలి. రోగులకు ఫిజియో సేవలు చేసే సమయంలో సహనం చాలా అవసరం. రోగులకు చికిత్సతోపాటు మాటలతో మానసిక స్వాంతన కలిగించాలి.
ఉన్నత విద్య
- బీపీటీ కోర్సు అనంతరం ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారు మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ(ఎంపీటీ)లో ప్రవేశం పొందవచ్చు. కోర్సు కాలవ్యవధి రెండేళ్లు. ఇష్టమైన విభాగంలో సేవలందించడానికి పీజీలో స్పెషలైజేషన్‌ను కూడా ఎంపిక చేసుకోవచ్చు. ఎంపీటీ తర్వాత ఆసక్తి ఉంటే పీహెచ్‌డీలో కూడా చేరవచ్చు.
ప్రవేశాలు ఇలా
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో బీపీటీ కోర్సు అందుబాటులో ఉంది. తెలంగాణలో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్‌సైన్సెస్, ఏపీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీల ద్వారా ప్రవేశాలు లభిస్తాయి. వీటితో పాటు నిమ్స్ వంటి సంస్థలు ప్రత్యేక ప్రకటన ద్వారా ప్రవేశ పరీక్షలు నిర్వహించి.. బీపీటీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నాయి.
ఉద్యోగావకాశాలు
బీపీటీ పూర్తిచేసుకున్న వారికి ఎక్కువగా కార్పొరేట్ ఆసుపత్రులో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఎంపీటీ విద్యార్హతతో స్పెషాలిటీ విభాగాల్లో ఉద్యోగాలను దక్కించుకోవచ్చు. ఇవేకాకుండా రిహాబిలిటేషన్ సెంటర్లు, పెయిన్ మేనేజ్‌మెంట్ సెంటర్లు, స్పెషల్ స్కూళ్లు, ఉమెన్ వెల్‌నెస్ సెంటర్లు, పాలీ క్లినిక్‌లు, ఓల్డేజ్ హోంలు, ప్రభుత్వ, ఆసుపత్రులు, మానసిక చికిత్స కేంద్రాలు, నర్సింగ్ హోంలు/ప్రయివేటు కేర్ సెంటర్లలో అవకాశాలుంటాయి.