Previous Question Papers: పరీక్ష ఏదైనా ప్రీవియస్‌పేపెర్లే .. ప్రిపరేషన్ కింగ్
- పోటీ పరీక్షల విజయంలో కీలకంగా ప్రీవియస్ పేపర్స్
- పరీక్ష శైలి, ప్రశ్నల తీరుపై అవగాహనకు అవకాశం
- అభ్యర్థులు స్వీయ సామర్థ్యాలు తెలుసుకునే వీలు
- కొన్నిసార్లు నేరుగా పాత ప్రశ్నలు అడుగుతున్న వైనం
'ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం ఎంతో ఉపకరించింది. పాత ప్రశ్న పత్రాలను అనుసరించడం పరీక్షలో విజయానికి దోహదం చేసింది'. -పోటీ పరీక్షల విజేతలు చెప్పే మాటలు ఇవి! దీన్ని బట్టి పోటీ పరీక్షల ప్రిపరేషన్‌లో గత ప్రశ్న పత్రాల ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు.
ప్రిపరేషన్ ప్రారంభానికి ముందే
పోటీ పరీక్షలకు సంబంధించి అభ్యర్థులు ప్రిపరేషన్ ప్రారంభానికి ముందే ప్రీవియస్ పేపర్లను పరిశీలించడం లాభిస్తుంది. వాస్తవానికి ఎక్కువ మంది సిలబస్‌పై అవగాహన ఏర్పరచుకుని ప్రిపరేషన్‌కు ఉపక్రమిస్తారు. కాని సిలబస్‌పై అవగాహనతోపాటు ప్రీవియస్ పేపర్లను కూడా పరిశీలిస్తే.. ఏ టాపిక్‌కు ఎంత వెయిటేజీ లభిస్తుందో తెలుస్తుంది. దానికి అనుగుణంగా ప్రిపరేషన్ సమయంలో ఆయా అంశాలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతపై స్పష్టత లభిస్తుంది.
చదవండి: Previous Papers Exams
ప్రశ్నల తీరుపై అవగాహన
ప్రీవియస్ కొశ్చన్ పేపర్స్ పరిశీలిస్తే.. ప్రశ్నలు అడుగుతున్న తీరు తెలుస్తుంది. ఒక అంశంపై ఎన్ని రకాలుగా ప్రశ్నలు వస్తున్నాయో అవగాహన వస్తుంది. దాని ఆధారంగా సదరు టాపిక్‌ను చదివేటప్పుడు.. అన్ని కోణాల్లో సబ్జెక్టుపై పట్టు పెంచుకునే ప్రయత్నం చేయొచ్చు. సొంతంగా ప్రశ్నలు రూపొందించుకుని సమాధానాలు ప్రాక్టీస్ చేయడానికి కూడా ఉపకరిస్తుంది.
స్వీయ సామర్థ్యంపై స్పష్టత
ప్రీవియస్ పేపర్లు సాధన చేయడం ద్వారా ఆయా టాపిక్ లేదా సబ్జెక్ట్‌పై అభ్యర్థులు తమకున్న సామర్థ్య స్థాయిపై స్పష్టత తెచ్చుకునే అవకాశం లభిస్తుంది. ప్రీవియస్ పేపర్స్‌ను ప్రాక్టీస్ చేసి.. ఫలితాన్ని విశ్లేషించుకోవడం ద్వారా.. పొరపాటు సమాధానాలకు కారణాలను గుర్తించొచ్చు. ఫలితంగా సదరు విభాగంలో ఇంకా పట్టు సాధించాల్సిన అంశాలు, అందుకు అనుసరించాల్సిన విధానంపైనా స్పష్టత వస్తుంది.
చదవండి: Civils Previous Papers
కనీసం అయిదేళ్ల పేపర్లు
కనీసం గత అయిదేళ్ల ప్రశ్న పత్రాలను సాధన చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. పోటీ పరీక్షల్లో గత ప్రశ్న పత్రాల నుంచి 20 శాతం వరకు ప్రశ్నలు పునరావృతం అయ్యే అవకాశం ఉందంటున్నారు. సదరు ప్రశ్న అన్ని పరీక్షల్లో ఒకే విధంగా ఉండకపోయినా.. నిర్దిష్టంగా ఒక అంశం నుంచి వేరే రూపంలో ప్రశ్నలు పునరావృతం అవుతున్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా గ్రూప్స్, సివిల్ సర్వీసుల పరీక్షల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకాలజీ, ఎన్విరాన్‌మెంట్ తదితర సబ్జెక్ట్‌లకు సంబంధించి కోర్ అంశాల నుంచి ప్రశ్నలు రిపీట్ అవుతున్నాయి.
చదవండి: TET/TRT/DSC Previous Papers
ప్రాక్టీస్ పలు విధాలుగా
- ప్రిపరేషన్ సమయంలో ప్రీవియస్ పేపర్లను ప్రాక్టీస్ చేసే విషయంలోనూ పలు వ్యూహాలను అనుసరించాలని నిపుణులు సూచిస్తున్నారు. టాపిక్ వారీగా, సబ్జెక్ట్ వారీగా ప్రీవియస్ పేపర్లలోని కొశ్చన్స్‌ను ప్రాక్టీస్ చేయాలి. అదే విధంగా ప్రిపరేషన్ పూర్తి చేసుకున్న అంశాలకు సంబంధించిన ప్రశ్నలను సాధనం చేయాలి. ఫలితంగా సదరు సబ్జెక్ట్ లేదా టాపిక్‌పై పరీక్షకు అవసరమైన అన్ని కోణాల్లో పట్టు సాధించొచ్చని చెబుతున్నారు.
- ప్రీవియస్ పేపర్లను సాధన చేసే క్రమంలో ఉపకరించే మరో వ్యూహం.. వీక్లీ ప్రాక్టీస్. అంటే.. ప్రతి వారం చివరలో.. ఆ వారంలో తాము చదివిన టాపిక్స్, యూనిట్స్, సబ్జెక్ట్‌లకు సంబంధించి ప్రీవియస్ పేపర్లలోని కొశ్చన్స్‌ను సాధన చేయాలి. దీనివల్ల నిరంతర అవగాహనతోపాటు.. అనుసంధాన విధానంలో ఉండే ప్రశ్నలను, వాటికి సంబంధించిన సబ్జెక్ట్‌లను తెలుసుకునే వీలు లభిస్తుంది.
చదవండి: CTET Previous Papers
వాస్తవ పరీక్ష మాదిరిగానే
ప్రీవియస్ పేపర్లను ప్రాక్టీస్ చేసే అభ్యర్థులు.. వాటిని వాస్తవ పరీక్షగానే భావించి సాధన చేయడం మేలు చేస్తుంది. పరీక్షలో సదరు పేపర్‌కు అందుబాటులో ఉండే సమయాన్నే.. ప్రీవియస్ పేపర్స్ సాధనకు కేటాయించాలి. నిర్దిష్ట సమయంలోపే పేపర్‌లోని అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. ఆ తర్వాత వాటి సమాధానాలను సరిచూసుకోవాలి. ఈ విశ్లేషణ ఆధారంగా.. స్వీయ బలాలు, బలహీనతలపై అవగాహన లభిస్తుంది. వాస్తవ పరీక్ష మాదిరిగానే భావించి ప్రాక్టీస్ చేయడం ద్వారా నిర్దేశిత సమయంలో ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించగలిగాం. మిగిలిపోయిన ప్రశ్నలెన్ని? దానికి కారణం సమయాభావమా.. లేదా సమాధానాలు తెలియకపోవడమా.. వంటి కోణాల్లో విశ్లేషించుకోవచ్చు. దానికి అనుగుణంగా సమయ పాలన పరంగా వేగం పెంచుకోవడం, సబ్జెక్ట్ పరంగా లోపాలు ఉంటే సరిదిద్దుకోవడం వంటివి చేయొచ్చు.
డిస్క్రిప్టివ్‌కు సమయపాలన
- డిస్క్రిప్టివ్ విధానంలో ఉండే పరీక్షలకు ప్రీవియస్ పేపర్స్ సాధనలో సమయ పాలనను తప్పనిసరిగా పాటించాలి. ఉదాహరణకు.. సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్ష లేదా గ్రూప్-1 మెయిన్ ఎగ్జామినేషన్‌నే పరిగణనలోకి తీసుకుంటే.. ప్రతి ప్రశ్నకు సగటున 10 నుంచి 12 నిమిషాల సమయం అందుబాటులో ఉంటుంది. ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ప్రతి ప్రశ్నకు సమయ పరిమితి విధించుకోవాలి. ఆ సమయం దాటిన తర్వాత సదరు ప్రశ్నకు సమాధానాన్ని ముగించి, వేరే ప్రశ్నకు సమాధానం రాయాలి.
- ఇలా వాస్తవ పరిస్థితుల్లో అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయడం పూర్తి చేసుకన్న తర్వాత విశ్లేషణ చేసుకోవాలి. సమాధానాల్లో ముఖ్యాంశాలను పొందుపర్చామా.. ఎగ్జామినర్ ఆశించిన తీరులోనే జవాబులు ఉన్నాయా.. సమాధానాన్ని అసంతృప్తిగా ఎందుకు ముగించాల్సి వచ్చింది? ఇలా భిన్న కోణాల్లో పరిశీలించాలి. అంతేకాకుండా తాము రాసిన సమాధానాలను వీలైతే సబ్జెక్ట్ నిపుణులతో మూల్యాంకన చేయించుకోవాలి.
- ఈ విశ్లేషణల ఫలితంగా సమయ పాలనతోపాటు సమాధానం రాసే విధానాన్నీ మెరుగుపరచుకునే వీలవుతంది. చక్కటి చేతిరాత, పాయింట్స్ వారీగా సమాధానాలు రాయడం వంటి నైపుణ్యాలు లభిస్తాయి.
చదవండి: GATE Previous Papers
పది రెట్లు ప్రయోజనం
ప్రీవియస్ పేపర్లను ప్రాక్టీస్ చేయడం, వాటిని విశ్లేషించుకోవడం ద్వారా రైటింగ్ స్కిల్స్, ప్రజెంటేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయి. పదిసార్లు చదివిన దానికంటే.. ఒకసారి రాసిన విషయం ఎక్కువగా కాలం గుర్తుంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. నిరంతర రాయడం ద్వారా రీడింగ్ స్పీడ్ కూడా పెరుగుతుందని చెబుతున్నారు.
సరి పోల్చుకుంటూ
ప్రస్తుతం పలు మార్గాల ద్వారా ప్రీవియస్ పేపర్లకు నిపుణుల సమాధానాలు అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు ఆ మార్గాలను వినియోగించుకోవాలి. ఆయా ప్రశ్నలకు సంబంధించి తమ సమాధానాలు, నిపుణుల జవాబులు పోల్చుకోవాలి. నిపుణులు పొందుపర్చిన సమాధానాల్లోని ముఖ్య అంశాలను నోట్ చేసుకోవాలి. తమ ప్రజెంటేషన్, నిపుణుల ప్రజెంటేషన్ మధ్య వ్యత్యాసాలను గుర్తించాలి. తాము రాయని, నిపుణులు రాసిన అంశాలను నోట్ చేసుకోవాలి. అదే విధంగా.. ఆయా అంశాలకు సంబంధించి తామ చదివిన మెటీరియల్‌లో లేని, నిపుణులు ఉదహరించిన అంశాలను ప్రత్యేకంగా గుర్తించాలి.
ప్రీవియస్ పేపర్లు.. ముఖ్యాంశాలు
- పోటీ పరీక్షల విషయంలో పూర్తి అవగాహన కల్పించే ప్రీవియస్ పేపర్లు.
- సబ్జెక్ట్‌లు, టాపిక్స్‌కు లభిస్తున్న వెయిటేజీని తెలుసుకునే అవకాశం.
- కనీసం అయిదేళ్ల ప్రశ్న పత్రాల సాధనతో ఆయా అంశాలపై అవగాహన.
- గత ప్రశ్న పత్రాల నుంచి దాదాపు 20 శాతం ప్రశ్నలు పునరావృతం
- నిరంతర స్వీయ సామర్థ్యాలను తెలుసుకునేందకు అవకాశం కల్పించే ప్రీవియస్ కొశ్చన్ పేపర్లు.