బీఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పూర్తి చేశాను. నేను హైదరాబాద్‌లో ఉద్యోగం సాధించేలా ఎలాంటి షార్ట్‌టర్మ్ కోర్సులు చేయాలి. కోర్సు ఎరా,...
- సుశ్మిత రాచెల్ .
Question
బీఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పూర్తి చేశాను. నేను హైదరాబాద్‌లో ఉద్యోగం సాధించేలా ఎలాంటి షార్ట్‌టర్మ్ కోర్సులు చేయాలి. కోర్సు ఎరా, ఉడెమీ ఆన్‌లైన్ కోర్సులు ఉపయుక్తమేనా... డేటా సైన్స్ కోర్సు నాకు ఏ విధంగా ఉపయోగపడుతుంది ?
డేటా సైన్స్ ఇప్పుడు ఎంతో డిమాండ్ నెలకొన్న కోర్సు. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. అయితే ఇందుకోసం ప్రత్యేక నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి. డేటా సైన్స్, డేటా అనలిటిక్స్ వంటి కోర్సులు పూర్తి చేసుకోవడం ఉపయుక్తం. కోర్సెరా, ఉడెమీ వంటి ఆన్‌లైన్ ప్లాట్ ఫామ్స్ అందిస్తున్న ఈ కోర్సులను అభ్యసించి నిర్దిష్ట పరీక్షలో ఉత్తీర్ణత సాధించి సర్టిఫికెట్ సొంతం చేసుకుంటే భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది. సర్టిఫైడ్ డేటా సైంటిస్ట్‌లకు వేతనాలు కూడా భారీ స్థాయిలో ఉంటున్నాయి. ఇతర ఐటీ ఉద్యోగాలతో పోల్చితే డేటా సైంటిస్ట్‌ల జీతాలు సగటున 30 నుంచి 40 శాతం మేర అధికంగా ఉంటున్నాయి. నైపుణ్యాలు ఉంటే డేటా సైంటిస్ట్‌గా రూ.8 లక్షల నుంచి రూ. 10 లక్షల వార్షిక వేతనం లభిస్తోంది. ఈ విభాగంలో స్థిర పడాలంటే.. అకడమిక్‌గా మ్యాథమెటికల్ స్కిల్స్, స్టాటిస్టికల్ స్కిల్స్, కంప్యుటేషనల్ స్కిల్స్ ఎంతో అవసరం. అంతేకాకుండా అనలిటికల్ స్కిల్స్, డేటా డీ-కోడింగ్, కోడింగ్ నైపుణ్యాలు కూడా ముఖ్యం. ఐటీ విభాగంలో హైదరాబాద్‌లోనే ఉద్యోగం కావాలనుకుంటే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, రోబోటిక్స్, ఐఓటీ స్కిల్స్ ఉంటే సులువుగా ఉద్యోగం సొంతం చేసుకోవచ్చు. వీటికి సంబంధించి కూడా పలు ఆన్‌లైన్ సర్టిఫికేషన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో మెరుగ్గా రాణించాలంటే ముందుగా మీకు కోడింగ్, కంప్యూటర్ లాంగ్వేజెస్‌లో పట్టు ఉండాలి.