Skip to main content

UPSC Civils Success Plans : యూపీఎస్సీ సివిల్స్ కొట్టాలంటే... ఈ టాప్ ర్యాంక‌ర్లు చెప్పినవి పాటిస్తే చాలు...!

దేశంలో అత్యున్న‌త ఉద్యోగంలో ఒక‌టి ఐఏఎస్‌. అలాగే ఐపీఎస్‌, ఐఎఫ్ఎస్ కూడా. ఈ ఉద్యోగాలు కొట్టాలంటే... యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ నిర్వ‌హించే సివిల్స్‌లో ప‌రీక్ష‌లో ఉత్తీర్ణ‌త సాధించాల్సిందే.
UPSC Civils Ranker Success Plans

అలాగే యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌.. దేశంలోనే అత్యున్నత ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్‌. లక్షల్లో దరఖాస్తులు వస్తే.. లక్ష్యం చేరేది కొందరే. అందుకే ఈ పోటీ పరీక్ష ఎంతో ప్రత్యేకమైంది. సివిల్స్‌ అంటే కఠోర సాధన.. శ్రమ.. పట్టుదల. 

ఆసక్తితో సన్నద్ధం అయితే సివిల్‌ సర్వెంట్‌గా ప్రజలకు సేవలు అందించొచ్చు. అత్యున్నత వ్యక్తిగా గౌరవ, మర్యాదలు స్వీకరించవచ్చు. అమ్మో సివిల్సా.. అని భయపడకుండా ప్రణాళిక ప్రకారం ప్రిపేరయితే.. చాలా మంది బతుకుల్లో వెలుగులు నింపొచ్చు. అందుకే సిద్ధం కండి.. మీ జీవితాలతో పాటు.. ప్రజల జీవితాల్లో మార్పుకోసం ప్రయత్నించండి. 2025 జనవరి 22వ తేదీన‌ యూపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఫిబ్ర‌వ‌రి 11వ తేదీ వ‌ర‌కు దరఖాస్తులకు చివరి తేదీ. అలాగే మే 25న ప్రిలిమ్స్‌, ఆగస్టు 22 నుంచి మెయిన్స్‌ నిర్వహించనున్నారు.

ఈ క్రమంలో సివిల్స్‌కు ఎలా సిద్ధం కావాలి.. నోట్స్‌ ప్రిపరేషన్‌, పరీక్ష విధానం.. తదితర అంశాలను 2018 సివిల్స్‌ ఆల్‌ ఇండియా మొదటి ర్యాంకర్‌, హైదరాబాద్‌ కలెక్టర్‌ దురిశెట్టి అనుదీప్‌, 2017 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి రాజన్న సిరిసిల్ల ఎస్పీ అఖిల్‌ మహాజన్‌, కోరుట్ల మండలం అయిలాపూర్‌కు చెందిన గతేడాది సివిల్స్‌ 132వ ర్యాంకర్‌ ఏనుగు శివమారుతిరెడ్డి ఐపీఎస్‌ వివరించారు. 

ముందు వీటిపై పట్టు సాధించాలి... : దురిశెట్టి అనుదీప్‌, ఐఏఎస్‌, హైదరాబాద్‌ కలెక్టర్‌

Anudeep IAS

ప్రణాళికతో కూడిన చదువు, సాధించాలన్న పట్టుదల ఉంటే సివిల్స్‌లో విజయం సాధించొచ్చు. 2018 సివిల్స్‌ ఫలితాల్లో ఆల్‌ ఇండియా మొదటి ర్యాంకర్‌గా నిలవక ముందు నాలుగు పర్యాయాలు సివిల్‌ పరీక్షలకు హాజ రయ్యాను. రెండోసారి ఐఆర్‌ఎస్‌కు ఎంపికయ్యాను. ఉద్యోగం చేస్తూనే లక్ష్యం వైపు అడుగులు వేశాడు. ఓటములు ఎదురైనా నిరాశ చెందకుండా ‘ఐఏఎస్‌’ కలను సాకారం చేసుకోవడమే కాదు.. జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు సాధించాను. 

లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఎదురయ్యే ఆటుపోట్లను అధిగమించాలి. సివిల్స్‌ సిలబస్‌పై లోతైన పట్టు కలిగి ఉండాలి. ముఖ్యంగా ఎన్సీఈఆర్టీ పుస్తకాలు (ncert books) చదివి హిస్టరీ, జియోగ్రఫీ, ఎకనామిక్స్‌, సైన్స్‌ సబ్జెక్టుల్లో విలువైన ప్రాథమిక సమాచారాన్ని సేకరించుకోవాలి. గతంలోని ప్రశ్నప్రతాలను విశ్లేషించడం, దినపత్రికలు, ఇంటర్నెట్‌ను సమర్థవంతంగా వినియోగించుకోవడం, నిష్ణాతుల నుంచి సందేహాలను నివృత్తి చేసుకోవాలి. సివిల్స్‌ విజయంలో రైటింగ్‌ ముఖ్య పాత్ర వహిస్తుంది.

పరీక్ష హాల్లో ఎలాంటి ప్రశ్నలు ఎదురైనా సరైన సమాధానాలు నిర్దేశించిన సమయంలోనే రాయాలి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రిపరేషన్‌ నుంచే చదువుతో పాటు రైటింగ్‌ ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రాంతీయ భాషలో పరీక్షలు రాయాలనుకునేవారు మెటీరియల్‌పై ఆందోళన చెందవద్దు. ఏడాది ముందుగానే అవసరమైన మెటీరి యల్‌ సేకరించుకుని, తెలుగు మాద్యమంలోకి అనువదించుకుంటే ఇబ్బంది ఉండదు.

సి‘విల్‌ పవర్‌’తో ఏదైనా సాధ్యమే.. ఇలా.. : అఖిల్‌ మహాజన్‌ ఐపీఎస్‌,రాజన్న సిరిసిల్ల ఎస్పీ

SP Akhil Maha Jan Success

జమ్ము–కశ్మీర్‌ నా జన్మస్థలం. తండ్రి కిరాణా వ్యాపారి. తల్లి గృహిణి. హైదరాబాద్‌ జేఎన్‌టీయూ క్యాంపస్‌లో ఇంజినీరింగ్‌ పట్టా పొందాను. కొన్నాళ్లు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం, ఇంకొన్నాళ్లు తండ్రి వ్యాపారంలో తోడు ఉన్నా. జీవితంలో పదిమందికి పనికొచ్చేలా ఉండడం ఎలా అన్న సందేహానికి నాలో పుట్టిన సమాధానం సివిల్స్‌. 2013లో నోటిఫికేషన్‌ వచ్చాక మూడు నెలల పాటు ఢిల్లీలో శిక్షణ తీసుకున్నా. అది అంతగా సంతృప్తి ఇవ్వలేదు. తరువాత ఏడాదంతా సొంతంగా ప్రిపేరయ్యాను. 2016లో విజయం సాధించాను. 2017 బ్యాచ్‌ ఐపీఎస్‌ ఆఫీసర్‌గా ఉద్యోగ జీవితం ఆరంభమైంది. 

సివిల్స్‌లో కొండంత సిలబస్‌ను అధ్యయనం చేయాలంటే కావాల్సిన మెటీరియల్‌ అందుబాటులో ఉంది. ప్రామాణికమైన పుస్తకాలను ఎంచుకోవడమే విజయానికి మొదటి మెట్టు. నిబద్ధతతో కూడిన సమయపాలన సన్నద్ధతను సులభతరం చేస్తుంది. రోజుకు 8 నుంచి 10గంటలు చదువుతూ.. సెల్‌ఫోన్‌కు దూరంగా ఉండడం ముఖ్యం. ప్రిపరేషన్‌ క్రమంలో ఒత్తిడికి దూరంగా ఉండేందుకు అభ్యర్థుల అభిరుచి మేరకు సంగీతం, సినిమాలు, సాయంకాలం వాకింగ్‌, ఫిజికల్‌ ఎక్సర్‌సైజ్‌ ముఖ్యమే. ఉద్యోగం రావాలన్న ఆశతో కఠోర శ్రమ, కావాల్సినంత సమయం కేటాయించినప్పటికీ ఒక్కోసారి సమయం కలిసి రాక, ఆశించిన ఫలితం కనిపించకపోవచ్చు. ఒక్కోవ్యక్తి నాలుగు, ఐదో ప్రయత్నంలో విజయం సాధించిన సందర్భాలున్నాయి. నిరాశ, నిస్పృహలకు తావివ్వకుండా లక్ష్యంతో ముందుకు సాగితే విజయం సులువే.

నోట్స్‌ తయారు చేసుకోండిలా... :  ఏనుగు శివమారుతిరెడ్డి, ఐపీఎస్‌,భువనేశ్వర్‌ ట్రైనీ అడిషనల్‌ ఎస్పీ

Shiva Maruthi Reddy IPS

సిలబస్‌ను చదివి ఆకళింపు చేసుకోవడానికి చిన్నచిన్న లక్ష్యాలను పెట్టుకోండి. చివరికి అంతా కలిపి పూర్తి అవగాహనతో సివిల్స్‌ సాధించడం చాలా సింపుల్‌. మా స్వస్థలం కోరుట్ల మండలం అయిలాపూర్‌. గతేడాది సివిల్స్‌ 132వ ర్యాంకు సాధించాను. ప్రస్తుతం ఒడిశా భువనేశ్వర్‌లో అడిషనల్‌ ఎస్పీగా శిక్షణలో ఉన్నా.. సివిల్స్‌ సిలబస్‌ పెద్దగా ఏమీ ఇబ్బంది లేదు. ఎన్‌సీఈఆర్‌టీ, ఇంటర్‌, డిగ్రీ సబ్జెక్టుల్లోని అంశాలే ఉంటాయి. ప్రిలిమ్స్‌ మొదటి ప్రయత్నంలో నాకు ఆరోగ్యం సహకరించక ఫెయిలయ్యాను. 

చదివే సమయంలో ఆరోగ్యంపైనా దృష్టి పెట్టాలి. ప్రిలిమ్స్‌ దశను దాటడానికి ఏడాది సరిపోతుంది. మొదటి ఏడు నెలల ఒక్కోసబ్జెక్టులో ఒక్కోబుక్‌ చదవాలి. ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్‌ పూర్తిగా చదివి ఆ తరువాత అవే అంశాలపై ప్రత్యేకంగా ఉన్న బుక్స్‌ చదవాలి. 60–70 వరకు ప్రిలిమ్స్‌ మాక్‌ టెస్టులు ప్రాక్టీస్‌ చేయాలి. ఈ పేపర్‌–1 జనరల్‌ స్టడీస్‌ కన్నా, పేపర్‌–2 సీసాట్‌(మాథ్స్‌, ఇంగ్లిష్‌)లో కేవలం సాధన లేక ఫెయిల్‌ అవుతున్నారు. ఈ విషయంలో జాగ్రత్త పడాలి. 

ప్రిలిమ్స్‌లో మంచి పర్‌ఫార్మెన్స్‌ చేయగలిగితే వెంటనే మెయిన్స్‌ ఆప్షనల్స్‌కు ప్రిపేర్‌ కావాలి. మెయిన్స్‌లో గత పరీక్షల ప్రశ్నపత్రాల ప్రాక్టీస్‌తో పాటు, ఇదివరకు టాపర్లుగా నిలిచిన వారి కాపీలను పరిశీలించాలి. సొంతంగా నోట్స్‌ తయారుచేసుకోవాలి. మెయిన్స్‌లో రెండు మూడు ప్రశ్నలు వదిలేస్తే ఆశలు వదుకోవాల్సిందే. జవాబులు రాసే సమయంలో ఇంట్రడక్షన్‌, బాడీ డివైడింగ్‌ అండ్‌ ప్రజెంటేషన్‌ ఎంతో ముఖ్యం. 

ఇక ఇంటర్వ్యూకు కేవలం 275 మార్కులు ఉంటాయి. మెయిన్స్‌లో మంచి స్కోరు సాధిస్తే ఇంటర్వ్యూ పెద్ద విషయం కాదు. ఇంటర్వ్యూకు 2వేల మంది వరకు పిలుస్తారు. ఇంటర్వ్యూ చేసేవారు రిటైర్డ్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌లు, వివి ధ రంగాల్లో దిగ్గజాలు ఉంటారు. వారు కేవలం మన గురించి తెలుసుకోవాలన్న రీతి లోనే ప్రశ్నిస్తారు. కాన్ఫిడెన్స్‌తో సరైన జవాబులు ఇవ్వాలి. తెలియని విషయాలు.. తెలియదని చెప్పాలి.

Published date : 05 Feb 2025 03:15PM

Photo Stories