Indian Polity Study Material: భారతదేశం.. రాష్ట్రాల యూనియన్
భారత భూభాగం – భారత యూనియన్
రాష్ట్రాల ఏర్పాటు–పునర్ వ్యవస్థీకరణ
భారత దేశంలో సమాఖ్య వ్యవస్థ ఉంది. కేంద్ర, రాష్ట్రాలు రాజ్యాంగ పరంగా అధికార విభజన సూత్రం ఆధారంగా పనిచేస్తాయి. సమాఖ్య, రాష్ట్రాల ఏర్పాటు, పునర్ వ్యవస్థ కరణ తదితర అంశాలను ఒకటో భాగంలో ప్రకరణలు 1 నుంచి 4 వరకు ప్రస్తావించారు.
భారత భూభాగం
ప్రకరణ–1
ఈ ప్రకరణ ప్రకారం, భారత భూభాగం అంటే రాష్ట్రాల సరిహద్దులు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర ప్రభుత్వం సముపార్జించిన ఇతర భూభాగాలు ఉంటాయి.
భారత భూభాగం అనే భావన విస్తృతమైంది. భారత సార్వభౌమాధికారం ఏ విధంగా విస్తరించి ఉంటుందో తెలుపుతుంది. భారత సార్వభౌమాధికారం భౌగోళిక ప్రాంతాలకే పరిమితం కాదు. భారత సముద్ర ప్రాదేశిక జలాలు 12 నాటికల్ మైళ్ల వరకు, విశిష్ట ఆర్థిక మండళ్లు 200 నాటికల్ మైళ్ల వరకు, అలాగే భారత అంతరిక్ష సరిహద్దులకూ సార్వభౌమాధికారం వర్తిస్తుంది.
భారత యూనియన్
ఇందులో రాష్ట్రాలు మాత్రమే ఉంటాయి. రాష్ట్రాలు సమాఖ్యలో అంతర్భాగంగా ఉంటూ నిర్ణీత అధికారాలను కలిగి ఉంటాయి. ఈ పదం కేంద్ర రాష్ట్ర సంబంధాలను సూచిస్తుంది.
రాష్ట్రాల సమ్మేళనం
భారత రాజ్యాంగం, ఒకటో ప్రకరణలో భారతదేశాన్ని రాష్ట్రాల యూనియన్‌గా పేర్కొంది. సమాఖ్య అనే పదాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. కెనడా సమాఖ్యను స్ఫూర్తిగా తీసుకుని యూనియన్ అనే పదాన్ని రాజ్యాంగంలో చేర్చారు.
భారత సమాఖ్య అమెరికాలా రాష్ట్రాల మధ్య ఒప్పందం ద్వారా ఏర్పడలేదు. అలాగే కెనడా మాదిరిగా ఏకకేంద్ర రాజ్యం సమాఖ్యగా విభజితమవలేదు. భారత సమాఖ్య ఒక ప్రత్యేక పద్ధతిలో ఏర్పడింది.
కేంద్ర రాష్ట్రాల మధ్య ఒప్పందం లేదు. కాబట్టి యూనియన్ నుంచి రాష్ట్రాలు విడిపోలేదు. అమెరికా సమాఖ్యలో ప్రారంభంలో రాష్ట్రాలకు కేంద్రం నుంచి విడిపోయే హక్కు ఉండేది. అయితే ఆ హక్కును తర్వాత రద్దు చేశారు.
కాబట్టి భారత సమాఖ్యను విచ్ఛిన్నం కాగల రాష్ట్రాల, అవిచ్ఛిన్న యూనియన్ (ఇన్ డెస్ట్రక్టిబుల్ యూనియన్ ఆఫ్ డెస్ట్రక్టిబుల్ స్టేట్స్)గా పేర్కొంటారు. అమెరికాను ఇన్‌డెస్ట్రక్టిబుల్ యూనియన్ ఆఫ్ ఇన్‌డెస్ట్రక్టిబుల్ స్టేట్స్‌గా పేర్కొంటారు.
ప్రకరణ–2
ఈ ప్రకరణ ప్రకారం పార్లమెంటు ఒక చట్టం ద్వారా కొత్త ప్రాంతాలను చేర్చుకోవచ్చు, ఇతర దేశాలకు బదిలీ చేయవచ్చు. ఈ అధికారం భారత భూభాగంలో లేని అంశాలకు వర్తిస్తుంది. ఈ అధికారం ΄పార్లమెంటుకు సంబంధించినదైనా అంతర్జాతీయ ఒప్పందాలకు లోబడి ఉంటుంది.
వివరణ..
విదేశీ భూభాగాలను భారతదేశంలో చేర్చుకున్నప్పుడు ΄పార్లమెంటు ప్రత్యేక మెజారిటీతో రాజ్యాంగ సవరణ చేయాలి.
ఉదాహరణ: 1961లో గోవాను భారత్‌లో కలిపినప్పుడు 12వ రాజ్యాంగ సవరణ చేశారు. అలాగే పాండిచ్చేరికి సంబంధించి 1962లో 14వ రాజ్యాంగ సవరణ చేశారు. 1975లో 36వ రాజ్యాంగ సవరణ ద్వారా సిక్కింను భారత రాష్ట్రంగా చేర్చుకున్నారు.
ప్రకరణ–3
- ఇందులో కింది అంశాలు ఉన్నాయి.
- కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం.
- రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలను కలిపి నూతన రాష్ట్రం ఏర్పాటు.(ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాద్ కలయికతో 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు). అలాగే రాష్ట్రాన్ని విడగొట్టి కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయడం. (2014 జూన్‌లో ఏర్పడిన తెలంగాణ)
- రాష్ట్ర విస్తీర్ణాన్ని పెంచవచ్చు.
- రాష్ట్ర విస్తీర్ణాన్ని తగ్గించవచ్చు.
- రాష్ట్ర సరిహద్దులను సవరించవచ్చు.
- రాష్ట్రాల పేర్లను మార్చవచ్చు.
రాష్ట్రాల ఏర్పాటు – ప్రక్రియ– పద్ధతి
ప్రకరణ 3లో పేర్కొన్న అన్ని అంశాలకు ఒకే ప్రక్రియ ఉంటుంది.
పై అంశాలకు సంబంధించిన బిల్లును పార్లమెంటులోని ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు.
వివరణ..
రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లులో ఆర్థిక వనరుల పంపకాలు ఉంటే అది స్పెషల్ కేటగిరీ బిల్లు అవుతుంది. అలాంటి సందర్భాల్లో బిల్లును లోక్‌సభలోనే ప్రతిపాదించాలి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఈ వివాదాన్ని గమనించవచ్చు.
పై బిల్లులను రాష్ట్రపతి పూర్వ అనుమతితోనే ప్రవేశపెట్టాలి.
ఈ షరతును 1955లో అయిదో రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు.
సంబంధిత బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ముందే ప్రభావితమవుతున్న రాష్ట్ర శాసనసభల అభిప్రాయాని రాష్ట్రపతి కోరతారు.
సంబంధిత రాష్ట్ర శాసనసభ రాష్ట్రపతి సూచించిన నిర్ణీత సమయంలోనే తమ అభిప్రాయాన్ని తెలపాలి.
రాష్ట్ర శాసనసభలు వ్యక్తీకరించిన అభిప్రాయాలను పార్లమెంటు పరిగణలోకి తీసుకోవచ్చు లేదా తీసుకోకపోవచ్చు.
వివరణ..
1966లో పంజాబ్ నుంచి హర్యానా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినప్పుడు పంజాబ్‌లో రాష్ట్రపతి పాలన, విధానసభ సుప్తచేతనావస్థలో ఉండటం వల్ల పునర్‌వ్యవస్థీకరణ బిల్లును రాష్ట్ర శాసనసభ అభిప్రాయానికి నివేదించలేదు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును శాసనసభ తిరస్కరించింది.
పార్లమెంటు ఉభయసభలు సంబంధిత బిల్లును సాధారణ మెజారిటీతో వేర్వేరుగా ఆమోదించాలి. ఉభయసభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడితే, సంయుక్త సమావేశానికి ఆస్కారం లేదు. బిల్లు వీగిపోతుంది.
బిల్లును రాష్ట్రపతి తప్పని సరిగా ఆమోదించాలి. పునఃపరిశీలనకు అవకాశం లేదు.
రాష్ట్రపతి ఆమోదం తెలిపితే బిల్లు చట్టంగా మారుతుంది. దీంతో ప్రక్రియ పూర్తి అవుతుంది.
కొత్త రాష్ట్రం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనేది కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. దీన్ని అపాయింటెడ్ డేట్ అంటారు.
ప్రకరణ–4
ఈ ప్రకరణ సంబంధిత తదుపరి పరిణామాలను వివరిస్తుంది. ప్రకరణ 2, 3 ప్రకారం ఏదైనా సవరణ చేసినప్పుడు 1, 4 షెడ్యూల్‌లో పేర్కొన్న అంశాలను కూడా తదనుగుణంగా మార్చాలి. దీనికోసం పార్లమెంటు ప్రత్యేక చట్టం చేయాల్సిన అవసరం లేదు. ప్రకరణ 2, 3 ప్రకారం ఏ సవరణ చేసినా, తదనుగుణంగా 1, 4 షెడ్యూల్‌లోని అంశాలు కూడా మార్పునకు గురవుతాయి.
వివరణ
ప్రకరణ 2, 3 ప్రకారం ఏ సవరణ చేసినా దాన్ని రాజ్యాంగ సవరణగా పరిగణించరు. ఈ అంశాన్ని ప్రకరణ 4(2)లో స్పష్టంగా పేర్కొన్నారు. రాష్ట్రాల ఏర్పాటు, పునర్‌వ్యవస్థీకరణ, ఇతర అంశాలకు రాజ్యాంగ సవరణ తప్పనిసరి కాదు.
వివాదాలు– సుప్రీంకోర్టు తీర్పులు
బెరుబారి యూనియన్ వివాదం–1960
ప్రకరణ 3 ప్రకారం, రాష్ట్రాల సరిహద్దును కుదించే అధికారం పార్లమెంటుకు ఉంది. అయితే ఒక రాష్ట్ర భూభాగాన్ని ఇతర దేశాలకు బదిలీ చేసే అధికారం ఉందా? అనే వివాదం తలెత్తింది. దీనికి సంబంధించి రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహాను కోరారు. ఈ వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు చెబుతూ, రాష్ట్ర భూభాగాన్ని ఇతర దేశాలకు బదిలీ చేయాలంటే ప్రకరణ 368 ప్రకారం పార్లమెంటు ప్రత్యేక మెజారిటీతో రాజ్యాంగ సవరణ చేయాలని పేర్కొంది. అయితే, అంతర్గతంగా బదిలీ చేసేందుకు సాధారణ మెజారిటీ సరిపోతుంది.
గమనిక: బెరుబారి అనేది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఒక ప్రాంతం. 9 చదరపు మైళ్ల విస్తీర్ణంతో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఒక ఒప్పందం ద్వారా పాకిస్తాన్‌కు కొంత భాగాన్ని బదిలీ చేసింది.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
బాబూలాల్ మారాండి వర్సెస్ ముంబై స్టేట్ కేస్ (1960)
రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ బిల్లును ఒక్క పర్యాయం మాత్రమే సంబంధిత రాష్ట్ర శాసనసభల అభి్ప్రాంయానికి నివేదిస్తారు. ఒక వేళ ఆ బిల్లులో తర్వాత చేసిన మార్పులకు సంబంధించి మరోసారి రాష్ట్ర పరిశీలనకు పంపాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఉదాహరణ: తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లాలోని పోలవరం కింది 7 ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించడం.
స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (1982)
భారత రాజ్యాంగం నిర్ణీతమైన సమాఖ్య వ్యవస్థను ఏర్పరచలేదు. నిర్మాణపరంగా సమాఖ్య అయినప్పటికీ ఇది సమాఖ్య, ఏక కేంద్ర ప్రభుత్వాల మిశ్రమంగా పేర్కొంది.
ముళ్ల పెరియార్ పర్యావరణ వివాదం (2006)
నదీజలాల పంపిణీ విషయంపై చట్టాలను చేసే అధికారం రాష్ట్ర శాసనసభకు ఉండదు. ఈ అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంటుందని సుప్రీంకోర్టు ఈ కేసులో తీర్పు చెప్పింది.
భాషా ప్రయుక్త రాష్ట్రాలు
దేశానికి స్వాతంత్య్రం వచ్చే నాటికి రెండు రకాల రాజకీయ భాగాలు ఉండేవి.
1. నేరుగా బ్రిటిష్ ప్రభుత్వ నియంత్రణలో ఉన్న భాగాలు.
2. బ్రిటిష్ సార్వభౌమాధికారం కింద పనిచేసే సంస్థానాలు (స్వదేశీ సంస్థనాలు).
ఆనాడు దేశంలో 552 స్వదేశీ సంస్థానాలు ఉండేవి. బ్రిటిషువారు ప్రకటించిన విలీన ఒప్పందం ప్రకారం 549 స్వదేశీ సంస్థానాలు భారత యూనియన్‌లో విలీనం అయ్యాయి కానీ హైదరాబాద్, జునాగఢ్, కశ్మీర్ సంస్థానాలు విలీనాన్ని వ్యతిరేకించాయి. కశ్మీర్ భారత్‌లో విలీన ఒప్పందం ద్వారా అంతర్భాగం అయింది. ప్రజాభిప్రాయం ద్వారా జునాగఢ్ భారత్‌లో కలిసిపోయింది. ప్రజాభిప్రాయం ద్వారా కలిసిన మొదటి, చివరి సంస్థానం ఇదే. హైదరాబాద్ సంస్థానాన్ని 1948 సెప్టెంబర్ 17న ఆపరేషన్‌పోలో అనే పోలీసు చర్య (సైనిక చర్య) ద్వారా విలీనం చేశారు.
1950 నాటికి రాజ్యాంగం ప్రకారం నాలుగు రకాల రాష్ట్రాలు అమలులో ఉండేవి. వీటిని పార్ట్–ఎ, బి, సి, డిగా వర్గీకరించారు. పార్ట్–ఎలో బ్రిటిష్ పాలిత గవర్నర్ ప్రావిన్స్‌లు 9 ఉండేవి. పార్ట్–బిలో శాసనసభ కలిగిన స్వదేశీ సంస్థానాలు 9, పార్ట్–సిలో చీఫ్ కమిషనర్ ప్రాంతాలు 10, పార్ట్–డిలో అండమాన్ నికోబార్ దీవులు ఉండేవి.
నేపథ్యం..
భాషాప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటు చేయాలనే డిమాండ్ స్వాతంత్య్రోద్యమ కాలంలోనే ఉండేది. ఈ డిమాండు మొట్టమొదటి సారి తెరపైకి తెచ్చింది తెలుగువారే.
గమనిక: స్వాతంత్య్రం రాక ముందు భాషాప్రాతిపదికన ఏర్పడిన మొదటి రాష్ట్రం ఒడిశా.
1913లో బాపట్లలో జరిగిన ఆంధ్రమహాసభ ప్రత్యేక ఆంధ్ర ఏర్పాటుకు డిమాండ్ చేసింది.
1927లో కాంగ్రెస్ సమావేశం భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును సమర్థిస్తూ తీర్మానం చేసింది.
1931లో జరిగిన రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి గాంధీ హాజరైన సందర్భంలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర డిమాండుపై చర్చించాలని భోగరాజు పట్టాభి సీతారామయ్య ప్రతిపాదించారు.
1937లో రాయలసీమ, ఆంధ్ర నాయకుల మధ్య కాశీనాథుని నాగేశ్వరరావు నివాసంలో ఒక ఒప్పందం కుదిరింది. కాశీనాథుని నివాసం పేరు శ్రీభాగ్ కాబట్టి దీన్ని శ్రీభాగ్ ఒప్పందం అంటారు. స్వాతంత్య్రానంతరం రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేసే సందర్భంలో మద్రాసు, ఆంధ్ర నాయకుల మధ్య తలెత్తిన వివాదాలు ప్రత్యేక ఆంధ్ర ఏర్పాటుకు బలమైన కారణాలుగా చెప్పొచ్చు.
థార్ కమిషన్ –1948
భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుపై పరిశీలనకు రాజ్యాంగ పరిషత్తు 1948లో ఉత్తరప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి ఎస్.కె.థార్ నాయకత్వంలో ఇద్దరు సభ్యులతో (పన్నాలాల్, జగత్ నారాయణ్‌లాల్) ఒక కమిషన్‌ను నియమించింది. ఈ కమిషన్ కేవలం భాషా ప్రాతిపదిక పైన రాష్ట్రాలు ఏర్పాటు చేయడాన్ని తిరస్కరించింది. పరిపాలనా సౌలభ్య ప్రాతిపదికపైనే రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని సూచించింది.
జె.వి.పి. కమిటీ
థార్ కమిషన్ నివేదికకు వ్యతిరేకంగా చెలరేగిన ఆందోళనను విరమింపజేయడానికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ 1948 డిసెంబర్‌లో జవహర్‌లాల్ నెహ్రూ, వల్లభ్‌భాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్య సభ్యులుగా ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ కూడా దేశం మొత్తం మీద రాష్ట్రాల పునర్‌నిర్మాణాన్ని వాయిదా వేయాలని, ఆంధ్ర రాష్ట్రాన్ని మాత్రం దానికి మినహాయింపుగా భావించాలని నివేదించింది.
1952 ఆగస్టు 15 నుంచి 35 రోజుల గాటు గొల్లపూడి సీతారామయ్య శాస్త్రి ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ఏర్పాటు కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. 35 రోజుల తర్వాత ఆచార్య వినోభా భావే అతడి నిరాహారదీక్షను విరమింపజేశారు.
1952 అక్టోబర్ 19 నుంచి మద్రాసులో బులుసు సాంబమూర్తి ఇంట్లో పొట్టి శ్రీరాములు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. దీక్ష 50వ రోజుకు చేరుకున్న సందర్భంగా మద్రాసును సందర్శించిన జవహర్‌లాల్ నెహ్రూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు హామీ ఇచ్చారు.
కానీ ΄÷ట్టి శ్రీరాములు తన దీక్షను కొనసాగించారు. 58వ రోజున డిసెంబర్ 15న ఆయన అమరుడయ్యారు. ΄÷ట్టి శ్రీరాములు మృతితో హింసాత్మక సంఘటనలు చెలరేగాయి. దీంతో 1952 డిసెంబర్ 19న పార్లమెంటులో నెహ్రూ ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ఏర్పాటును ప్రకటించారు.
Tags
- India Union of States
- indian territory
- Indian Polity
- Competitive Exams
- Indian Polity Study Material
- appsc and tspsc exams
- study material for groups exams
- practice questions for indian polity in groups
- competitive exams preparation for indian polity
- study material for indian polity in competitive exams