Skip to main content

Civil Services FAQs

Civils preparation: సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమ్స్‌ సిలబస్, ప్రిపరేషన్‌ టిప్స్‌ చెప్పండి?
+

ప్రిలిమ్స్‌ సబ్జెక్టుల వారీగా

 • చరిత్ర: ఆధునిక చరిత్ర; జాతీయోద్యమం;ప్రాచీన, మధ్యయుగ చరిత్రకు సంబంధించి సాహిత్యం, కళలు, మత ఉద్యమాలు, రాజకీయ–సామాజిక–ఆర్థిక చరిత్ర అంశాలు. ఆధునిక చరిత్రలో బ్రిటిష్‌ సామ్రాజ్య స్థాపన– పరిపాలన విధానాలు;బ్రిటిష్‌కు వ్యతిరేక తిరుగుబాట్లు–ఉద్యమాలు(ప్రధానంగా స్వాతంత్య్ర పోరాటం),సంస్కరణోద్యమాలపై దృష్టి పెట్టాలి. 

పాలిటీ

 • రాజ్యాంగం: రాజ్యాంగ పరిషత్, రాజ్యాంగ సవరణ ప్రక్రియ, పీఠిక, ఇప్పటివరకు జరిగిన ముఖ్య రాజ్యాంగ సవరణలు–వాటికి సంబంధించిన రాజ్యాంగ ప్రకరణలు. 
 • రాజకీయ వ్యవస్థ: పార్లమెంటరీ వ్యవస్థ, రిపబ్లికన్‌ ప్రభుత్వం, అర్థ సమాఖ్య, రాష్ట్రపతి, గవర్నర్, పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలు, సుప్రీంకోర్టు, హైకోర్టు, ఎన్నికల కమిషన్, ఆర్థిక కమిషన్, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు, అటార్నీ జనరల్, అడ్వకేట్‌ జనరల్‌ వాటికి సంబంధించి రాజ్యాంగ ప్రకరణలు.
 • పంచాయతీరాజ్‌ వ్యవస్థ: బల్వంత్‌రాయ్, అశోక్‌మెహతా, హన్మంతరావ్, జి.వి.కె.రావ్, సింఘ్వీ కమిటీల సిఫార్సులు. 73వ రాజ్యాంగ సవరణ చట్టం. 
 • ప్రభుత్వ విధానం: విధాన రూపకల్పన ఎలా జరుగుతుంది? అందులో ప్రముఖ భాగస్వాములెవరు? విధానాల అమలు, వాటి సమీక్ష. ఇటీవల ప్రభుత్వం తీసుకున్న ముఖ్య విధానపర నిర్ణయాలు;  కేంద్ర–రాష్ట్ర సంబంధాలు; ఇటీవల కాలంలో చర్చనీయాంశంగా మారిన అంశాలు.

ఎకానమీ

 • ఆర్థికాభివృద్ధిలో సహజ వనరులు–మూలధన వనరుల పాత్ర; ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాల ప్రగతి(వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవారంగం); ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో.. దేశంలో ఆర్థిక–సాంఘికాభివృద్ధి; పారిశ్రామిక తీర్మానాలు–వ్యవసాయ విధానం; నీతి అయోగ్‌; బ్యాంకింగ్‌ రంగం, ప్రగతి–సంస్కరణలు; తాజా మానవాభివృద్ధి, ప్రపంచ అభివృద్ధి నివేదికలు; ఎకనామిక్‌ సర్వే, బడ్జెట్‌

సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ

పరీక్షకు ముందు ఏడాది కాలంలో ఇస్రో ప్రయోగించిన ఉపగ్రహాలు; ఇటీవల కాలంలో సంభవిస్తున్న వ్యాధులు–కారకాలు; ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ–అందుకు సంబంధించి ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న చర్యలు; రక్షణ రంగంలో కొత్త మిస్సైల్స్‌ ప్రయోగాలు; ముఖ్యమైన ఘట్టాలు, సంఘటనలు; ఏడాది కాలంలో జరిగిన జాతీయ,అంతర్జాతీయ పరిణామాలు

టైమ్‌ మేనేజ్‌మెంట్‌ ముఖ్యం

 • జూన్‌ 5న ప్రిలిమ్స్‌ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటి నుంచి ఏప్రిల్‌ రెండు లేదా మూడో వారం వరకు ప్రిలిమ్స్, మెయిన్స్‌ సబ్జెక్ట్‌లను అనుసంధానం చేసుకుంటూ చదవాలి.
 • ఆ తర్వాత నుంచి ప్రిలిమ్స్‌ పరీక్ష తేదీ వరకూ పూర్తిగా ప్రిలిమ్స్‌ ప్రిపరేషన్, రివిజన్‌కు కేటాయించాలి.
 • ఈ సమయంలో కనీసం మూడు మాక్‌ లేదా మోడల్‌ టెస్ట్‌లకు హాజరు కావడం ఉపయుక్తంగా ఉంటుంది.
 • ప్రతి రోజు అన్ని సబ్జెక్ట్‌లను చదివే విధంగా సమయం విభజించుకోవాలి.
 • ప్రతి చాప్టర్‌/యూనిట్‌ పూర్తయిన తర్వాత అందులోని ముఖ్యాంశాలతో సొంత నోట్స్‌ రూపొందించుకోవాలి.
 • పరీక్ష తేదీకి నెల రోజుల ముందు నుంచి అంతకు ముందు ఏడాది వ్యవధిలో జరిగిన ముఖ్యమైన సమకాలీన అంశాలపై పట్టు సాధించాలి.

 

చ‌ద‌వండి: నేను డిగ్రీ పూర్తి చేశాను. సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుదామనుకుంటున్నాను. ఈ పరీక్షలో విజయం సాధించాలంటే.. రోజుకు 18 గంటలు చదవాలంటున్నారు. నిజమేనా?

నేను డిగ్రీ పూర్తి చేశాను. సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుదామనుకుంటున్నాను. ఈ పరీక్షలో విజయం సాధించాలంటే.. రోజుకు 18 గంటలు చదవాలంటున్నారు. నిజమేనా?
+

యూపీఎస్సీ ప్రతి ఏటా జాతీయ స్థాయిలో నిర్వహించే అత్యంత ప్రతిష్టాత్మక పరీక్ష.. సివిల్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌. ఈ పరీక్షలో విజయం సాధించాలంటే.. పట్టుదలతో ప్రణాళికబద్ధంగా ప్రిపరేషన్‌ సాగించాలి. వెయ్యిలోపు ఉద్యోగ ఖాళీలుంటే.. ప్రిలిమినరీ పరీక్షకు దాదాపు 10 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటారు. ఇంత తీవ్ర పోటీ ఉండే సివిల్స్‌ పరీక్షకు సిద్ధమవ్వాలంటే.. ఎంతో ముందుచూపు, ప్రణాళిక ఉండాలి. చాలామంది అభ్యర్థులు సివిల్స్‌లో విజయం సాధించాలంటే.. టాప్‌ ఇన్‌స్టిట్యూట్స్‌లో చదివి ఉండాలేమో.. రోజుకు 18 గంటలు చదవాలేమో.. కోచింగ్‌ తీసుకుంటేనే సక్సెస్‌ అవుతామా.. ఇలా అనేక సందేహాలతో సతమతమవుతూ ఉంటారు. అలాంటి వారికోసం సివిల్స్‌ పరీక్ష గురించిన అపోహలు.. వాస్తవాలు... 

అపోహ: సివిల్స్‌కి ప్రిపేర్‌ అవ్వాలంటే.. ప్రతిరోజూ 15–18 గంటలు తప్పనిసరిగా చదవాలి?
వాస్తవం: ఏడాది పొడవునా రోజుకు 15–18 గంటలు చదువు కొనసాగించడం అందరికీ సాధ్యమయ్యే పనికాదు. ఎన్ని గంటలు చదివామనే దాని కంటే.. విషయాన్ని ఎంత బాగా ఆకళింపు చేసుకున్నామన్నదే ముఖ్యం అంటున్నారు నిపుణులు, టాపర్స్‌. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే.. రోజుకు కనీసం ఆరేడు గంటలు నిద్రపోవాలి. నిద్ర సరిగా ఉంటేనే.. చదువుపై ఏకాగ్రత కుదురుతుంది.కాబట్టి గంటలు గంటలు పుస్తకాల ముందు కూర్చోవడం కంటే.. ఏకాగ్రతతో చదవడం ముఖ్యమని గుర్తించాలి. 

అపోహ: ఉన్నత విద్యావంతులు మాత్రమే సివిల్స్‌ పరీక్షలో సక్సెస్‌ అవుతారు? 
వాస్తవం: యూపీఎస్సీ సివిల్స్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుంది. ఐఐటీలు, ఐఐఎంలు వంటి ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌ల నుంచి వచ్చిన ఉన్నత విద్యావంతులు మాత్రమే విజయం సాధిస్తారు అనేది వాస్తవం కాదు. సంప్రదాయ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు ఎంతోమంది ప్రతిఏటా సివిల్స్‌లో సక్సెస్‌ అవుతున్నారు. హార్డ్‌వర్క్, సాధించాలనే తపన, పట్టుదలతోపాటు సహనం ఉంటే ఎవరైనా సివిల్స్‌ సాధించవచ్చు.

అపోహ: ఇంగ్లిష్‌ మీడియం అభ్యర్థులే సివిల్స్‌లో విజయం సాధిస్తారు? 
వాస్తవం: విభిన్న నేపథ్యాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని యూపీఎస్సీ ప్రోత్సహిస్తుంది. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో పేర్కొన్న 22 భాషల్లో.. ఏదైనా భాషలో పరీక్ష రాసేందుకు, ఇంటర్వ్యూలో సమాధానాలు ఇచ్చేందుకు అనుమతి ఉంది. కాబట్టి అభ్యర్థులు తమకు నచ్చిన భాషలో అభిప్రాయాలను సరళంగా, సూటిగా రాయడం, చెప్పడం సాధన చేస్తే సరిపోతుంది. అయితే ప్రామాణిక పుస్తకాలు ఎక్కువగా ఇంగ్లిష్‌లో అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఇంగ్లిష్‌పై అవగాహన పెంచుకుంటే.. పరీక్ష ప్రిపరేషన్‌లో కచ్చితంగా దోహదపడుతుందని చెప్పొచ్చు.

అపోహ: సివిల్స్‌కు ప్రిపేర్‌ అయ్యే అభ్యర్థికి ప్రతీదీ తెలిసుండాలి? 
వాస్తవం: సివిల్స్‌ సిలబస్‌ విస్తృతమైనది. వైవిధ్యమైనది. కాబట్టి ముందుగా సిలబస్‌ను అధ్యయనం చేసి.. పరీక్ష కోణంలో ముఖ్యమైన టాపిక్స్‌ను గుర్తించాలి. ఆయా ప్రాధాన్య అంశాల గురించి వివరంగా తెలుసుకోవాలి. గత ప్రశ్న పత్రాలను పరిశీలించి.. సరైన దిశలో ప్రిపరేషన్‌ సాగించాలి. 50శాతం నుంచి 60 శాతం సిలబస్‌పై పట్టు సాధించగలిగినా.. విజయం సొంతం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. 

అపోహ: కోచింగ్‌ లేకుండా సివిల్స్‌ పరీక్షలో విజయం సాధించలేం?
వాస్తవం: కోచింగ్‌ అనేది పరీక్ష తీరుతెన్నుల గురించి కొంత దిశానిర్దేశం చేస్తుంది. ఎలాంటి కోచింగ్‌ తీసుకోకుండానే ప్రతి ఏటా ఎంతో మంది సివిల్స్‌లో ర్యాంకులు సాధిస్తున్నారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో స్టడీ మెటీరియల్, నిపుణుల సలహాలు వంటివన్నీ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ప్రణాళికబద్ధంగా ప్రిపరేషన్‌ సాగించడం ద్వారా ఈ పరీక్షలో విజయం సొంతం చేసుకోవచ్చు. నిరంతర కృషి, ఆత్మవిశ్వాసం, సరైన వ్యూహంతో సివిల్‌ సర్వీసెస్‌ కలను నిజం చేసుకోవచ్చు.

సివిల్స్ ప్రాక్టీస్‌ పేపర్లలో సమాధానాలు గుర్తించేందుకు ఏది ఉత్తమ మార్గం?
+

 దీనివల్ల అభ్యర్థులు రియల్‌ ఎగ్జామ్‌లో ఎలాంటి ఇబ్బంది లేకుండా పరీక్ష రాయగలరు. మీరు రాస్తున్నది ప్రాక్టీస్‌ టెస్ట్‌గా కాకుండా, నిజమైన పరీక్షే అనుకుని రెండు గంటల సమయం పెట్టుకుని దాని ప్రకారం రాయండి. దీనివల్ల పరీక్షలో ఎలాంటి ఒత్తిడి ఉండదు. ప్రాక్టీస్‌ టెస్ట్‌ రాసిన తర్వాత ఈ కింది అంశాలను పరిశీలించాలి. అవి..
• ఎన్ని ప్రశ్నలకు ఖచ్చితమైన సమాధానం తెలుసు?
• ఎన్ని ప్రశ్నలకు సమాధానం తెలియదు?
• సమాధానాలు గుర్తించడంలో ఎక్కడ ఇబ్బంది పడ్డారు?
• ఎన్ని ప్రశ్నలకు జవాబులు ఊహించాల్సి వచ్చింది?
• అంచనా ప్రకారం గుర్తించిన ప్రశ్నల్లో ఎన్ని సరైన సమాధానాలు?!!
తద్వారా మన బలాలు, బలహీనతలపై అవగాహన వస్తుంది.

ఈ సమయం సరిపోతుంది..
సమయం తక్కువగా ఉందని అభ్యర్థులు ఆందోళన చెందవద్దు. ప్రిలిమ్స్‌ రాసే ప్రతి అభ్యర్థి మీలాగే ఆలోచిస్తారని గుర్తుంచుకోండి. తక్కువ సమయంలో ఎలా ప్రిపేర్‌ అవ్వాలో, అందుకు ఎన్ని ప్రత్యామ్నాయాలు ఉన్నాయో గుర్తించి.. అందులో మీకు అనువైన మార్గాన్ని అనుసరించండి. సిలబస్‌లో మీరు కవర్‌ చేయని అంశాలపై ఎక్కువగా దృష్టి పెట్టండి. సిలబస్‌ ప్రకారం నోట్స్‌ రాసుకొని ప్రిపరేషన్‌ సాగిస్తే.. విజయం సొంతమవుతుంది. ముఖ్యంగా ఈ తక్కువ సమయంలో ఎక్కువ ప్రాక్టీస్‌ పేపర్లకు సమాధానాలు గుర్తించడం ద్వారా సమయ పాలనతో పాటు ఏ విభాగంలో వెనుకబడ్డారో గుర్తించి, అందుకు తగ్గట్టుగా ప్రాక్టీస్‌ను మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది.
– వి.గోపాలకృష్ణ, బ్రెయి¯Œన్‌ ట్రీ ఐఏఎస్‌ అకాడమీ డైరెక్టర్‌
 

ప్రస్తుత సమయంలో సివిల్స్ ప్రిప‌రేష‌న్ లో భాగంగా సబ్జెక్ట్‌ వారీగా పేపర్లు ప్రాక్టీస్‌ చేయడం మంచిదా! లేక సమగ్ర పేపర్లకు సమాధానాలు గుర్తించడం మేలా?
+
ప్రస్తుతం  ప్రిలిమ్స్‌కు అందుబాటులో ఉన్న సమయం 50 రోజులు. ఇది సబ్జెక్టు వారీగా విభజించుకొని సెల్ఫ్‌ టెస్ట్‌ చేసుకునే సమయం కాదు. ప్రిలిమ్స్‌లో ఆయా పేపర్‌ వారీగా అన్ని సబ్జెక్టులకు కలిపి ఉన్న ప్రశ్నలకు సమాధానాలు రాయడమే మంచిది. దీనివల్ల వివిధ సబ్జెక్టులకు నిర్ణీత వ్యవధిలో సమాధానాలు గుర్తించే అవకాశం లభిస్తుంది. ఏ ఏరియాలో వెనుకబడ్డారో కూడా సులువుగా గుర్తించవచ్చు.
ప్రస్తుత సివిల్స్ షార్ట్‌ టైమ్‌ ప్రిపరేషన్‌ను మెయిన్‌లో భాగంగా చదవడం మంచిదేనా?
+
ఈ దశలో అభ్యర్థులు ప్రిలిమినరీపై పూర్తి దృష్టి పెట్టడం మంచిది.  రెండు పరీక్షలకు చాలా చాప్టర్లు ఒకే విధంగా ఉన్నాయి. ప్రిలిమ్స్‌లో మల్టిపుల్‌ ఛాయిస్‌ జవాబులు గుర్తిస్తే, మెయిన్‌లో విశ్లేషణాత్మకంగా సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ప్రిలిమ్స్‌ కోసం సాగించిన ప్రిపరేషన్‌ ఆ తర్వాత మెయిన్‌కు కూడా ఉపయోగపడుతుంది.
సివిల్స్‌ ప్రిలిమ్స్‌లో కరెంట్‌ అఫైర్స్‌ చాలా ముఖ్యమైన విభాగం. పరీక్షలు వాయిదా పడటంతో కొంతకాలంగా పత్రికలు సరిగా చదవలేదు. ఈ విభాగాన్ని ఎలా కవర్‌ చేయాలి?
+
సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పరీక్షకు ఒక నెల ముందు వరకు కరెంట్‌ అఫైర్స్‌ చదవడం మంచిది.  చాలా మంది 2019 జూన్‌ 1 నుంచి 2020 ఆగస్టు 1 వరకు కరెంట్‌ అఫైర్స్‌ను చదువుతారు. దీనికి అదనంగా సెప్టెంబర్‌ 1 వరకూ జరిగే అతి ముఖ్యమైన అంశాలపైనా దృష్టి పెట్టాలి. అలాగే కరెంట్‌ అఫైర్స్‌లో ప్రధానంగా 2020 జనవరి 1 నుంచి ఆగస్టు1 మధ్య సంభవించిన ప్రధానమైన అంశాలను బాగా గుర్తుంచుకోవాలి. న్యూస్‌ పేపర్లు చదవకపోయినా ప్రస్తుతం వివిధ న్యూస్‌ సైట్లలో ఆయా పత్రికల ఈపేపర్స్‌ అందుబాటులో ఉంటాయి. మీరు ఎప్పటి నుంచి పత్రికలు చదవడం ఆపేశారో అప్పటి నుంచి వర్తమాన విషయాలను నోట్స్‌ రాసుకోవచ్చు.
సివిల్స్ ‘సెల్ఫ్‌ చెక్‌ టెస్ట్‌’లో 55 శాతం స్కోర్‌ చేయలేకపోతే ఏం చేయాలి, పరీక్ష రాయడం ఆపేయాలా?
+
ముందు మీరు ఏ సబ్జెక్టుల్లో.. ఏయే చాప్టర్స్‌లో సమాధానాలు గుర్తించలేకపోయారు? ఎందుకు గుర్తించలేకపోయారో తెలుసుకోవాలి. ఊహించకుండా ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించారో తెలుసుకోవాలి. ఏ సబ్జెక్టుల్లో అద్భుతంగా సమాధానాలు గుర్తించగలిగారో.. ఎక్కడ వెనుకబడ్డారో అంచనా వేసుకోవాలి. ఎక్కడా, ఏ ప్రశ్నకూ ఊహించి సమాధానాలు గుర్తించవద్దు. ఆ తర్వాత, వెనుకబడిన చాప్టర్స్‌కు ఎక్కువ సమయం కేటాయించి.. ప్రిపరేషన్‌ కొనసాగించండి. పరీక్ష సమయానికి రివిజన్‌ కూడా పూర్తయ్యేలా చాప్టర్స్‌ ప్రకారం టైమ్‌టేబుల్‌ వేసుకుని ముందుకు సాగాలి.
సివిల్స్ పరీక్షలు మరోసారి వాయిదా పడతాయని సోషల్‌ మీడియాలో పుకార్లు వస్తున్నాయి. వీటిని నమ్మొచ్చా?
+
ఎన్నో ఏళ్లుగా సివిల్స్‌తోపాటు పలు జాతీయ స్థాయి పరీక్షలు పక్కాగా ముందే ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం నిర్వహిస్తుందన్న ఖ్యాతి యూనియ¯Œన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిష¯Œన్‌ (యూపీఎస్సీ)కి ఉంది. ఏటా ఆ ప్రతిష్టను కొనసాగిస్తోంది. ఎంతో బలమైన కారణం ఉంటే తప్ప పరీక్షలు వాయిదా వేసే ప్రసక్తే ఉండదు. మే నెలలో పరీక్ష నిర్వహించే సమయానికి కోవిడ్‌ ప్రభావం అధికంగా ఉంటుందని ముందే అంచనా వేసి.. అక్టోబర్‌ 4వ తేదీకి వాయిదా వేశారు. మరోసారి వాయిదా పడే అవకాశం లేదు. నిస్సందేహంగా పరీక్షలకు సిద్ధమవ్వచ్చు.
సివిల్స్‌ ప్రిప‌రేష‌న్ ఎలా..?
+

సివిల్‌ సర్వీసెస్‌.. దేశంలో క్రేజీ సర్వీసులు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ వంటి 24 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో అభ్యర్థుల ఎంపికకు ఏటా నిర్వహించే పరీక్ష! ‘కోవిడ్‌–19’ ప్రభావంతో మే నెలలో జరగాల్సిన సివిల్స్‌ ప్రిలిమ్స్‌–2020 అక్టోబర్‌ 4వ తేదీకి వాయిదా పడింది. పరీక్షలు వాయిదా పడినా.. ఈ సమయాన్ని సక్రమంగా ఉపయోగించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం పరీక్షలకు 50 రోజుల వ్యవధి ఉన్నందున సరైన ప్రణాళికతో చదవాలని సలహా ఇస్తున్నారు. సివిల్స్‌ ప్రిలిమ్స్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ప్రధానంగా ఎదురయ్యే సందేహాలకు  నిపుణుల సమాధానాలు..

కొవిడ్‌ కారణంగా సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష వాయిదా పడటంతో నా ప్రిపరేషన్ గందరగోళంలో పడింది. ఇప్పుడు మొదట చదివినంత శ్రద్ధ పెట్టలేకపోతున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో ప్రిలిమ్స్‌ రాయాలా, లేక ఈ అటెంప్ట్‌ వాయిదా వేసుకోవాలా?

సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష వాయిదా పడటం సీరియస్‌గా ప్రిపేర్‌ అవుతున్న చాలామంది అభ్యర్థులను కలవరపరిచింది. సివిల్స్‌ మాత్రమే కాదు.. పోటీ పరీక్షలు రాసే అందరిదీ ఇదే పరిస్థితి. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.  ఇంకా  దాదాపు 50 రోజుల సమయం అందుబాటులో ఉంది. ఇప్పటికే చాలావరకు సిలబస్‌ పూర్తిచేసిన అభ్యర్థులు ఈ సమయాన్ని మరింతగా సద్వినియోగం చేసుకొని పరీక్షలు రాయడమే మంచిది.

సివిల్స్‌ ప్రిలిమ్స్‌ వాయిదా ప్రకటనతో నా ప్రిపరేషన్‌ దాదాపు ఆగిపోయింది. తిరిగి ప్రిపరేషన్‌ ప్రారంభిస్తే ఈ రెండు నెలల సమయంలో పోటీలో నిలవగలనా?
+
ఇలాంటి అనుమానాలు ఉన్నవారు చేయాల్సిందల్లా.. ముందు మీరు ఎంత సబ్జెక్టు కవర్‌ చేశారో స్వయంగా అంచనా వేసుకోవాలి. అందుకోసం ప్రాక్టీస్‌ పేపర్లు ఆన్సర్‌ చేయడం; ఎన్ని ప్రశ్నలకు కచ్చితంగా(ఊహించకుండా) జవాబులు గుర్తించగలిగారో చూసుకోవడం వంటివి చేయాలి. ఈ స్వయం పరీక్షల్లో  స్కోరు 55 శాతం ఉంటే బాగా ప్రిపేర్‌ అవుతున్నట్టుగా అంచనా వేయవచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయాన్ని సబ్జెక్టుల వారీగా కేటాయించి మరింత ఉత్సాహంతో చదవడం మేలు.
గ్రూప్స్, సివిల్స్ తదితర పరీక్షల్లో ఎస్సే ఎలా రాస్తే మంచి మార్కులు వస్తాయి?
+
 • చాలామంది అభ్యర్థులకు పరీక్షలో అడిగిన ఓ అంశంపై బాగా అవగాహన ఉన్నప్పటికీ ఎస్సేను ఎలా ప్రారంభించాలో తెలియక సతమతమవుతారు. దీనివల్ల సమయం వృథా అవుతుంది. అభ్యర్థులు ఎస్సేను ప్రారంభించేందుకు సమకాలీన శైలి (Contemporary Style)ని అనుసరించాలి. ఉదాహరణకు ప్రశ్న ఉగ్రవాద నిర్మూలనకు సంబంధించినది అయితే ‘పుల్వామా దాడి’ ఘటనను ప్రస్తావిస్తూ ప్రారంభించొచ్చు.
 • ఎస్సే ప్రారంభంలో కొట్టివేతలు లేకుండా చూసుకోవాలి. అప్పుడే ఎగ్జామినర్‌ను ఆకట్టుకోగలరు. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్.. దీన్ని అభ్యర్థులు గుర్తుంచుకొని అడుగు వేయాలి. మొదటి పేజీ పేరాల్లో సరళమైన పదాలు, సూటిగా, స్పష్టమైన వివరణలు ఉండేలా చూడాలి. ఇతరులతో పోల్చితే భిన్నంగా, విశ్లేషణాత్మకంగా ఆలోచన రేకెత్తించేవిగా ఉంటే ఎక్కువ మార్కులు పొందేందుకు అవకాశం ఉంటుంది.
 • వాక్యాలు చిన్నవిగా ఉండేటట్లు చూసుకోవాలి. కఠిన పదబంధాలు ఉపయోగించకూడదు. ఎదురుగా ఉన్న వ్యక్తితో సంభాషిస్తున్నట్లు రాయాలి.
 • ఎస్సేలో చేతిరాత కీలక పాత్ర పోషిస్తుంది. అందువల్ల చాలా విషయాలను వ్యాసంలో ప్రస్తావించాలన్న తాపత్రయంతో గజిబిజిగా రాస్తే ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే ప్రమాదముంది.
 • ఎస్సేను పేరాగ్రాఫ్‌లుగా రాయాలి. అవసరమైన సబ్ హెడ్డింగ్స్ పెట్టాలి. ఒక పేరాకు తర్వాతి పేరాకు సంబంధం ఉండేలా చూసుకోవాలి. గణాంకాలను సాధ్యమైనంతవరకు శాతాల్లో చూపేందుకు యత్నించాలి.
 • బాక్స్‌లు, ఫ్లో డయాగ్రమ్స్, పైచార్ట్‌లు వంటి వాటిని అవసరానికి తగ్గట్టు సముచితంగా ఉపయోగించాలి.
 • ఎస్సేను ముగించే ముందు అప్పటివరకు రాసిన అంశాలను మరోసారి సరిచూసుకోవాలి. ప్రారంభంలో రాసిన దానికి, ముగింపునకు సంబంధం ఉండేలా చూసుకోవాలి. ఈ ముగింపు ఆశావహ దృక్పథంతో ఉండేలా చూసుకోవాలి.
పోటీపరీక్షల్లో పర్యావరణ శాస్త్ర సన్నద్ధతలో భాగంగా ప్రధానంగా ఏ అంశాలపై దృష్టిసారించాలి?
+
ఈ మధ్యకాలంలో వీఆర్‌వో నుంచి సివిల్స్ వరకు పరీక్షల్లో పర్యావరణ అంశాలకు ప్రాధాన్యం పెరిగింది. పర్యావరణం, ఆవరణ వ్యవస్థ, జాగ్రఫీ మిళితంగా ఉండే ప్రశ్నలు ఎక్కువగా వస్తున్నాయి.

ప్రధానంగా దృష్టిసారించాల్సిన అంశాలు...
 • ఎకోటోన్, కోరల్ బ్లీచింగ్, కార్బన్ ఫుట్‌ప్రింట్, ఫ్యూయల్ పావర్టీ వంటి జీవావరణ, పర్యావరణ సంబంధిత పదజాలం.
 • జల, వాయు, ధ్వని, నేల తదితర కాలుష్యాలు-కారకాలు, ప్రభావం. ఆమ్లవర్షాలు, ఫొటోకెమికల్ స్మాగ్, గ్రీన్‌హౌస్ వాయువులు, ఓజోన్ పొరకు రంధ్రం, వ్యర్థాల నిర్వహణ.
 • జీవవైవిధ్యానికి సంబంధించి ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్).. రెడ్ డేటాబుక్, బయోడైవర్సిటీ హాట్‌స్పాట్స్.
 • సహజ వనరుల పరిరక్షణ, జాతీయ పార్కులు, వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలు, చిత్తడినేలలు, బయోస్పియర్ రిజర్వ్‌లు.
 • పునరుత్పాదక ఇంధన వనరులు, జీవ ఇంధనాలు, జీవ క్రిమిసంహారకాలు తదితర అంశాలు.
 • జీవావరణం పరంగా సున్నితమైన పశ్చిమకనుమలు, హిమాలయాలకు సంబంధించిన అంశాలు.
 • వాతావరణ మార్పులు, కారణాలు, ప్రభావాలు, ఎదుర్కొనే చర్యలు, అంతర్జాతీయ సదస్సులు, ఒప్పందాలు తదితర అంశాలు.
 • పర్యావరణ పరిరక్షణ చట్టం, అటవీ చట్టం, జీవ వైవిధ్య చట్టం తదితర ప్రధాన చట్టాల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవాలి.
 • యునెటైడ్ నేషన్స్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రాం (యూఎన్‌ఈపీ), గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ ఫెసిలిటీ (జీఈఎఫ్), ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ (ఐపీసీసీ) తదితర అంతర్జాతీయ సంస్థలు, కార్యాచరణ విభాగాల గురించి తెలుసుకోవాలి.

రిఫరెన్స్ :
 • ఎన్‌సీఈఆర్‌టీ/సీబీఎస్‌ఈ ఆరు నుంచి 12 తరగతుల పుస్తకాలు. ఇగ్నో మెటీరియల్, ఎన్‌ఐఓఎస్ పుస్తకాలు, అధికారిక వెబ్‌సైట్లు.
సివిల్స్ మెయిన్స్ జనరల్ స్టడీస్ పేపర్-1లో జాగ్రఫీకి సంబంధించి సిలబస్‌లో పేర్కొన్న అంశాలకు ఎలా సిద్ధమవాలి?
+
వరల్డ్ ఫిజికల్ జాగ్రఫీలోని అంశాలకు ఆకాశమే హద్దు. అందువల్ల ప్రిపరేషన్‌లో భాగంగా తొలుత బేసిక్ విషయాలపై పట్టుసాధించాలి. ఆ తర్వాత ముఖ్యమైన అంశాలను, సమకాలీన అంశాలతో అనుసంధానం చేసుకుంటూ ప్రిపరేషన్ కొనసాగించాలి. ఇందులోని ముఖ్యాంశాలు.. భూ స్వరూపాలు, వాతావరణం, మృత్తికలు, సహజ ఉద్భిజ్జాలు వంటి భౌతిక, భౌగోళిక అంశాలు. వీటిని రెండు రకాలుగా విభజించి అధ్యయనం చేయాలి.
అవి..
1. సమకాలీన ప్రాధాన్యం ఉన్న అంశాలు.
2. ప్రత్యేక లక్షణాలున్న అంశాలు.
 • ఓ అంశాన్ని చదువుతున్నప్పుడు దాన్నుంచి ఎలాంటి ప్రశ్నలు రావడానికి అవకాశముందో ఆలోచించి చదవాలి. అప్పుడే ప్రిపరేషన్ సఫలీకృతమవుతుంది.
  ఉదా: శీతోష్ణస్థితి అనే అంశాన్ని చదువుతున్నప్పుడు ఒక ప్రాంతంలోని శీతోష్ణస్థితి అక్కడి ఆర్థిక వ్యవస్థపై ఎలా ప్రభావం చూపుతుందో తెలుసుకోవాలి.
 • భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాలు, తుపాన్లు తదితరాలపై తొలుత శాస్త్రీయ అవగాహన పెంపొందించుకోవాలి. తర్వాత అవి ఎక్కడెక్కడ.. ఎందుకు? సంభవిస్తున్నాయో తెలుసుకోవాలి.
 • మానవ జోక్యం వల్ల ఏ భౌగోళిక అంశాల్లో మార్పులు వస్తున్నాయి? వాటి ప్రభావం ఏమిటి? వంటి అంశాలపై దృష్టి సారించాలి. క్లుప్తంగా చెప్పాలంటే 'అభివృద్ధి-పర్యావరణం' కోణంలో చదవాలి.
 • జాగ్రఫీ సిలబస్‌లోని మరొక కీలకాంశం- ముఖ్యమైన సహజ వనరుల విస్తరణ. దీని ప్రిపరేషన్‌లో భాగంగా సహజవనరుల్లో ప్రధానమైనవి, సమకాలీన (వివాదాల్లో ఉండటం వంటివి) ప్రాధాన్యం ఉన్నవి ఏమిటో గుర్తించాలి. ఏ రకమైన వనరులు ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి? అలా ఉండటానికి అనుకూలించిన పరిస్థితులు? తదితర విషయాలపై అవగాహన పొందాలి.
 • ప్రపంచంలో ఏ ప్రాంతాల్లో ఏ రకమైన పరిశ్రమలు ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్నాయి.. దానికి గల కారణాలేంటి? వనరుల విస్తరణకు, పరిశ్రమల అభివృద్ధికి మధ్య సంబంధాలను అధ్యయనం చేయాలి.
సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీఎస్‌ఈ) రాయాలనుకుంటున్నాను. ఎలా చదవాలి?
+
ప్రాథమిక భావనలు (Basic concepts)పై పట్టు.. వర్తమాన వ్యవహారాలపై అవగాహన.. తులనాత్మక అధ్యయనం.. విశ్లేషణాత్మక దృక్పథం.. ఇవీ సివిల్స్ ఔత్సాహికులకు ఉండాల్సిన ప్రాథమిక లక్షణాలు! పరీక్షకు సంబంధించిన సిలబస్‌లోని అంశాల కాన్సెప్ట్స్ మొదలు వాటికి సంబంధించిన సమకాలీన పరిణామాల వరకు అన్నిటిపై సమగ్ర అవగాహన పెంచుకుంటూ శాస్త్రీయంగా అడుగులు వేయాలి. అప్పుడే విజయం చేజిక్కుతుంది. సివిల్స్ ఔత్సాహిక అభ్యర్థులు ప్రిపరేషన్‌లో భాగంగా మొదట చేయాల్సిన పని సిలబస్ అధ్యయనం. నిర్దేశిత సిలబస్‌ను ఆసాంతం క్షుణ్నంగా పరిశీలించాలి. ముఖ్యంగా మొదటిసారి పరీక్షకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఇది చాలా అవసరం. సిలబస్ పరిశీలన ద్వారా తమకు అవగాహన ఉన్న అంశాలేవి? పూర్తిస్థాయిలో దృష్టిసారించాల్సిన అంశాలేవి? అనేది తెలుస్తుంది. ఇది ప్రిపరేషన్‌కు ఎంతగానో ఉపకరిస్తుంది. సిలబస్ పరిశీలన ఆధారంగా అవగాహన లేని అంశాలను లోతుగా అధ్యయనం చేసే విషయంలో ఒక అంచనాకు రావాలి. సివిల్స్ పరీక్షలో సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ, ఎకానమీ, హిస్టరీ.. ఇలా అన్ని నేపథ్యాల అంశాలు ఉంటాయి. దీంతో పరీక్షకు పోటీపడే ప్రతి అభ్యర్థి తమ అకడమిక్ నేపథ్యానికి సంబంధంలేని అంశాల్లో కొంత ఆందోళన చెందుతుంటారు. ఉదాహరణకు ఆర్ట్స్ విద్యార్థులు సైన్స్ అండ్ టెక్నాలజీ; సైన్స్ విద్యార్థులు జనరల్ నాలెడ్జ్‌లోని పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీలకు ప్రిపరేషన్ విషయంలో ఇబ్బంది పడుతున్నారు. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సిలబస్‌లో పేర్కొన్న అంశాలన్నీ గ్రాడ్యుయేషన్ స్థాయిలోనే ఉంటున్నాయి. కాబట్టి తమ అకడమిక్ నేపథ్యం లేని అంశాలకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలి. రోజుకు పది నుంచి పన్నెండు గంటల పాటు ప్రిపరేషన్ సాగించే అభ్యర్థులు తమకు పరిచయం లేని అంశాలకు కనీసం మూడు గంటలు కేటాయించాలి. సివిల్స్ ప్రిపరేషన్ పరంగా అభ్యర్థులకు ప్రయోజనం చేకూర్చే మరో సాధనం.. గత ప్రశ్నపత్రాల పరిశీలన. దీని ద్వారా ప్రధానంగా ప్రశ్నల శైలి అర్థమవుతుంది.

సివిల్స్ విజయంలో మెటీరియల్ ఎంపికది ఎంతో కీలక పాత్ర. ప్రస్తుతం ఒక సబ్జెక్ట్‌కు సంబంధించి పదుల సంఖ్య లో పుస్తకాలు, వెబ్ రిసోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. ఆయా పుస్తకాలను ఎంపిక చేసుకునే ముందు సిలబస్‌లోని అన్ని అంశాలు ఉన్నాయా? లేవా? ఉంటే నిర్దిష్ట అంశంపై అన్ని కోణాల్లో సమాచారం ఉందా? అనేది పరిశీలించాలి. సమగ్ర సమాచారం ఉన్న మెటీరియల్‌నే ఎంపిక చేసుకోవాలి. ఒక అంశాన్ని విశ్లేషణాత్మకంగా, డిస్క్రిప్టివ్ విధానంలో చదివితే ఒకే సమయంలో ప్రిలిమ్స్, మెయిన్స్ రెండిటికీ సన్నద్ధత లభిస్తుంది.
సివిల్స్ మెయిన్స్ జీఎస్ పేపర్‌కు సంబంధించి ఎకానమీ అంశాలకు ఎలా సిద్ధమవాలి?
+
అభ్యర్థులు ఏ అంశానికి సంబంధించైనా స్వల్ప, దీర్ఘ సమాధాన ప్రశ్నలకు సమాధానాలు రాయగలిగేలా సిద్ధమవాలి. కాన్సెప్టులపై స్పష్టత ఏర్పరచుకోవాలి. సిలబస్‌లోని అంశాలకు సంబంధమున్న సమకాలీన పరిణామాలను తప్పనిసరిగా అధ్యయనం చేయాలి.
 • 11, 12వ పంచవర్ష ప్రణాళికలు; ప్రభుత్వ రంగం- వనరుల సమీకరణకు ఆధారాలు; ఉపాధి రహిత వృద్ధి; శ్రామిక శక్తి, పనిలో పాలుపంచుకునే రేటు, లోటు బడ్జెట్ విధానం, ఆర్థికాభివృద్ధి నేపథ్యంలో ఉపాధిస్తంభన తదితర అంశాలపై దృష్టిసారించాలి.
 • 11, 12వ ప్రణాళికల పత్రాల్లో సమ్మిళిత వృద్ధికి సంబంధించిన అంశాలను తప్పనిసరిగా అధ్యయనం చేయాలి. పేదరికం, నిరుద్యోగాన్ని తగ్గించడం; సామాజిక అభివృద్ధి ద్వారా సమ్మిళిత వృద్ధి ఎలా సాధ్యమవుతుందన్న దానిపై అవగాహన పెంపొందించుకోవాలి. సమ్మిళిత వృద్ధి, అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధికి మధ్య సంబంధాన్ని అధ్యయనం చేయాలి. భారత్‌లో విద్య, ఆరోగ్య రంగాల స్థితిగతుల నేపథ్యంలో సమ్మిళిత వృద్ధి సాధన అంశం ఆధారంగా ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది.
 • ప్రభుత్వ బడ్జెట్ రూపకల్పన, అమలుకు సంబంధించిన ప్రాథమిక అంశాలపై అవగాహన అవసరం. 2016-17 బడ్జెట్‌ను అధ్యయనం చేయాలి. రెవెన్యూ రాబడి, రెవెన్యూ వ్యయం, రెవెన్యూ లోటు, మూలధన రాబడి, మూలధన వ్యయం, ప్రణాళిక వ్యయం, ప్రణాళికేతర వ్యయం, ద్రవ్యలోటు వంటి అంశాలపై పట్టు సాధించాలి.
 • దేశంలోని ముఖ్య పంటలు, ఆహార ఉత్పత్తుల రవాణా, నిల్వ, మార్కెటింగ్, ఈ-టెక్నాలజీ, అవరోధాలు తదితరాలకు సంబంధించిన సమకాలీన పరిణామాలను అధ్యయనం చేయాలి. పంటల తీరుతెన్నులు, నీటిపారుదల పద్ధతులు, వ్యవసాయ మార్కెటింగ్ సంస్కరణలు వంటివాటిపై అవగాహన అవసరం. భారత్‌లో ఆహార భద్రతకు సంబంధించిన తాజా పరిణామాలను తెలుసుకోవాలి. టెక్నాలజీ మిషన్లు (టెక్నాలజీ మిషన్- కాటన్, టెక్నాలజీ మిషన్- హార్టికల్చర్ తదితరాలు) ముఖ్యమైనవి. భారత్‌లో భూ సంస్కరణలు, కౌలు సంస్కరణల అమల్లో వివిధ రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉంది? వంటి అంశాలను తెలుసుకోవాలి.
సివిల్ సర్వీసెస్ పరీక్ష గురించి పూర్తి వివరాలు తెలపండి?
+
భారతీయ సర్వీసుల్లోకెల్లా అత్యున్నత సర్వీసుగా సివిల్ సర్వీసెస్ పరీక్షను పేర్కొనవచ్చు. ఈ పరీక్షను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహిస్తుంది. ఇండియన్ ఫారిన్ సర్వీస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్,సెంట్రల్ సెక్రటేరియెట్ సర్వీస్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్), గ్రూప్-ఏ వంటి పోస్టుల్లో నియామకాల కోసం ఈ పరీక్ష నిర్వహిస్తుంది.

అర్హత: ఏదైనా డిగ్రీ. అభ్యర్థి వయసు 21-30 ఏళ్ల మధ్యలో ఉండాలి.

పరీక్ష విధానం:
 • సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష: ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. జనరల్ స్టడీస్, సివిల్ సర్వీస్ ఆప్టిట్యూడ్ టెస్ట్(సీ-శాట్).
 • ఈ రెండు పరీక్షలు ఒకే రోజు జరుగుతాయి. ఒక్కో పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. నెగెటివ్ మార్కులు ఉంటాయి. ఆబ్జెక్టివ్ విధానంలో రాతపరీక్ష ఉంటుంది. జాతీయ, అంతర్జాతీయ వర్తమాన వ్యవహారాలు, భారతదేశ చరిత్ర, జాగ్రఫీ, ఎకనమిక్ అండ్ సోషల్ డెవలప్‌మెంట్, జనరల్ ఇష్యూస్ ఆన్ ఎన్విరాన్‌మెంటల్ ఎకాలజీ, జనరల్ సైన్స్ వంటి అంశాలపై జనరల్ స్టడీస్ పేపర్‌లో ప్రశ్నలు అడుగుతారు. లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రెహెన్షన్ స్కిల్స్ వంటి వాటిపై సీ-శాట్ పేపర్‌లో ప్రశ్నలు అడుగుతారు.
 • మెయిన్ పరీక్ష: సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను మెయిన్ పరీక్షకు పిలుస్తారు. ఇందులో 9 పేపర్లు ఉంటాయి. డిస్క్రిప్టివ్ విధానంలో పరీక్ష ఉంటుంది. అభ్యర్థి పూర్తిస్థాయి నైపుణ్యాలను పరీక్షించే విధంగా ఇందులో పరీక్షలు ఉంటాయి. వీటిని ఇంగ్లిష్ లేదా ఎనిమిదో షెడ్యూల్‌లో ఉన్న ఏదైనా ఒక భాషలో రాయవచ్చు. ఇందులో తెలుగు కూడా ఉంది.
 • ఇంటర్వ్యూ: - సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులో అభ్యర్థి వ్యక్తిగత సామర్థ్యం, నాలెడ్జ్, విలువలను పరీక్షించే రీతిలో ప్రశ్నలు ఉంటాయి.
 • సివిల్ సర్వీసెస్.. భారతదేశంలో జరిగే పరీక్షలన్నిటిలో కష్టమైంది. సివిల్ సర్వీసెస్‌కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు నిరంతర శ్రమ, కఠోర దీక్ష, పట్టుదల అవసరం. ప్రపంచ వ్యాప్తంగా జరిగే అంశాలన్నిటిపైనా నిరంతరం అప్‌డేట్ అవుతూ పట్టు సాధించాలి. నాలెడ్జ్, ఆప్టిట్యూడ్ పెంచుకోవటం కోసం మేగజీన్లు చదవాలి. ఎక్కువ మోడల్ పేపర్ల సాధన ద్వారా స్పీడ్‌ను పెంచుకోవచ్చు. హ్యుమానిటీస్, సోషల్ సెన్సైస్ వంటివి ఆప్షనల్స్‌గా తీసుకోవటం మేలని నిపుణులు సూచిస్తున్నారు.

వెబ్‌సైట్: www.upsc.gov.in
కస్టమ్స్ ఆఫీసర్ కావడానికి కావాల్సిన అర్హతల వివరాలు తెలపండి?
+
ఇండియన్ రెవెన్యూ సర్వీస్(ఐఆర్‌ఎస్)కు ఎంపిక కావడం ద్వారా కస్టమ్స్ ఆఫీసర్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఐఆర్‌ఎస్‌లో ఆదాయపు పన్ను, కస్ట మ్స్, కేంద్ర ఎక్సైజ్ లాంటి విభాగాలు ఉంటాయి. విదేశాల నుంచి వచ్చే సరుకులకు సంబంధించి పన్ను వివరాల గురించి కస్టమ్స్ విభాగం చూస్తుంది. దేశంలో తయారయ్యే వస్తువులపై పన్ను గురించి ఎక్సైజ్ విభాగం చూస్తుంది. సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి ఐఆర్‌ఎస్‌లో ప్రవేశార్హత ఉంటుంది.

యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని ఐండియన్ ఫారిన్ సర్వీస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్, సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్(కస్టమ్స్, ఎక్సైజ్), గ్రూప్-ఎ లాంటి ఉద్యోగాలకు అర్హత ఉంటుంది.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ. వయసు 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

పరీక్ష విధానం:
యూపీఎస్సీ నిర్వహించే పరీక్షలో
1) సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్;
2) సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్ష;
3) పర్సనాలిటీ టెస్ట్ ఉంటాయి.

సివిల్ సర్వీస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ లో రెండు పేపర్లు ఉంటాయి. ప్రతి పేపరుకు గరిష్టంగా 200 మార్కులు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టీవ్ విధానంలో ఉంటాయి.

సిలబస్: అంతర్జాతీయ, జాతీయ వర్తమాన అంశాలు, భారతదేశ చరిత్ర, జాగ్రఫీ, ఎకనమిక్ అండ్ సోషల్ డెవలప్‌మెంట్, ఎన్విరాన్‌మెంటల్ ఎకాలజీ, జనరల్ సైన్స్, లాజికల్ రీజనింగ్, ఎనలిటికల్ ఎబిలిటీ, ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్సన్ స్కిల్స్

ప్రవేశం: ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధిస్తే మెయిన్స్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇందులో తొమ్మిది పేపర్లు ఉంటాయి. అన్నీ డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటాయి. అభ్యర్థి మేధో సామర్థ్యాన్ని, పాలనాదక్షతను ఈ పరీక్షల ద్వారా అంచనా వేస్తారు. మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించిన వారికి పర్సనాలిటీ టెస్ట్ ఉంటుంది. ఇందులో అభ్యర్థిని ఇంటర్వ్యూ చేయడం ద్వారా వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తారు.

అత్యంత క్లిష్టమైన పరీక్షగా సివిల్ సర్వీసెస్‌ను చెప్పుకోవచ్చు. దీనికోసం నిరంతర శ్రమ, అధ్యయనం తప్పనిసరి. ప్రపంచంలో జరుగుతున్న వర్తమాన అంశాలపై పట్టు సాధించాలి. మేగజీన్లని చదవడం ద్వారా వ్యక్తిగత సామర్థ్యాలను మెరుగుపరచుకోవాలి. నమూనా ప్రశ్నపత్రాలను సాధన చేయడం ద్వారా పరీక్షలో వేగాన్ని పెంచుకోవచ్చు.

వెబ్‌సైట్: www.upsc.gov.in
ఇండియన్ ఫారెన్ సర్వీస్ వివరాలను తెలపండి?
+
కేంద్ర విదేశీ మంత్రిత్వ శాఖ పరిధిలోనిది ఇండియన్ ఫారెన్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్). యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ద్వారా ఐఎఫ్‌ఎస్‌లో ప్రవేశించవచ్చు. ఇందులో ప్రిలిమ్స్, మెయిన్స్, పర్సనాలిటీ టెస్ట్ దశలుంటాయి.
అర్హత: డిగ్రీ. ఐపీఎస్, ఐఏఎస్, ఐఆర్‌ఎస్ ఇతర సర్వీసులతో కలిసి ఉమ్మడిగా ముస్సోరిలో ఫౌండేషన్ కోర్సు పూర్తి చేసుకున్న తర్వాత ఐఎఫ్‌ఎస్ అభ్యర్థులకు న్యూఢిల్లీలోని ఫారెన్ సర్వీస్ ఇన్‌స్టిట్యూట్‌లో ఏడాది కాలంపాటు శిక్షణ ఉంటుంది. శిక్షణ సమయంలోనే.. విదేశాల్లో భారత రాయబార కార్యాలయాల పనితీరుపై అవగాహన కల్పించేలా విదేశీ పర్యటన, అక్కడ భారతీయ రాయబార కార్యాలయాలతో అటాచ్‌మెంట్ ఉంటుంది. విదేశీ వ్యవహారాలతోపాటు స్వదేశంలో క్షేత్రస్థాయిలో పరిస్థితిపై అవగాహన ఏర్పరిచే దిశగా డిస్ట్రిక్ట్ అటాచ్‌మెంట్ కూడా ఉంటుంది. వివరాల కోసం యూపీఎస్సీ వెబ్‌సైట్ www.upsc.gov.in  చూడొచ్చు.
గత విజేతలకు ఇంటర్వ్యూలో అడిగిన కొన్ని ప్రశ్నలు చెప్పండి?
+
పేరు : వినీల్‌ కృష్ణ
బ్యాచ్‌ : 2004
ర్యాంక్‌ : 28
ఇంటర్వ్యూ
మార్కులు : 201/300
ఐఐటీ-మద్రాస్‌లో ఇంజినీరింగ్‌ పూర్తిచేశావు కదా క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో ఎంపిక కాలేదా ?
సివిల్‌ సర్వీసును కెరీర్‌గా ఎందుకు ఎంచుకోవాలనుకుంటున్నావు?
జిల్లా కలెక్టైర్‌గా నీ ప్రాథమ్యాలు ఏంటీ?
పాలనలో పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. ఎందుకు?
స్వేచ్ఛ, సమాచార హక్కుకు మధ్య తేడా ఏంటీ?
భారతీయుడివైనందుకు గర్విస్తున్నానన్నావు కదా ? ఎందుకు?
నీ టెక్నికల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ పాలనలో ఏవిధంగా ఉపయోగపడుతుంది?
మహిళా సాధికారత గురించి నీకు ఏమి తెలుసు?
డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అంటే ఏమిటి?
పేరు : రేవు ముత్యాలరాజు
బ్యాచ్‌ : 2006
ర్యాంక్‌ : 1
ఇంటర్వ్యూ
మార్కులు : 195/300
ఆర్‌ఈసీ వరంగల్‌ నుంచి బీ.టెక్‌., ఐఐఎస్సీ బెంగళూరు నుంచి ఎమ్‌.ఈ. చేశావు కదా. టెన్త్‌ అయిన తర్వాత డిప్లొమా ఎందుకు చదివావు?
నాలుగు నెలలు ఐపీఎస్‌ సర్వీసులో ఉన్నావు కదా. నేరాన్ని చూసినా సరే పోలీసు సాక్ష్యం చెల్లదు ఎందుకు?
ధ్యానం చేయడం... ఇతరుల్లో ప్రేరణ కల్గించడం... పురాణాల అధ్యయనం... ఇవన్నీ నీ హాబీలు కదా. ఇవన్నీ వ్యక్తి అంతర్ముఖ సంబంధిత అంశాల్లా నీకనిపించడంలేదా?
ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ చదివావు కదా. ప్రధాన సంఖ్యలను ఎక్కడ ఉపయోగిస్తారో చెప్పు?
ఉద్యోగం లేదా పరిశోధన కాకుండా సివిల్స్‌ను ఎందుకు లక్ష్యంగా ఎన్ను కున్నావు?
ఏదైనా ఒక సంఘటన జరిగితే.. బీడీఓ, డాక్టర్‌, పోలీసు వీరిలో ఎవరు ముందుగా స్పందించాలి?
పేరు : ఎం.విజయ్‌ కుమార్‌
బ్యాచ్‌ : 2006
ర్యాంక్‌ : 28
ఇంటర్వ్యూ
మార్కులు : 195/300

తత్వశాస్ర్తానికి, గణితానికి మధ్య ఉన్న సంబంధం?
గణితం, త త్వశాస్ర్తాల మధ్య సంబంధం ప్రాచీన సాహిత్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
అప్పట్లో సైన్సు సబ్జెక్టుల కంటే ఆర్ట్స్‌కు ప్రాధాన్యం ఉండేది. ఇప్పుడు పరిస్థితి మారింది. ఎందుకు?
రామాయణం, మహాభారతాలు చదివావు కదా. ప్రస్తుత సమాజానికి ఏది రిలవెంట్‌ ?
కురుక్షేత్ర యుద్ధాన్ని మనం నివారించగలిగే ఉండేవాళ్లమని నీవు భావిస్తున్నావా?
ప్రభుత్వం ఐఐటీలకోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తోంది. అయినా వాళ్లు విదేశాలకు వెళ్లిపోతున్నారు. మేధోవలసను అరికట్టడమెలా?
ఇన్‌ఫ్ల్లేషన్‌ అంటే ఏమిటి?
నీకు ఇష్టమైన తత్వవేత్త ఎవరు?
ఇంటర్‌ ప్రైవేటుగా పాస్‌ అయ్యాను. ప్రస్తుతం బీఏ రెగ్యులర్‌ కోర్సు చేస్తున్నాను. నాది ఉర్దూ మీడియం. ఐఏఎస్‌ కావాలన్నది నా లక్ష్యం. ఉర్దూ మీడియం విద్యార్ధులు సివిల్స్‌కు అర్హులు కారని అంటున్నారు. సివిల్స్‌ ఉర్దూలో రాయవచ్చా?
+
మీరు బీఏ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత సివిల్స్‌ పరీక్షలు రాసేందుకు పూర్తిగా అర్హులవుతారు. ఉర్దూ మీడియంలో సివిల్స్‌ పరీక్షలు రాయవచ్చు. సివిల్స్‌ పరీక్ష ప్రిలిమినరీ, మెయిన్స్‌, ఇంటర్వ్యూ అనే మూడు దశల్లో ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్ష మాత్రం ఇంగ్లిష్‌ లేదా హిందీ భాషల్లో రాయాలి. మెయిన్స్‌ పరీక్షలు భారత రాజ్యాంగం ఎనిమిదవ షెడ్యూల్‌లో గుర్తించిన ఏ భాషలోనైనా రాయవచ్చు. ఉర్దూ భాషకు రాజ్యాంగ గుర్తింపు ఉంది. మీరు ఎంపిక చేసుకునే మెయిన్స్‌, ఆప్షనల్‌ సబ్జెక్టులకు ఉర్దూ మీడియంలో పుస్తకాలు లభ్యత ఎక్కువగా ఉండదు. అదొక్కటే అసౌకర్యం.
నేను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 50 శాతం మార్కులతో డిగ్రీ(బీఏ) పాసయ్యాను. సివిల్‌ సర్వీస్‌ పరీక్ష రాసేందుకు నాకు అర్హత ఉందా? సివిల్స్‌ పరీక్ష విధానం ఏంటి?నేను ఏ ఆఫ్షనల్స్‌ ఎంచుకుంటే మంచిది? నోటిఫికేషన్‌, పరీక్ష తేదీ, మార్కులు తదితర పూర్తి వివరాలు తెలపండి?
+
మీరు సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష రాసేందుకు అర్హులే. సివిల్స్‌ రాసేందుకు కనీస విద్యార్హత ఏదైనా డిగ్రీ. గరిష్ట వయోపరిమితి 30 ఏళ్లు. రిజర్వేషన్లకనుగుణంగా సడలింపు ఉంటుంది. జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు నాలుగుసార్లు; బీసీ అభ్యర్థులు ఏడుసార్లు; ఎస్సీ, ఎస్టీలు ఎన్నిసార్లైనా ఈ పరీక్ష రాయొచ్చు. ప్రతి ఏటా నవంబరు, లేదా డిసెంబరులో నోటిఫికేషన్‌ వెలువడుతుంది. ప్రిలిమ్స్‌ మేలో జరుగుతుంది.

మెయిన్స్‌ రాత పరీక్షలు అక్టోబరు, లేదా నవంబరులో నిర్వహిస్తారు. సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష రెండు దశల్లో ఉంటుంది. మొదటి దశలో ప్రిలిమినరీ పరీక్ష ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటుంది. రెండో దశ మెయిన్స్‌లో రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ప్రిలిమ్స్‌ పాస్‌ అయిన వాళ్లే, మెయిన్స్‌ రాసేందుకు అర్హులు.

ప్రిలిమ్స్‌ : ప్రిలిమ్స్‌లో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌ రెండొందల మార్కులకు ఉంటుంది. ప్రశ్నలన్నీ మల్టిఫుల్‌ చాయిస్‌ విధానంలో ఉంటాయి. ఒక్కో పేపర్‌ కాల వ్యవధి రెండు గంటలు.ఒక పేపర్‌ పూర్తిగా జనరల్‌ స్టడీస్‌, మరొక పేపర్‌లో కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, మెంటల్‌ ఎబిలిటీ, లాజికల్‌ రీజనింగ్‌, డెసిషన్‌ మేకింగ్‌లపై ప్రశ్నలుంటాయి. ప్రశ్నపత్రం హిందీ, ఇంగ్లిష్‌ల్లో ఉంటుంది. ఈ మార్కులు కేవలం స్క్రీనింగ్‌ టెస్ట్‌ మాత్రమే. ఫైనల్‌ ర్యాంకింగ్‌లో ఈ మార్కులను కలపరు.

మెయిన్స్‌: మెయిన్స్‌లో మొత్తం తొమ్మిది పేపర్లుంటాయి. పేపర్‌-1లో అభ్యర్థి ఎంచుకున్న ఏదైనా భారతీయ భాష 300 మార్కులకు ఉంటుంది. ఇది కూడా ఫైనల్‌ మార్కుల్లో కలపరు. పేపర్‌-2లో ఇంగ్లిష్‌ ఉంటుంది. దీనికి కూడా 300 మార్కులు ఉంటాయి. ఈ రెండు పేపర్‌ల్లో వచ్చిన మార్కులను చివరి మార్కుల్లో కలపరు. కానీ కనీస మార్కులు సాధిస్తేనే మిగతా పేపర్లు దిద్దుతారు. పేపర్‌-3లో జనరల్‌ ఎస్సే ఉంటుంది. దీనికి రెండొందల మార్కులు. పేపర్‌ 4, 5 జనరల్‌ స్టడీస్‌ ఉంటాయి. ఒక్కో పేపర్‌కు మూడొందల మార్కులు, పేపర్‌-6, 7, 8, 9 అభ్యర్థి ఎంచుకున్న ఏవైనా రెండు ఆప్షనల్‌ సబ్జెక్టుల నుంచి ఒక్కో పేపర్‌ 300 మార్కులకు ఉంటుంది.

ఇంటర్వ్యూ: మెయిన్స్‌ ఉత్తీర్ణులైనవారిని ఉన్న ఖాళీలను పరిగణనలోకి తీసుకుని ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ 300 మార్కులకు ఉంటుంది.

టెక్ట్స్‌బుక్స్‌పై ఆధారపడాలా... గైడ్స్, స్టడీ మెటీరియల్‌ .. వీటిలో ఏది బెటర్‌?
+
ఊరెళ్లడానికి ప్రయాణమై, ఇంటిదగ్గర నుంచి బస్టాండుకు నడిచి వెళతాం. బస్సెక్కి చేరాల్సిన నగరానికి చేరిన తర్వాత రిక్షాలో చేరాల్సిన ఇంటికి వెళ్తాం. టెక్ట్స్‌బుక్‌ చదవడం వల్ల అభ్యర్థి రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ పెరుగుతుంది. విషయాన్ని ప్రాథమిక స్థాయి నుంచి స్పష్టంగా, నేర్చుకోవడానికి టెక్ట్స్‌బుక్‌ చదవడం అవసరం. టెక్ట్స్‌బుక్‌ చదవడం వల్ల విషయ నైపుణ్యంతోపాటు భాషా నైపుణ్యం, భావ ప్రకటనా సామర్థ్యం కూడా పెరుగుతాయి. ఒక విషయాన్ని నేర్చుకోవడానికి కావలసిన సహనం కూడా అలవడుతుంది. విషయంపై ఒక స్థాయి అవగాహన ఏర్పడిన తరువాత అభ్యర్థిని ఆలోచింపచేసే గుణం టెక్ట్స్‌బుక్‌ చదవడం ద్వారా ఏర్పడుతుంది. గైడ్‌‌స లేదా స్టడీ మెటీరియల్‌ విషయాన్ని తక్కువ సమయంలో అభ్యర్థి ముందు ఉంచగలిగినా, టెక్ట్స్‌బుక్‌ చదవడం వల్ల కలిగే ఇతర లాభాలు ఇందులో ఉండకపోవచ్చు. అయితే ముఖ్యాంశాలను మననం చేసుకోవడానికి వీటిని అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు.
సివిల్స్‌కు ఎంపికైనవాళ్లకు శిక్షణ ఎలా ఉంటుంది? శిక్షణలో ఏమి నేర్పుతారు?
+
‘శీలం పరమభూషణం’ అనేది ముస్సోరీ అకాడెమీ మోటో.  యోగః కర్మసు కౌశలం అనేది ఐఏఎస్‌ మోటో. రెండింటినీ పరిశీలిస్తే ఈ రంగంలోకి రావాలనుకునేవారిని శీలవంతంగా, సుశిక్షితులైన అధికారిక సేవాసైనికులుగా తీర్చిదిద్దడం శిక్షణ ప్రధాన ఉద్దేశం. భారత రాజ్యాంగం, దేశంలో అమలవుతున్న చట్టాలు, ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలైన కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, పత్రికా వ్యవస్థల మధ్య ప్రజాస్వామ్యాన్ని పెంపొందించేందుకు, ప్రజా శ్రేయస్సును పరిరక్షించుకునేందుకు అవసరమైన సమన్వయాన్ని సాధిస్తూ, భవనాన్ని స్టీల్‌ ఫ్రేమ్‌ ఎలా పైకప్పుగా ఉండి రక్షిస్తుందో అలా ప్రజాస్వామిక   భారత దేశం అనే భవనం ముక్కలు కాకుండా బలంగా, భద్రంగా భవిష్యత్తువైపు అడుగులు వేయించడానికి కావల్సిన స్ఫూర్తిని ఇవ్వడమే ముస్సోరీలోని శిక్షణ ప్రధాన ఉద్దేశం.
చిన్నప్పటి నుంచి సివిల్స్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలనుకున్న విద్యార్థి అలవరచుకోవాల్సిన లక్షణాలు?
+
చేసే పనిపట్ల ప్రేమ, పట్టుదల, ప్రణాళిక, పరిశ్రమ, అణకువ, అంకిత భావం, ఆత్మ స్థైర్యం, ఆత్మ విమర్శ, ఏ విషయం చదివినా గ్రహించడంలో స్పష్టత, వ్యక్తీకరించడంలో సరళత, వివరించడంలో సంగ్రహత.. ఇవి విద్యార్థి అలవరచుకోవాల్సిన లక్షణాలు. ప్రతిరోజూ రేడియో వార్తలు వినడం, The Hindu’ లాంటి దినపత్రికలను చదవడం, చదివిన దానిపై ఆలోచించి సహచరులతో చర్చించడం, సామాజిక సమస్యల పట్ల సానుభూతితో స్పందించడం. నిజాయితీతో నిర్భయంగా నమ్రతతో చెప్పదలచుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పగలగడం. ఇవి విద్యార్థి చేసుకోవాల్సిన అలవాట్లు. పుచ్చలపల్లి సుందరయ్య చెప్పిన కింది మాటలు ఈ సందర్భంలో విద్యార్థులందరికీ అనుకరణీయం.

‘‘నాకొక లక్షణం ఉంది. ఎప్పుడు లేవాలనుకుంటే అప్పుడు కచ్చితంగా మెలకువ వస్తుంది. నాకు నా మనోగడియారం ఉంది. అది ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది. సహజంగా లేవాలనుకునే సమయానికి కొద్ది నిమిషాలు ముందే మెలకువ వస్తుంది’’
సివిల్స్‌ ఎంపికలో అకడమిక్‌ ట్రాక్‌ రికార్డు ఏమేరకు ఉపయోగపడుతుంది?
+
ఎక్కడ, ఏం చదివారు అనే దానికంటే ఎలా చదివారు, ఏం గ్రహించారు, చక్కని వ్యక్తిత్వం, వ్యక్తీకరణ ఉన్నాయా అనే విషయాలు బాగా ఉపయోగపడతాయి. అయితే మంచి అకడమిక్‌ ట్రాక్‌ రికార్డు, మార్కులు, బహుమతులు  ఇవన్నీ అభ్యర్థి గురించి అతను ఎంత కష్టించే మనస్తత్వం ఉన్నవాడో చెప్పకనే చెపుతాయి. Facts Speak
సివిల్స్‌కు ఎంపికైనవాళ్లకు కేడర్‌ ఎలాట్‌మెంట్‌ ఎలా జరుగుతుంది?
+
అభ్యర్థి ర్యాంకు, రాష్ట్రాల వారీగా ఖాళీలు, అభ్యర్థి ఎంచుకున్న రాష్ట్రాల ప్రాధాన్యత, స్థానిక, స్థానికేతర అంశాలు, ఆల్ఫాబెటికల్‌ ఆర్డర్‌, రిజర్వేషన్‌... అంశాలన్నీ మేళవించిన నిర్థారిత ప్రక్రియ ద్వారా కేడర్‌ కేటాయింపు జరుగుతుంది.
జాబ్‌చేస్తూ సివిల్స్‌ ప్రిపరేషన్‌ సాధ్యమేనా?
+
సాధ్యమే. అలా సాధించిన వారు ఎంతోమంది. జాబ్‌ అనేది ఆర్థిక అనివార్యత. కానీ సివిల్స్‌ చాలా మందికి జీవిత లక్ష్యంగా ఉంటుంది. ఆత్మానందం, ఆత్మవిచారంతో అవిశ్రాంత పరిశ్రమ చేస్తే జాబ్‌ చేస్తూ కూడా సివిల్స్‌ సాధించవచ్చు.
ప్రిలిమ్స్‌ పేపర్‌-1కు ఎలా సిద్ధం కావాలి? ఏయే అంశాల గురించి చదువుకోవాలి?
+

ఇందులో జాతీయ, అంతర్జాతీయ ముఖ్య సంఘటనలు, భారత దేశ చరిత్ర, స్వాతంత్య్రోద్యమంలో ముఖ్య సంఘటనలు; భారత్‌, ప్రపంచ భూగోళం(నైసర్ఘిక, సాంఘిక, ఆర్థిక); భారత రాజనీతి, ప్రభుత్వం, రాజ్యాంగం, రాజకీయ విధానం, పంచాయతీరాజ్‌, పబ్లిక్‌ పాలసీ, రైట్స్‌ ఇష్యూస్‌, ఆర్థిక సాంఘికాభివృద్ధి, సస్టైనబుల్‌ డెవలప్‌మెంట్‌, పావర్టీ, ఇన్‌క్లూజన్‌, డెమోగ్రాఫిక్స్‌, సోషల్‌ సెక్టార్‌ ఇనీషియేటివ్స్‌...పర్యావరణం, బయోడైవర్సిటీ, వాతావరణ మార్పులు (ఈ అంశాల్లో ప్రత్యేక ప్రావీణ్యం అవసరం లేదు) జనరల్‌ సైన్స్‌ అంశాల్లో అభ్యర్థి పరిజ్ఞానం పరిశీలిస్తారు.

చదవాల్సిన ముఖ్యాంశాలు:
జాగ్రఫీ: ఫ్యాక్ట్స్‌, కాన్సెప్ట్స్‌ క్షుణ్నంగా చదవాలి. పాత ప్రశ్నపత్రాల ఆదారంగా మ్యాప్‌ పాయింటింగ్‌ ప్రాక్టీస్‌ చేయాలి. జనాభా, సెన్సస్‌, వనరులు, వాతావరణం...సంబంధిత సంస్థలపై పూర్తి సమాచారం తెలుసుకోవాలి.

పాలిటీ: రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌, షెడ్యూళ్లు, సవరణలు, రాజ్యాంగ సంస్థలు, నియామకాలు-అర్హతలు, ప్రజాస్వామ్యానికి సంబంధించిన ముఖ్యాంశాలపై అవగాహన అవసరం. దేశ రాజకీయ- పాలనా వ్యవస్థకు సంబంధించి రాజ్యాంగ, న్యాయ, పాలనాపరమైన పరిణా మాలను ప్రశ్నలుగా అడగొచ్చు. జ్యుడీషియల్‌ యాక్టివిజమ్‌, రాష్ట్రాల అటానమీ డిమాండ్స్‌, ప్రాథమిక విధులు వంటి అంశాల నుంచి గతంలో ప్రశ్నలొచ్చాయి.

ఎకానమీ:
బడ్జెట్‌, బడ్జెట్‌ అంశాలు, సూచీలు, ఫ్రభుత్వ పథకాలు, ఆహారోత్పత్తుల గణాంకాలు, పారిశ్రామికోత్పత్తి, విదేశీమారకం, చెల్లింపుల శేషం, పంచవర్ష ప్రణాళికలు, విదేశీ వాణిజ్యం, విదేశీ పెట్టుబడులు ...అంశాలు బాగా చదువుకోవాలి. తాజా వ్యవహారాల నుంచి ఈ విభాగంలో ప్రశ్నలు రావొచ్చు.

హిస్టరీ:
పురాతన, ఆధునిక, మధ్యయుగ చరిత్ర చదవాలి. భారత చరిత్ర కాలగమనం, యుద్ధాలు-సంవత్సరాలు, చారిత్రక కట్టడాలు, సంస్కృతి, కవులు-వారి సాహిత్య సేవలు, రాజుల ప్రోత్సాహకాలు...ఇవన్నీ చదవాలి.

కరెంట్‌ ఈవెంట్స్‌: ముఖ్యమైన సదస్సులు-వేదికలు, అవార్డులు, ముఖ్యమైన సంక్షోభాలు, భారత్‌-విదేశీ సంబంధాలు, ప్రముఖుల భారత్‌ పర్యటనలు, ప్రధాని విదేశీ పర్యటనలు, విదేశాలతో చేసుకున్న ఒప్పందాలు,  ముఖ్యమైన ఆటల పోటీలు-విజేతలు, పరాజితులు, ప్రపంచ రికార్డులు, నోబెల్‌ ప్రైజులు, సాహిత్య అవార్డులు, ప్రముఖులు రాసిన పుస్తకాలు... ఇవన్నీ చదువుకోవాలి.

సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ: బయాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీల్లోని ప్రాథమికాంశాలు, కొత్త ఆవిష్కరణలు, పర్యావరణ సంబంధ అంశాలు, సైన్స్‌కు సంబంధించిన వివిధ సంస్థలు-సదస్సులు, కొత్త టెక్నాలజీలు...ఇవన్నీ తెలుసుకోవాలి.

ఎకాలజీ: పర్యావరణం, ఓజోన్‌ పొర, ప్రస్తుత పర్యావరణ సదస్సులు, వివిధ పర్యావరణ సంస్థలు, పర్యావరణ సమతౌల్యం...ఇలాంటి అంశాల్లో తేలికపాటి ప్రశ్నలే వస్తాయి.

సూచనలు:
- నెగటివ్‌ మార్కులు ఉంటాయి కాబట్టి లాటరీ వద్దు.
- సిలబస్‌ ప్రకారం అన్నీ చదవడం పూరె్తైన తర్వాత ప్రాక్టీస్‌ పరీక్షలు రాయాలి. 
- సివిల్స్‌ కోసం కొత్తగా ప్రిపరేషన్‌ ప్రారంభించినవాళ్లు ఇప్పటికిప్పుడు మెయిన్స్‌ కోసం చదవలేరు కాబట్టి పూర్తి దృష్టంతా ప్రిలిమ్స్‌పైనే కేంద్రీకరించాలి.
- ఒక అంశం చదవడం పూరె్తైన వెంటనే దానిలోని ముఖ్యాంశాలతో సంక్షిప్త నోట్స్‌ రూపొందించుకుంటే రివిజన్‌కు బాగా ఉపయోగపడుతుంది.
- సమకాలీన అంశాలపై దిన పత్రికల ద్వారా క్రమం తప్పకుండా అవగాహన సాధించాలి.
- రోజుకు 7 గంటలకు తక్కువ కాకుండా నిద్రపోవాలి. ఒక గంట యోగా లేదా వ్యాయామం చేస్తే మెదడు చురుకుగా పనిచేస్తుంది.
- గత పదేళ్ల ప్రిలిమ్స్‌ పేపర్‌-1 ప్రశ్నపత్రాలు బాగా చదవాలి. వీటిద్వారా ఏ అంశాల్లో ఎలాంటి ప్రశ్నలొస్తున్నాయి? సబ్జెక్టుల వారీ దేనికెంత ప్రాధాన్యం...లాంటి విషయాలు తెలుస్తాయి. ఇలా చేయడం వల్ల ప్రిపరేషన్‌  సులువవుతుంది.
ఇంటర్వ్యూ తెలుగులో చేయొచ్చా?
+

తెలుగు మాధ్యమంలో మెయిన్స్ రాసిన అభ్యర్థులు ఇంటర్వ్యూను తెలుగు, ఇంగ్లిష్‌ రెండు భాషల్లోను చేయవచ్చు. గ్రామీణ నేపథ్యం, కుటుంబ చరిత్ర, నిజాయతీ.. ఈ మూడూ ప్రాధాన్యం ఉన్న అంశాలే. ఇంటర్వ్యూకు మొదటిసారి హాజరవుతున్నవాళ్లు చేసే చిన్నచిన్న తప్పులకు సడలింపు ఉంటుంది. ఇప్పటికే సర్వీస్‌లో ఉన్నవాళ్లు, ఐఐటీ, ఐఐఎం నుంచి వచ్చినవాళ్లపై ఫోకస్‌ ఎక్కువగా ఉంటుంది. ఈ బోర్డైతే బాగుంటుంది లాంటి అపోహలు లేకుండా నమ్మకంతో ముందుకు సాగండి. తెలుగులో సమాధానాలు చెప్పేవారికి ఇంగ్లిష్‌లో అనువదించడానికి దుబాషీలను ఏర్పాటుచేస్తారు.

ఇంటర్వ్యూకు వెళ్లే ముందు దేనిపై దృష్టి సారించాలి? ఏయే అంశాల్లో ప్రశ్నలు అడగొచ్చు?
+
మెయిన్స్ పరీక్ష అప్లికేషన్‌ ఫాంలో పూరించిన అన్ని అంశాలపై మీకు సమగ్ర అవగాహన ఉండాలి. ఉగ్రవాదాన్ని ఎలా ఎదుర్కోవాలి అని బోర్డు ప్రశ్నించినపుడు.. యుద్ధం చేసి ఆరికట్టవచ్చు లాంటి దుడుకు సమాధానాలు చెప్పకూడదు. యుద్ధం చేయడం సమస్యకు పరిష్కారం కాదంటూనే.. అణ్వాయుధాలు ఉన్న పాకిస్థాన్‌పై అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి తీసుకువచ్చి తీవ్రవాద సంస్థలు, శిక్షణాకేంద్రాలపై నిఘా ఉంచాలి అని చెబితే బోర్డును ఆకట్టుకోవచ్చు.
ప్రాంతం: మీ ప్రాంతానికి సంబంధించిన సమాచారం అంటే భౌగోళిక స్వరూపం, చరిత్ర, ఎకానమీ... లాంటి అంశాలపై అవగాహన ఉండాలి. ప్రసిద్ధ కట్టడాలు, ఉద్యమాలు, నదులు, ప్రాంతీయ సమస్యలు తదితర అంశాలు తెలుసుకోవాలి.

ఇంటిపేరు: మీ ఇంటిపేరుతో ఉన్న ప్రముఖ వ్యక్తులకు సంబంధించిన సమాచారంతోపాటు.. మీ ఆర్థిక, సామాజిక నేపథ్యం, తల్లిదండ్రుల వృత్తి వంటి వాటిపై అవగాహన ఉండాలి.

హాబీస్‌: ఉదాహరణకు సినిమాలను హాబీగా రాసిన ఆంధ్రప్రదేశ్‌ వ్యక్తిని ఎన్టీఆర్‌, చిరంజీవి గురించి పోల్చి చెప్పమనడం, సినిమా వ్యక్తుల రాజకీయ ప్రవేశం గురించి మీ ఉద్దేశాన్ని తెలుసుకోవడం, ఆంధ్రలో సినిమా హీరోలను ఎందుకు ఆరాధిస్తారో చెప్పమనడమో, సినిమాల ప్రభావం రాజకీయూలపై ఏమేరకు ఉంటుంది అని ప్రశ్నిం శవచ్చు.

అకడమిక్‌ బ్యాక్‌గ్రౌండ్‌: డిగ్రీ స్థాయిలో చదివిన కోర్సుల్లో వస్తున్న మార్పులు... సివిల్స్‌ను ఎంచుకోవడానికి కారణం, ఆప్షనల్స్‌ ఎంచుకో వడానికి కారణాలు.

సర్వీస్‌ ఆప్షన్స్‌: మీరు ఏ సర్వీసును ఎంచుకున్నారు.. దానికి కారణాలు... ఎంచుకున్న సర్వీసుకు సంబంధించిన సమాచారం తెలిసుం డాలి.

సెల్ఫ్‌చెక్‌: ఇంటర్వ్యూలో అడిగే అవకాశం ఉన్న ప్రశ్నలు.. దానికి మీరు చెప్పే సమాధానం.. మీ ఆన్సర్‌పై బోర్డు అడిగే అనుబంధ ప్రశ్నలను ఊహించుకొని ప్రిపేరైతే జవాబుల్లో స్పష్టత ఉంటుంది.

కరెంట్‌ అఫైర్స్‌: ఈ విభాగంలో అడిగే ప్రశ్నలు మీ విశ్లేషణా సామ ర్థ్యాన్ని పరిశీలించే విధంగా ఉంటాయి. రాష్ట్ర, దేశ, ప్రపంచ స్థాయిలో జనజీవనంతో ముడిపడిన అంశాలతోపాటు రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. మన రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ సమస్య, ఎస్సీల వర్గీకరణ, సత్యం కుంభకోణం, రాష్ట్రంలో అమలులో ఉన్న వివిధ సంక్షేమ పథకాలు, సాగునీటి ప్రాజెక్టులు, ఫీ రీఎంబర్స్‌మెంట్‌, రాష్ట్ర బడ్జెట్‌, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ, 108, 104... ఇలా దేని గురించైనా అడగొచ్చు. ఎన్నికల హామీలు.. రాష్ట్ర రాజకీయూలు.. వివిధ జాతీయ రాజకీయ పార్టీలు-పొత్తులు, ఉగ్రవాదం, ఆర్థిక మాంద్యం, కార్పొరేట్‌ గవర్నెన్స్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ... తదితర అంశాలపై ప్రశ్నించొచ్చు.

ట్రెండ్‌ మారుతోంది...
ఇటీవలి కాలంలో యుపీఎస్‌సీ ఇంటర్వ్యూ విధానంలో మార్పులు వచ్చాయి. ఆ ప్రశ్నల సరళి ఇలా ఉంటోంది.. మీ జీవిత లక్ష్యాలు బలాలు, బలహీనతలు, సర్వీసుకు ఎంపికైతే ఎలాంటి పనులు చేస్తారు? కెరీర్‌ అంటే కేవలం డబ్బేనా? కెరీర్‌కు మీరిచ్చే నిర్వచనం.. పదేళ్ల తర్వాత మిమ్మల్ని మీరు ఎలా చూసుకోవాలనుకుంటున్నారు? ఇలాంటి ప్రశ్నలడుగుతున్నారు.

సహనాన్నీ పరీక్షిస్తారు...
కొంతమంది కనీసం మూడుసార్లు పరీక్షరాస్తే గానీ ఇంటర్వ్యూ వరకు రాలేరు. మూడేళ్లు చదివితే గానీ ఇంటర్వ్యూ వరకు రాలేకపో యూవా? అని ప్రశ్నిస్తారు. ఇలాంటి ప్రశ్నలు మిమ్మల్ని తక్కువచేసి చూడటానికి కాదు. మీలో సహనం ఎలా ఉంది? ఓపికెంత? ఒత్తిడిని తట్టుకోగలరా? ఇవన్నీ పరిశీలించడానికే.

మీరూ అడగొచ్చు...
ఒక్కోసారి ఇంటర్వ్యూ ఆఖరులో ఏదైనా ప్రశ్న అడగమని బోర్డు కోరుతుంది. మీరడిగే ప్రశ్న బోర్డు సభ్యుల అపార అనుభవం నుంచి మీరు నేర్చుకోవడానికి తోడ్పడేలా ఉండాలి. దేశంలోనే అత్యున్నత సివిల్‌ సర్వెంట్‌లను ఎంపిక చేసే బోర్డులో సభ్యులు కావడం పట్ల మీరు ఎలా ఫీలవుతున్నారు? లాంటి ప్రశ్నలు అడగొచ్చు. అంతేకానీ మీ తెలివితేటలను ప్రదర్శించుకునేలా ప్రశ్నలు ఉండకూడదు.

డ్రెస్సింగ్‌..
అబ్బాయిలైతే ముదురు రంగు ప్యాంటు, లేతరంగు షర్టు వేసుకుంటే మంచిది. పాలిష్‌ చేసిన నలుపు లేదా బ్రౌన్‌ రంగు బూట్లు ధరించొచ్చు. అమ్మాయిలైతే చీరలే మంచిది. సెంట్లు వాడకపోవడమే శ్రేయస్కరం. డ్రెస్సింగ్‌ కోసం ఎక్కువ సమయూన్ని వృథా చేయొద్దు. 1973 ఇంటర్వ్యూలో ఆర్‌బీఐ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు వేసు కున్న తెల్లరంగు చొక్కాపై సుమారు 20 నిమిషాలు ఇంటర్వ్యూ సాగింది.

మాక్‌ ఇంటర్వ్యూలకు హాజరవ్వాలి:
మీలోని లోపాలను విశ్లేషించి సలహా ఇచ్చే వారి దగ్గరికే మాక్‌ ఇం టర్వ్యూలకు వెళ్లాలి. నిపుణులు, సీనియర్లు ఇచ్చిన సలహా పాటిం చాలి. వార్తాపత్రికలు, టీవీల్లోని విశ్లేషణల్లో అంశాలను విశ్లేషిం చుకుంటూ... ప్రతి అంశంపై మీకంటూ ఒక సొంత అభిప్రాయాన్ని ఏర్పరచుకోవాలి. బాడీలాంగ్వేజ్‌, భాషపై మరీ ప్రత్యేకమైన శ్రద్ధ అవ సరం లేదు. ఒరిజినాలిటీ ముఖ్యం.
చేతిరాత ఎలా ఉండాలి? సమాధానం ఎలా రాయాలి?
+
కనీసం మనం చదవాలనుకునే విధంగా ఉండే చేతిరాతలో సమా ధానాలు రాయాలి. అందంగా లేకపోయినా.. చదవగలిగేదిగా ఉం డాలి. చేతిరాతలో స్పష్టత లేనివారు.. ఒక పదంలో అక్షరానికి, అక్ష రానికి దూరం పెంచటం.. ప్రతి వాక్యంలోని పదానికి, పదానికి మధ్య దూరం పెంచటం.. ప్రతి పేజీలోను లైనుకు, లైనుకు మధ్య దూరం పెంచటం.. చేస్తే చేతిరాతలో స్పష్టత పెరుగుతుంది. చేతిరాత పైనే తలరాత ఆధారపడి ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు. మెయిన్స్‌ పరీక్షలో అభ్యర్థి మానసిక పరిణితి కూడా వ్యక్తమవుతుంది. రాసే సమాధానాలు చక్కని భాషలో, అతివాద భావాలు లేకుండా.. నిర్మాణాత్మక దృక్పథంలో సాగాలి. భాషా సంయమనం, భావ సంయమనం రెండూ అవసరం. రాసే విషయం పట్ల సమాధానంలో.. ఆత్మీయత, నిజాయితీ కనిపించాలి. అడిగిన విషయం గురించి నాకు ఏం తెలుసు? ప్రశ్నలో నన్నేం రాయమని అడిగారు? నాకు తెలిసిన దాంట్లోంచి, అడిగిన ప్రశ్నకు ఎంత స్పష్టంగా సమాధానం రాయగలను? ఇవి అభ్యర్థులు సమాధానం రాసేముందు వేసుకోవాల్సిన ప్రశ్నలు?ఈ ప్రశ్నలకు జవాబుగా వచ్చిన ఆలోచనలను క్రమంగా, క్లుప్తంగా పైన పేర్కొన్న విధంగా సమాధానంగా రాయాలి. తాళం తెరుచు కోవాలంటే... దానికి నిర్ధారించిన తాళం చెవినే ఉపయోగించాలి. మన వద్ద ఉన్న ఏదో ఒక తాళం చెవితో తాళం తీద్దామనుకుంటే అవివేకం. అడిగిన ఏ ప్రశ్నకైనా మన వద్ద ఉన్న సమాచారాన్నంతా..dump చేద్దామనుకుంటే.. పొరపాటే. చివరిగా పరీక్ష రాసే అభ్యర్థి మానసిక స్థితి ప్రశాంతంగా ఉండాలి. ఫలితంపై కంటే ప్రయత్నం పైనే దృష్టంతా ఉం డాలి.
మెయిన్స్‌ పరీక్షలో ప్రశ్నలకు సమాధానాలు రాయడానికి సమయపాలన ఏవిధంగా విభజించుకోవాలి?
+
మెయిన్స్‌ పరీక్షల్లో అభ్యర్థి రాసే సమాధానాలు Descriptiveగా ఉంటాయి. జనరల్‌ స్టడీస్‌ గానీ, ఆప్షనల్‌కు గాని పద పరిమితి (Wo rd Limit)కి అనుగుణంగా సమాధానాలు రాయాల్సి ఉంటుంది. జనరల్‌ స్టడీస్‌లో 20 పదాల నుంచి 250 పదాల వరకు.. ఆయా ప్రశ్నల పద పరిమితులను అనుసరించి అభ్యర్థి సమాధానం రాయాలి. పద పరిమితి పాటించటంలో కచ్చితమైన పద్ధతంటూ లేకపోయినా... యూపీఎస్సీ మాటల్లో చెప్పాలంటే.. Credit will be given for effective and exact expression. సూటిగా రాసే కచ్చితమైన సమాధానాలకే ఎక్కువ విలువ ఇస్తారు. 20 పదాలు రాయాల్సిన సమాధానానికి 30 పదాలు లేదా 40 పదాలు రాస్తున్నామంటే... ఆ ప్రశ్నకు కేటాయించాల్సిన సమయం కంటే ఎక్కువ కేటాయించి, మరో ప్రశ్నకు అన్యాయం చేయబోతున్నామన్న మాట. ఎందుకంటే... జనరల్‌ స్టడీస్‌లో కానీ, ఆప్షనల్‌ సబ్జెక్టుల్లో కానీ.. ఒక్కో పేపర్లో అభ్యర్థి రాయాల్సిన సమాధానాలు దాదాపు 3000 పదాలు. 3000 పదాలను మూడు గంటల్లో రాయాలంటే... ప్రతి ప్రశ్నకు దానికి రాయాల్సిన పదాల కంటే మరీ ఎక్కువగా రాస్తే.. మరో ప్రశ్నను అవసరమైన దాని కంటే కుదించాల్సి ఉంటుంది. అదనంగా రాసిన పదాలకు అదనపు మార్కులు లభించవు, గానీ అవసరమైనంత రాయని సమాధానానికి రావాల్సినన్ని మార్కులు రావు. రెండు విధాలా అభ్యర్థికే నష్టం. అం దువల్ల సమాధానాలు రాసే సమాధాన పత్రం చక్కగా మార్జిన్లు వదిలిన తర్వాత... లైనుకు 5 పదాలు సగటున వచ్చే విధంగా.. పేజీకి 20 లైన్లు రాస్తే, ప్రతి పేజీకి 100 పదాలు వస్తాయి. ఒక పేజీ (100 పదాలు) రాయటానికి 5 నిమిషాల కంటే ఎక్కువ సమయం తీసుకో కూడదు. అభ్యర్థి తదేకంగా రాస్తూ పోతే... రెండో పేజీ చివరికి వస్తున్న దశలో అతనికి తాను సమాధానాన్ని ఇక ముగించాలన్న విషయం అనాలోచితంగా గుర్తుంటుంది(200 పదాలు పద పరిమితికి). అలాగే పెద్ద ప్రశ్నలకు 6పేజీలు సరిపోతాయి. ఇలా సూక్ష్మస్థాయి వరకూ ప్రణాళిక ఉంటే... అభ్యర్థి తాను రాయాలనుకున్న సమాధానాలను, అడిగినంత నిడివిలో.. ముఖ్యమైన అంశాలేవీ వదిలిపెట్టకుండా రాయగలుగుతాడు. అలా కాకుండా.. అరగంట రాయాల్సిన ప్రశ్నకు, గంట సమాధానం రాస్తే.. ఆ ప్రభావం మిగతా ప్రశ్నలకు రాయాల్సిన సమాధానాలపై పడి, జవాబు నాణ్యత దెబ్బతింటుంది. అన్నీ ప్రశ్నలకు సమాధానం రాయలేకపోవచ్చు. జవాబు చిన్నదైనా, పెద్దదైనా.. రాయాల్సిన సమాధానానికి సంబంధించి చిన్న ప్రణాళిక ఒకటి లేదా రెండు నిమిషాల్లో వేసుకుని, దాని ప్రకారం ముందుకెళితే... రాద్దామ నుకున్న పాయింట్లు ఏవీ మిస్‌ కావు. ఈ ప్రణాళిక మనసులోనైనా లేదా ఆన్సర్‌ షీట్‌పైనైనా ఎవరికి వచ్చినట్లు వారు వేసుకోవచ్చు.
సమాధానాలు రాసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రశ్నలోని పదాలను ఎలా ఆకళింపు చేసుకోవాలి? ఏ పదానికి ఎలా సమాధానం రాయాలి?
+
Explain, Enumerate, Analyse, Critically Analyse, Comment, Describe లాంటి పదాలు ప్రశ్నల్లో తరచూ కనిపిస్తాయి. ఈ పదాలు రాయబోయే సమాధానానికి దిక్సూచి లాంటివి. ఈ పదాల అర్థం సరిగ్గా ఆకళింపు చేసుకుంటేనే.. అభ్యర్థి సమాధానం సరైన దిశలో సాగుతుంది.

Describe అనే పదం అర్థం పరిశీలిస్తే.. తెలుగులో ‘వర్ణించటం’ దానికి సమానార్థకం. ఏదైనా విషయాన్ని వర్ణించమన్నప్పుడు చిన్న ప్పుడు బామ్మలు, తాతయ్యలు కథలను ఎలా వర్ణించి చెప్పేవారో? ఒక్కసారి మనం స్ఫురణకు తెచ్చుకోవాలి. ఈ వర్ణనలో పాటించాల్సిన క్రమాన్ని కూడా సమాధానం రాసేటప్పుడు దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. ఒక మనిషిని గురించి వర్ణించేటప్పుడు.. శిరస్సుతో ప్రారంభమై, పాదాలతో ముగుస్తుంది. అంటే.. ప్రాముఖ్యతా క్రమాన్ని తప్పకుండా వర్ణిస్తేనే.. వర్ణన రక్తికడుతుంది.

Analyse అంటే.. విశ్లేషించటం. విశ్లేషణలో ఆ విషయానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై లోతైన పరిశీలన అవసరం. అలాగే critically Analyse అంటే... విమర్శనాత్మక దృక్పథంతో లోతైన అధ్యయనం కలిగిన సమాధానం రాయమని అర్థం. Analyse, critically Analyse కు తేడా ఏంటంటే... Analyse అన్నప్పుడు అభ్యర్థి తటస్థ విశ్లేషకుడిగా సమాధానం రాస్తే..critically Analyse అన్నప్పుడు విమర్శనాత్మక దృక్పథంతో కూడిన విశ్లేషణ రాయాల్సి ఉంటుంది.

Enumerate అంటే.. విషయానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను యధాతథంగా చెప్పటం. అలాగే Explain అంటే.. ముఖ్యాంశాలను యధాతథంగా చెప్పటమే కాక, వాటిని స్పష్టంగా వివరించటం అవసరం. అలాగే comment అన్నప్పుడు, విషయా నికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను చెబుతూనే.. అభ్యర్థి తన అభిప్రాయాలను కూడా వ్యక్తం చేయాల్సి ఉంటుంది. అంటే.. ముఖ్య మైన అంశాలపై అభ్యర్థి వ్యాఖ్యాతగా వ్యవహరించాల్సి ఉంటుంది. క్లుప్తంగా చెప్పాలంటే... Describe అన్నప్పుడు కవి లాగా.. Analyse అన్నప్పుడు విషయాన్ని విశ్లేషించే అధ్యాపకుడిలా గానూ.. critically Analyse అన్నప్పుడు విమర్శనాత్మక పాత్రికే యుడిగా.. Enumerate అన్నప్పుడు వార్తల్లో ముఖ్యాంశాలు చదివే News Reader లాగాను.. Explain అన్నప్పుడు వివరాలతో సహా వార్తలను అందించే విలేఖరిలాగాను.. Discuss అన్నప్పుడు ఏదైనా ఒక విషయంపై జరిగే చర్చలో సంచాలకుడిగాను... Comment అన్నప్పుడు విషయాన్ని ప్రత్యక్షంగా పరిశీలిస్తూ, దానికి సంబంధించిన అన్ని అంశాలపై వ్యాఖ్యానించే వ్యాఖ్యాతగాను (ఉదాహరణ: టీవీల్లో చూసే ప్రత్యక్ష వ్యాఖ్యానాలు-విషయంపై వ్యాఖ్యాత అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతుంటాయి) అభ్యర్థి వ్యవహరించాలి. News Reader కవిలా మారినా.. సంచాలకుడు వ్యాఖ్యాతగా మారినా.. పాత్రికేయుడు అధ్యాపకుడిగా మారినా... రక్తి కట్టకపోగా రసాభాసగా మారుతుంది.
ప్రిపరేషన్‌, ప్రెజెంటేషన్‌ టిప్స్‌?
+
 సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో విజయం సాధించాలంటే... ప్రిపరేషన్‌ సమయంలో తప్పనిసరిగా మూడు అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. అందులో ఒకటి, సిలబస్‌లో ముఖ్యమైన విభాగాలను గుర్తించడం; రెండు, ఈ విభాగాల నుంచి యూపీఎస్‌సీ కోణంలో ప్రశ్నలు ఎలా వచ్చే అవకాశం ఉందో అవగాహన పెంచుకోవడం; మూడు, ముఖ్యమైన అంశాలపై మీరే సొంతంగా ప్రశ్నలు సిద్ధం చేసు కొని, సమాధానాలు రాయడం ప్రాక్టీస్‌ చేయాలి.

ముఖ్యాంశాలు
 పద పరిమితి(వర్డ్‌ లిమిట్‌) అనేది మీ సౌకర్యం కోసమే; కాబట్టి సమయపాలన మీ చేతిలోనే ఉంది. భాష... చిన్నచిన్న పదాలు, వాక్యాలతో అర్థ్ధవంతంగా, సరళంగా ఉండాలి. పెద్దపెద్ద పదబంధాలతో సంక్లిష్టంగా ఉంటే... అభ్యర్థికి నష్టం వాటిల్లడం ఖాయం. అర్థం కాకుండా ఎంత రాసినా వ్యర్థమే.

 చేతిరాత అందంగా చదివించేట్లుగా ఉండటం మేలు చేస్తుంది.   రెండు మార్కుల ప్రశ్నలను మొదట పూర్తి చేయండి.  ఆలోచిస్తూ సమయం వృధా చేయకుండా... బాగా తెలిసిన ప్రశ్నలకు మొదట సమాధానాలు రాయడం మేలు. బ్యాలెన్స్‌డ్‌ అభిప్రాయూలతో సమాధానాన్ని ప్రారంభిస్తే... సగం పని పూర్తయినట్లే. సాంఘిక, రాజకీయ అంశాలకు సంబంధించిన ప్రశ్నలు రాసేటప్పుడు రాజ్యాంగ విలువలను తప్పనిసరిగా అనుసరించాలి. మీరు చెప్పదలచుకున్న పాయింట్స్‌ను సరిగా ప్రజెంట్‌ చేయండి. ముఖ్యమైన అంశాలకు సమాధానంలో ప్రాధాన్యం ఇవ్వండి. 

మెయిన్స్‌ పరీక్షకు సంబంధించిన గతంలో వచ్చిన ప్రశ్నలు చాప్టర్ల వారీగా మార్కెట్‌లో లభిస్తున్నాయి. వాటిని దగ్గర పెట్టుకోండి.  ప్రిపరేషన్‌ విషయంలో అనవసరమైన సలహాలకు దూరంగా ఉండండి. ఎందుకంటే... మీకు మీరే సరైన నిర్ణేత. కఠిన నిబంధనలకు యూపీఎస్‌సీ ప్రాముఖ్యత ఇవ్వదు. ఇలాంటి వాటిని ప్రొఫెసర్లు కూడా పట్టించుకోరు. నిర్మాణాత్మకమైన, సమయోచితమైన ఆలోచనా విధానం సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్స్‌ పరీక్ష రాసే అభ్యర్థికి మంచి ఫలితాల్ని ఇస్తుంది. కొన్ని కోచింగ్‌ సెంటర్ల వాళ్లు అభ్యర్థులు తమపై ఆధారపడేట్లు చేస్తూ... ప్రిపరేషన్‌ ప్రక్రియను సంక్లిష్టం చేస్తున్నారు.
ప్రిపరేషన్‌ ప్రణాళిక ఎలా రూపొందించుకోవాలి?
+
రోజుకు కనీసం 15 గంటలు ప్రణాళికాబద్ధంగా సాధన చేస్తే ఆప్షనల్‌, జనరల్‌ స్టడీస్‌లపై మంచి పట్టు సాధించవచ్చు. సబ్జెక్ట్‌లోని ఒక్కో కాన్సెప్ట్‌పై సంపూర్ణ విషయ పరిజ్ఞానం ఒక్కరోజులో సాధ్యమయ్యే పని కాదు. ఆ సబ్జెక్ట్‌కు సంబంధించి సిలబస్‌లోని ఏ అంశంపై అయినా, ఆ విషయంపై ఏ మాత్రం పరిజ్ఞానం లేని ఏ వ్యక్తికి అయినా అర్థమయ్యేలా చెప్పగలగాలి. అప్పుడే మనం నేర్చుకున్న అంశంపై మనకు సాధికారత ఏర్పడటమే కాకుండా... భావ ప్రక టనా సామర్థ్యం పెరుగుతుంది. వేరెవరికైనా బోధించే సౌకర్యం అందుబాటులో లేకపోతే, మనకు మనమే బోధించుకోవాలి.

ఆప్షనల్‌ సబ్జెక్టుల్లో వివిధ అంశాలపై ప్రిపేర్‌ అయ్యేటప్పుడు ఎంపిక చేసుకున్న కొన్ని మంచి పుస్తకాల్లోని ముఖ్య కాన్సెప్ట్‌లను ఒకటికి 10 సార్లు చదివితే ఆ విషయంపై సంపూర్ణ అవగాహన ఏర్పడుతుంది. దొరికిన ప్రతి పుస్తకం చదవడం వల్ల సమయం వృథా కావడంతో పాటు స్పష్టత కొరవడుతుంది. రోజూ ప్రిపరేషన్‌కు కేటాయించే సమయంలో 60% ఆప్షనల్‌ సబ్జెక్టుకు, 40% జనరల్‌ స్టడీస్‌కు కేటా యిస్తే ప్రిపరేషన్‌లో సమతుల్యత ఏర్పడి ఫలితం ఉంటుంది. ప్రతి కాన్సెప్ట్‌ లేదా సిలబస్‌లో ప్రతి అధ్యాయాన్ని చదివిన తర్వాత ఆ అధ్యాయం నుంచి గత ప్రశ్నాపత్రాల్లో వచ్చిన ప్రశ్నలను సాధన చేయాలి. మళ్లీ ఆ అధ్యాయాన్ని తిరిగి చదివేటప్పుడు ఆ ప్రశ్నల దృష్టి కోణంలో చదివితే పాత వాక్యాల్లోనే కొత్త అర్థాలు స్ఫురించటం, మొదట్లో పరిశీలించని అంశాలెన్నో మన దృష్టికి వస్తాయి. ఇలా పఠ నం, మననం ఏక కాలంలో సాగితే అడిగిన ప్రశ్నకు వేగంగా స్పందిం చి సమాధానం రాయగలిగే నైపుణ్యం పెరుగుతుంది. ఆప్షనల్‌ సబ్జెక్టు సిలబస్‌ పూర్తి అయిన తర్వాత మోడల్‌ ప్రశ్నాపత్రాలను వీలైనన్ని ఆన్సర్‌ చేయాలి. దీంతో ఎక్కడ తప్పులు చేస్తున్నామో తెలియడమే కాకుండా నిర్దేశిత సమయంలో మనం ప్రశ్నపత్రాన్ని పూర్తి చేస్తు న్నామో లేదో తెలుస్తుంది. ఆప్షనల్‌ సబ్జెక్టు, జనరల్‌ స్టడీస్‌కు సంబం ధించి మోడల్‌ పరీక్షలు రాసే సమయాన్ని యూపీఎస్సీ నిర్ధారిత సమయంలో రాయటం అలవాటు చేసుకుంటే అది ఒక నిరంతర ప్రక్రియగా మారి అసలు పరీక్ష రోజున శరీరం, మనసు, మెదడు శిక్షణ పొందిన సైనికుల్లా పని చేయడానికి అలవాటు పడతాయి.

జనరల్‌ స్టడీస్‌ జనరల్‌గా....
ఈ విభాగంలో మంచి మార్కులు పొందాలంటే సూచించిన పుస్తకా లను క్షుణ్ణంగా కనీసం 4సార్లు చదివేలా ప్రణాళిక వేసుకోవాలి. మనం చదవగలిగే సమాచారం ఎంత? గంటకు మనం చదివే వేగం ఎంత?(కనీసస్థాయి 12-15 పేజీలు) లభించిన సమయంలో విషయాన్ని 4సార్లు రివిజన్‌ చేయటానికి మన విషయసేకరణ కూర్పు, ఎంత పకడ్బందీగా ఉండాలి? లాంటి విషయాలపై స్పష్టమైన అవగాహన అభ్యర్థికి అవసరం. ప్రణాళిక అంత సూక్ష్మస్థాయిలో సరిగ్గా అమలు చేయగలిగితేనే స్థూలస్థాయిలో ఆశించిన ఫలితం వస్తుంది.

ప్రిపరేషన్‌ సమయంలో అభ్యర్థులు చేసే తప్పులు, సివిల్స్‌ ప్రిపరేషన్‌ ఎలా ఉండాలి?
+
ప్రిలిమ్స్‌కు ప్రిపేర్‌ అయ్యే విద్యార్థులు చేసే మెుట్టమెుదటి తప్పిదం ప్రతి విషయంపైనా మార్కెట్‌లో అందుబాటులో ఉండే సమాచారా న్నంతా సేకరించడం. యూపీఎస్సీ అభ్యర్థి నుంచి ఏమి ఆశిస్తుందనే విషయంపై స్పష్టమైన అవగాహన లేకుండా సమాచారాన్ని సేకరించ డం వల్ల ప్రయోజనం లేదు. ఎందుకంటే సేకరించిన సమాచారాన్ని పూర్తిగా చదవలేక, చదివిన దానిని ఒక క్రమ పద్ధతిలో అమర్చుకోలేక, చదవని అంశాలపై అనవసరపు కంగారుతో సతమతమవుతారు. బాల్యం నుంచి మన విద్యాభ్యాసాన్ని ఒకసారి అవలోకనం చేసుకుంటే.. ఏ విషయూన్నైనా మనం గుర్తుంచుకుని, అర్థం చేసుకుని, స్పష్టంగా వ్యక్తీకరించాలంటే పఠనం, మననం ద్వారానే సాధ్యం. చిన్న వయసు నుంచి అనేకమార్లు విషయూన్ని వల్లె వేయటం వల్ల మెదడు కండరాలు దానికి అలవాటుపడి జ్ఞాపకశక్తి పెంపొందుతూ వస్తుంది. చిన్నప్పటినుంచి విషయూన్ని నేర్చుకునేటప్పుడు, పరీక్షా సమయూల్లో వచ్చే సందేహాలను, చేసిన తప్పులను మనం చాలాకాలం గుర్తుంచుకొని వాటిని పునరావృతం చేయం. అంతేకాక చదివే విషయూన్ని కూడా ఒకే పుస్తకం నుంచి పదేపదే చదువుతూ, ఆ పుస్తకంలోని సమాచారం, భాష, విశ్లేషణ లాంటి విషయూల పట్ల మక్కువ పెంచుకుంటాం. ప్రిలిమినరీ ప్రిపరేషన్‌లో కూడా ఈ అలవాటు చక్కగా పని చేస్తుంది.
ఆప్షనల్స్‌ ఎలా ఎంపిక చేసుకోవాలి? వీటి ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు?
+
అభ్యర్థి అభిరుచి, అందుబాటులో ఉన్న సమాచారం, విషయ పరిజ్ఞానం ఆధారంగా ఆప్షనల్స్‌ ఎంచుకోవాలి. డిగ్రీ స్థాయిలో తాను చదివిన అంశమనో, మిత్రులు చెప్పారనో తీసుకోకూడదు. కొంతమంది సంవత్సరానికి ఒక ఆప్షనల్‌ మార్చేస్తుంటారు. అలా చేయడం సమయం వృథా. ఆప్షనల్‌ను జీవిత భాగస్వామిగా భావించి ఆఖరు ప్రయత్నం దాకా దాన్నే కొనసాగించండి.
ఎంచుకున్న సబ్జెక్టులో ఆప్టిట్యూడ్‌, యాటిట్యూడ్‌, ఎబిలిటీ అవసరం. ఏ ప్రశ్న అడిగినా రాయగలిగే సమర్థత, సన్నద్ధత రావాలంటే ఎంచుకున్న సబ్జెక్టును ప్రేమించాలి. సబ్జెక్టును ప్రేమించాలంటే ఆసక్తి ఉన్న దాన్నే ఎంచుకోవాలి. మీరు డిగ్రీ చదివేటప్పుడే ఏ ఆప్షనల్‌ ఎంచుకోవాలో ఒక నిర్ణయూనికి రండి. డిగ్రీ స్థారుులో చదివిన సబ్జెక్టులను కూడా ఆప్షనల్స్‌గా ఎంచుకోవచ్చు. అరుుతే ఈ సబ్జెక్టుల్లో మీ ప్రిపరేషన్‌ చాలా లోతుగా ఉండాలి. 
మెయిన్స్‌ పరీక్ష ఎలా ఉంటుంది? అభ్యర్థి నుంచి ఏమి గమనిస్తారు? సిలబస్‌ స్థాయి ఏ విధంగా ఉండొచ్చు?
+
‘‘మెయిన్స్‌ పరీక్ష ముఖ్యోద్దేశం అభ్యర్థికి అన్ని విభాగాల్లోనూ ఉన్న మేథోశక్తిని పరీక్షించడం, అభ్యర్థిని లోతుగా అర్థం చేసుకోవడానికే. అభ్యర్థి దగ్గర ఎంత సమాచారం ఉంది, ఎంత జ్ఞాపక శక్తి ఉందో తెలుసుకోవడానికి కాదు’’. మెయిన్స్‌ పరీక్షలో మీ చేతి రాత బాగుండాలి (అర్థవుయ్యేలా) మీ చేతిరాతే మీ తలరాత అన్న విషయుం వురవొద్దు.

ప్రస్తుత విధానం ప్రకారం మెయిన్స్‌లో మొత్తం 7 పేపర్లు ఉంటాయి. ఇందులో నాలుగు జనరల్ స్టడీస్ (4 x 250=1000), రెండు ఆఫ్షనల్ (2 x 250=500), జనరల్ ఎస్సే, ఇంగ్లిష్‌తో కూడిన ఒక పేపర్ (300 మార్కులు) ఉంటాయి. మెయిన్స్ మొత్తం 7 పేపర్లకూ కలిపి 1800 మార్కులకు ఉంటుంది. ఇంటర్వ్యూ 275 మార్కులకు జరుగుతుంది.

సిలబస్‌ కోసం చూడండి
ఏదో ఒక సర్వీస్‌ సొంతం కావాలంటే ఎన్ని మార్కులు రావాలి?
+
  కేటగిరీ మార్కులు
 జనరల్‌     1200
 ఓబీసీ       1175
 ఎస్సీ        1150
 ఎస్టీ         1120
(ఇది కేవలం అంచనా కోసమే. ఆ సంవత్సరం అభ్యర్థులు గరిష్టంగా పొందిన మార్కులు, ఉన్న ఖాళీల బట్టి ఈ కటాఫ్‌ మారుతుంది)
ఇంటర్వ్యూ వరకు వెళ్లాలంటే మెయిన్స్‌లో ఎన్ని మార్కులు రావాలి?
+
 (మెయిన్స్‌ 2000 మార్కులకు)
 కేటగిరీ మార్కులు
  
 జనరల్‌         980
 ఓబీసీ           960
 ఎస్సీ            950
 ఎస్టీ             920
సివిల్స్‌కు సిద్ధపడేవాళ్లు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం?
+
 గాంధీజీ తన భార్యతో ఒక సందర్భంలో ఇలా అన్నారు ‘‘ఏదైనా పనిని ప్రేమిస్తేనే, ఆనందిస్తేనే చేయి. లేకపోతే ఆ పనిని తలపెట్టకు’’ ఒలంపిక్‌ పోటీలాంటి సివిల్స్‌ పరీక్షలో విజయం సాధించాలంటే సహనం, సంయమనం, అంకితభావం, ప్రణాళికాబద్ధమైన కృషి, అన్నింటికీ మించి చేసే పనిలో ఆనందం వెతుక్కోవడం ఎంతో అవసరం. ఇలాచేస్తే ఏదోఒక ప్రయత్నంలో సివిల్స్‌లో విజేతగా నిలుస్తారు. పరీక్ష సమస్యలా, ప్రిపరేషన్‌ శిక్షలా భావిస్తే విజయానికి వేయి మైళ్ల దూరంలో ఆగిపోవాల్సిందే. తల్లిదండ్రుల ఒత్తిడివల్లో, మరెవరో ప్రిపేర్‌ అవుతున్నారనో ప్రిపరేషన్‌ మొదలెడితే ఐదేళ్లు పూరెతైనా ప్రిలిమినరీ పరీక్ష దాటలేరు.

Work is love made visible

అనే ఖలీల్‌ జీబ్రాన్‌ మాటలను ప్రిపరేషన్‌ కోసం సిద్ధపడ్డ ప్రతి ఒక్కరూ ఎప్పటికీ గుర్తుంచుకోవాలి.

ఇంటర్వ్యూకు ఎంతమందిని పిలుస్తారు? ఇందులో ఏమి గమనిస్తారు?
+

ఆ ఏడాది ఉన్న మొత్తం ఖాళీలకు రెండు రెట్ల సంఖ్యలో అభ్యర్థులను ఇంటర్వ్యూ కోసం పిలుస్తారు. ఇంటర్వ్యూ ముఖ్యోద్దేశం మీరు పబ్లిక్‌ సర్వెంట్‌గా సేవలందించడానికి సరిపోతారా లేదా అనేదాన్ని బోర్డు సభ్యులు పరిశీలించడానికే. మీ మనోసామర్థ్యం, మానసిక పరిణతిని గమనిస్తారు తప్ప ఇదేమీ కఠినమైన క్రాస్‌ ఎగ్జామినేషన్‌ కాదు. కేవలం ఇంటలెక్చువల్‌ క్వాలిటీస్‌ (పరిజ్ఞాన లక్షణాలు/మేధోపరమైన లక్షణాలు) కాకుండా.. సోషల్‌ ట్రైట్స్‌, వర్తమాన విశేషాలపై మీకున్న ఆసక్తిని గమనిస్తారు. మీ అభిరుచులపై ప్రశ్నలడుగుతారు.

ఇవి గమనిస్తారు...
మెంటల్‌ అలర్ట్‌నెస్‌, క్రిటికల్‌ పవర్స్‌ ఆఫ్‌ అసిమిలేషన్‌, క్లియర్‌ అండ్‌ లాజికల్‌ ఎక్స్పోజిషన్‌, బ్యాలెన్స్‌ ఆఫ్‌ జడ్జిమెంట్‌, వెరైటీ అండ్‌ డెప్త్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌, ఎబిలిటీ ఫర్‌ సోషల్‌ కొహెషన్‌, లీడర్‌షిప్‌, ఇంటలెక్చువల్‌ అండ్‌ మోరల్‌ ఇంటిగ్రిటీ.
మీకున్న జనరల్‌ నాలెడ్జ్‌, అకడమిక్‌ పరిజ్ఞానం, ఆప్షనల్‌ సబ్జెక్టులపై ప్రశ్నలేయరు. ఎందుకంటే.. వీటిని ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ పరీక్షల్లోనే పరిశీలించారు. మీ చుట్టూ, బయట, రాష్ట్రంలో, దేశంలో జరుగుతున్న వివిధ సంఘటనలు, కొత్త ఆవిష్కరణలపై ప్రశ్నలు అడుగుతారు. ఇంటర్వ్యూలో బోర్డు సభ్యులు అడిగిన ప్రశ్నలకు తెలుగులోనూ సమాధానం చెప్పొచ్చు. దీనికోసం ట్రాన్స్‌లేటర్‌ను ఏర్పాటు చేస్తారు. అయితే ఇంగ్లిష్‌లోనే సమాధానం చెప్పడం శ్రేయస్కరం.

ఏయే ఆప్షనల్స్‌ను కాంబినేషన్‌గా తీసుకోకూడదు?
+
ఈ కాంబినేషన్లు కుదరదు...
 పొలిటికల్‌ సైన్స్‌-పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌
 కామర్స్‌-మేనేజ్‌మెంట్‌
 ఆంత్రోపాలజీ-సోషియాలజీ
 మ్యాథ్స్‌-స్టాటిస్టిక్స్‌
 అగ్రికల్చర్‌-యానిమల్‌ హజ్బెండరీ అండ్‌ వెటర్నరీ సెన్సైస్‌
 మేనేజ్‌మెంట్‌-పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌
 సివిల్‌- మెకానికల్‌- ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ (మూడింట్లో ఒకదాన్నే తీసుకోవాలి)
 యానిమల్‌ హజ్బెండరీ అండ్‌ వెటర్నరీ సైన్స్‌-మెడికల్‌ సైన్స్‌

(పైనున్న ఏ జోడీ కాంబినేషన్లలోనైనా జోడీకి ఒకదాన్నే ఎంచుకోవాలి) ఏ రెండు భాషా సాహిత్యాలనూ కలిపి ఆప్షనల్స్‌గా ఎంచుకునే వీలు లేదు.
కోచింగ్‌ అవసరమా?
+
ఇది అకడమిక్‌ పరీక్ష కాదు. పరీక్షలోనూ ఎక్కువ స్థాయిలు భిన్న సబ్జెక్టులు ఉంటాయి. కాబట్టి కోచింగ్‌ తీసుకుంటే ప్రయోజనమే. అన్నిటికంటే మించి సివిల్‌ సర్వీస్‌కు ఎంపికైనవారితో టచ్‌లో ఉంటూ మీ సందేహాలు నివృ్తత్తి చేసుకోవాలి. వారిచ్చే సూచనలు మీ విజయానికి నిచ్చెనలవుతాయి. కోచింగ్‌ లేకపోయినా సక్సెస్‌ అరుునవారు కూడా ఉన్నారు. కోచింగ్‌ ఒక ప్లాట్‌ఫాం లాంటిది. కేవలం ఏదైనా సెంటర్‌లో చేరినంతమాత్రాన సరిపోదు. శ్రమించి చదివితేనే ఏదో ఒక సర్వీస్‌ సొంతమవుతుంది. దారి తెలిస్తే గమ్యం దగ్గరవుతుంది. కానీ నడవాల్సింది మాత్రం అభ్యర్థే. కోచింగ్‌ దారి చూపడానికి ఉపకరిస్తుంది.
రోజూ పేపర్‌ చదవాలా?
+
సివిల్స్‌కు ప్రిపేర్‌ అయ్యే అభ్యర్థులు కరెంట్‌ అఫైర్స్‌పై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలి. హిందూ లేదా, సాక్షి (తెలుగు మీడియంలో రాసే వాళ్లు) ప్రతిరోజూ చదవాలి. అలానే ఫ్రంట్‌లైన్‌ మ్యాగజీన్‌, సివిల్‌ సర్వీసెస్‌ క్రానికల్‌ , ఇండియా ఇయర్‌ బుక్‌ (పబ్లికేషషన్స్‌ డివిజన్‌), మనోరమ ఇయర్‌ బుక్‌ చదవండి. ఒక పేపర్‌ , ఒక మ్యాగజీన్‌ రెగ్యులర్‌గా చదివితే సరిపోతుంది.
సివిల్స్‌ అంటే ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ అందులోనూ జనరల్‌ స్టడీస్‌, ఆప్షనల్స్‌, ఎస్సే... ఇలా భిన్న సబ్జెక్టులు ఉంటాయి కదా. చాలా పుస్తకాలు చదవాలేమో?
+
చదివిందే పదిసార్లు చదవడం విజయ రహస్యం. ఇలా చేయడం వల్ల కొత్త ఆలోచనలు వచ్చి ఆ అంశాన్ని అన్ని కోణాల్లోనూ సృ్పశించడానికి/విశ్లేషించడానికి సాధ్యపడుతుంది. సరళమైన భాష, చక్కటి విశ్లేషణ, సమగ్ర విషయ పరిజ్ఞానం ఉన్న పుస్తకాలే ఎంపిక చేసుకోవాలి. ‘‘సివిల్స్‌ నోటిఫికేషన్‌లో పేపర్‌, సబ్జెక్టు వారీ సిలబస్‌ నిర్దేశించారు. ప్రశ్నలు సిలబస్‌ను దాటి అడగరు. కాబట్టి సిలబస్‌ ప్రకారం ప్రిపేరైతే సరిపోతుంది.’’

మార్కెట్‌లో దొరికిన ప్రతి పుస్తకాన్నీ సేకరించవద్దు. సివిల్స్‌లో విజయం సాధించిన సీనియర్లు, కోచింగ్‌ ఫ్యాకల్టీతో చర్చించి ఏయే పుస్తకాలు చదవాలో ఒక నిర్ణయానికి రండి. ప్రిపరేషన్‌ సమయంలో వాటిని మాత్రమే మీ రూంలో ఉంచుకోవాలి. పదులసంఖ్యలో న్యూస్‌పేపర్లు... మ్యాగజీన్లు కొన్నంత మాత్రాన సక్సెస్‌ రాదు.  ఎన్ని పుస్తకాలు కొన్నాం అనేదానికంటే... ఎంత చదివాం.. ఎన్ని అంశాలు గుర్తుంచుకున్నాం... ఎంత బాగా రాశాం అన్నదే ప్రధానం. మీరు అంతిమంగా పరీక్ష హాలులో 3 గంటల్లోపు ఏం రాశారు అనేదే కీలకం. ఏ పుస్తకం చదవాలి.. ఎక్కడ కోచింగ్‌ తీసుకోవాలి... ఆప్షనల్స్‌గా వేటిని ఎంపిక చేసుకోవాలి?ఉద్యోగం చేయాలా? లేక మానేసి ప్రిపేర్‌ కావాలా అని ఆలోచిస్తూ ... ఏమీ చేయకుండా సమయం వృథా చేసుకోవద్దు. ఏ నిర్ణయమైనా ఒక నిర్ణీత వ్యవధిలోపు బాగా ఆలోచించి తీసుకోండి. తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గద్దు.
ప్రిలిమ్స్‌లో పేపర్‌-2 కష్టమా?
+
 పదోతరగతి స్థాయిలో పేపర్‌-2 ప్రశ్నలు ఉంటాయని యూపీఎస్‌సీ పేర్కొంది.  క్యాట్‌ పరీక్ష మాదిరి పేపర్‌-2 ఉంటుందని కొంతమంది ప్రచారం చేశారు. ఈ రెండూ వాస్తవానికి కాస్త దూరంగా ఉన్నవే. మరీ పదోతరగతి స్థాయిలో కానీ, క్యాట్‌ అంత కష్టంగానూ పేపర్‌-2 లేదని మొన్నటి ప్రశ్నపత్రం రుజువు చేస్తుంది. క్యాట్‌ లక్ష్యం, స్వరూపం వేరు.  సివిల్స్‌ పేపర్‌-2 వేరు. క్యాట్‌ పరీక్షను అభ్యర్థి పూర్తిస్థాయి సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి విశిష్ట కొలమానంగా ఏర్పాటు చేశారు. అందులో ఎంపికైతే గ్రూప్‌ డిస్కషన్‌తోనే ప్రవేశం లభిస్తుంది. సివిల్స్‌ ప్రిలిమ్స్‌ లక్ష్యం వడపోత. అభ్యర్థి పూర్తి పరిజ్ఞానాన్ని ప్రిలిమ్స్‌లో తెలుసుకోవాలని భావించరు. ఎందుకంటే తర్వాత 2000 మార్కులకు మెయిన్స్‌ ఆ తర్వాత 300 మార్కులకు ఇంటర్వ్యూ ఉంటాయి. వీటిద్వారా అభ్యర్థిని అన్నికోణాల్లోనూ తెలుసుకోవడానికి వీలవుతుంది. సివిల్స్‌లో మూడు దశలున్నాయి కాబట్టి స్టేజ్‌-1 ఐన ప్రిలిమ్స్‌ ఎంపికకు ప్రధాన సూచీ కాదు. వడపోతకు మాత్రమే ప్రిలిమ్స్‌ పరిమితం. ఇంతకుముందు పేపర్‌-1లోనూ మ్యాథ్స్‌ సంబంధిత ప్రశ్నలు 30 వరకు సివిల్స్‌ ప్రిలిమ్స్‌లో అడిగేవారు. ఇప్పుడు వాటిని పేపర్‌-1 నుంచి మినహాయించి పరిధి పెంచారు. ప్రశ్నల సరళి సాధారణంగా బ్యాంక్‌ పరీక్షలు, ఐసెట్‌ మాదిరిగానే ఉంటాయి. నాన్‌ మ్యాథ్స్‌ అభ్యర్థులు కూడా కొంచం శ్రమిస్తే ప్రశ్నలు సులువుగానే ఎదుర్కోవచ్చు. తర్కం ఉపయోగించే విధానంపై ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు రాయొచ్చు. పేపర్‌ కష్టంగా ఉన్నప్పటికీ ప్రిలిమ్స్‌లో ఖాళీలకు 12 లేదా 13 రెట్ల అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఎంపికలో మార్పులేదు కాబట్టి అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.  బాగా చదివిన మీకు కష్టమనిపిస్తే... మీతోటి సహచరులకూ కష్టంగా ఉన్నట్లే లెక్క.
కోచింగ్‌ ఎక్కడ తీసుకోవాలి? ఎంత ఖర్చు అవుతుంది?
+
డబ్బు సమస్య కాకుంటే ఢిల్లీలో కోచింగ్‌ తీసుకోవచ్చు. వాజీరామ్‌, శ్రీరామ్స్‌ ఐఏఎస్‌, రావూస్‌... ఢిల్లీలో పేరున్న కోచింగ్‌ సెంటర్లు. ఢిల్లీ తర్వాత దేశంలో సివిల్స్‌ కోచింగ్‌లో హైదరాబాద్‌ రెండోస్థానంగా చెప్పుకోవచ్చు. ఆర్‌సీరెడ్డి, బ్రెయిన్‌ ట్రీ కోచింగ్‌ సెంటర్ల నుంచి ఏటా పదుల సంఖ్యలో అభ్యర్థులు ఎంపికవుతున్నారు. హైదరాబాద్‌లో ఐతే  ప్రిలిమ్స్‌, మెయిన్స్‌  జనరల్‌ స్టడీస్‌; ఆప్షనల్‌ కోచింగ్‌, రిఫరెన్స్‌ పుస్తకాలు మొత్తం కలిపి యాభై వేల రూపాయల వరకు ఖర్చవుతుంది. హాస్టల్‌ కోసం నెలకు రూ.3 వేలు తప్పనిసరి. గది అద్దెకు తీసుకొని చదువుకోవాలంటే రూ.5వేలు ఆపైన ఖర్చవుతుంది. ఢిల్లీలో కోచింగ్‌ తీసుకుంటే అదనంగా మరో 30-40 శాతం ఎక్కువ ఖర్చవుతుంది.   
పాత ప్రశ్నపత్రాలు ఎక్కడ లభిస్తాయి?
+
చాలా వెబ్‌సైట్లలో పాత ప్రశ్నపత్రాలు లభిస్తాయి. గూగుల్‌లో సెర్చ్‌ చేస్తే కావాల్సినంత సమాచారం దొరుకుతుంది.
www.sakshieducation.com
https://upsc.nic.in,

లాంటి వెబ్‌సైట్లలో వెతుక్కోవచ్చు.
ప్రిలిమినరీ పరీక్షకు ఉపయోగపడే పుస్తకాలు?
+

పేపర్‌-1
ఇండియన్‌ హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ: 11, 12 తరగతుల ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు
పాలిటీ: యాన్‌ ఇంటర్‌డక్షన్‌ టు ఇండియన్‌ కాన్‌స్టిట్యూషన్‌, అవర్‌ కాన్‌స్టిట్యూషన్‌
జనరల్‌ సైన్స్‌: ఎన్‌సీఈ ఆర్‌టీ 8, 9, 10 తరగతుల పుస్తకాలు
సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ: మనోరమ, ఇండియా ఇయర్‌ బుక్‌లో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అంశాలు
కరెంట్‌ అఫైర్స్‌: ప్రతి రోజూ దినపత్రిక చదువుతూ ముఖ్యాంశాలు రాసుకోవాలి. మనోరమ ఇయర్‌ బుక్‌లో కరెంట్‌ అఫైర్స్‌ సెక్షన్‌ చదువుకుంటే చాలు

పేపర్‌-2
ఇంగ్లిష్‌:
ఎ ప్రాక్టికల్‌ ఇంగ్లిష్‌ గ్రామర్‌-థాంప్సన్‌ మార్టినెట్‌, వర్డ్‌ పవర్‌ మేడ్‌ ఈజీ-నార్మన్‌ లూయీస్‌
మ్యాథ్స్‌: క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌-ఆర్‌ఎస్‌ అగర్వాలా
బ్యాంక్‌ పీవో నమూనా పరీక్షలు రాస్తే సివిల్స్‌ పేపర్‌-2పై అవగాహన వస్తుంది.