Skip to main content

TSPSC Group 1 Mains: ప్రిలిమ్స్‌ కటాఫ్‌ అంచనా 75-80... తెలంగాణ అంశాలపై ప్రత్యేకంగా...

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌.. రాష్ట్ర స్థాయిలో డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ వంటి ఉన్నతస్థాయి పోస్ట్‌లకు నిర్వహించే రెండంచెల ఎంపిక ప్రక్రియలో.. తొలిదశ. గ్రూప్‌ 1-2022 నోటిఫికేషన్‌కు సంబంధించి జూన్‌ 11న ప్రిలిమినరీ పరీక్ష ముగిసింది! ఈ ప్రిలిమ్స్‌ రీ ఎగ్జామ్‌కు దాదాపు 2.3 లక్షల మంది హాజరైనట్లు సమాచారం. వీరంతా ఇప్పుడు ప్రిలిమ్స్‌ కటాఫ్‌ ఎంత ఉంటుంది.. ఎన్ని మార్కుల శ్రేణిలో ఉంటే తదుపరి దశ మెయిన్‌కు అర్హత లభిస్తుంది..! అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష విశ్లేషణ, కటాఫ్‌ అంచనాతోపాటు.. మెయిన్‌లో విజయానికి మార్గాలు..
tspsc group 1 mains preparation strategy in telugu
 • ముగిసిన టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌
 • పేపర్‌ క్లిష్టంగా ఉందనే అభిప్రాయాలు
 • ప్రిలిమ్స్‌ కటాఫ్‌ అంచనా 75-80!
 • ముందస్తు ప్రిపరేషన్‌ మేలంటున్న నిపుణులు

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ కటాఫ్‌పై నిపుణుల ద్వారా ఒక అంచనాకు వచ్చిన తర్వాత అభ్యర్థులు మెయిన్‌కు ముందస్తుగా సన్నద్ధత మొదలుపెట్టాలి. ప్రిలిమ్స్‌ ఫలితాలు వచ్చాక ప్రిపరేషన్‌ ప్రారంభిద్దాం అనే ధోరణి సరికాదు అంటున్నారు నిపుణులు.

ప్రిలిమ్స్‌కు తగ్గిన హాజరు

మొత్తం 503 పోస్ట్‌లతో విడుదల చేసిన గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షను ఈ నెల 11న మళ్లీ నిర్వహించిన సంగతి తెలిసిందే. మొదటిసారి జరిగిన పరీక్షకు హాజరైన వారి సంఖ్యతో పోల్చితే.. రీ ఎగ్జామ్‌కు హాజరు తగ్గింది. తొలుత నిర్వహించిన పరీక్షను 2,86,051 మంది రాయగా.. రీ ఎగ్జామ్‌కు 2,33,248 మంది మాత్రమే హాజరయ్యారు.

చ‌ద‌వండి: TSPSC Group 2&3 Preparation Tips: లక్షల సంఖ్యలో దరఖాస్తులు ... రెండు పరీక్షలకు ఉమ్మడి వ్యూహంతోనే సక్సెస్‌

ప్రిలిమ్స్‌ క్లిష్టంగానే

మొత్తమ్మీద ప్రిలిమ్స్‌ పరీక్ష క్లిష్టంగానే ఉందనే అభిప్రాయం వ్యక్తమైంది. నిడివి ఎక్కువగా ఉండటంతో ప్రశ్నలను పూర్తిగా చదివి అవగాహన చేసుకునేందుకు ఎక్కువ సమయం పట్టిందని అభ్యర్థులు పేర్కొంటున్నారు. దీంతో సమయాభావానికి గురైనట్లు చెబుతున్నారు. ఎకానమీ, కరెంట్‌ అఫైర్స్‌ల నుంచి అడిగిన ప్రశ్నలు చాలా క్లిష్టంగా ఉన్నట్లు అభ్యర్థులు పేర్కొంటున్నారు. అదే విధంగా జాతీ య, అంతర్జాతీయ వ్యవహారాలు, ప్రభుత్వ విధానాలపైనా ఎక్కువగా ప్రశ్నలు అడిగారు. దీంతోపాటు ప్రభుత్వ పథకాలు, ఆయా రంగాల్లో అభివృద్ధి, ఇతర అంశాలపై గణాంకాలతో కూడిన ప్రశ్నలు ఎదురయ్యాయి. తెలంగాణ అంశాల నుంచి ప్రశ్నలు తక్కువగా రావడంతో.. ఈ విభాగంపై ఎక్కువ దృష్టి పెట్టిన అభ్యర్థులు కొంత నిరాశకు గురయ్యారు. మొత్తంగా చూస్తే రద్దయిన ప్రిలిమినరీ పరీక్షతో పోల్చితే రీ ఎగ్జామ్‌ కొంత సులభమే అనే వాదన వినిపిస్తోంది.

కటాఫ్‌ శ్రేణి 75-80

ప్రశ్నల క్లిష్టత స్థాయిని పరిగణనలోకి తీసుకుంటే.. ప్రిలిమ్స్‌ జనరల్‌ కటాఫ్‌ 75-80 మార్కుల శ్రేణిలో ఉండొచ్చని నిపుణుల అంచనా. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తాము రాసిన సమాధానాలను సరిపోల్చుకొని.. ఈ మార్కుల శ్రేణిలో ఉంటామని భావిస్తే.. తదుపరి దశ మెయిన్‌ పరీక్షకు సన్నద్ధం కావడం మేలని సూచిస్తున్నారు.

చ‌ద‌వండి: Study Material

మెయిన్‌లో రాణించేందుకు ఇలా

గ్రూప్‌-1 మెయిన్‌ పరీక్ష పూర్తిగా డిస్క్రిప్టివ్‌ విధానంలో ఆరు పేపర్లుగా 900 మార్కులకు నిర్వహించనున్నారు. దీంతోపాటు.. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ కూడా ఉంటుంది. ఈ పేపర్‌ను కేవలం అర్హత పేపర్‌గానే నిర్దేశించారు. గ్రూప్‌-1 మెయిన్‌ పరీక్షలను అక్టోబర్‌ లేదా నవంబర్‌లో నిర్వహించే అవకాశముంది. కాబట్టి అభ్యర్థులు మెయిన్‌ పరీక్ష విధానం, సిలబస్‌పై సంపూర్ణ అవగాహన పెంచుకొని ప్రిపరేషన్‌ సాగించాలి. ముఖ్యంగా మెయిన్‌ పరీక్ష అభ్యర్థులకు ఆయా అంశాలపై ఉన్న పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా ఉంటుంది. 

ఇవెంతో కీలకం

 • మెయిన్‌ పరీక్షలో తెలంగాణకు సంబంధించిన అంశాలు కీలకంగా నిలిచే అవకాశముంది. కాబట్టి మెయిన్‌ ప్రిపరేషన్‌లో భాగంగా అభ్యర్థులు తెలంగాణ చరిత్ర, జాగ్రఫీ, ఎకానమీ, తెలంగాణ ఉద్యమంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అదే విధంగా జనరల్‌ ఎస్సే పేపర్‌లో, హిస్టరీ పేపర్‌లో ఉండే తెలంగాణ రాష్ట్ర విధానాలు, తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం, హక్కులపై పట్టు సాధించాలి. 
 • జనరల్‌ ఎస్సే పేపర్‌లో రాణించేందుకు సమకాలీన సామాజిక అంశాలు, సమస్యలు, ఆర్థిక వృద్ధి, భారత చారిత్రక-వారసత్వ సంపద, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో తాజా పరిణామాలు తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాలి.
 • భారత చరిత్ర, సంస్కృతి అంశాలు, ఆధునిక భారత దేశ చరిత్ర, స్వాతంత్య్రోద్యమం; అదే విధంగా తెలంగాణ చరిత్ర, సాంస్కృతిక వారసత్వ అంశాలను చదవాలి. వీటితోపాటు భారత, రాష్ట్ర భౌగోళిక అంశాలపై పట్టు సాధించాలి.
 • భారత రాజ్యాంగం, పాలనా వ్యవస్థ, భారత సమాజం, సమస్యలు, సాంఘిక ఉద్యమాలపై దృష్టి పెట్టాలి.
 • ఎకానమీ అండ్‌ డెవలప్‌మెంట్‌ సబ్జెక్ట్‌ పేపర్‌ కోసం భారత, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ-అభివృద్ధి, పర్యావరణ సమస్యల గురించి తెలుసుకోవాలి.
 • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో.. సామాజిక అభివృద్ధికి సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ దోహద పడుతున్న తీరు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆధునిక పద్ధతుల గురించి అధ్యయనం చేయాలి. 

చ‌ద‌వండి: Practice Test

ఆరో పేపర్‌కు ప్రత్యేకంగా

మెయిన్స్‌కు సన్నద్ధమయ్యే అభ్యర్థులు తెలంగాణ ఆవిర్భావానికి సంబంధించిన ఆరో పేపర్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి. ప్రత్యేక తెలంగాణ ఆలోచన(1948-1970), ఉద్యమ దశ(1971-1990), తెలంగాణ ఏర్పాటు దశ, ఆవిర్భావం(1991-2014) తదితర అంశాలను అన్ని కోణాల్లో అధ్యయనం చేయాలి. ముఖ్యంగా సిలబస్‌లో నిర్దేశించిన ప్రకారం-1948 నుంచి 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వరకు జరిగిన ముఖ్య ఉద్యమాలు, ఒప్పందాలు, ముల్కీ నిబంధనలు, కమిటీలు-వాటి సిఫార్సులపై సమగ్ర అవగాహన పెంచుకోవాలి. దీంతోపాటు పునర్‌ వ్యవస్థీకరణ బిల్లులో తెలంగాణకు సంబంధించి ప్రత్యేకంగా పొందుపరచిన అంశాలు; తె­లంగాణకు కల్పించిన హక్కులపై దృష్టి సారించాలి.

చ‌ద‌వండి: Groups Preparation Tips: 'కరెంట్‌ అఫైర్స్‌'పై పట్టు.. సక్సెస్‌కు తొలి మెట్టు!

కరెంట్‌ అఫైర్స్‌

తెలంగాణకు సంబంధించి ఇటీవల ప్రాధాన్యం సంతరించుకున్న అంశాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి వంటి వాటిని ప్రత్యేక దృష్టితో చదవాలి. ఆర్థిక వనరుల అభివృద్ధి, రాష్ట్రంలో వ్యవసాయం, సాగు పరిస్థితులు, పారిశ్రామిక విధానాలపై పట్టు సాధించాలి.

చ‌ద‌వండి: TSPSC Group 3 Exam Pattern : 1365 గ్రూప్‌-3 ఉద్యోగాలు.. ప‌రీక్షా విధానం ఇదే..

తెలంగాణ అంశాలపై ప్రత్యేకంగా

 • తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జాగ్రఫీ, తెలంగా­ణ ఎకానమీపై పట్టు సాధిస్తే మెయిన్‌లో మార్కు­లు పెంచుకునే అవకాశం ఉంది. ఇందుకోసం చరిత్రలో తెలంగాణలో రాజులు, ముఖ్య యుద్ధా­లు, ఒప్పందాలు, తెలంగాణలోని కవులు-రచనలు; కళలు; ముఖ్య కట్టడాలు-వాటిని నిర్మించిన రాజులు తదితర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అదే విధంగా స్వాతంత్య్రోద్యమ సమయంలో తెలంగాణ ప్రాంత ప్రమేయం ఉన్న సంఘటనలపై అవగాహన పెంచుకోవాలి.
 • జాగ్రఫీలో.. తెలంగాణలోని ముఖ్యమైన నదులు-పరీవాహక ప్రాంతాలు; ముఖ్యమైన పంటలు; భౌగోళిక ప్రాధాన్యం ఉన్న ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలపై దృష్టి పెట్టాలి. దీంతోపాటు తెలంగాణ భౌగోళిక స్వరూపం, విస్తీర్ణం, జనాభా వంటి అంశాలపై పట్టు సాధించాలి. 
 • ఎకానమీలో తెలంగాణ స్థూల రాష్ట్రీయోత్పత్తి, ముఖ్యమైన పథకాలు, 2011 జనాభా గణాంకాలు; ముఖ్యమైన పరిశ్రమలు-ఉత్పత్తిదాయకత, రాష్ట్ర ప్రధాన ఆదాయ వనరులపై అవగాహన ఏర్పరచుకోవాలి. 

ఆరు పేపర్లు.. 900 మార్కులు

పేపర్‌ సబ్జెక్స్‌ మార్కులు
ఎ) జనరల్‌ ఇంగ్లిష్‌ (క్వాలిఫయింగ్‌ టెస్ట్‌) 150
1

జనరల్‌ ఎస్సే 

(1.సమకాలీన సామాజిక అంశాలు, సమస్యలు; 2. ఆర్థిక అభివృద్ధి, న్యాయపరమైన అంశాలు; 3.భారత రాజకీయ స్థితిగతులు; 4.భారతీయ చరిత్ర సాంస్కృతిక వారసత్వం; 5.సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అభివృద్ధి; 6.విద్య, మానవ వనరుల అభివృద్ధి)

150
2 హిస్టరీ, కల్చర్‌ - జాగ్రఫీ.                
(1.భారత దేశ చరిత్ర, సంస్కృతి. ఆధునిక యుగం(1757-1947); 2.తెలంగాణ చరిత్ర, సాంస్కృతిక వారసత్వం; 3.భారతదేశం, తెలంగాణ జాగ్రఫీ)
150
3 ఇండియన్‌ సొసైటీ, రాజ్యాంగం, పరిపాలన.        
(1.భారతీయ సమాజం, నిర్మాణం, అంశాలు, సామాజిక ఉద్యమాలు; 2.భారత రాజ్యాంగం; 3.పరిపాలన)
150
4 ఎకానమీ అండ్‌ డెవలప్‌మెంట్‌            
(1.భారత ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి; 2.తెలంగాణ ఆర్థిక వ్యవస్థ; 3.అభివృద్ధి, పర్యావరణ సమస్యలు)
150
5 సైన్స్‌-టెక్నాలజీ-డేటా ఇంటర్‌ప్రిటేషన్‌.        
(1.శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పాత్ర, ప్రభావం; 2.విజ్ఞానశాస్త్ర వినియోగంలో ఆధునిక పోకడలు; 3.డేటా ఇంటర్‌ప్రిటేషన్‌-సమస్యా పరిష్కారం)
150
6 తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం.         
(1.తెలంగాణ తొలి దశ (1948-1970); 2.ఉద్యమ దశ (1971-1990); 3. తెలంగాణ రాష్ట్ర 
ఆవిర్భావ దశ (1991-2014))
150
Published date : 26 Jun 2023 06:35PM

Photo Stories