TSPSC Groups
- గ్రూప్స్ అభ్యర్థులు లక్ష్యంపై స్పష్టతతో అడుగులు వేయాలి. అప్పుడే విజయం దక్కుతుంది. మీరు ముందుగా సిలబస్ అంశాలను పరిశీలించి.. వాటిలో మీకున్న నాలెడ్జ్ లెవల్‌ను తెలుసుకోవాలి. ఆ తర్వాత పూర్తి స్థాయి ప్రిపరేషన్‌కు ఉపక్రమించాలి. ప్రిపరేషన్ సమయంలో సిలబస్‌కు అనుగుణంగా మెటీరియల్‌ను ఎంపిక చేసుకోవాలి. అకాడమీ పుస్తకాలను అభ్యసించడం తప్పనిసరి అని గుర్తించాలి. ముఖ్యంగా టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 2 అభ్యర్థులకు.. తెలంగాణ హిస్టరీ, సంస్కృతి, కళలు, సాహిత్యం వంటి తెలంగాణ ప్రాంత ప్రాధాన్యం ఉన్న అంశాలకు అకాడమీ పుస్తకాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. నా ప్రిపరేషన్ సమయంలో తెలుగు అకాడమీ పుస్తకాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాను. వాటి ద్వారా పొందిన అవగాహనను తెలుసుకునేందుకు మోడల్ పేపర్స్‌ను ప్రాక్టీస్ చేశాను.
చదవండి: గ్రూప్-1,2,3,4 ప్రీవియస్ కొశ్చన్ పేపర్స్ కోసం క్లిక్ చేయండి
- అభ్యర్థులు గుర్తించాల్సిన మరో విషయం.. గ్రూప్స్ సిలబస్ పూర్తి చేయాలంటే గంటల కొద్దీ చదవాలనే అభిప్రాయాన్ని వీడాలి. ఎంత సేపు చదివాం? అనే దాని కంటే చదివిన సమయంలో ఎంత ఏకాగ్రతతో ఆకళింపు చేసుకున్నాం..అనేది ముఖ్యమని గుర్తించాలి. నా ఉద్దేశం ప్రకారం– డిగ్రీ స్థాయిలో అకడమిక్స్‌పై పట్టు ఉన్న అభ్యర్థులు రోజుకు కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలు చదివేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. ఫలితంగా అన్ని సబ్జెక్ట్‌లలోనూ అవగాహన, నైపుణ్యం సొంతం చేసుకునేందుకు వీలవుతుంది.
చదవండి: ఏపీపీఎస్సీ పరీక్ష స్టడీమెటీరియల్, మోడల్‌పేపర్స్, ప్రీవియస్ పేపర్స్, సిలబస్, గైడెన్స్, సక్సెస్ స్టోరీలు మొదలైన వాటి కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి
- ప్రిపరేషన్ పూర్తయిందనుకున్న తర్వాత మాక్ టెస్ట్‌లు లేదా మోడల్ టెస్ట్‌లకు హాజరు కావాలి. పోటీ పరీక్షల్లో విజయం దిశగా ఈ వ్యూహం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. దీనివల్ల మలిదశ ప్రిపరేషన్, అదే విధంగా పరీక్ష హాల్లో అనుసరించాల్సిన టైమ్ మేనేజ్‌మెంట్‌పై స్పష్టత లభిస్తుంది.
–ఎ.జంగయ్య, గ్రూప్–2 విజేత (ఎక్సైజ్ సబ్–ఇన్‌స్పెక్టర్)
- పంచవర్ష ప్రణాళికల లక్ష్యాలు, వివిధ రంగాలకు జరిపిన కేటాయింపులు, సాధించిన వృద్ధి, ప్రణాళికా వ్యూహాలు, విజయాలు, వైఫల్యాలపై అవగాహన పెంపొందించుకోవాలి. ముఖ్యంగా 12వ పంచవర్ష ప్రణాళికా అంశాలపై దృష్టిసారించాలి. నిర్దేశించుకున్న లక్ష్యాలను ఎంతవరకు చేరుకున్నామనే దానిపై అవగాహన పెంపొందించుకోవాలి. ఆర్థిక సంస్కరణల అమలుకు సంబంధించిన అంశాలను అధ్యయనం చేయాలి. ఇటీవలి కాలంలో వివిధ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితి సడలింపు, వస్తు-సేవల పన్ను (GST) గురించి తెలుసుకోవాలి.
- సమ్మిళిత వృద్ధి, పేదరికం, నిరుద్యోగ నిర్మూలన పథకాలు; వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాల స్థితిగతులపై ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. వ్యవసాయ రంగంలో సాంకేతికపరమైన సంస్కరణ విధానాలు, సంస్థాపరమైన సంస్కరణలు, మార్కెటింగ్, ధరలకు సంబంధించిన విధానాలపై అవగాహన పెంపొందించుకోవాలి.
- కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వివిధ పారిశ్రామిక తీర్మానాల్లోని ముఖ్యాంశాలను పరిశీలించాలి. మానవాభివృద్ధి సూచీ రూపకల్పనలో వినియోగించే సూచికలు, ఆయా సూచికల విషయంలో భారతదేశానికి సంబంధించిన గణాంకాలను అధ్యయనం చేయాలి.
- ద్రవ్యం, బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన అంశాలను అధ్యయనం చేయాలి. ద్రవ్యోల్బణానికి సంబంధించి ద్రవ్యోల్బణ రకాలు, ఆర్థిక వ్యవస్థపై ద్రవ్యోల్బణ ప్రభావం, ప్రతి ద్రవ్యోల్బణం తదితర అంశాల నుంచి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.
- ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి మధ్య తేడాలను గమనించాలి. మూలధన కల్పనలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు (కార్పొరేటు) రంగం, కుటుంబ రంగాల్లో వృద్ధిని పరిశీలించాలి.
- జాతీయాదాయ భావనలపై అవగాహన పెంపొందించుకోవాలి. జాతీయాదాయాన్ని మదించే పద్ధతులైన ఉత్పత్తి, ఆదాయ, వ్యయ పద్ధతులపై ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.
- ఆర్థిక సర్వే, బడ్జెట్ అంశాల నుంచి తప్పనిసరిగా ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. దినపత్రికలను చదువుతూ ఆర్థిక రంగంలో రోజువారీ పరిణామాలపై అవగాహన పెంపొందించుకోవడం ముఖ్యం.
జీవ వైవిధ్యానికి ప్రమాదాలు అని ప్రస్తావించినప్పుడు.. ప్రస్తుతం సమకాలీనంగా చోటు చేసుకుంటున్న సంఘటనల (వార్తల్లో అంశాలు)పై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. బట్టమేక పక్షి (Great Indian Bustard)ని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఫర్ నేచర్ (IUCN-The International Union for Conservation of Nature) క్రిటికిల్లీ ఎండేంజర్‌డ జాబితాలో చేర్చారు. ఈ క్రమంలో సంబంధిత సమాచారాన్ని .. ఆ పక్షి విస్తరణ, దానికి ప్రత్యేకంగా ఏర్పడుతున్న ప్రమాదాలు, దాని శాస్త్రీయ నామం-వంటి అంశాల ఆధారంగా సేకరించడం ఉపయుక్తంగా ఉంటుంది. ఇదే దృక్పథాన్ని ఇతర సంఘటనలకు అన్వయించుకోవడం ప్రయోజనకరం.
- పాలన అంటే ప్రభుత్వ పనితీరు, నిర్వహణ. ఆధునిక ప్రభుత్వాలు ప్రజలకు గరిష్ట సేవలు అందించడానికి అనేక సంస్కరణలు ప్రవేశపెట్టాయి. అందులో భాగంగా వచ్చినవే సుపరిపాలన, ఇ-పరిపాలన.
- గతంలో ప్రభుత్వం అంటే కేవలం సంప్రదాయ శాసనాలు, వాటి అమలుకు పరిమితమై ఉండేది. కానీ, ప్రజలు నేడు ప్రభుత్వం కంటే పాలన కోరుకుంటున్నారు. అయితే ప్రజలకు, ముఖ్యంగా అట్టడుగు వర్గాల వారికి గరిష్ట, సత్వర ప్రామాణిక సేవలను కేవలం ప్రభుత్వ సంస్థలు మాత్రమే అందించలేవు. వాటికి తోడు పౌర సమాజ భాగస్వామ్యం, కార్పొరేట్ సంస్థల సహకారం, సామాజిక బాధ్యత కూడా అవసరం. కాబట్టి సుపరిపాలనకు అవసరమయ్యే అంశాల స్వభావాన్ని, ఆవశ్యకతను అభ్యర్థులు సమగ్రంగా అధ్యయనం చేయాలి.
- పాలనలో నైతిక విలువల ఆవశ్యకత ఎంతైనా ఉంది. పాలనలో రాజకీయ జోక్యం.. ప్రభుత్వ అధికారులపై, ప్రజలకు అందించే సేవలపై ప్రభావం చూపుతుంది. అవినీతిని, ఆశ్రీత పక్షపాతాన్ని అరికట్టాలంటే ప్రజలకు వారిని ప్రశ్నించే అవకాశమివ్వాలి. అందులో భాగంగా వచ్చినవే ఈ-పౌర, సిటిజెన్ చార్టర్లు, పారదర్శకత, జవాబుదారీతనం. ఈ నేపథ్యంలో పౌర సమాజం, ప్రజావేగుల పాత్ర, ఆవశ్యకత, నిఘా సంస్థలైన లోక్‌పాల్, లోకాయుక్త, సమాచార హక్కు చట్టం, రెండో పరిపాలన సంస్కరణల కమిషన్ నివేదికలను జాగ్రత్తగా చదివి వాటి ప్రాముఖ్యతను విశ్లేషించుకోవాలి.
- తేలిగ్గా, సత్వరం సేవలు అందించేందుకు సమాచార, సాంకేతిక రంగంలో వచ్చిన మార్పులను ముఖ్యంగా ఇంటర్నెట్, వెబ్‌సైట్ ఆధారిత సేవలు, ఇ-సేవ, మీ-సేవలు, ప్రభుత్వ శాఖల సమాచారాన్ని డిజిటలైజ్ చేయడం ద్వారా ఒనగూరే ప్రయోజనాలను, పరిమితులపై దృష్టిసారించాలి.
1. తెలుగు అకాడమీ ప్రచురించిన డిగ్రీ ద్వితీయ సంవత్సరంలోని 'భారతదేశ పాలన' పాఠ్యపుస్తకం.
2. యోజన తదితర పత్రికల్లో ప్రచురితమైన వ్యాసాలు.
- పారిశ్రామిక సామర్థ్యాన్ని మెరుగుపరచడం ద్వారా పట్టణ నిరుద్యోగ సమస్యను నిర్మూలించవచ్చు. తక్కువ వ్యయంతో ప్రస్తుతం ఉన్న పరిశ్రమల విస్తరణ, ఆధునికీకరణకు తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. దీంతోపాటు నూతన పరిశ్రమల ఏర్పాటుకు ప్రయత్నించాలి.
- ముఖ్యంగా ఇనుము, ఉక్కు, రసాయనాలు, రక్షణ వస్తువులు, హెవీ మిషనరీ, విద్యుదుత్పాదన, అణుశక్తికి సంబంధించిన పరిశ్రమల ఆధునికీకరణ, విస్తరణపై దృష్టి సారించాలి. తద్వారా పట్టణ ప్రాంతాల్లో ప్రస్తుత, భవిష్యత్ తరాలకు ఉపాధి అవకాశాలు విస్తృతమవుతాయి.
- విద్యార్థులను సాధారణ విద్య నుంచి వృత్తి విద్య వైపు మరల్చాలి. తద్వారా యువత స్వయం ఉపాధి దిశగా దృష్టి కేంద్రీకరించగలుగుతుంది.
- శ్రమ–సాంద్రత పరిజ్ఞానాన్ని వినియోగించే చిన్న తరహా, కుటీర పరిశ్రమల అభివృద్ధిని ప్రోత్సహించాలి.
- పట్టణ అసంఘటిత రంగంలో అనేక మంది ప్రజలు నిమగ్నమై ఉన్నారు. అందువల్ల ఈ రంగాన్ని అభివృద్ధిపరచడం, ఆధునికీకరించడానికి తగిన చర్యలు చేపట్టాలి. ఫలితంగా పెరుగుతున్న పట్టణ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి.
- షెడ్యూల్డ్, వాణిజ్య బ్యాంకులు ప్రత్యేకంగా రిటైల్ రంగం, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు తక్కువ వడ్డీకి పరపతిని అందించాలి. అర్బన్ అసంఘటిత రంగాన్ని అభివృద్ధి చేయడానికి సేవా రంగానికి సంబంధించి అనేక యూనిట్లను అభివృద్ధి చేయాలి. ఉత్పాదక రంగాలపై పెట్టుబడులు పెంచడం ద్వారా ఉపాధి అవకాశాలను విస్తృతపరచాలి.
- గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు పెరుగుతున్న కారణంగా పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం అధికమవుతోంది. దీంతో పట్టణ ప్రాంతాల్లో మురికివాడలు కూడా పెరిగి మౌలిక సౌకర్యాల కొరత ఏర్పడుతోంది.
- తెలంగాణ ఎకానమీలో అభ్యర్థులు ప్రధానంగా దృష్టి సారించాల్సిన అంశం భూ సంస్కరణలు. మొదటి దశ భూ సంస్కరణల లక్ష్యాలు, హైదరాబాద్ రాష్ట్రంలోని భూస్వామ్య విధానాలు, కౌలు విధానాలను పరిశీలించాలి. కమతాలపై గరిష్ట పరిమితికి సంబంధించి జాతీయ మార్గదర్శక సూత్రాలను పరిశీలించాలి. తెలంగాణ ప్రాంతంలో భూసంస్కరణలకు సంబంధించి తీసుకొచ్చిన చట్టాల వివరాల గురించి తెలుసుకోవాలి.
- తెలంగాణ ప్రాంత వ్యవసాయ రంగ స్థితిగతులను ముఖ్యంగా పంటలు, ఉత్పత్తి, ఉత్పాదకత, వ్యవసాయ పరపతి, నీటి పారుదల, ఎరువుల వినియోగం తదితర అంశాలను పరిశీలించాలి.
- తెలంగాణ రాష్ట్ర జీఎస్‌డీపీలో వ్యవసాయం, అనుబంధ రంగాల వాటాలను అధ్యయనం చేయాలి. కొత్త ప్రభుత్వం ఈ రంగాల అభివృద్ధికి చేపట్టిన చర్యలపై అవగాహన పెంపొందించుకోవాలి. రుణ మాఫీ టి కార్యక్రమాల సమాచారాన్ని తెలుసుకోవాలి.
- భారీ, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల ప్రగతిపై అవగాహన అవసరం. జిల్లాల వారీగా వివిధ పరిశ్రమలు, ఉపాధి, పెట్టుబడుల గురించి తెలుసుకోవాలి. పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన చర్యలతోపాటు భారీ పారిశ్రామికీకరణకు చేపట్టాల్సిన చర్యలపై అవగాహన అవసరం.
1. తెలంగాణ సోషియో ఎకనమిక్ ఔట్‌లుక్
2. శ్రీకృష్ణ కమిటీ నివేదిక.
3. తెలుగు అకాడమీ: తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన పుస్తకం.
విదేశీ వాణిజ్యం: వాణిజ్య శేషం, చెల్లింపుల శేషం, వర్తక నిబంధనలు, విదేశీ మారక ద్రవ్యం, వాణిజ్య విధానం, మూల్యహీనీకరణ, రీ వాల్యుయేషన్, స్థిర వినిమయ రేటు, అస్థిర వినిమయ రేటు, అప్రెసియేషన్, కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్, ఎల్‌ఈఆర్‌ఎమ్‌ఎస్, హార్డ్ కరెన్సీ, సాఫ్ట్ కరెన్సీ, హాట్ కరెన్సీ, ప్రత్యేక ఆర్థిక మండళ్లు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు, నామినల్ ఎఫెక్టివ్ ఎక్స్ఛేంజ్ రేట్, రియల్ ఎఫెక్టివ్ ఎక్స్ఛేంజ్ రేట్.
పేదరికం - సాంఘిక భద్రత - సుస్థిర వృద్ధి: మానవాభివృద్ధి, సమ్మిళిత వృద్ధి, ఉపాధి, పేదరిక నిర్మూలనా కార్యక్రమాలు, సాంఘిక భద్రత, గ్రామీణ మౌలిక సౌకర్యాలు, పట్టణ మౌలిక సౌకర్యాలు, నైపుణ్యాభివృద్ధి, విద్య, ఆరోగ్యం, మహిళా, శిశు సంక్షేమ అభివృద్ధి.
ద్ర వ్యోల్బణం: ద్రవ్యోల్బణ రకాలు, ద్రవ్యోల్బణ ప్రభావం, ఫిలిప్స్ రేఖ, టోకు ధరల సూచీ, వినియోగదారుని ధరల సూచీ, స్టాగ్ ఫ్లేషన్, డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం, వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం.
జ్ఞానాత్మకమైన వి లేదా పరిజ్ఞానాన్ని పరిశీలించేవి: ఈ తరహా ప్రశ్నలు ప్రధానంగా కంటెంట్‌కు సంబంధించి ఉంటాయి. వీటి ద్వారా అభ్యర్థి పరిజ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని పరిశీలిస్తారు. ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలను గుర్తించాలంటే విస్తృత పఠనంతో పాటు పునశ్చరణ అవసరం. ఈ ప్రశ్నల సంఖ్య పరీక్ష స్థాయిని బట్టి మారుతుంది.
విషయ అవగాహనకు సంబంధించినవి: కొన్ని ప్రశ్నలు అభ్యర్థి అవగాహన, తెలివితేటలను పరీక్షిస్తాయి. ఇవి రెండూ నిరంతర సాధన, ప్రత్యేక శ్రద్ధతోనే సాధ్యమవుతాని చెప్పొచ్చు.
విషయ అనువర్తనకు సంబంధించినవి: ఈ తరహా ప్రశ్నల్లో అభ్యర్థి అసాధారణ తెలివితేటలు ప్రదర్శించాలి. లోతైన ఆలోచనతో పాటు సహజ ప్రతిభ, విచక్షణాశక్తులను ఉపయోగించాలి. ఈ ప్రశ్నల ద్వారా అభ్యర్థి అప్లికేషన్ స్కిల్స్‌ను పరీక్షిస్తారు.
అంతరిక్ష రంగానికి సంబంధించి ప్రధానంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపడుతున్న కార్యక్రమాలపై ప్రశ్నలు వస్తున్నాయి. ఇస్రో చేపట్టిన ముఖ్య ప్రయోగాల (చంద్రయాన్, మంగళ్‌యాన్ తదితర)పై అవగాహన పెంపొందించుకోవాలి. ఆయా ప్రయోగాల ప్రస్తుత పరిస్థితి, ఫలితాలను తెలుసుకోవాలి. ముఖ్యంగా అవి సామాజిక, ఆర్థికాభివృద్ధికి ఉపయోగపడుతున్న తీరుపై అవగాహన పెంపొందించుకోవాలి. ఇటీవల కాలంలో చేపట్టిన ఉపగ్రహ ప్రయోగాలకు సంబంధించి పూర్తిసమాచారాన్ని తెలుసుకోవాలి.
ఉదాహరణకు 2017, జూన్ 5న చేపట్టిన జీఎస్‌ఎల్‌వీ మార్క్ 3–డీ1/జీశాట్–19 ప్రయోగానికి సంబంధించి అభ్యర్థులు పరిశీలించాల్సిన అంశాలు..
లిఫ్ట్ ఆఫ్ మాస్: 3136 కిలోలు;
మిషన్ జీవితకాలం: పదేళ్లు;
వాహక నౌక: జీఎస్‌ఎల్‌వీ మార్క్–3 డీ1;
ఉపగ్రహ రకం: కమ్యూనికేషన్;
కక్ష్య రకం: జియో సింక్రోనస్ ఆర్బిట్ (జీఎస్‌వో).
వాహక నౌకల అభివృద్ధి గురించి తెలుసుకోవాలి. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్‌ఎల్‌వీ: ఎత్తు–44 మీటర్లు, వ్యాసం–2.8 మీటర్లు, దశలు–4, లిఫ్ట్ ఆఫ్ మాస్–320 టన్నులు (ఎక్స్‌ఎల్); జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (జీఎస్‌ఎల్‌వీ: ఎత్తు–49.13 మీటర్లు, దశలు–3, లిఫ్ట్ ఆఫ్ మాస్–414.75 టన్నులు); జీఎస్‌ఎల్‌వీ మార్క్–3: ఎత్తు–43.43 మీటర్లు, వ్యాసం–4 మీటర్లు, ఉష్ణ కవచం వ్యాసం–5 మీటర్లు, దశలు–3, లిఫ్ట్ ఆఫ్ మాస్–640 టన్నులు. అదే విధంగా పునర్వినియోగ వాహక నౌక–టెక్నాలజీ డిమాన్‌స్ట్రేటర్ (ఆర్‌ఎల్‌వీ–టీడీ) గురించి తెలుసుకోవాలి.
వ్యవసాయం, విపత్తుల నిర్వహణ, విద్య, పౌర విమానయానం, పర్యావరణం తదితర రంగాల్లో అంతరిక్ష కార్యక్రమాల అనువర్తనాలను తెలుసుకోవాలి. ఉదాహరణ: ఎర్త్ అబ్జర్వేషన్ అనువర్తనాల ద్వారా పంట ఉత్పత్తులను అంచనా వేయొచ్చు. అదే విధంగా సాయిల్ మ్యాపింగ్ చేయొచ్చు.
ఇస్రో తన కార్యకలాపాలను సక్రమంగా నిర్వహించేందుకు దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటిపై అవగాహన అవసరం. ఆయా కేంద్రాలు, నెలకొన్న ప్రాంతాలు, కేంద్రాల విధులను తెలుసుకోవాలి. ఉదాహరణకు అహ్మదాబాద్‌లో స్పేస్ అప్లికేషన్ సెంటర్ (ఎస్‌ఏసీ), ఫిజికల్ రీసెర్చ్ లేబొరేటరీ (పీఆర్‌ఎల్); డెవలప్‌మెంట్ అండ్ ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్ యూనిట్ (డీఈసీయూ) ఉన్నాయి.
అభ్యర్థులు ప్రిపరేషన్‌కు www.isro.gov.in ను ఉపయోగించుకోవాలి.
- అభ్యర్థులు ప్రిపరేషన్ సమయంలో షార్ట్‌నోట్స్‌ను తయారు చేసుకోవాలి. ఈ నోట్స్‌లోని అంశాలు ముఖ్యమైనవి కాబట్టి ఎన్నిసార్లు చదివితే అంత మంచిది. ప్రస్తుత ప్రిపరేషన్ సమయంలో చాలాముఖ్యమైన అంశాలను షార్ట్‌కట్ నోట్స్‌గా రాసుకోవాలి. ఇది పరీక్ష ముందు క్విక్ రివిజన్ సమయంలో ఉపయోగపడుతుంది.
- పరీక్ష ఏదైనా అందులో విజయం సాధించాలంటే రివిజన్ చాలా ముఖ్యం. అందుకే వీలైనంత తొందరగా ప్రిపరేషన్‌ను పూర్తిచేసి, పరీక్షకు ముందు రివిజన్‌కు తగిన సమయం కేటాయించాలి.
- చాప్టర్ల వారీగా ప్రాక్టీస్ టెస్ట్‌లు రాయడం పూర్తయ్యాక పేపర్ల వారీగా మోడల్ టెస్ట్‌లు రాయాలి. స్వీయ మూల్యాంకనం చేసుకోవాలి. అప్పుడే ప్రిపరేషన్ పరంగా బలాలు, బలహీనతలు తెలుస్తాయి. బలహీనంగా ఉన్న అంశాలకు అధిక సమయం కేటాయించి, వాటిపైనా పట్టు సాధించాలి. పరీక్షకు ముందు వీలైనన్ని గ్రాండ్‌టెస్ట్‌లు రాయాలి. ప్రీవియస్ పేపర్లను ప్రాక్టీస్ చేయడం మరవొద్దు.
- పూర్తిస్థాయిలో ప్రిపరేషన్ సాగించడానికి గ్రూప్ స్టడీ ఉపయోగపడుతుంది. క్లిష్టమైన అంశాలపై పట్టు సాధించేందుకు ఈ విధానం దోహదం చేస్తుంది. వీలైన సమయాల్లో అభ్యర్థులు తమ స్నేహితులతో కలిసి చదవాలి. వివిధ అంశాలపై చర్చించాలి. ఒకరికి తెలియని అంశాలను మరొకరితో పంచుకోవాలి.
- నేటి పోటీపరీక్షల్లో విజయం సాధించేందుకు ఉపయోగపడే మరో ముఖ్యాంశం.. సబ్జెక్టులను సమకాలీన అంశాలతో అనుసంధానం చేసుకుంటూ చదవడం. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ, పాలిటీ వంటి సబ్జెక్టుల ప్రిపరేషన్‌కు ఇది చాలా ముఖ్యం.
- సబ్జెక్టులను ప్రిపేరవుతున్నా, ప్రాక్టీస్ టెస్ట్‌లు రాస్తున్నా.. ప్రిపరేషన్ ఏ దశలో ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు స్వీయ విశ్లేషణ చేసుకోవాలి. ప్రిపరేషన్ పరంగా ఏవైనా తప్పులను గుర్తిస్తే, వాటిని సరిచేసుకుంటూ ముందుకెళ్లాలి. ఏవైనా సందేహాలుంటే బిడియపడకుండా ఫ్యాకల్టీని అడిగి, నివృత్తి చేసుకోవాలి.
- సీనియర్ సెక్షన్ ఇంజనీర్ (ఎస్‌ఎస్‌ఈ) ప్రశ్నపత్రంలో జనరల్ సైన్స్‌కు సంబంధించి ఇంటర్ స్థాయి ప్రశ్నలుంటాయి. ఫిజిక్స్, బయాలజీ ప్రాథమిక భావనలపై అవగాహన పెంచుకుంటే ప్రశ్నలకు తేలిగ్గానే సమాధానాలు గుర్తించొచ్చు. జేఈ పరీక్షకు పదో తరగతి స్థాయిలో ప్రశ్నలుంటాయి. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను ప్రిపరేషన్‌కు ఉపయోగించుకోవాలి. ప్రతి చాప్టర్‌లోని ముఖ్య భావనలపై అవగాహన పెంపొందించుకోవాలి.
- టెక్నికల్ ఎబిలిటీ: ఎస్‌ఎస్‌ఈ ప్రశ్నపత్రంలో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, ఎన్విరాన్‌మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మెజర్‌మెంట్, ఇంజనీరింగ్ డ్రాయింగ్/గ్రాఫిక్స్‌పై ప్రశ్నలుంటాయి. జేఈకి కూడా ఇవే అంశాలపై ప్రశ్నలుంటాయి. కానీ, ప్రశ్నల క్లిష్టతా స్థాయి తక్కువగా ఉంటుంది.
- ఉద్యోగ సాధనకు మంచి స్కోర్ సాధించాలంటే ఏదైనా ఒక బ్రాంచ్‌కు చెందిన విద్యార్థి మరికొన్ని ఇతర బ్రాంచ్‌లకు సంబంధించిన అంశాలపైనా పట్టుసాధించాల్సి ఉంటుంది. ఉదాహరణకు మెకానికల్ గ్రాడ్యుయేట్‌కు ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌కు సంబంధించిన ప్రశ్నలు కష్టంగా ఉంటాయి. అందువల్ల ఓ ప్రణాళిక ప్రకారం సిలబస్‌ను అనుసరించి వివిధ సబ్జెక్టుల్లోని ముఖ్యమైన భావనలపై పూర్తిస్థాయి అవగాహన పెంపొందించుకోవాలి.
- ఎలక్ట్రికల్‌లో ఎలక్ట్రికల్ మెషీన్స్, పవర్ సిస్టమ్స్, బేసిక్ సర్క్యూట్ల అంశాలను క్షుణ్నంగా నేర్చుకోవాలి. ఎలక్ట్రానిక్స్‌లో ఎలక్ట్రానిక్ డివెసైస్, సర్క్యూట్లు, కమ్యూనికేషన్ అంశాలను బాగా ప్రాక్టీస్ చేయాలి.
కంప్యూటర్స్‌కు సంబంధించి సి, జావా, డీబీఎంఎస్ తదితర అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి. సివిల్‌లో స్ట్రెన్త్ ఆఫ్ మెటీరియల్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్, సర్వేయింగ్ అంశాలు ముఖ్యమైనవి. మెకానికల్‌లో థర్మోడైనమిక్స్, ఇంజనీరింగ్ మెకానిక్స్, హీట్ ఇంజన్స్ అంశాలు ప్రధానమైనవి. ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో ట్రాన్స్‌డ్యూసర్స్, కంట్రోల్ సిస్టమ్స్ అంశాలు ముఖ్యమైనవి.
- థియరీ అంశాలు: పర్యావరణం, జీవవైవిధ్యం.
- అంతర్జాతీయ కార్యక్రమాలు, ఒప్పందాలు, సదస్సులు.
- భారత్‌లోని పర్యావరణ సంస్థలు, కమిటీలు, నివేదికలు.
- శక్తి వనరులు, కాలుష్యం.
- వృక్ష, జంతుజాలం, పరిరక్షణ.
- సహజ విపత్తులు.
- వ్యవసాయం–పర్యావరణం మధ్య సంబంధం.
- వీటి అధ్యయనానికి ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్లు ఉపయోగించుకోవాలి. దినపత్రికలను చదువుతూ ముఖ్యమైన అంశాలను నోట్స్‌లో పొందుపరచుకోవాలి. రాష్ట్ర జీవ వైవిధ్య బోర్డ్ అధికారిక వెబ్‌సైట్లో పొందుపరచిన అంశాలను పరిశీలించాలి. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌ను కూడా రిఫరెన్స్‌గా ఉపయోగించుకోవాలి.
- ఒకవైపు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వృద్ధి పథంలో పయనిస్తున్న మనిషి.. అదే క్రమంలో పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నాడు. పర్యావరణాన్ని దెబ్బతీస్తే భవిష్యత్ తరాల మనుగడే ప్రశ్నార్థకమనే విషయాన్ని గుర్తెరిగి, నడుచుకున్నప్పుడే నిజమైన అభివృద్ధి సాకారమవుతుంది. అభ్యర్థులు పర్యావరణానికి ఏ విధంగా నష్టం జరుగుతోంది? దాని పర్యవసానాలు ఏమిటి? అనే దానిపై అవగాహన పెంపొందించుకోవాలి. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థలు తీసుకుంటున్న చర్యలను పరిశీలించాలి.
- సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చేరుకునే క్రమంలో పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలను తెలుసుకోవాలి.
- ఫుడ్‌చైన్, ఫుడ్‌వెబ్, డీడీటీ–బయోమ్యాగ్నిఫికేషన్, బయోటిక్ ఫొటెన్షియల్ తదితరాలపై అవగాహన పెంపొందించుకోవాలి. వీటికోసం ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) మెటీరియల్‌ను ఉపయోగించుకోవచ్చు.
- గత కాప్ (కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్) సదస్సుల తీర్మానాలను తెలుసుకోవాలి.
ప్రశ్న: కిందివాటిలో జడవాయువు కానిదేది?
- ఆర్గాన్
- హీలియం
- బ్రోమిన్
- క్రిప్టాన్
ఇచ్చిన ఆప్షన్లలో ‘బ్రోమిన్’ సరైన సమాధానం. ఇది జడవాయు కుటుంబానికి పక్కనే ఉన్న హాలోజన్లకు చెందింది.
‘గజ ఈతగాళ్లు సముద్ర లోతుల్లో శ్వాస కోసం ఉపయోగించే వాయు మిశ్రమంలో నైట్రోజన్ బదులు హీలియంను ఎందుకు ఉపయోగిస్తారు?’ అనే ప్రశ్న రావొచ్చు. అధిక పీడనం వద్ద నైట్రోజన్ రక్తంలో కరుగుతుంది. కాబట్టి దీన్ని ఉపయోగించరు. అదేవిధంగా నియాన్ లైట్లలో వివిధ రంగుల కాంతి గురించి ప్రశ్నలు అడగవచ్చు. అందువల్ల ఈ అంశాలన్నింటిపై సంపూర్ణ అవగాహన పెంపొందించుకోవాలి. వీటి కోసం ఇంటర్మీడియెట్ రసాయనశాస్త్రం పాఠ్యపుస్తకాలు ఉపయుక్తంగా ఉంటాయి.
2. ముఖ్యమైన రాజ్యాంగ అధికరణలపై పట్టు సాధించాలి. దేశంలో ముఖ్య వ్యవస్థలకు సారథ్యం వహిస్తున్న వారి పేర్లను తెలుసుకోవాలి. ఉదా: ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్-అచల్ కుమార్ జ్యోతి. అదే విధంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి; సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్‌లో పనిచేస్తున్న ప్రధాన సమాచార కమిషనర్, వివిధ స్థాయీ సంఘాల (పార్లమెంట్/అసెంబ్లీ) అధ్యక్షుల పేర్లు తదితరాలను తెలుసుకోవాలి.
3. రాజ్యాంగ పరిషత్ ఎన్నిక విధానం, ముఖ్య కమిటీల అధ్యక్షులు, పరిషత్ చివరి సమావేశం లక్ష్యాల తీర్మానం (పీఠికకు మూలం), ప్రధాన షెడ్యూళ్లు, కీలకమైన సుప్రీంకోర్టు తీర్పులు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నిక, రాజ్యసభ/విధాన పరిషత్‌లకు ఎన్నిక విధానం; కేంద్ర, రాష్ట్ర సంబంధాలు; కొత్త రాష్ట్రాల ఏర్పాటు, కశ్మీర్ రాష్ట్ర ప్రత్యేక ప్రతిపత్తి; ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు, వెనుకబడిన తరగతులు, మైనారిటీలకు సంబంధించిన జాతీయ కమిషన్లు, వాటి విధులు, ఆయా కమిషన్ల అధ్యక్షుల వివరాలను తెలుసుకోవాలి.
రిఫరెన్స్:
- లక్ష్మీకాంత్ పుస్తకం.
- బీఏ ద్వితీయ సంవత్సరం రాజనీతి శాస్త్రం.
- బీఏ ద్వితీయ సంవత్సరం ప్రభుత్వ పాలన.
- వార్తా పత్రికలు, మేగజీన్లు.
- పర్యావరణ అర్థశాస్త్రం (Environmental Economics).. మానవాభివృద్ధికి, పర్యావరణానికి మధ్యగల అంతర్గత సంబంధాన్ని వివరిస్తుంది. అధిక ఆర్థికాభివృద్ధి లక్ష్యాలను చేరుకునే క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా దేశాలు వివిధ రంగాల్లో అవలంబిస్తున్న విధానాలు పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పర్యావరణ పరిరక్షణకు రూపొందించాల్సిన పథకాలు, ఆయా పథకాల అమలుకు తీసుకోవాల్సిన ఆర్థిక నిర్ణయాలను పర్యావరణ అర్థశాస్త్రం చర్చిస్తుంది. వీటిపై అవగాహన పెంపొందించుకోవాలి.
- వస్తువుల ఉత్పత్తిని పెంచటం ద్వారా గరిష్ట లాభాలు ఆర్జించాలంటే పర్యావరణ వనరులను అధికంగా ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితిలో అర్థశాస్త్ర విభాగాలైన నిశ్చయాత్మక, ప్రతిపాదనాత్మక అర్థశాస్త్రాలు.. పర్యావరణం, ఆర్థిక వ్యవస్థల మధ్య అంతర్గత సంబంధాన్ని విశ్లేషిస్తాయి. పర్యావరణ ఆస్తులపై ఆర్థిక కార్యకలాపాల ప్రభావాన్ని నిశ్చయాత్మక అర్థశాస్త్రం తెలుపుతుంది. అయితే ఇది ఎలాంటి తీర్పులు ఇవ్వదు. ప్రతిపాదనాత్మక అర్థశాస్త్రం మాత్రం పర్యావరణ వస్తువులను దోపిడీ చేస్తూ, జీవవైవిధ్యాన్ని, పర్యావరణ సమతుల్యతను దెబ్బతీయటం సమంజసమా? అనే ప్రశ్నకు సమాధానమిస్తుంది. పర్యావరణ సమతుల్యతకు చేసే పథకాల రచన వల్ల కలిగే లాభనష్టాలు, నష్టాల నివారణకు అనుసరించే మార్గాలు ప్రతిపాదనాత్మక అర్థశాస్త్రం పరిధిలోకి వస్తాయి. ఆయా అంశాలను సమకాలీన పరిణామాలకు అన్వయిస్తూ అధ్యయనం చేయాల్సి ఉంటుంది.
- వ్యవసాయ రంగంలో అధిక దిగుబడిని సాధించేందుకు సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించటం, అధిక పారిశ్రామికీకరణ కారణంగా శీతోష్ణస్థితి, వాతావరణం మార్పు చెందుతున్నాయి. ఈ క్రమంలో దేశంలో వివిధ రంగాలకు ఎదురవుతున్న సమస్యలను అధ్యయనం చేయాలి. అడవుల విస్తరణ, విస్తీర్ణాన్ని సాధించాల్సిన లక్ష్యాలు, వాటి సాధనకు ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలపై అవగాహన పెంపొందించుకోవాలి.
- స్వాతంత్య్రం తర్వాత ప్రణాళికాబద్ద ఆర్థిక ప్రగతిలో భాగంగా వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు సంభవించాయి. జాతీయాదాయం, తలసరి ఆదాయం, ప్రజల జీవన ప్రమాణాల్లో అధిక ప్రగతి నమోదైంది. దేశంలో సహజ వనరుల వినియోగంలో విచక్షణ పాటించకపోవటం, పునరుత్పన్నం కాని వనరులను ఇష్టానుసారం ఉపయోగించటం, పర్యావరణ-జీవ వైవిధ్యం ప్రాధాన్యతను గుర్తించకపోవటం వల్ల దేశంలో పర్యావరణ తులారాహిత్యం పెరుగుతోంది. ప్రపంచ పారిశ్రామిక ఉత్పత్తిలో భారత్ వాటా తక్కువగా ఉన్నప్పటికీ, పారిశ్రామిక కాలుష్యాలైన గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాల్లో దేశానికి అధిక వాటా ఉండటం గమనించాల్సిన అంశం.
- ప్రపంచ వ్యాప్తంగా పెరిగిన జనాభాలో 85 శాతం అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించినది. ఈ దేశాల్లో గ్రామీణ జనాభా రెట్టింపై, పర్యావరణ పరిరక్షణకు సవాలుగా పరిణమించింది. పట్టణ జనాభా వృద్ధి కారణంగా మౌలిక వసతుల కల్పనపై ఒత్తిడి పెరిగింది. అదే విధంగా కాలుష్యం పెరగడంతో పర్యావరణ క్షీణత ఏర్పడింది. ఒకే పంటను ఎక్కువసార్లు పండించటం, పురుగు మందుల అధిక వినియోగం కారణంగా భూసారం తగ్గింది. భూమి కోత, ఎడారీకరణ, లవణీకరణ, ఆమ్లీకరణ, గుంతల్లో వ్యర్థాలను పూడ్చటం వంటి వాటివల్ల భూమి నాణ్యత క్షీణిస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాల విధానపర చర్యలను తెలుసుకోవాలి.
- ప్రపంచ వ్యాప్తంగా మానవ కార్యకలాపాలు, భారీ పారిశ్రామికీకరణ ప్రక్రియ.. పర్యావరణ సమతుల్య సాధనకు అవరోధంగా నిలిచాయి. పర్యావరణ తులారాహిత్యానికి సంబంధించి పరిమాణాత్మక, ద్రవ్యపరమైన అంచనాలను రూపొందించటం కష్టతరమైనప్పటికీ, ఇటీవల కాలంలో కొన్ని దేశాలకు ఈ రకమైన అంచనాలు వెలువడ్డాయి. వీటిపై అవగాహన పెంపొందించుకోవడంతో పాటు ప్రపంచ బ్యాంకు వంటి సంస్థలు విడుదల చేసిన నివేదికల్లోని ముఖ్యాంశాలను తెలుసుకోవాలి.
- శ్రేయస్సును కొలవటంలో స్థూలజాతీయోత్పత్తి అంచనాలు ఎంతవరకు ఉపకరిస్తాయనే విషయంలో ఆర్థిక వేత్తలు, పర్యావరణ శాస్త్రవేత్తలు సందేహాలు వెలిబుచ్చారు. ఈ క్రమంలో ఆర్థికాభివృద్ధి, జాతీయ శ్రేయస్సును కొలిచేందుకు జీఎన్‌పీకి ప్రత్యామ్నాయంగా గ్రీన్ జీఎన్‌పీ కొలమానం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి అధ్యయనం చేయాలి.
- డీఎస్సీతో పాటు వివిధ పోటీపరీక్షలకు జీకే, కరెంట్ అఫైర్స్ ముఖ్యవిభాగం. సాధారణంగా ఈ విభాగంలో భిన్న అంశాల నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అవి..
- వార్తల్లో వ్యక్తులు (వివిధ సంస్థల కీలక పదవుల్లో కొత్తగా నియమితులైనవారు); అవార్డుల విజేతలు (నోబెల్ ప్రైజ్, బుకర్ ప్రైజ్, మెగసెసె ప్రైజ్ తదితరాల విజేతలు); క్రీడలు (క్రికెట్, ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్, టెన్నిస్ తదితర క్రీడల పోటీల విజేతలు-వేదికలు..); రక్షణ రంగం (క్షిపణులు, వాటి పరిధి-రక్షణ ఒప్పందాలు; యుద్ధ నౌకలు, రక్షణ సంస్థలు వంటివి); అణు ఇంధన రంగం (అణువిద్యుత్ ప్లాంట్లు-నెలకొన్న ప్రాంతాలు-సామర్థ్యం); పాలిటీ (రాజ్యాంగ సవరణలు, ముఖ్యమైన బిల్లులు, చట్టాలు, ఎన్నికలు..); ఆర్థిక రంగం (ముఖ్య సూచీలు, బడ్జెట్-ఆర్థిక సర్వే గణాంకాలు, జనాభా వివరాలు..), పర్యావరణం, ఆవరణ శాస్త్రం (ముఖ్య సదస్సులు, రక్షిత ప్రాంతాలు, వన్య ప్రాణుల సంరక్షణ ప్రాంతాలు, కాలుష్యం..); సదస్సులు, సమావేశాలు (బ్రిక్స్, కామన్వెల్త్, జీ-20..); జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఉపగ్రహ ప్రయోగాలు, ముఖ్య ఆవిష్కరణలు..), ఇటీవల విడుదలైన ముఖ్య పుస్తకాలు-రచయితలు.
- అదే విధంగా దేశంలో భౌగోళిక ప్రాంతాలు, సహజ వనరుల విస్తరణ; నదీ వ్యవస్థ, రవాణా వ్యవస్థ వంటి అంశాలపైనా అవగాహన పెంపొందించుకోవాలి. జాగ్రఫీ అంశాలను తేలిగ్గా అధ్యయనం చేయడానికి అట్లాస్‌ను తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి.
- రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వ పథకాలపై తప్పనిసరిగా అవగాహన పెంపొందించుకోవాలి. రాష్ట్ర బడ్జెట్, ఆర్థిక సర్వేలోని ముఖ్యాంశాలను అధ్యయనం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వ అధికార మాసపత్రికను, పోర్టల్ (https://www.ap.gov.in OR https://www.telangana.gov.in )ను ప్రిపరేషన్‌కు ఉపయోగించుకోవాలి.
- ఈ మధ్యకాలంలో స్టాక్ జీకే కంటే కరెంట్ అఫైర్స్‌కు ప్రాధాన్యమిస్తున్నందున రోజూ తప్పనిసరిగా పత్రికలు చదవడంతో పాటు ముఖ్యాంశాలను నోట్ చేసుకోవాలి.
(disaster management)అంశాలను ఎలా చదవాలి?
విపత్తు నిర్వహణ చట్టం-2005లోని ముఖ్యాంశాలను తప్పనిసరిగా అధ్యయనం చేయాలి. ప్రధానమంత్రి అధ్యక్షతన 2005, మే 30న జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థను మొదట ఏర్పాటు చేశారు. ఈ సంస్థ చేపడుతున్న విపత్తు కార్యక్రమాలను తెలుసుకోవాలి. అదేవిధంగా విపత్తులను ఎదుర్కొనేందుకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్‌స (బీఎస్‌ఎఫ్), సెంట్రల్ రిజర్‌వ పోలీస్ ఫోర్‌స (సీఆర్‌పీఎఫ్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్‌స (సీఐఎస్‌ఎఫ్), ఇండో- టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ), సశస్త్ర సీమబల్ (ఎస్‌ఎస్‌బీ) నుంచిజాతీయ విపత్తు ప్రతిస్పందన దళాన్ని (ఎన్‌డీఆర్‌ఎఫ్) ఏర్పాటు చేశారు. విపత్తు నిర్వహణ చట్టం-2005లోని సెక్షన్ 44 కింద ఏర్పాటు చేసిన ఈ దళాలు 2006 నుంచి విధులు నిర్వర్తిస్తున్నాయి. అభ్యర్థులు ఎన్‌డీఆర్‌ఎఫ్ బెటాలియన్లు- అవి ఉన్న ప్రాంతాలను తెలుసుకోవాలి. రాష్ట్ర, జిల్లా స్థాయి విపత్తు నిర్వహణ యంత్రాంగంపై అవగాహన పెంపొందించుకోవాలి. భూకంప మండలాలు, విపత్తులు-ఉపశమన చర్యలు, విపత్తులకు కారణాలు-పర్యవసానాలు, నష్టనివారణ చర్యలపై అవగాహన పెంపొందించుకోవాలి. పాత ప్రశ్నపత్రాలను పరిశీలించడం ద్వారా ఈ విభాగం నుంచి ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయో తెలుసుకోవచ్చు.
ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు, https://www.ndma.gov.in/en/ లను ప్రిపరేషన్‌కు ఉపయోగించుకోవచ్చు.
అభ్యర్థులు కేవలం ప్రిపరేషన్‌కే పరిమితం కాకుండా, తాము అప్పటివరకు చదివిన అంశాలపై ఏ మేరకు పట్టు సాధించామనే దానిపై స్వీయ విశ్లేషణ చేసుకోవాలి. దీనికోసం స్వయంగా మాక్ టెస్ట్‌లు రాయాలి. వాటిని మూల్యాంకనం చేసుకొని, ప్రిపరేషన్ పరంగా లోపాలను సరిదిద్దుకోవాలి. పేపర్ల వారీగా వారాంతపు పరీక్షలకు హాజరుకావడం విజయావకాశాలను మెరుగుపరుస్తుంది. వారం రోజుల్లో చదివిన అంశాలకు సంబంధించి టెస్ట్ రాయడం, ఫలితాలను విశ్లేషించుకోవడం చేయాలి. ఒక అంశాన్ని కేవలం థియరిటికల్ అప్రోచ్‌తో చదవడానికే పరిమితం కాకుండా.. ప్రాక్టీస్ చేయాలి.
సెక్షన్-2 గా పేర్కొన్న సమీకరణ దశ (1971-1990)కు సంబంధించి ముఖ్యమైన అంశాలు.. జై ఆంధ్ర ఉద్యమం, ఆరు సూత్రాల పథకం, తెలంగాణకు వ్యతిరేకంగా జరిగిన చర్యలు, రాష్ట్రపతి ఉత్తర్వులు, జోనల్ వ్యవస్థ ఏర్పాటు, ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష దిశగా ఏర్పడిన సంస్థలు/ పార్టీలు, ముల్కీ ఉద్యమాలు, నిబంధనలు వంటి వాటిపై అధ్యయనం చేయాలి.
సెక్షన్-3లో పేర్కొన్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశ (1991-2014)కు సంబంధించి ఆయా పార్టీల ఏర్పాటు-అందుకు దారితీసిన పరిస్థితులు, ఈ దశలో జరిగిన నిరసన కార్యక్రమాలు (మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె వంటివి), వాటి పర్యవసానాలను అధ్యయనం చేయాలి.
రిఫరెన్స్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భాగంగా ముఖ్యమైన కమిటీల నివేదికలు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లులో పొందుపర్చిన, తెలంగాణ సంబంధ అంశాలు.
- సింధు నాగరికత, వేదకాలం నాగరికత, మతపరమైన ఉద్యమాలు (బౌద్ధం, జైనం తదితర), ఇస్లాం మతం-ప్రభావం, భక్తి ఉద్యమాలు-స్వభావం, లలిత కళలు, మొగల్ సామ్రాజ్యం తదితర అంశాలను బాగా చదవాలి.
- తెలంగాణ ప్రాచీన, మధ్యయుగ చరిత్రల్లో ఆయా రాజ్య వంశాలు, వాటి హయాంలో జరిగిన సామాజిక ఆర్థిక అభివృద్ధి, పరిస్థితులపై అవగాహన (ఉదా.. కాకతీయుల కాలంలో ప్రత్యేకత ఉన్న నీటిపారుదల వ్యవస్థ) పెంపొందించుకోవాలి.
- ఆధునిక తెలంగాణ చరిత్రలో నిజాం సంస్కరణలు, శిస్తులు-విధానాలు, ఆయా రంగాల అభివృద్ధి చర్యలు (ఉదాహరణకు విద్యారంగం, పారిశ్రామిక అభివృద్ధి). అసఫ్‌జాహీల కాలంలో ప్రధాన ఉద్యమాలైన ఆర్య సమాజ్, ఆది హిందూ ఉద్యమాలు, తెలంగాణ సాయుధ పోరాటం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) విడుదల చేసిన గ్రూప్ - 1 జనరల్ ఎస్సే కొత్త సిలబస్‌లో సరికొత్త అంశం ‘విద్య, మానవ వనరుల అభివృద్ధి (జనరల్ ఎస్సే సెక్షన్-3)’. సామాజిక అభివృద్ధికి, దేశ ప్రగతికి పునాదులు విద్య, మానవ వనరులే అనేది నిస్సందేహం. ఈ నేపథ్యంలోనే ఈ అంశాన్ని సిలబస్‌లో పొందుపర్చినట్లు చెప్పొచ్చు. ఈ విభాగానికి సంబంధించి ప్రిపరేషన్ సాగించే క్రమంలో.. జాతీయ, రాష్ట్ర స్థాయిలో చేపడుతున్న పలు విద్యాభివృద్ధి పథకాల (ఉదాహరణ రైట్ టు ఎడ్యుకేషన్; సర్వ శిక్ష అభియాన్)తోపాటు మానవ వనరుల అభివృద్ధి దిశగా చేపడుతున్న చర్యలు (ఉదా: నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ మిషన్; సెక్టార్ స్కిల్ కౌన్సిల్స్ ఏర్పాటు) గురించి తెలుసుకోవాలి. వాటి ఉద్దేశాలు - లక్ష్యాలు - ఇప్పటివరకు సాధించిన ప్రగతి తదితర అంశాలపై పట్టు సాధించాలి. ఈ విభాగంలో తెలంగాణ ప్రత్యేక అంశాలపై దృష్టి సారిస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. కేజీ టు పీజీ ఉచిత విద్య, గురుకుల విద్యా విధానాన్ని, అన్ని గురుకుల విద్యా సంస్థలను ఒకే నియంత్రణ సంస్థ పరిధిలోకి వచ్చే విధంగా తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల గురించి తెలుసుకోవాలి. దీంతోపాటు అన్ని వర్గాల విద్యార్థులను ఉన్నత విద్య దిశగా నడిపించేందుకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక ప్రోత్సాహకాలపై అవగాహన అవసరం.
అదే విధంగా నిరుద్యోగిత గురించి వివరంగా తెలుసుకోవాలి. ప్రత్యక్ష నిరుద్యోగిత, ప్రచ్ఛన్న నిరుద్యోగిత నిర్వచనాలతో మొదలుపెట్టి నిరుద్యోగ రేటు తగ్గించేందుకు తీసుకుంటున్న చర్యలు, స్వయం ఉపాధి పథకాలపై దృష్టి పెట్టాలి. నిరుద్యోగం కారణంగా వలసలు; అవి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అభివృద్ధిపై చూపుతున్న ప్రభావాలను తెలుసుకోవాలి. కోర్ ఎకానమీకి సంబంధించి ద్రవ్యం, బ్యాంకింగ్ వ్యవస్థపై అవగాహన పెంచుకోవాలి. భారత బ్యాంకింగ్ వ్యవస్థ స్వరూపం, ఆర్‌బీఐ ఏర్పాటు ఉద్దేశం, బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలపై పట్టు సాధించాలి. ఈ రంగంలో సంస్కరణలకు సంబంధించి నరసింహన్ కమిటీ సిఫారసులను ప్రధానంగా అధ్యయనం చేయాలి. బ్యాంకింగ్, ద్రవ్యకోశ విధానాలకు సంబంధించి పలు అంశాల నిర్వచనాలు చదవాలి. సమకాలీన ఎకానమీ అంశాలపై దృష్టి సారించాలి. కొత్తగా ఏర్పాటైన బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులకు అనుమతుల మంజూరు దిశగా తీసుకున్న చర్యల గురించి సమాచార సేకరణ ఉపకరిస్తుంది. ద్రవ్యోల్బణ సూచీలు, ఈ సూచీల్లో పేర్కొనే ఉత్పత్తులు/వస్తువులు/సేవల జాబితా తెలుసుకోవాలి. ఎకానమీలో మరో ముఖ్యమైన అంశం.. పబ్లిక్ ఫైనాన్స్. దీనికి సంబంధించి పన్ను విధానం, ప్రభుత్వ అప్పు; బడ్జెట్‌లో రూపాయి రాక-పోక తదితర అంశాలు తెలుసుకోవాలి. వీటితోపాటు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, రూపాయి మారకపు విలువ, మానిటరీ పాలసీ, ఫిజికల్ పాలసీ మొదలైన అంశాలపైనా అవగాహన పెంచుకోవాలి.
జాతీయ స్థాయిలో కేంద్రప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు జన్‌ధన్ యోజన, స్వచ్ఛ భారత్, ప్రధాన మంత్రి సురక్ష్ బీమా యోజన, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన తదితర పథకాలపై అవగాహన అవసరం. అలాగే ఆర్థిక వ్యవహారాలు, వార్తల్లోని వ్యక్తులు, అవార్డులు (డిసెంబర్ 10న నోబెల్ బహుమతుల ప్రదానం), క్రీడల గురించి చదవాలి. ద్వైపాక్షిక ఒప్పందాలు, భారత్ పాల్గొనే అంతర్జాతీయ సదస్సులపై పూర్తి స్థాయి అవగాహన ఏర్పరచుకోవాలి. ఉదాహరణకు తాజాగా పారిస్‌లో వాతావరణ మార్పులపై జరిగిన కాప్ 21 సదస్సు, కామన్‌వెల్త్, జీ - 20 సదస్సు లాంటివి. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన తాజా పరిణామాలపై కూడా దృష్టి సారించాలి. ఈ రంగంలో జరుగుతున్న ప్రయోగాలు, విజయాలు లాంటివి గమనిస్తూ ఉండాలి. వర్తమాన అంశాల కోసం రోజూ దినపత్రికలు చదువుతూ ఎప్పటికప్పుడు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. తద్వారా పరీక్ష సమయంలో సులువుగా పునశ్చరణ చేసుకునే అవకాశం ఉంటుంది.
గ్రూప్స్ తదితర పోటీ పరీక్షల ప్రిపరేషన్‌లో మీకు ఎదురైన సందేహాలను sakshieducation@gmail.com కు మెయిల్ చేయండి.
బ్యాంకింగ్ సంబంధిత పారిభాషిక పదాలు, ఆర్‌బీఐ విధులు, వాణిజ్య బ్యాంకులు- చరిత్ర, విధులు, బ్యాంకులు వినియోగదారులకు అందజేస్తున్న సేవలు, బ్యాంకింగ్ సంస్కరణలను అధ్యయనం చేసిన కమిటీలు, కేంద్ర ప్రభుత్వం- బ్యాంకింగ్ వ్యవస్థ మధ్య సంబంధం తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాలి. వివిధ రంగాల అభివృద్ధికి బ్యాంకింగ్ వ్యవస్థ ఏ విధంగా దోహదపడుతుందో అధ్యయనం చేయాలి. ప్రామాణిక వార్తా పత్రికలు, మేగజీన్లను చదువుతూ బ్యాంకింగ్ వ్యవస్థకు చెందిన వర్తమాన అంశాలపై ఎప్పటికప్పుడూ వివరాలు సేకరించాలి. వీటితో పాటు ఆర్‌బీఐ వెబ్‌సైట్‌ను పరిశీలించడం ప్రయోజనకరం. వీటి ఆధారంగా జనరల్ నాలెడ్‌జ, కరెంట్ అఫైర్‌స విభాగాల్లో వచ్చే ప్రశ్నలకు కూడా సరైన సమాధానాలు గుర్తించవచ్చు.
సైన్స్ అండ్ టెక్నాలజీ రంగ అభివృద్ధి దిశగా ప్రభుత్వం నిరంతరం తీసుకుంటున్న చర్యలు, విధానాల్లో అవలంబిస్తున్న మార్పులపై అవగాహన పెంపొందించుకోవాలి. ముఖ్యంగా ఇటీవల విద్య, వైద్య, సామాజిక అభివృద్ధికి ఎంతో కీలకంగా మారుతున్న ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ విధానంపై సంపూర్ణ అవగాహన అవసరం. వీటితోపాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ప్రాథమిక నైపుణ్యాలు అందించే కంప్యూటర్ వినియోగం గురించి తెలుసుకోవాలి. అదే విధంగా రోబోటిక్స్, నానో టెక్నాలజీ కూడా ఇటీవల ఎస్ అండ్ టీ విభాగంలో ప్రాశస్త్యం పొందుతున్నాయి. వీటి గురించి తెలుసుకోవాలి.
అభ్యర్థులు దృష్టి సారించాల్సిన మరో ముఖ్యమైన అంశం.. భారత అంతరిక్ష విధానం. ఈ దిశగా భారత్‌చేపడుతున్న నూతన ఉపగ్రహ ప్రయోగాలు, కొత్త కార్యక్రమాలు (చంద్రయాన్, ఎడ్యూశాట్ లాంటివి) గురించి అవగాహన అవసరం. అంతరిక్ష సాంకేతికత ఆధారంగా సామాజిక అభివృద్ధి దిశగా చేపడుతున్న చర్యలు.. ముఖ్యంగా విద్య, వ్యవసాయం, పారిశ్రామిక అభివృద్ధి, వరదలు, తుపానులు, సునామీలు, వాతావరణ మార్పులకు సంబంధింన వాటి గురించి తెలుసుకోవాలి.
శాస్త్ర, సాంకేతిక రంగంలో భాగంగా అభ్యర్థులు దృష్టి సారించాల్సిన మరో ప్రధానాంశం.. శక్తి వనరులు. జల, అణు, న్యూక్లియర్ శక్తి వనరులు - వాటి వినియోగం దిశగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, స్థాపిస్తున్న సంస్థల గురించి అవగాహన పెంచుకోవాలి. పునరుత్పాదక ఇంధన వనరులుగా గుర్తింపు పొందుతున్న బయోమా్‌స్; వ్యర్థాల ఆధారిత ఇందన వనరుల ఉత్పత్తి, సౌర, పవన విద్యుత్ ఉత్పాదకాలు, వాటి కోసం ఏర్పాటు చేసిన సంస్థలు; అనువైన ప్రాంతాల గురించి సమాచారం తెలుసుకోవాలి. ప్రస్తుతం పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగానికి ప్రాధాన్యం ఇవ్వాలనే అభిప్రాయాలు వినిపిస్తున్న నేపథ్యంలో వీటి గురించి తప్పనిసరిగా అవగాహన పెంచుకోవాలి. అదేవిధంగా వివిధ వ్యాధులు - టీకాలు, సరికొత్త వ్యాక్సిన్ ఆవిష్కరణలపై అవగాహన ఏర్పరచుకోవాలి. బ్యాక్టీరియా, వైరస్‌లు వాటి కారకాలు, స్వభావాలు - ప్రభావాల గురించి తెలుసుకోవాలి. హెచ్‌ఐవీ, స్వైన్‌ఫ్లూ, చికెన్‌గున్యా తదితర వ్యాధులకు కారణమయ్యే వైరస్‌లు, వాటి నివారణలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా అవగాహన అవసరం. ఫుడ్ బయోటెక్నాలజీకి సంబంధించి ఆహారభద్రత, ఆ దిశగా ప్రభుత్వం విధించిన నియమ నిబంధలు, వాటి అమలు తీరు. డీ-ఫ్లోరైడేషన్ తదితర అంశాలపై సమాచారం సేకరించాలి. ఇటీవల బాగా ప్రాచుర్యం పొందుతున్న బయోటెక్నాలజీ గురించి విస్తృతంగా అధ్యయనం చేయాలి. హ్యూమన్ బయో టెక్నాలజీ, ప్లాంట్ బయో టెక్నాలజీ, ఫార్మ్ బయో టెక్నాలజీలలోని ముఖ్యాంశాలు - వాటి పూర్వాపరాలు తెలుసుకోవాలి. ముఖ్యంగా వ్యవసాయ రంగ అభివృద్ధికి బయో టెక్నాలజీ పోషిస్తున్న పాత్రపై అధ్యయనం చేయాలి. ఉదాహరణకు.. బీటీ విత్తనాలు, వాటి ఫలితాలు. అభ్యర్థులు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో అధిక మార్కులు సాధించాలంటే.. అప్లికేషన్ ఓరియంటేషన్‌తో ప్రిపరేషన్ సాగించాలి. కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా తాజా సమాచారం ఆధారంగా వివరాలు సేకరిస్తూ సన్నద్ధమవ్వాలి.
- జీవావరణ శాస్త్రానికి సంబంధించి జీవవైవిధ్యం ప్రస్తుతం అధిక ప్రాధాన్యం సంతరించుకున్న అంశం. జీవ వైవిధ్యం (బయో డైవర్సిటీ), భూమిపై ఉన్న విభిన్న జాతులు, ఆవరణ వ్యవస్థల వైవిధ్యాల గురించి బాగా చదవాలి.
- దేశంలోని జాతీయ పార్కులు, అభయారణ్యాలు, కన్జర్వేషన్ రిజర్వులు, టైగర్ రిజర్వులు, కమ్యూనిటీ, బయోస్ఫియర్ రిజర్వులు, ఎలిఫెంట్ రిజర్వుల గురించి తెలుసుకోవాలి.
- పర్యావరణంలో మరో ముఖ్య అంశం పర్యావరణ కాలుష్యం. గాలి, జల, భౌమ, శబ్ద, కాంతి కాలుష్యాలు, కారకాలు, ప్రభావాలు, నివారణ చర్యలు, నివారణ పద్ధతులను చదవాలి.
- కాలుష్యానికి సంబంధించి జాతీయ, అంతర్జాతీయ నివేదికలు, కాలుష్య సంఘటనల గురించి తెలుసుకోవాలి. ప్రపంచ వ్యాప్తంగా వర్షపాతం, ఉపరితల ఉష్ణోగ్రతల్లో వస్తున్న హెచ్చుతగ్గులు, తీవ్రమవుతున్న తుపాన్లకు ప్రధాన కారణం శీతోష్ణస్థితి మార్పు. కాబట్టి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో శీతోష్ణస్థితి మార్పు ప్రభావాల గురించి తెలుసుకోవాలి. దేశంలో పర్యావరణ చట్టాలు, శాసనాలు, వాటి అమలు, వివిధ విభాగాల్లోని అత్యున్నత అధికారుల గురించి తెలుసుకోవాలి.
ఆధునిక భారత దేశ చరిత్ర నుంచి ప్రశ్నలు ఎక్కువగా అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఇండియన్ హిస్టరీ మూడో యూనిట్ (భారత్‌లో బ్రిటిష్ పాలన ప్రారంభం) నుంచి ప్రత్యేక శ్రద్ధతో సన్నద్ధత సాగించాలి. బ్రిటిష్ పాలనకు దారితీసిన ప్లాసీ యుద్ధంతో ప్రారంభించి బ్రిటిష్ కాలంలోని ముఖ్య ఘట్టాలు, వారి నిబంధనలు, బ్రిటిషర్లకు-ఇతర రాజ వంశాలకు మధ్య జరిగిన యుద్ధాలపై దృష్టి సారించాలి. బ్రిటిషర్ల హయాంలో చేసిన అభివృద్ధి పనులు (రైల్వేలు, ట్రాన్స్‌పోర్ట్, టెలిగ్రాఫ్ మొదలైనవి) గురించి కూడా తెలుసుకోవాలి.
ఆధునిక భారత దేశ చరిత్రలో భాగంగా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాట్లు, ముఖ్యంగా గిరిజనులు, రైతుల ఉద్యమాలు, నిరసనలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి. 1857 మొదటి స్వాతంత్య్ర పోరాటం, అందుకు దారితీసిన పరిస్థితులు, భారతీయ వాదం పెరిగేందుకు కారణమైన పరిస్థితుల గురించి అధ్యయనం చేయాలి. వీటితోపాటు సామాజిక-మత ఉద్యమాలు, కుల వ్యతిరేక ఉద్యమాలు గురించి అవగాహన ఎంతో అవసరం. బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం, అలీగఢ్ ఉద్యమం మొదలైన వాటిపై దృష్టి సారించాలి. ఈ కాలంలో చారిత్రకంగా గుర్తింపు పొందిన వ్యక్తులు, వారు చేపట్టిన చర్యల గురించి చదవాలి. ఉదాహరణకు మహాత్మాగాంధీ భారత్‌కు తిరిగి రావడం, ఆ తర్వాత కాలంలో ఆయన నేతృత్వంలో సాగిన పలు ఉద్యమాలు చదవాలి. ఈ కాలంలోని భక్తి ఉద్యమాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. 1885 నుంచి 1947లో స్వాతంత్య్రం వచ్చే వరకు మూడు దశలుగా జరిగిన స్వాతంత్య్రోద్యమ దశలపై అవగాహన ఏర్పరచుకోవాలి. ఈ క్రమంలో అఖిల భారత కిసాన్ సభ, సోషలిస్ట్, కమ్యూనిస్ట్ ఉద్యమాల వ్యాప్తి, వాటికి దారితీసిన పరిస్థితులపై అవగాహన పెంచుకోవాలి.
తెలుగు అకాడమీ ‘చరిత్ర’ పాత పుస్తకాలు ఉపయుక్తంగా ఉంటాయి. వీటితో పాటు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు (తెలుగులోకి అనువాదం); డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ బీఏ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పుస్తకాలు కూడా సన్నద్ధతకు దోహదపడతాయి. ఈ సబ్జెక్ట్‌పై పట్టు సాధిస్తే జనరల్ ఎస్సేలోని భారత చారిత్రక, సాంస్కృతిక వారసత్వం అనే అంశానికి కూడా సన్నద్ధత లభిస్తుంది.
మాదిరి ప్రశ్నలు
1. విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చేది?
ఎ) మోటారు
బి) జనరేటర్
సి) ట్రాన్సఫార్మర్
డి) కెపాసిటర్
- View Answer
- సమాధానం: ఎ
2. స్థావర విద్యుత్తును నిల్వ చేసేది?
ఎ) మోటారు
బి) జనరేటర్
సి) ట్రాన్సఫార్మర్
డి) కెపాసిటర్
- View Answer
- సమాధానం: డి
3. ఇళ్లలో ఉపయోగించే విద్యుత్ పరికరాలను ఏ పద్ధతిలో కలుపుతారు?
ఎ) శ్రేణి
బి) సమాంతరం
సి) విడివిడిగా
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: బి
4. యాంత్రిక శక్తిని విద్యుచ్ఛక్తిగా మార్చేది?
ఎ) మోటారు
బి) జనరేటర్
సి) ట్రాన్సఫార్మర్
డి) విద్యుద్దర్శిని
- View Answer
- సమాధానం: బి
5. కిందివాటిలో ఓమ్ నియమాన్ని పాటించనిది?
ఎ) రాగి
బి) ఇనుము
సి) చెక్క
డి) సిలికాన్
- View Answer
- సమాధానం: డి
6. విద్యుత్‌కు ప్రమాణాలు?
ఎ) ఓమ్
బి) ఓమ్-మీటర్
సి) ఆంపియర్
డి) వోల్ట్
- View Answer
- సమాధానం: సి
జీవశాస్త్రం, భౌతిక, రసాయన శాస్త్రాల్లోని ప్రాథమిక అంశాలపై అవగాహన కోసం 7 నుంచి 10వ తరగతి వరకు పాఠ్య పుస్తకాలు చదవాలి. ఈ శాస్త్రాల పరిజ్ఞానం మానవాళి సంక్షేమానికి ఎలా ఉపయోగపడుతుందో అర్థం చేసుకోవాలి. వాటి అనువర్తనాలకు సంబంధించిన ప్రశ్నలను ఏవిధంగా అడుగుతున్నారో పరిశీలించాలి. ఉదాహరణకు మానవుని జీర్ణవ్యవస్థలో ఉత్పత్తి అయ్యే ఆమ్లం? కిటకాల్లో రక్తం రంగు? శీతాకాలంలో మొక్కల పత్రాలు ఎందుకు రాలిపోతాయి? అథ్లెట్ ఫూట్ వ్యాధికి కారణం? గాయాలు మానడానికి కారణమైన విటమిన్? ఇలాంటి ప్రశ్నలను పరిశీలిస్తే మానవ, వృక్ష శరీర ధర్మ శాస్త్రం, వ్యాధులు-నివారణ, విటమిన్లు, ఆర్థిక వృక్ష శాస్త్రం, జెనిటిక్స్ అంశాల నుంచి ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నట్లు తెలుస్తోంది.
జనరల్ సైన్స్ విభాగంలో జీవశాస్త్రంతో పోల్చితే భౌతిక-రసాయన శాస్త్రం నుంచి తక్కువ మార్కులు వస్తాయి.
భౌతిక శాస్త్రంలో కాంతి, ధ్వని, విద్యుత్, అయస్కాంతత్వం నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. ఉదా:
- సూర్యాస్తమయ సమయంలో సూర్యుడు ఎందుకు ఎర్రగా కనిపిస్తాడు?
- ధ్వని వేగాన్ని కొలిచే సాధనం?
- విద్యుత్ బల్బ్‌లోని ఫిలమెంట్?
- ఆటంబాంబుకు ఆధారమైన సూత్రం?
- ఏ సూత్రం ఆధారంగా రాకెట్ నింగిలోకి ఎగురుతుంది?
- అగ్గిపుల్లలో మండే రసాయన పదార్థం?
- మొదటి ప్రపంచ యుద్ధంలో ఉపయోగించిన విషవాయువు?
- మానవ శరీరంలో ఎక్కువగా ఉండే మూలకం?
- మస్కిటోకాయిల్స్‌లోని రసాయనం?
- ఉల్లిలో ఘాటైన వాసనకు కారణం?
అలాగే పరమాణు నిర్మాణం, మూలకాల ఆవర్తన పట్టిక, రసాయన బంధం, ద్రావణాలు, ఆమ్లాలు-క్షారాలు, లోహశాస్త్రం, వాయువులు తదితర అంశాలకు సంబంధించిన అనువర్తనాలపై దృష్టి సారించాలి.
జనరల్ సైన్‌సతో పోల్చితే సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ‘భారత్ సాధించిన విజయాలు’ అంశం పరిధి కాస్త తక్కువే. కానీ ఈ అంశం నుంచి సుమారు 3 నుంచి 5 మార్కులు వచ్చే అవకాశం ఉంది. అంతరిక్ష రంగం, పరిశోధన సంస్థలు, ఇస్రో విజయాల పరంపర, చంద్రయాన్, రక్షణ రంగం, అగ్ని మిస్సైల్ క్షిపణి ప్రస్థానం, జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, అంటువ్యాధుల నివారణ, మిషన్ ఇంద్రధనస్సు, సంప్రదాయేతర ఇంధన వనరులు, జీవ ఎరువులు, పర్యావరణం- కాలుష్యం, జన్యు పరివర్తిత మొక్కల సృష్టి-లాభనష్టాలు, బయోటెక్నాలజీ, స్టెమ్‌సెల్ ప్రయోగాలపై అభ్యర్థులు పట్టు సాధించాలి. ఇటీవల ప్రకటించిన 2015 నోబుల్ ఫ్రైజ్ విజేతలు, ఆవిష్కరణలు, వారి దేశం తదితర విషయాలను అధ్యయనం చేయాలి. సైన్‌స అండ్ టెక్నాలజీలో లేటెస్ట్ అంశాలకు మాత్రమే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. కాబట్టి అభ్యర్థులు నోటిఫికేషన్ తేది నుంచి ఏడాది లోపు సంఘటనలను అధ్యయనం చేసి నోట్స్ రాసుకోవాలి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత నిర్వహించే మొదటి గ్రూప్-2 పరీక్ష కాబట్టి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన మన ఊరు-మన చెరువు, వాటర్ గ్రిడ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన అన్ని పథకాలపై అవగాహన అవసరం. అభ్యర్థులు ప్రతి అంశాన్ని క్షుణ్నంగా చదివి, మోడల్ పేపర్లను ప్రాక్టీస్ చేస్తే మంచి మార్కులు సాధించవచ్చు.
భారత భౌగోళిక అంశాలకు సంబంధించి ముఖ్యమైన నదులు, సరస్సులు, వాటి పరీవాహక ప్రాంతంలోని ముఖ్యమైన పట్టణాలపై దృష్టి పెట్టాలి. భౌగోళిక సంబంధమున్న అంశాలను కూడా సమకాలీన పరిణామాలతో సమన్వయం చేసుకుంటూ చదవాలి.
తెలంగాణ జాగ్రఫీకి సంబంధించి ఈ ప్రాంతంలోని ముఖ్యమైన సెజ్‌లు, ఎకనామిక్ జోన్‌లు, వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, తాజా వ్యవసాయ పరిస్థితులు, పర్యావరణ సమస్యలు, రవాణా వ్యవస్థ గురించి అధ్యయనం చేయాలి. అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలోని జనాభా స్థితిగతులు, వారు నివసిస్తున్న ప్రాంతాలు గురించి తెలుసుకోవాలి. జాగ్రఫీ కోణంలోనే పారిశ్రామికీకరణ కూడా చదవాలి.
సమీకరణ దశ కోసం అభ్యర్థులు కొంత ఎక్కువ కసరత్తు చేయాలి. కారణం ఈ దశలో ఎన్నో ముఖ్య ఘట్టాలు, పరిణామాలు జరిగాయి. జై ఆంధ్ర ఉద్యమం; 1973లో రాష్ర్టపతి పాలన, ఆరు సూత్రాల పథకం; తెలంగాణకు వ్యతిరేకంగా జరిగిన చర్యలు; రాష్ట్రపతి ఉత్తర్వులు, జోనల్ వ్యవస్థ ఏర్పాటు లాంటివి చదవాలి. ప్రాంతీయ పార్టీలు, తెలంగాణలో రాజకీయ, సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక మార్పులు, తెలంగాణ అస్తిత్వ అణచివేత; తెలంగాణ ఆత్మాభిమానం, భాషా సంస్కృతులపై దాడి తదితర అంశాలను అధ్యయనం చేయాలి. 1990 దశకంలో ఆర్థిక సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాలు, వాటి ప్రభావం; పెరిగిన ప్రాంతీయ అసమానతలు; తెలంగాణలో వ్యవసాయం, చేతివృత్తుల రంగాల్లో సంక్షోభం, తెలంగాణ సమాజం, ఆర్థిక వ్యవస్థ వాటి ప్రభావం గురించి అధ్యయనం చేయాలి.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అంశం కోసం గ్రూప్స్ అభ్యర్థులు 1991-2014 మధ్యకాలంలో ఏర్పాటైన ముఖ్యమైన పార్టీలు/సంస్థల గురించి తెలుసుకోవాలి. తెలంగాణలో ప్రజాచైతన్యం, పౌరసంఘాల ఆవిర్భావం, ప్రత్యేక తెలంగాణ అస్థిత్వ భావన, తెలంగాణ ఐక్య వేదిక, భువనగిరి సభ, తెలంగాణ జనసభ, తెలంగాణ మహాసభ, వరంగల్ ప్రకటన, తెలంగాణ విద్యార్థుల వేదిక లాంటి అంశాలపై దృష్టిసారించాలి. ముఖ్యంగా 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) ఏర్పాటుకు దారితీసిన పరిస్థితుల గురించి అధ్యయనం చేయాలి. తర్వాతి పరిణామాలతోపాటు పత్యేక తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి శ్రీ కృష్ణ కమిటీ సిఫారసుల తర్వాత క్రమంలో తెలంగాణ ఏర్పాటు దిశగా జరిగిన అన్ని పరిణామాలపై అవగాహన ఎంతో ముఖ్యం.