Civils prelims Preparation Tips: 1,056 పోస్ట్‌లకు సివిల్స్ ప్రిలిమ్స్-2024 పరీక్ష... కరెంట్ అఫైర్స్‌తో సమ్మిళితం
- ఎన్నికలతో వాయిదాపడిన సివిల్స్ ప్రిలిమ్స్
- మే 26కు బదులు జూన్ 16న నిర్వహణ
- అవకాశంగా మలచుకోవాలంటున్న నిపుణులు
- 1,056 పోస్ట్‌లకు సివిల్స్ ప్రిలిమ్స్-2024 పరీక్ష
- ఆరు లక్షల మంది హాజరయ్యే అవకాశం
పోటీ పరీక్షలకు సీరియస్‌గా ప్రిపరేషన్ సాగించే వారు.. అవి వాయిదా పడితే నిరాశకు గురవడం సహజం. ముఖ్యంగా దాదాపు ఏడాదిన్నర పాటు ఎంపిక ప్రక్రియ సాగే సివిల్స్ విషయంలో ఈ ధోరణి కొంత ఎక్కువగానే ఉంటుంది. జూన్‌లో జరుగనున్న ప్రిలిమ్స్‌కు దాదాపు ఆరు లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉంది. ప్రిలిమ్స్‌లో ప్రతిభ ఆధారంగా మెయిన్స్‌కు ఎంపిక చేసే అభ్యర్థుల సంఖ్య 13 వేల వరకూ ఉంటుంది. ఇలాంటి వడపోత పరీక్షలో నెగ్గడం అంత తేలికకాదు. కాబట్టి పరీక్ష వాయిదాతో అదనంగా లభించిన సమయంలో తమ ప్రిపరేషన్‌కు మరింత పదును పెట్టుకుని విజయావకాశాలను మెరుగుపరచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
అదనంగా 20 రోజులు
వాస్తవానికి మే 26న సివిల్స్ ప్రిలిమ్స్ జరగాల్సి ఉంది. కానీ లోక్‌సభ ఎన్నికల కారణంగా రీ-షెడ్యూల్ చేసి జూన్ 16న నిర్వహించనున్నారు. అంటే.. ప్రిలిమ్స్ అభ్యర్థులకు అదనంగా లభించిన సమయం 20 రోజులు. మొత్తంగా చూస్తే ఇప్పటి నుంచి 65 రోజుల సమయం అందుబాటులో ఉంది. ఆయా సబ్జెక్ట్‌లపై మరింత పట్టు సాధించేందుకు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
టైమ్ మేనేజ్‌మెంట్
ప్రస్తుత సమయంలో అభ్యర్థులు టైం మేనేజ్‌మెంట్‌ను తప్పనిసరిగా పాటించాలి. జనరల్ స్టడీస్ పేపర్ సిలబస్‌లో పేర్కొన్న ఏడు విభాగాలకు సంబంధించిన సిలబస్‌ను పరిశీలించి.. ప్రతి సబ్జెక్ట్‌ను ప్రతి రోజూ చదివేలా టైమ్ ప్లాన్ రూపొందించుకోవాలి. ప్రతిరోజు కనీసం ఎనిమిది నుంచి పది గంటల సమయం ప్రిపరేషన్‌కు కేటాయించాలి. దీంతోపాటు ప్రతి వారం సెల్ఫ్ టెస్ట్‌లు, మాక్ టెస్ట్‌లు రాయడం కూడా ఉపకరిస్తుంది.
చదవండి: Preparation Tips: 'కరెంట్ అఫైర్స్'పై పట్టు.. సక్సెస్‌కు తొలి మెట్టు!
కరెంట్ అఫైర్స్‌తో సమ్మిళితం
ప్రస్తుతం అభ్యర్థులు ప్రధానంగా దృష్టి సారించాల్సిన అంశం.. కరెంట్ అఫైర్స్. తాజా పరిణామాలను చదవడమే కాకుండా.. సిలబస్‌లో పేర్కొన్న కోర్ టాపిక్స్‌ను సమ్మిళితం చేసుకుంటూ ప్రిపరేషన్ సాగించాలి. ఆయా అంశాల నేపథ్యం, ప్రభావం, ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తు అంచనా వంటి వాటిని విశ్లేషించుకుంటూ చదవాలి. ఇటీవల కాలంలో ప్రిలిమ్స్‌లో అడుగుతున్న ప్రశ్నలు కరెంట్ అఫైర్స్ సమ్మిళితంగా ఉంటున్నాయి.
ప్రాధాన్య అంశాల గుర్తింపు
అభ్యర్థులు సబ్జెక్ట్‌ల వారీగా ముఖ్యాంశాలను గుర్తించి.. వాటిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. గత నాలుగైదేళ్ల ప్రశ్న పత్రాలను పరిశీలించి.. ఆయా సబ్జెక్ట్‌ల నుంచి అడుగుతున్న ప్రశ్నల సంఖ్య.. ఏఏ అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం లభిస్తుందో గుర్తించాలి. ఉదాహరణకు చరిత్రనే పరిగణనలోకి తీసుకుంటే..ఆర్ట్ అండ్ కల్చర్, స్వాతంత్య్రోద్యమం ముఖ్యమైనవిగా పేర్కొనొచ్చు. ఇంటర్నేషనల్ ఈవెంట్స్‌లో గత ఏడాది కాలంలో సంభవించిన ముఖ్యమైన పరిణామాలపై దృష్టి సారించాలి. వార్తల్లో నిలిచిన ప్రాంతాలు, వ్యక్తులు, సంఘటనలపై అవగాహన పెంచుకోవాలి.
చదవండి: Civil Service Exam Preparation Tips: ప్రిలిమ్స్‌పై.. పట్టు సాధించేలా!
రివిజన్.. రివిజన్
ప్రస్తుతం అభ్యర్థులు తమకు అందుబాటులో ఉన్న సమయంలో ప్రతి సబ్జెక్ట్‌ను కనీసం రెండుసార్లు పునశ్చరణ చేసుకోవాలి. ఆయా సబ్జెక్ట్‌ల సిలబస్‌ను మే మొదటి వారానికి పూర్తి చేసుకునే విధంగా సమయ పాలన సిద్ధం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రెండుసార్లు రివిజన్ చేసేందుకు సమయం లభిస్తుంది. రివిజన్ చేసేందుకు ఉపకరించే విధంగా ప్రిపరేషన్ సమయంలోనే షార్ట్‌నోట్స్ రూపొందించుకోవాలి.
కొత్త అంశాలు వద్దు
ప్రస్తుత సమయంలో ఇప్పటికే చదివిన అంశాలపై మరింత పట్టు లభించేలా కృషి చేయడం మేలు. ఇప్పుడు కొత్త టాపిక్స్ చదవడం మొదలుపెడితే.. అనవసరపు ఆందోళనకు గురవడం, ఇది ఇతర అంశాల ప్రిపరేషన్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో కొత్త అంశాలను చదవాలనుకుంటే.. వాటికి సంబంధించి సినాప్సిస్, కాన్సెప్ట్‌లపై అవగాహన పెంచుకోవాలి.
సెల్ఫ్ మెమొరీ టిప్స్
ప్రిపరేషన్ సాగించే సమయంలో అభ్యర్థులు మెమొరీ టిప్స్ అనుసరించాలి. ఇది పరీక్షలో మెరుగైన ప్రతిభ కనబర్చడానికి దోహదం చేస్తుంది. పాయింటర్స్, ఫ్లో చార్ట్స్, విజువలైజేషన్ టెక్నిక్స్, నుమానిక్స్ వంటి వాటిని అనుసరించాలి. ముఖ్యమైన సంవత్సరాలు, గణాంకాలను గుర్తుంచుకునేందుకు వాటిని వ్యక్తిగతంగా అన్వయించుకోవచ్చు. ఆయా అంశాలను విభిన్న కోణాల్లో విశ్లేషించగలిగే విధంగా అభ్యసిస్తే పరీక్షలో ప్రతిభ చూపొచ్చు.
చదవండి: Previous Question Papers: పరీక్ష ఏదైనా ప్రీవియస్‌పేపెర్లే .. ప్రిపరేషన్ కింగ్
గత ప్రశ్న పత్రాల సాధన
ప్రిపరేషన్ పరంగా అభ్యర్థులు అనుసరించాల్సిన మరో వ్యూహం.. గత ప్రశ్న పత్రాల సాధన. పరీక్షకు నెల రోజుల ముందు నుంచి ప్రతి రోజు ఒక ప్రీవియస్ పేపర్ ప్రాక్టీస్ చేసేలా సమయం కేటాయించుకోవాలి. దీనిద్వారా తమ బలాలు, బలహీనతలపై అవగాహన ఏర్పడుతుంది.
సబ్జెక్ట్‌ల వారీగా ముఖ్యంశాలపై పట్టు
- చరిత్రలో.. ప్రాచీన చరిత్రలో సింధూ నాగరికత, బౌద్ధ, జైన మతాలు; మౌర్యులు, గుప్తులు, విజయనగర సామ్రాజ్యం, ఢిల్లీ సుల్తానులు, మొఘలులు, ఆధునిక భారత చరిత్ర, జాతీయోద్యమం, ప్రాచీన, మధ్యయుగ చరిత్రకు సంబంధించి సాహిత్యం, కళలు, మత ఉద్యమాలు, రాజకీయ-సామాజిక-ఆర్థిక చరిత్ర; ఆధునిక చరిత్రలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన-పరిపాలన విధానాలు; బ్రిటిష్ వ్యతిరేక తిరుగుబాట్లు -ఉద్యమాలు (ప్రధానంగా స్వాతంత్య్ర పోరాటం), సంస్కరణోద్యమాలపై దృష్టి సారించాలి.
- పాలిటీలో.. రాజ్యాంగం, రాజ్యాంగ పరిషత్, రాజ్యాంగ సవరణ ప్రక్రియ, పీఠిక, ఇప్పటివరకు జరిగిన ముఖ్య రాజ్యాంగ సవరణలు-వాటికి సంబంధించిన రాజ్యాంగ ప్రకరణలు, రాజకీయ వ్యవస్థ, పార్లమెంటరీ వ్యవస్థ, రాష్ట్రపతి, గవర్నర్, పార్లమెంట్, రాష్ట్ర శాసన సభలు, సుప్రీంకోర్టు, హైకోర్టు, ఎన్నికల సంఘం, ఫైనాన్స్ కమిషన్, పబ్లిక్ సర్వీస్ కమిషన్లు, అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్, వాటికి సంబంధించి రాజ్యాంగ ప్రకరణలు చదవాలి. అదే విధంగా.. పంచాయతీరాజ్ వ్యవస్థ-బల్వంత్‌రాయ్ మెహతా, అశోక్‌మెహతా,హన్మంతరావ్,జి.వి.కె.రావ్, సింఘ్వీ కమిటీల సిఫార్సులు,73వ రాజ్యాంగ సవరణ చట్టాలపై అవగాహన పొందాలి. అదేవిధంగా కేంద్ర-రాష్ట్ర సంబంధాలు; గత కొద్ది రోజులుగా చర్చనీయాంశంగా మారిన అంశాలపై దృష్టి పెట్టాలి.
- ఎకానమీలో.. ఆర్థికాభివృద్ధిలో సహజ వనరులు-మూలధన వనరుల పాత్ర; ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాల ప్రగతి (వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవారంగం); ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో దేశంలో ఆర్థిక-సాంఘికాభివృద్ధి; పారిశ్రామిక తీర్మానాలు-వ్యవసాయ విధానం; బ్యాంకింగ్ రంగం-సంస్కరణలు వంటి వాటిపై పట్టు సాధించాలి.
- సైన్స్ అండ్ టెక్నాలజీలో.. గత ఏడాది కాలంలో ఇస్రో ప్రయోగించిన ఉపగ్రహాలు, గగన్‌యాన్, చంద్రయాన్, ఆదిత్య ఎల్-1 వంటి ప్రయోగాలు; వ్యాధులు-కారకాలు; సైబర్ సెక్యూరిటీ యాక్ట్; రక్షణ రంగంలో కొత్త మిస్సైల్స్ ప్రయోగాలు; ముఖ్యమైన వన్యమృగ సంరక్షణ కేంద్రాలు; పర్యావరణ పరిరక్షణ ఒప్పందాలు, చర్యలపై అవగాహన పెంచుకోవాలి.
- జాగ్రఫీలో.. సౌర వ్యవస్థ, భూమి అంతర్ నిర్మాణం, శిలలు, జియలాజికల్ టై స్కేల్, రుతుపవనాలు, ప్రపంచ పవనాలు, చక్రవాతాలు, ఉష్ణోగ్రత విలోమం, భూకంపాలు, సునామీలు; మన దేశ పరిస్థితుల నేపథ్యంలో నగరీకరణ; రుతుపవనాలు, ఎల్‌నినో, బయోడైవర్సిటీ, పర్యావరణ సమస్యలు తదితరాలపై దృష్టిపెట్టాలి.
చదవండి: Civils Prelims Study Material
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Tags
- Civils Prelims 2024
- Civils prelims Preparation Tips
- Civils Prelims Syllabus
- UPSC jobs
- IPS
- IAS
- IFS
- Civils Prelims 2024 Notification
- UPSC Prelims 2024
- UPSC Prelims Exam Pattern
- UPSC Preparation Strategy
- Civils Prelims Previous Papers
- Civil Services Prelims Preparation
- how to prepare for upsc
- UPSC IAS Preparation Strategy
- UPSC Prelims exam date
- Competitive Exams
- time management
- Current Affairs
- General Studies Paper Syllabus
- latest job notifications 2024
- latest govt jobs notifications
- central govt jobs 2024
- latest employment notification
- sakshi education latest job notifications
- CivilServiceExam
- CentralServices
- IAS
- IPS
- IFS
- PreliminaryExam
- LokSabhaElections
- StudyPlan
- RevisedSchedule
- StudyMaterials
- mocktests