Skip to main content

నేను డిగ్రీ పూర్తి చేశాను. సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుదామనుకుంటున్నాను. ఈ పరీక్షలో విజయం సాధించాలంటే.. రోజుకు 18 గంటలు చదవాలంటున్నారు. నిజమేనా?

Question
నేను డిగ్రీ పూర్తి చేశాను. సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుదామనుకుంటున్నాను. ఈ పరీక్షలో విజయం సాధించాలంటే.. రోజుకు 18 గంటలు చదవాలంటున్నారు. నిజమేనా?

యూపీఎస్సీ ప్రతి ఏటా జాతీయ స్థాయిలో నిర్వహించే అత్యంత ప్రతిష్టాత్మక పరీక్ష.. సివిల్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌. ఈ పరీక్షలో విజయం సాధించాలంటే.. పట్టుదలతో ప్రణాళికబద్ధంగా ప్రిపరేషన్‌ సాగించాలి. వెయ్యిలోపు ఉద్యోగ ఖాళీలుంటే.. ప్రిలిమినరీ పరీక్షకు దాదాపు 10 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటారు. ఇంత తీవ్ర పోటీ ఉండే సివిల్స్‌ పరీక్షకు సిద్ధమవ్వాలంటే.. ఎంతో ముందుచూపు, ప్రణాళిక ఉండాలి. చాలామంది అభ్యర్థులు సివిల్స్‌లో విజయం సాధించాలంటే.. టాప్‌ ఇన్‌స్టిట్యూట్స్‌లో చదివి ఉండాలేమో.. రోజుకు 18 గంటలు చదవాలేమో.. కోచింగ్‌ తీసుకుంటేనే సక్సెస్‌ అవుతామా.. ఇలా అనేక సందేహాలతో సతమతమవుతూ ఉంటారు. అలాంటి వారికోసం సివిల్స్‌ పరీక్ష గురించిన అపోహలు.. వాస్తవాలు... 

అపోహ: సివిల్స్‌కి ప్రిపేర్‌ అవ్వాలంటే.. ప్రతిరోజూ 15–18 గంటలు తప్పనిసరిగా చదవాలి?
వాస్తవం: ఏడాది పొడవునా రోజుకు 15–18 గంటలు చదువు కొనసాగించడం అందరికీ సాధ్యమయ్యే పనికాదు. ఎన్ని గంటలు చదివామనే దాని కంటే.. విషయాన్ని ఎంత బాగా ఆకళింపు చేసుకున్నామన్నదే ముఖ్యం అంటున్నారు నిపుణులు, టాపర్స్‌. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే.. రోజుకు కనీసం ఆరేడు గంటలు నిద్రపోవాలి. నిద్ర సరిగా ఉంటేనే.. చదువుపై ఏకాగ్రత కుదురుతుంది.కాబట్టి గంటలు గంటలు పుస్తకాల ముందు కూర్చోవడం కంటే.. ఏకాగ్రతతో చదవడం ముఖ్యమని గుర్తించాలి. 

అపోహ: ఉన్నత విద్యావంతులు మాత్రమే సివిల్స్‌ పరీక్షలో సక్సెస్‌ అవుతారు? 
వాస్తవం: యూపీఎస్సీ సివిల్స్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుంది. ఐఐటీలు, ఐఐఎంలు వంటి ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌ల నుంచి వచ్చిన ఉన్నత విద్యావంతులు మాత్రమే విజయం సాధిస్తారు అనేది వాస్తవం కాదు. సంప్రదాయ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు ఎంతోమంది ప్రతిఏటా సివిల్స్‌లో సక్సెస్‌ అవుతున్నారు. హార్డ్‌వర్క్, సాధించాలనే తపన, పట్టుదలతోపాటు సహనం ఉంటే ఎవరైనా సివిల్స్‌ సాధించవచ్చు.

అపోహ: ఇంగ్లిష్‌ మీడియం అభ్యర్థులే సివిల్స్‌లో విజయం సాధిస్తారు? 
వాస్తవం: విభిన్న నేపథ్యాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని యూపీఎస్సీ ప్రోత్సహిస్తుంది. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో పేర్కొన్న 22 భాషల్లో.. ఏదైనా భాషలో పరీక్ష రాసేందుకు, ఇంటర్వ్యూలో సమాధానాలు ఇచ్చేందుకు అనుమతి ఉంది. కాబట్టి అభ్యర్థులు తమకు నచ్చిన భాషలో అభిప్రాయాలను సరళంగా, సూటిగా రాయడం, చెప్పడం సాధన చేస్తే సరిపోతుంది. అయితే ప్రామాణిక పుస్తకాలు ఎక్కువగా ఇంగ్లిష్‌లో అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఇంగ్లిష్‌పై అవగాహన పెంచుకుంటే.. పరీక్ష ప్రిపరేషన్‌లో కచ్చితంగా దోహదపడుతుందని చెప్పొచ్చు.

అపోహ: సివిల్స్‌కు ప్రిపేర్‌ అయ్యే అభ్యర్థికి ప్రతీదీ తెలిసుండాలి? 
వాస్తవం: సివిల్స్‌ సిలబస్‌ విస్తృతమైనది. వైవిధ్యమైనది. కాబట్టి ముందుగా సిలబస్‌ను అధ్యయనం చేసి.. పరీక్ష కోణంలో ముఖ్యమైన టాపిక్స్‌ను గుర్తించాలి. ఆయా ప్రాధాన్య అంశాల గురించి వివరంగా తెలుసుకోవాలి. గత ప్రశ్న పత్రాలను పరిశీలించి.. సరైన దిశలో ప్రిపరేషన్‌ సాగించాలి. 50శాతం నుంచి 60 శాతం సిలబస్‌పై పట్టు సాధించగలిగినా.. విజయం సొంతం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. 

అపోహ: కోచింగ్‌ లేకుండా సివిల్స్‌ పరీక్షలో విజయం సాధించలేం?
వాస్తవం: కోచింగ్‌ అనేది పరీక్ష తీరుతెన్నుల గురించి కొంత దిశానిర్దేశం చేస్తుంది. ఎలాంటి కోచింగ్‌ తీసుకోకుండానే ప్రతి ఏటా ఎంతో మంది సివిల్స్‌లో ర్యాంకులు సాధిస్తున్నారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో స్టడీ మెటీరియల్, నిపుణుల సలహాలు వంటివన్నీ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ప్రణాళికబద్ధంగా ప్రిపరేషన్‌ సాగించడం ద్వారా ఈ పరీక్షలో విజయం సొంతం చేసుకోవచ్చు. నిరంతర కృషి, ఆత్మవిశ్వాసం, సరైన వ్యూహంతో సివిల్‌ సర్వీసెస్‌ కలను నిజం చేసుకోవచ్చు.

Photo Stories