TSPSC Exam 2023: గ్రూప్–1 ప్రిలిమ్స్.. ఎగ్జామ్ డే టిప్స్
- జూన్ 11న టీఎస్‌పీఎస్సీ గ్రూప్–1 ప్రిలిమ్స్ రీ–ఎగ్జామ్
- ఈ నెల 4 తేదీ నుంచి అందుబాటులోకి వచ్చిన హాల్ టికెట్ డౌన్‌లోడ్ సదుపాయం
- గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన ప్రిలిమ్స్‌కు 2,86,051 మంది హాజరు
- అభ్యర్థులు ఒత్తిడిని దూరం పెట్టాలంటున్న నిపుణులు
ఎన్ని సంవత్సరాలు కష్ట పడినా.. ఎన్ని పుస్తకాలు చదివినా..పరీక్షకు ముందు చేసే రివిజన్ విజయంలో కీలకంగా నిలుస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. కాబట్టి అన్ని టాపిక్స్ చదివేశాం కదా అనే ఆలోచనను వీడాలి. అందుబాటులో ఉన్న ప్రస్తుత సమయంలో ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. మళ్లీ మళ్లీ చదివే ప్రయత్నం చేయాలి.
రివిజన్ ప్రధానంగా
ప్రిలిమ్స్‌కు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ వారం రోజుల సమయంలో అభ్యర్థులు ప్రధానంగా రివిజన్‌కే ప్రాధాన్యం ఇవ్వాలి. శాస్త్రీయ దృక్పథంతో పునశ్చరణ సాగించాలి. ఇప్పటివరకు ఆయా సబ్జెక్ట్‌లకు సంబంధించి సొంతంగా రూపొందించుకున్న షార్ట్ నోట్స్, సినాప్సిస్‌లపై ఎక్కువ దృష్టిపెట్టాలి. ఒక టాపిక్‌కు సంబంధించిన సినాప్సిస్‌ను చదివితే..ఆ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మదిలో మెదిలే విధంగా ఉండాలి. ఇప్పటివరకు చదివిన పుస్తకాలు, నోట్స్‌లోని ముఖ్యాంశాలను, సబ్ హెడ్డింగ్స్‌ను చూసుకోవాలి.
చదవండి: Groups Preparation 2023: సొంత నోట్సు.. సక్సెస్‌కు రూటు
ప్రాక్టీస్ టెస్ట్స్
ప్రస్తుత సమయంలో ప్రిలిమ్స్ అభ్యర్థులు రివిజన్‌తోపాటు ప్రాక్టీస్ టెస్ట్స్‌కు హాజరు కావడం కూడా మేలు చేస్తుంది. ప్రతిరోజు ప్రాక్టీస్ టెస్ట్‌లు రాయడం ద్వారా టైమ్ మేనేజ్‌మెంట్ అలవడుతుంది. ఇది పరీక్ష హాల్లో ఎలా వ్యవహరించాలో నేర్పుతుంది. ఫలితంగా ఎగ్జామ్ డే టెన్షన్ నుంచి ఉపశమనం కలుగుతుంది.
క్లిష్టతను తట్టుకునేలా
గత అక్టోబర్‌లో నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షలో ప్రశ్నల క్లిష్టత స్థాయి ఎక్కువగా ఉందనే అభిప్రాయం వ్యక్తమైంది. కొన్ని ప్రశ్నలు అభ్యర్థులను తికమకకు గురి చేసే విధంగా కనిపించాయి. దీంతో అభ్యర్థులు పరీక్ష హాల్లో కొంత ఒత్తిడికి లోనయ్యారు. ఇలాంటి సందర్భాలను దృష్టిలో పెట్టుకుని ప్రశ్నలు ఎలా అడిగినా.. టెన్షన్‌కు గురికాకుండా ముందుగానే మానసికంగా సంసిద్ధత పొందాలి.
ఆరోగ్యం జాగ్రత్తగా
ప్రిలిమ్స్‌కు హాజరయ్యే అభ్యర్థులు..రేయింబవళ్లు శ్రమిస్తేనే మంచి మార్కులు వస్తాయని భావిస్తుంటారు. ఫలితంగా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. పరీక్షకు ముందు రోజు కూడా అర్థరాత్రి వరకూ చదవుతూ ఉంటారు. ఇది మరుసటి రోజు పరీక్ష హాల్లో ప్రదర్శన తీరుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాబట్టి పరీక్షకు ముందు రోజు అతిగా చదవకుండా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి.
చదవండి: Groups Preparation Tips: గ్రూప్స్..ఒకే ప్రిపరేషన్‌తో కామన్‌గా జాబ్ కొట్టేలా!
పరీక్షకు ముందు రోజు
పరీక్షకు ఒకరోజు ముందు అభ్యర్థులు సబ్జెక్ట్ ప్రిపరేషన్ కంటే..మరుసటి రోజు పరీక్షకు హాజరయ్యేందుకు అవసరమైన వాటిని(హాల్ టికెట్, పెన్నులు, గుర్తింపు కార్డులు వంటివి) సిద్ధం చేసుకోవాలి. ముందుగానే పరీక్ష కేంద్రాన్ని చూసుకోవడం, హాల్ టికెట్ డౌన్‌లౌడ్ వంటి పూర్తిచేసుకోవాలి. పోటీ నేపథ్యంలో చివరి నిమిషం వరకు చదవాలనే తపన ఉండటం సహజం. దీనివల్ల మానసిక ఒత్తిడి, శారీరక అలసటకు గురయ్యే ప్రమాదం ఉందని గమనించాలి.
పరీక్ష హాల్లో ప్రత్యేకంగా
అభ్యర్థులు పరీక్ష హాల్లో ప్రత్యేక వ్యూహాలను అనుసరించాలి. ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వాలనే తొందరపాటును వీడాలి. ముందుగా ప్రశ్న పత్రాన్ని చదివేందుకు కొంత సమయం కేటాయించాలి. కనీసం పది నిమిషాలపాటు ప్రశ్న పత్రం పరిశీలించాలి. ఫలితంగా ప్రశ్న పత్రం క్టిష్లత స్థాయిపై ప్రాథమిక అవగాహన ఏర్పడుతుంది. తొలుత సులభంగా భావించిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. తర్వాతి దశలో ఓ మోస్తరు క్లిష్టత ఉన్న ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. చివరగా తాము అత్యంత క్లిష్టంగా భావించిన ప్రశ్నలపై దృష్టి పెట్టాలి.
ఎలిమినేషన్.. చివరగా
ఆబ్జెక్టివ్ విధానంలో ఉండే ప్రిలిమ్స్ పరీక్షలో చాలామంది అభ్యర్థులు చేసే పని.. ఎలిమినేషన్ టెక్నిక్‌ను అనుసరించడం. అంటే..నాలుగు సమాధానాల్లో.. ప్రశ్నకు సరితూగని సమాధానాలను ఒక్కొక్కటిగా తొలగించి.. చివరగా మిగిలిన ఆప్షన్‌ను సమాధానంగా భావించడం. ఈ టెక్నిక్‌ను కూడా పరీక్ష చివరి దశలోనే అమలు చేయాలి. అప్పటికే తమకు సమాధానాలు తెలిసిన అన్ని ప్రశ్నలను పూర్తి చేసుకున్నామని భావించాకే..ఎలిమినేషన్ లేదా గెస్సింగ్‌పై దృష్టి పెట్టాలి.
ఓఎంఆర్ షీట్–అప్రమత్తం
ఎంతోమంది అభ్యర్థులు ఓఎంఆర్ షీట్‌లో వివరాలు పొందుపరచడంలో పొరపాట్లు చేస్తున్నారు. దీంతో పరీక్షలో మంచి మార్కులు సాధించినా.. విజయాన్ని చేజార్చుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితి ఎదురుకాకుండా.. ఓఎంఆర్ షీట్ నింపడంలో అభ్యర్థులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఓఎంఆర్ షీట్‌ను తప్పులు లేకుండా నింపడంతోపాటు సమాధానాలు బబ్లింగ్ చేసేటప్పుడు ప్రశ్న సంఖ్య, ఆప్షన్‌ను క్షుణ్నంగా గుర్తించాలి.
చదవండి: Groups Preparation Tips: 'కరెంట్ అఫైర్స్'పై పట్టు.. సక్సెస్‌కు తొలి మెట్టు!
హాల్ టికెట్ డౌన్‌లోడ్
ప్రిలిమ్స్ అభ్యర్థులు హాల్ టికెట్ డౌన్‌లోడ్ సదుపాయం అందుబాటులోకి వచ్చిన వెంటనే ఆ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. సమయం ఉంది కదా.. అని చివరి రోజు వరకు వేచి చూడకుండా.. హాల్ టికెట్‌ను వీలైనంత ముందుగా డౌన్‌లోడ్ చేసుకోవడం మేలు. దీనివల్ల హాల్‌టికెట్‌లో ఏమైనా పొరపాట్లు ఉంటే..పరీక్ష కేంద్రంలోని అధీకృత అధికారుల దృష్టికి తీసుకెళ్లి మార్పులు చేయించుకునే అవకాశం ఉంటుంది. ఇలా మార్పులు చేయించుకోవాల్సిన అవసరం ఏర్పడిన అభ్యర్థులు..తప్పనిసరిగా తమ గుర్తింపును రుజువు చేసే విధంగా ఏదైనా ఇతర అధికారిక గుర్తింపు కార్డును తీసుకెళ్లాలి.
పరీక్ష కేంద్రంలో ఇలా..
- పరీక్ష సమయానికి కనీసం గంట ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.
- ప్రశ్న పత్రాన్ని చదివేందుకు కొంత సమయం కేటాయించాలి.
- సులభంగా భావించిన ప్రశ్నలకు ముందుగా, తర్వాత ఓ మోస్తరు క్లిష్టత ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి.
- ఎలిమినేషన్ టెక్నిక్‌ను చివరిగా అనుసరించడం మేలు.
- ఓఎంఆర్ షీట్ నింపడంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.