Civils Preparation Plan: సివిల్స్‌కు సన్నద్ధమవ్వండిలా!.. పరీక్ష విధానం, ప్రిపరేషన్ తదితర వివరాలు..

23 సర్వీసులు.. 979 పోస్ట్‌లు
సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్–2025 ద్వారా ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్, ఐపీఎస్ సహా మొత్తం 23 సర్వీసుల్లో 979 పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు. అయితే గత రెండేళ్లతో పోల్చితే ఈ ఏడాది పోస్ట్‌ల సంఖ్య తగ్గడం గమనార్హం. 2024 నోటిఫికేషన్‌లో 1056 పోస్ట్‌లు, 2023లో 1105 పోస్ట్‌లు ఉండగా.. ఈ ఏడాది ఆ సంఖ్య 979కు తగ్గింది.
అర్హతలు
- బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- వయసు: 2025 ఆగస్ట్ 1 నాటికి 21–32 ఏళ్లు ఉండాలి. ఎస్‌సీ, ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు చొప్పున గరిష్ట వయో పరిమితిలో సడలింపు లభిస్తుంది.
దరఖాస్తు నిబంధనలు
- సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్–2025కు సంబంధించి దరఖాస్తు విధానంలో కొత్త నిబంధనలు పేర్కొన్నారు. యూపీఎస్‌సీ తాజా నిబంధనల ప్రకారం–అభ్యర్థులు ప్రిలిమ్స్ దరఖాస్తుతోపాటే అన్ని అవసరమైన డాక్యుమెంట్లు (అర్హతల సర్టిఫికెట్లు, కుల ధ్రువీకరణ సర్టిఫికెట్స్) అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
- గత ఏడాది వరకు బ్యాచిలర్ డిగ్రీ ఫైనల్ విద్యార్థులు.. ప్రిలిమ్స్‌లో విజయం సాధించాక.. మెయిన్స్‌కు దరఖాస్తు చేసుకునే సమయంలోనే విద్యార్హతల సర్టిఫికెట్ ఇవ్వాల్సిన విధంగా నిబంధన ఉండేది. కాని ఈ ఏడాది నుంచి ఆ సర్టిఫికెట్‌ను మెయిన్స్‌లో విజయం సాధించాక సమర్పించేలా సడలింపు కల్పించారు.
చదవండి: సివిల్స్ - స్టడీ మెటీరియల్ | సక్సెస్ స్టోరీస్ | ఎఫ్‌ఏక్యూస్ | గైడెన్స్ | వీడియో లెక్చర్స్ | జనరల్ ఎస్సే | జీకే
ప్రిలిమ్స్ పరీక్ష విధానం
- సివిల్స్ ఎంపిక ప్రక్రియలో తొలి దశ ప్రిలిమినరీ పరీక్షను రెండు పేపర్లలో నాలుగు వందల మార్కులకు నిర్వహిస్తారు. అవి.. పేపర్–1 జనరల్ స్టడీస్ 100 ప్రశ్నలు – 200 మార్కులకు, అదేవిధంగా పేపర్–2 ఆప్టిట్యూడ్ టెస్ట్ 80 ప్రశ్నలు–200 మార్కులకు ఉంటాయి. ప్రిలిమినరీ ఎగ్జామ్ పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో మల్టిపుల్ ఛాయిస్ కొశ్చన్స్‌తో నిర్వహిస్తారు.
- ప్రిలిమినరీ పరీక్షలో పేపర్–1(జనరల్ స్టడీస్)లో నిర్దిష్ట కటాఫ్ మార్కులను సాధించిన వారిని రెండో దశ మెయిన్స్ ఎగ్జామినేషన్‌కు ఎంపిక చేస్తారు. పేపర్–2లో కనీసం 33 శాతం మార్కులు సాధించాలనే నిబంధన ఉంది. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కు ఒక్కో పోస్ట్‌కు 12 లేదా 13 నిష్పత్తిలో ఎంపిక చేస్తారు.
మెయిన్ ఎగ్జామ్
- ఎంపిక ప్రక్రియ రెండో దశ మెయిన్ ఎగ్జామినేషన్‌లో రెండు లాంగ్వేజ్ పేపర్లు, ఒక జనరల్ ఎస్సే పేపర్, నాలుగు జనరల్ స్టడీస్ పేపర్లు, రెండు ఆప్షనల్ పేపర్లు ఉంటాయి. అర్హత పేపర్లయిన లాంగ్వేజ్ పేపర్లలో పొందిన మార్కులను తుది జాబితా రూపకల్పనలో పరిగణనలోకి తీసుకోరు. కానీ వీటిలో తప్పనిసరిగా కనీస అర్హత మార్కులు సాధిస్తేనే మెయిన్ ఎగ్జామ్‌లోని మిగతా పేపర్లను మూల్యాంకన చేస్తారు.
- ఇండియన్ లాంగ్వేజ్(300 మార్కులు), ఇంగ్లిష్ పేపర్లు(300 మార్కులు) అర్హత పేపర్లు. ఇండియన్ లాంగ్వేజ్‌కు సంబంధించి 21 భాషల్లో పరీక్ష రాయొచ్చు. అర్హత పేపర్‌లలో తప్పనిసరిగా 25 శాతం మార్కులు సాధించాలి.
- మొత్తం ఏడు పేపర్లలో ఒక్కో పేపర్‌కు 250 మార్కులు చొప్పున మొత్తం 1750 మార్కులకు పూర్తి డిస్క్రిప్టివ్ విధానంలో మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది.
- మెయిన్ ఎగ్జామ్ తర్వాత చివరగా పర్సనాలిటీ టెస్ట్ నిర్వహిస్తారు. మెయిన్ పరీక్షలో ప్రతిభ ఆధారంగా ఒక్కో పోస్ట్‌కు ఇద్దరు లేదా ముగ్గురిని (1:2 లేదా 1:3 నిష్పత్తిలో) పర్సనాలిటీ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు. పర్సనాలిటీ టెస్ట్‌కు 275 మార్కులు కేటాయించారు.
సిలబస్‌పై అవగాహన
- ప్రిలిమ్స్‌కు హాజరయ్యే అభ్యర్థులు తొలుత నిర్దేశిత సిలబస్‌ను క్షుణ్నంగా పరిశీలించాలి. దీంతోపాటు గత ప్రశ్న పత్రాలను విశ్లేషించాలి. తద్వారా పరీక్ష ట్రెండ్‌తోపాటు తమ వ్యక్తిగత సామర్థ్య స్థాయిపై అవగాహన వస్తుంది. ప్రిపరేషన్ పరంగా ప్రధానంగా దృష్టి సారించాల్సిన అంశాల గురించి తెలుస్తుంది.
- సిలబస్‌ను పరిశీలించిన తర్వాత ప్రామాణిక మెటీరియల్ సేకరణపై దృష్టి పెట్టాలి. ఒక్కో సబ్జెక్ట్‌కు నాలుగైదు పుస్తకాలు చదివే బదులు ఒకట్రెండు ప్రామాణిక పుస్తకాలకు పరిమితమవడం మేలు.
మారుతున్న ప్రశ్నల శైలి
గత అయిదేళ్ల సివిల్స్ ప్రిలిమ్స్ ప్రశ్న పత్రాలను పరిశీలిస్తే.. ఏటేటా ప్రశ్నలు అడుగుతున్న శైలిలో మార్పు కనిపిస్తోంది. స్టేట్‌మెంట్ ఆధారిత ప్రశ్నలు, అసెర్షన్ టైప్ ప్రశ్నలకు ప్రాధాన్యం పెరిగింది. గత నాలుగేళ్లలో కరెంట్ అఫైర్స్ ప్రశ్నల విషయంలోనూ మార్పు కనిపిస్తోంది. డైరెక్ట్ కొశ్చన్స్ స్థానంలో ఇన్‌డైరెక్ట్ కొశ్చన్స్ సంఖ్య ఏటేటా పెరుగుతోంది. ముందుగా అంచనా వేయలేని విధంగా ఆయా అంశాల నుంచి ప్రశ్నల సంఖ్య ఉంటోంది.
కరెంట్ అఫైర్స్
గత ప్రశ్నల శైలిని పరిశీలిస్తే.. కరెంట్ అఫైర్స్‌పై మరింత ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరముందనే విషయం అర్థమవుతోంది. ఎందుకంటే.. కోర్ సబ్జెక్ట్‌లకు సంబంధించి కూడా సమకాలీన అంశాలు సమ్మిళితమైన ప్రశ్నలు అడుగుతున్నారు. గతేడాది కరెంట్ అఫైర్స్ ప్రశ్నల్లో పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ తదితర కోర్ సబ్జెక్టుల సమ్మిళితంగా ప్రశ్నలు ఎదురయ్యాయి.
టైమ్ మేనేజ్‌మెంట్
ప్రిపరేషన్ పరంగా అభ్యర్థులు కచ్చితంగా పాటించాల్సిన వ్యూహం.. టైమ్ మేనేజ్‌మెంట్. ప్రతి రోజు కనీసం ఎనిమిది గంటలు ప్రిపరేషన్ సాగించే విధంగా సమయ ప్రణాళిక రూపొందించుకోవాలి. అదే విధంగా ప్రతి రోజు అన్ని సబ్జెక్ట్‌లను చదవడమనే విధానం అనుసరించాలి.ఒక సబ్జెక్ట్ పూర్తయ్యాక మరో సబ్జెక్ట్ వైపు అనే విధానం ఏ మాత్రం సరికాదు.దీనివల్ల కొన్నిసార్లు సిలబస్ అంశాలన్నింటినీ పూర్తి చేయడంలో ఇబ్బందులు ఎదురుకావచ్చు.
![]() ![]() |
![]() ![]() |
పేపర్–2 అప్రమత్తంగా
సివిల్స్ ప్రిలిమ్స్ అభ్యర్థులు పేపర్–2(ఆప్టిట్యూడ్ టెస్ట్) విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వాస్తవానికి ఈ పేపర్‌ను అర్హత పరీక్షగానే పేర్కొన్నప్పటికీ.. 33 శాతం మార్కులు సాధిస్తేనే పేపర్–1(జనరల్ స్టడీస్) మూల్యాంకన చేస్తారు. పేపర్–2లోని రీడింగ్ కాంప్రహెన్షన్, న్యూమరికల్ ఎబిలిటీ, డెసిషన్ మేకింగ్ అంశాలపై దృష్టి పెట్టాలి.
డిస్క్రిప్టివ్ అప్రోచ్
ప్రిలిమినరీ పరీక్ష రెండు పేపర్లలో ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. అభ్యర్థులు డిస్క్రిప్టివ్ విధానంలో చదవడం మేలు చేస్తుంది. దీనివల్ల ఒక విషయంపై అన్ని కోణాల్లో అవగాహన లభిస్తుంది. ఇది మెయిన్స్ ప్రిపరేషన్‌ను సులభం చేస్తుంది. ఒక అంశానికి సంబంధించి ప్రామాణిక మెటీరియల్‌లో ఉండే అన్ని కోణాలపై స్పష్టత ఏర్పరచుకోవాలి.
మెయిన్స్‌తో అనుసంధానం
మెయిన్స్‌లో ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్లు, ఎథిక్స్ పేపర్ మినహా మిగతా అన్ని పేపర్లు ప్రిలిమ్స్ జనరల్ స్టడీస్‌లో నిర్దేశించిన విభాగాలకు సంబంధించినవే. కాబట్టి అభ్యర్థులు ప్రిలిమ్స్ సిలబస్‌ను మెయిన్స్‌తో అనుసంధానం చేసుకుంటూ చదవాలి. ఆయా టాపిక్స్ నేపథ్యంతోపాటు సమకాలీన పరిణామాలపై అవగాహన పెంచుకోవాలి. దీంతోపాటు ప్రిలిమ్స్ పరీక్ష తేదీకి నెల రోజుల ముందు నుంచి అభ్యర్థులు పూర్తిగా రివిజన్‌కే సమయం కేటాయించే విధంగా టైమ్ ప్లాన్ రూపొందించుకోవాలి. ఈ సమయంలో మాక్ టెస్ట్‌లు, మోడల్ టెస్ట్‌లకు హాజరు కావాలి.
115–120 లక్ష్యంగా
సివిల్స్ ప్రిలిమ్స్ అభ్యర్థులు పేపర్ 1లో కనీసం 115 నుంచి 120 మార్కులు సాధించే విధంగా కృషి చేయాలి. తద్వారా మెయిన్స్‌కు ఎంపికయ్యే అవకాశాలు మెరుగవుతాయి.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 2025, ఫిబ్రవరి 11
- ఆన్‌లైన్ దరఖాస్తు సవరణ అవకాశం: ఫిబ్రవరి 12 నుంచి 18 వరకు
- ప్రిలిమ్స్ పరీక్ష తేదీ: 2025, మే 25
- మెయిన్స్ పరీక్ష తేదీలు: ఆగస్ట్ 22 నుంచి అయిదు రోజులు
- వెబ్‌సైట్: www.upsc.gov.in
Tags
- Civils Preparation Plan
- Civils preparation plan pdf download
- Civil Services Preparation Plan
- how to prepare for upsc
- UPSC IAS Preparation Strategy
- IAS Preparation
- IPS Preparation
- IFS Preparation
- Magical UPSC Preparation Tips
- Time Table For UPSC Preparation
- Civil Services Examination 2025
- upsc exam
- 979 UPSC Jobs
- Civils Notification
- UPSC study plan
- upsc preparation tips
- Free UPSC Study Material