Skip to main content

After BiPC: నేను బైపీసీ ఇంటర్మీడియెట్‌ రెండో సంవత్సరం చదువుతున్నాను. నాకు ఇంటర్‌ బైపీసీ తర్వాత అందుబాటులో ఉన్న కోర్సుల గురించి వివరించండి?

Question
After BiPC: నేను బైపీసీ ఇంటర్మీడియెట్‌ రెండో సంవత్సరం చదువుతున్నాను. నాకు ఇంటర్‌ బైపీసీ తర్వాత అందుబాటులో ఉన్న కోర్సుల గురించి వివరించండి?

బైపీసీలో చేరిన విద్యార్థులు ఎక్కువ మంది ఎంబీబీఎస్‌ గు రించే ఆలోచిస్తారు. వాస్తవానికి బైపీసీ ఉత్తీర్ణులకు ఎంబీబీఎస్, బీడీఎస్‌తోపాటు ఆయుష్, ఫార్మసీ, నర్సింగ్, పారామెడికల్, అగ్రికల్చ ర్, బీఎస్సీ వంటి ఎన్నో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 

ఎంబీబీఎస్‌
వైద్యవిద్య అనగానే టక్కున గుర్తుచ్చేది.. ఎంబీబీఎస్‌(బ్యాచిలర్‌ ఆఫ్‌ మెడిసిన్‌ అండ్‌ బ్యాచిలర్‌ ఆఫ్‌ సర్జరీ). డాక్టర్‌ కావాలని కలలు కనే వారు ప్రధానంగా ఎంబీబీఎస్‌ లక్ష్యంగా చదువుతుంటారు. అలాగే దంత వైద్యంపై ఆసక్తి ఉన్నవారికి బ్యాచిలర్‌ ఆఫ్‌ డెంటల్‌ సర్జరీ(బీడీఎస్‌) కోర్సు అందుబాటులో ఉంది. నీట్‌లో ర్యాంకు ఆధారంగా ఎంబీబీఎస్, బీడీఎస్‌ల్లో ప్రవేశం లభిస్తుంది. 

ఆయుష్‌
సాంప్రదాయ వైద్య విధానాలైన ఆయుర్వేద, యునానీ, హోమియోపతి, యోగా అండ్‌ నేచురోపతిలను ఆయుష్‌ అంటారు. ఆసక్తి ఉంటే నీట్‌లో ర్యాంకు ఆధారంగా ఆయుర్వేద(బీఏఎంఎస్‌), నేచురోపతి(బీఎన్‌వైఎస్‌), యూనానీ(బీయూఎంఎస్‌), సిద్దవైద్యం(బీఎస్‌ఎంఎస్‌), హోమియోపతి(బీహెచ్‌ఎంఎస్‌) కోర్సుల్లో చేరొచ్చు.
 
నర్సింగ్‌

బైపీసీ విద్యార్థులకు అందుబాటులో ఉన్న మరో చక్కటి కోర్సు.. నర్సింగ్‌. ఇటీవల కాలంలో ఉపాధి అవకాశాలు పెరుగుతున్న కోర్సు ఇది. ఇంటర్‌ బైపీసీ ఉత్తీర్ణులు బీఎస్సీ నర్సింగ్‌లో చేరేందుకు అర్హులు. అలాగే జీఎన్‌ఎం(జనరల్‌ నర్సింగ్‌ మిడ్‌వైఫరీ) పూర్తి చేసిన వారు కూడా బీఎస్సీ నర్సింగ్‌లో ప్రవేశం పొందొచ్చు. జాతీయ స్థాయిలో ఎయిమ్స్‌ వంటి సంస్థలు ప్రవేశ పరీక్షలు నిర్వహించి నర్సింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నాయి. నర్సింగ్‌లో డిప్లొమా కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఫార్మసీ
ఇంటర్‌ బైపీసీ ఉత్తీర్ణులు బీఫార్మసీ, ఫార్మా డీ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్‌ ర్యాంక్‌ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఈ కోర్సులను పూర్తి చేసిన వారు ఫార్మా రంగంలో చక్కటి అవకాశాలు అందుకోవచ్చు. 

అగ్రికల్చర్‌
బైపీసీ తర్వాత బీఎస్సీ ఆగ్రికల్చర్, హార్టికల్చర్‌ కోర్సుల్లో చేరొచ్చు. ఎంసెట్‌లో సాధించిన ర్యాంకు ఆధారంగా అడ్మిషన్‌ లభిస్తుంది. అలాగే వ్యవసాయ అనుబంధ రంగాలైన యానిమల్‌ హజ్బెండరీ, పౌల్ట్రీలో ఉపాధి కల్పించే బీవీఎస్సీ, ఫిషరీస్‌కు సంబంధించి బీఎఫ్‌ఎస్సీ వంటి కోర్సులు సైతం అందుబాటులో ఉన్నాయి. 

బీఎస్సీ
బైపీసీ ఉత్తీర్ణులయ్యాక గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో బీఎస్సీ(బైపీసీ), బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, బయోఇన్ఫర్మాటిక్స్, అగ్రికల్చర్‌ జియాలజీ, జెనిటిక్స్, ఫోరెన్సిక్‌ సైన్స్, ఫుడ్‌ టెక్నాలజీ, హోంసైన్స్, కమ్యూనిటీ సైన్స్‌.. ఇలా అనేక కోర్సులను ఎంచుకోవచ్చు. 

పారామెడికల్‌
వైద్యరంగంలో డాక్టర్లతోపాటు కీలకంగా నిలిచే వారు పారామెడికల్‌ సిబ్బంది. బైపీసీ పూర్తిచేసిన వారు సంబంధిత పారామెడికల్‌ కోర్సులు పూర్తిచేసుకోవడం ద్వారా రోగ నిర్ధారణ పరీక్షలు, స్కానింగ్, ఎక్స్‌రేలు, అల్ట్రాసౌండ్, అనస్తీషియా, ఎంఆర్‌ఐ తదితర విభాగాల్లో కొలువులు దక్కించుకోవచ్చు.

Photo Stories