Engineering Jobs: మెకానికల్ ఇంజనీరింగ్.. ఉన్నత విద్యావకాశాలు, ఉద్యోగ మార్గాలు
Question
నేను మెకానికల్ ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నాను. చదువు పూర్తయ్యాక నాకు అందుబాటులో ఉండే ఉన్నత విద్యావకాశాలు, ఉద్యోగ మార్గాలను వివరించండి?
- మెకానికల్ ఇంజనీరింగ్ అభ్యర్థులకు విభిన్న పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. సంప్రదాయ నైపుణ్యాలతోపాటు లేటెస్ట్ టెక్నాలజీపై పట్టు సాధిస్తే.. మెకానికల్ ఇంజనీర్లు ఉజ్వల భవిష్యత్తును సొంతం చేసుకోవచ్చు.
- కెరీర్‌లో రాణించడానికి విద్యార్థులు అకడమిక్ స్థాయిలోనే బేసిక్ నైపుణ్యాలైన డిజైన్, డ్రాయింగ్, డ్రాఫ్టింగ్ వంటి వాటిపై పూర్తి స్థాయి అవగాహన పెంచుకోవాలి. రోబోటిక్స్, క్యాడ్,క్యామ్, 3–డి డిజైన్ టెక్నాలజీస్ తదితర ఆధునిక సాఫ్ట్‌వేర్ ఆధారిత స్కిల్స్‌పై దృష్టిసారించాలి.
- 3డీ మోడలింగ్, సిమ్యులేషన్ సాఫ్ట్‌వేర్‌లను నేర్చుకోవాలి. ప్రాజెక్టుల నిర్వహణలో ఈ పరిజ్ఞానం పనికొస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మెకానికల్ ఇంజనీరింగ్‌కు కోడింగ్, ప్రోగ్రామింగ్ కీలకంగా మారుతోంది. అలాగే విశ్లేషణా నైపుణ్యాలనుకూడా అకడమిక్ స్థాయి నుంచే పెంచుకునే ప్రయత్నం చేయాలి.
- మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. విద్యా సంవత్సరం సెమిస్టర్ విరామ సమయంలో ఇంటర్న్‌షిప్‌లను చేయాలి. ఇంటర్న్‌షిప్ ద్వారా పరిశ్రమల్లో వాస్తవ పని పరిస్థితులపై అవగాహన పెరుగుతుంది. ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది.
- ఉద్యోగావకాశాలు: మెకానికల్ ఇంజనీర్లు ఆటోమొబైల్, ఏరోస్పేస్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, పరిశోధన, అభివృద్ధి, తయారీ కర్మాగారాలు మొదలైన విభిన్న రంగాల్లో అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. నానోటెక్నాలజీ, రోబోటిక్స్‌లోనూ వారికి మంచి డిమాండ్ ఉంది. గేట్ ద్వారా ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ ఉద్యోగాలు సాధించొచ్చు. అలాగే యూపీఎస్సీ నిర్వహించే ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్ ద్వారా కేంద్ర ఇంజనీరింగ్ విభాగాల్లో, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ జరిపే పరీక్షల ద్వారా రాష్ట్ర స్థాయి ఇంజనీరింగ్ కొలువుల్లో చేరే అవకాశం ఉంది.
- ఉన్నత విద్య: గేట్/క్యాట్/పీజీఈసెట్ వంటి పరీక్షల్లో ర్యాంకు సాధించడం ద్వారా మెకానికల్ ఇంజనీరింగ్ అభ్యర్థులు ఉన్నత చదువులకు వెళ్లవచ్చు. ఐఐటీలు, ఐఐఎస్సీ, ఐఐఎంలు వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో ఉన్నత చదువులు అభ్యసించవచ్చు.
- కోర్ విభాగంలో.. మాన్యుఫాక్చరింగ్ ఇంజనీరింగ్, మెకట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎనర్జీ ఇంజనీరింగ్–మేనేజ్‌మెంట్, ఇంజనీరింగ్ డిజైన్, కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ అండ్ మ్యానుఫాక్చరింగ్, ప్రొడక్ట్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్, కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ మ్యానుఫాక్చరింగ్, మెటీరియల్ టెక్నాలజీ, రోబోటిక్స్, ఆటోమేషన్ తదితర స్పెషలైజేషన్‌లలో మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్‌ను ఎంచుకోవచ్చు.