Skip to main content

బీడీఎస్‌లో అడ్మిషన్, కోర్సు స్వరూపం, కెరీర్‌ అవకాశాల గురించి వివరించండి?

Question
నేను దంత వైద్యుడిగా పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాను. బీడీఎస్‌లో అడ్మిషన్, కోర్సు స్వరూపం, కెరీర్‌ అవకాశాల గురించి వివరించండి?

వైద్యవృత్తిలో రాణించడానికి ఎంబీబీఎస్‌ తర్వాత అందుబాటులో ఉన్న చక్కటి మార్గం.. బ్యాచిలర్‌ ఆఫ్‌ డెంటల్‌ సర్జరీ(బీడీఎస్‌)! వైద్యరంగంలో ప్రాధాన్యం ఉన్న కోర్సు బీడీఎస్‌. చిన్నపిల్లల దగ్గరి నుంచి వయోవృద్ధుల వరకూ.. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సందర్భంలో దంత సమస్యలు వస్తూనే ఉంటాయి. ఇలాంటి వారికి సేవలు అందించే డెంటిస్ట్‌లకు(దంతవైద్యులు) ఎప్పుడూ డిమాండ్‌ ఉంటుంది. 

కోర్సు స్వరూపం

బీడీఎస్‌.. పూర్తిగా దంత సమస్యలు, చికిత్స, నివారణ విధానాలపై నైపుణ్యాలను అందించే కోర్సు. ఇది ఐదేళ్ల కాల్యవ«వధి కలిగిన అండర్‌ గ్రాడ్యుయేషన్‌ కోర్సు. మెడికల్, డెంటల్‌ సబ్జెక్టుల సమ్మేళనంగా ఉంటుంది. ఈ కోర్సులో ము ఖ్యంగా దంత సంబంధ సమస్యలు, ∙చికిత్స విధానాలపై శిక్షణ ఇస్తారు.

ప్రవేశ మార్గం

బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే అభ్యర్థులు జాతీయస్థాయిలో నిర్వహించే నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(నీట్‌) యూజీ(అండర్‌ గ్రాడ్యుయేట్‌)లో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి. నీట్‌లో సాధించిన స్కోర్‌ ఆధారంగా రాష్ట్రాల స్థాయిలోని డెంటల్‌ కాలేజీల్లో, అదే విధంగా జాతీయ స్థాయిలోఆల్‌ ఇండియా కోటా విధానంలో  డెంటల్‌ కళాశాలల్లో ప్రవేశాలు పొందవచ్చు.

ఉన్నత విద్య

  • బీడీఎస్‌ అనంతరం ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారు ఎండీఎస్‌(మాస్టర్‌ ఆఫ్‌ డెంటల్‌ సర్జరీ) కోర్సులో చేరవచ్చు. నీట్‌ పీజీ ఎంట్రెన్స్‌లో సాధించిన ఉత్తీర్ణత ఆధారంగా ఎండీఎస్‌ కోర్సులో ప్రవేశం లభిస్తుంది. 
  • ఎండీఎస్‌ కోర్సులో పలు స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఓరల్‌ మెడిసిన్, డయాగ్నసిస్‌ అండ్‌ రేడియాలజీ, ఓరల్‌ అండ్‌ మాక్సిల్లోపేషియల్‌ సర్జరీ, ఓరల్‌ పాథాలజీ అండ్‌ మైక్రోబయాలజీ, కన్సర్వేటివ్‌ డెంటిస్ట్రీ అండ్‌ ఎండోడాంటిక్స్, ఆర్థోడాంటిక్స్, పోర్థోడాంటిక్స్, పెరియోడాంటల్‌ సర్జరీ అండ్‌ ఓరల్‌ ఇంప్లాటాలజీ, పెడోడాంటిక్స్, పబ్లిక్‌ హెల్త్‌ డెంటిస్ట్రీ వంటి స్పెషలైజేషన్లను ఎంపిక చేసుకోవచ్చు.
  • బీడీఎస్‌ తర్వాత ఎండీఎస్‌తోపాటు పీజీ డిప్లొమా కోర్సు కూడా అందుబాటులో ఉంది. 

ఉద్యోగావకాశాలు

  • బీడీఎస్‌ అర్హతతో ప్రభుత్వ వైద్య విభాగాల్లో అసిస్టెంట్‌ సివిల్‌ సర్జన్‌ కొలువు సొంతం చేసుకోవచ్చు. ఇందుకోసం ఆయా రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు లేదా వైద్యశాఖలు నిర్వహించే నియామక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. బీడీఎస్‌ ఉత్తీర్ణులకు రాష్ట్ర స్థాయిలోనే కాకుండా..కేంద్ర ప్రభుత్వంలోని పలు శాఖల్లో సైతం ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఆర్మీ డెంటల్‌ కార్ప్స్, టెరిటోరియల్‌ ఆఫీసర్‌ ఇన్‌ ఆర్మీ పేరుతో రక్షణ దళాల్లో కొలువు సంపాదించవచ్చు. అదే విధంగా రైల్వేశాఖ, ప్రభుత్వరంగ సంస్థ(పీఎస్‌యూ)ల్లోనూ డెంటిస్ట్‌లుగా ఉపాధి అవకాశాలను పొందవచ్చు. ఇందుకోసం ఆయా శాఖలు, విభాగాలు నిర్వహించే రిక్రూట్‌మెంట్‌ టెస్టులు, ఇంటర్వ్యూల్లో విజయం సాధించాల్సి ఉంటుంది.

సొంత ప్రాక్టీస్‌

బీడీఎస్‌ ఉత్తీర్ణత సాధించిన వారు ఉద్యోగాలతోపాటు స్వయం ఉపాధి కూడా పొందొచ్చు. కొంత అనుభవం వచ్చాక.. సొంతంగా డెంటల్‌ క్లినిక్‌ను నెలకొల్పి ప్రాక్టీస్‌ ప్రారంభించొచ్చు. ఇందుకోసం ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అవసరమైన మౌలిక సదుపాయాలు, వైద్య పరికరాలను సమకూర్చుకోవాల్సి ఉంటుంది.

Photo Stories