Indian Geography : బెంగాల్ దుఃఖదాయని అని ఏ నదిని పిలుస్తారు?
భారతదేశ ప్రధాన నదీ వ్యవస్థ
భారతదేశంలో నదీ వ్యవస్థను ప్రధానంగా రెండు రకాలుగా విభజించవచ్చు.
అవి:
1) జీవ నదీ వ్యవస్థ
2) వర్షాధార నదీ వ్యవస్థ
ఈ రెండు నదీ వ్యవస్థల వల్ల భారతదేశానికి వ్యవసాయపరంగా, పారిశ్రామికంగా, రవాణా పరంగా చాలా ప్రయోజనాలున్నాయి.
జీవ నదీ వ్యవస్థ
వీటినే హిమాలయన్ నదులు అని కూడా అంటారు. సంవత్సరం పొడవునా నీటి ప్రవాహం ఉన్న నదులను ‘జీవనదులు’ అంటారు. వర్షాకాలంలోని వర్షపు నీరు, ఇతర కాలాల్లో పర్వత శిఖరాల్లోని మంచు కరగడం వల్ల ఈ నదులు ఎల్లప్పుడూ ప్రవహిస్తూ ఉంటాయి. హిమాలయ నదులైన గంగా, సింధూ, బ్రహ్మపుత్ర, వీటి ఉపనదులు జీవ నదులుగా ఉన్నాయి.
సింధూనది: ఇది ‘టిబెట్’ హిమాలయాల్లోని ‘మానస సరోవరం’ పశ్చిమ వైపున 5180 మీ. ఎత్తయిన కైలాస శిఖరాల్లో జన్మిస్తోంది. టిబెట్, భారత్, పాకిస్థాన్‌లో ప్రవహిస్తోంది. దీని మొత్తం పొడవు 2880 కి.మీ. భారతదేశంలో 709 కి.మీ. దూరం ప్రయాణిస్తుంది. ఈ నది భారతదేశంలో జమ్మూ–కాశ్మీర్ రాష్ట్రంలో ప్రవేశిస్తుంది. ఈ రాష్ట్రం నుంచి పాకిస్థాన్‌లోకి ప్రవేశించి, ఆ దేశంలో ఉత్తర, దక్షిణాలుగా ప్రవహిస్తోంది. చివరకు పాకిస్థాన్‌లోని ‘కరాచి’ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తోంది. జమ్మూ–కాశ్మీర్‌లో ప్రధానంగా లద్దాఖ్, బల్టిస్థాన్ ప్రాంతాల ద్వారా ప్రవహిస్తోంది. దీని ఉపనదులు సట్లెజ్, జీలం, చినాబ్, బియాస్, రావి. వీటిలో అతి పెద్ద ఉపనది సట్లెజ్.
గంగా: ఇది భారతదేశంలో ప్రవహిస్తున్న నదుల్లో అత్యంత పొడవైంది. ఉత్తరాఖండ్ హిమాలయాల్లో గంగోత్రి హిమానీనదం వద్ద జన్మిస్తున్న అలకనంద, భగీరథ అనే రెండు పాయలు కొంత దూరం ప్రవహించి ‘దేవ ప్రయాగ’ వద్ద కలిసి ‘గంగానది’ ఏర్పడుతోంది. దీని మొత్తం పొడవు 2525 కి.మీ. దీని పరీవాహక ప్రాంతం సుమారు 8,61,404 చ.కి.మీ. విస్తరించి ఉంది.
ఈ నది భారతదేశంలో ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ద్వారా ప్రవహిస్తూ బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించి బంగాళాఖాతంలో కలుస్తోంది. దీన్ని బంగ్లాదేశ్‌లో ‘పద్మానది’ అని, బ్రహ్మపుత్రా నదితో కలిసిన తర్వాత ‘మేఘన’ అని పిలుస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లో నిర్మించిన ఫరక్కా బ్యారేజీ ద్వారా దీని నీటిని హుగ్లీనదికి మళ్లిస్తున్నారు. దీని ప్రధాన ఉప నదులు– యమున, కోసీ, రామ్‌గంగా, గోమతి, బాగ్రా, గండక్, మహానందా, సోన్. దక్షిణ దిశ నుంచి వచ్చి గంగానదిలో కలిసే ఏకైక ఉపనది సోన్. మిగితావన్నీ హిమాలయాల నుంచి వచ్చి గంగానదిలో కలుస్తున్నాయి.
☛Follow our YouTube Channel (Click Here)
యమునా: ఇది గంగానది ఉపనదులన్నింటిలో పెద్దది. ఇది ‘యమునోత్రి’ హిమానీనదం వద్ద పుట్టి ‘అలహాబాద్’ దగ్గర గంగానదితో కలుస్తుంది. చంబల్, బెట్వా, కెన్ దీని ఉపనదులు.
బ్రహ్మపుత్ర: ఇది టిబెట్ హిమాలయాల్లోని ‘మానస సరోవరం’ తూర్పు వైపున జన్మిస్తోంది. టిబెట్, భారత్, బంగ్లాదేశ్ ద్వారా 2900 కి.మీ. దూరం ప్రయాణించి బంగాళాఖాతంలో కలుస్తోంది.
ఈ నది భారత్‌లో అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రవేశించిన వెంటనే ‘షియాంగ్’ అనే నదితో కలిసి కొంత దూరం ప్రయాణించి ‘దిహంగ్’ అనే ప్రదేశం వద్ద దిహంగ్, లోహిత నదులతో కలుస్తోంది. అసోంలో ‘తీస్టా’ ఉపనదిని కలుపుకొని బంగ్లాదేశ్‌లో ప్రవేశిస్తోంది. చివరగా గంగానదితో కలిసి బంగాళాఖాతంలో కలుస్తోంది. ఈ నదిని వివిధ ్ర΄ాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తున్నారు. టిబెట్‌లో – సాంగ్‌పో లేదా త్యాంగ్‌పో అని పిలుస్తున్నారు. ‘స్వచ్ఛమైన’ అని దీని అర్థం. అరుణాచల్ ప్రదేశ్‌లో ‘దిహంగ్’ అని, బంగ్లాదేశ్‌లో ‘జమునా’ అని పిలుస్తున్నారు.
మగవారి పేరుతో పిలుస్తున్న భారతదేశ ఏకైక నది బ్రహ్మపుత్ర. దీని ఉపనదులు తీస్టా, షియాంగ్, దిహంగ్, లోహిత. గంగా, బ్రహ్మపుత్ర నదులు సముద్రంలో కలిసేచోట ప్రపంచంలో కెల్లా అతి పెద్దదైన ‘సుందర్‌బన్ డెల్టా’ను ఏర్పరుస్తున్నాయి.
వర్షాధార నదీ వ్యవస్థ
వర్షాకాలం మాత్రమే నీటి ప్రవాహం కలిగి ఉండటం వల్ల వీటిని ‘వర్షాధారిత నదులు’ అంటారు. వీటినే ‘ద్వీపకల్ప నదులు’ అని కూడా అంటారు.
వీటిని రెండు రకాలుగా విభజించవచ్చు.
పశ్చిమం వైపునకు ప్రవహిస్తున్న నదులు: సబర్మతి, నర్మదా, తపతి, మహి మొద
లైనవి.
నర్మదానది: ఇది పశ్చిమం దిశగా ప్రవహిస్తున్న నదుల్లో అతి పొడవైంది. ఇది మధ్యప్రదేశ్‌లోని ‘అమర్‌కంఠక్’ ప్రాంతంలో పుట్టి వింధ్య, సాత్పుర పర్వత శ్రేణుల మధ్య 1312 కి.మీ. ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తోంది. భారతదేశంలో ‘పగులు లోయ’లో ప్రవహిస్తున్న అతి ΄÷డవైన నది నర్మద.
దీని ప్రధాన ఉపనదులు షార్, బర్హానర్, బుంజర్, షక్కర్, కోలర్, బుర్నా, హీరాన్. ఈ నది ప్రవాహ మార్గంలో రెండు ప్రధాన జలపాతాలున్నాయి. అవి: కపిల ధారా, ధూన్‌ధర్. దీని పరీవాహ ప్రాంతం అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో (87 శాతం), మిగి లింది మహారాష్ట్ర, గుజరాత్‌లో ఉంది.
☛ Follow our Instagram Page (Click Here)
తపతి: ఇది పశ్చిమం దిశగా ప్రవహిస్తున్న వాటిలో రెండో అతిపెద్ద నది. ఇది మధ్యప్రదేశ్‌లోని ‘బిటువల్’ జిల్లాలోని ‘ముల్టాయి’ వద్ద పుట్టి 724 కి.మీ. పొడవున సాత్పురా – అజంతా పర్వత శ్రేణుల మధ్య ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తోంది. పూర్ణానది, గిర్లా, బొరి, కీప్ర, సిప్రా, సుకీ, అమరావతి దీని ఉపనదులు.
తూర్పు వైపునకు ప్రవహిస్తున్న నదులు: వీటిలో ముఖ్యమైనవి గోదావరి, కృష్ణా, మహానది, కావేరి, పెన్నా.
ద్వీపకల్ప పీఠభూమి తూర్పువైపునకు వాలి ఉండటంతో దీనిలోని నదులు అధికభాగం తూర్పుదిశగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి.
గోదావరి: భారతదేశంలో గంగానది తర్వాత రెండో అతిపెద్ద నది గోదావరి. ఇది దక్షిణ భారతదేశంలో అతిపెద్ద నది. దీన్ని ‘దక్షిణ గంగా’, ‘దక్షిణ గంగోత్రి’, ‘వృద్ధ గంగా’ అని కూడా అంటారు. ఈ నది మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో ‘నాసిక్ త్రయంబకం’ వద్ద జన్మిస్తోంది. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ద్వారా సుమారు 1465 కి.మీ. ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తోంది. మంజీరా, మానేరు, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు, వార్థా మొదలైనవి దీని ఉపనదులు. ఇది నిర్మల్ జిల్లాలోని ‘బాసర’ వద్ద తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశిస్తుంది.
కృష్ణానది: ఇది మహారాష్ట్రలో పశ్చిమ కనుమల్లోని ‘మహాబలేశ్వరం’ వద్ద పుట్టి మహారాష్ట్ర్ట, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రవహిస్తోంది. 1440 కి.మీ. ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తోంది. ఇది దక్షిణ భారతదేశంలో రెండో అతిపెద్దనది. ఈ నది నారాయణపేట జిల్లాలోని మక్తల్ మండలం ‘తంగడి’ వద్ద తెలంగాణ రాష్ట్రం లో ప్రవేశించి ఆంధ్రప్రదేశ్‌లోని హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తోంది.
తుంగభద్ర, కోయన, ΄ాలేరు, దిండి, మూసీ, భీమా, మున్నేరు, ఘటప్రభ మొదలైనవి దీని ఉపనదులు.
కావేరి: ఇది కర్ణాటకలోని ‘కూర్గ్’ జిల్లాలో ‘బ్రహ్మగిరి’ కొండల్లో జన్మించి కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల ద్వారా సుమారు 805 కి.మీ. పొడవున ప్రవహిస్తోంది. తమిళనాడులోని కావేరి పట్టణం ప్రాంతంలో బంగాళాఖాతంలో కలుస్తోంది. హేమావతి, లోక΄ావని, షింషా, ఆర్కావతి, లక్ష్మణ తీర్థ, భవాని మొదలైనవి దీని ఉపనదులు. ఇది తమిళనాడులో అతి ప్రధానమైన నది.
పెన్నా: ఇది కర్ణాటకలోని మైసూరు వద్ద ‘నందిదుర్గ’ కొండల్లో పుట్టి అనంతపురం జిల్లా హిందూపురం వద్ద ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశిస్తోంది. నెల్లూరు జిల్లాలోని ‘ఊటుకూరు’ వద్ద బంగాళాఖాతంలో కలుస్తోంది. జయమంగళి, చిత్రావతి, కుందేరు, పాపాఘ్ని, చెయ్యేరు, సగిలేరు దీని ఉపనదులు.
మహానది: ఇది మధ్యప్రదేశ్‌లో పుట్టి ఒడిశా ద్వారా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తోంది. దీని పొడవు 857 కి.మీ. దీని ఉపనదులు– మండ్, షియోనాథ్, లేవ్, ఇబ్, హస్‌డియో.
గతంలో అడిగిన ప్రశ్నలు
1. కిందివాటిలో అత్యంత పొడవైన నది ఏది?
1) గంగా 2) నర్మదా
3) కృష్ణా 4) గోదావరి
2. భారతదేశంలోకి బ్రహ్మపుత్ర నది మొదట ఎక్కడ ప్రవేశిస్తుంది?
1) అరుణాచల్ ప్రదేశ్
2) త్రిపుర
3) అస్సాం
4) మేఘాలయ
3. దక్షిణ గంగా అని ఏ నదికి పేరు?
1) కృష్ణా 2) గోదావరి
3) తుంగభద్ర 4) పెన్నా
4. ఏ నదీ సమూహం టిబెట్‌లో ప్రారంభ మూలాన్ని కలిగి ఉంది?
1) బ్రహ్మపుత్ర, గంగా, సట్లెజ్
2) గంగా, సట్లెజ్, యమున
3) చినాబ్, రావి, సట్లెజ్
4) బ్రహ్మపుత్ర, ఇండస్, సట్లెజ్
5. సాత్పురా, వింధ్య శ్రేణుల మధ్య ప్రవహించే నది ఏది?
1) నర్మద 2) గండక్
3) తపతి 4) గోదావరి
6. బంగ్లాదేశ్‌లో గంగానదిని ఏమని పిలుస్తారు
1) సుభ్ర 2) భగీరథి
3) రూప్ నారాయణ్ 4) పద్మ
సమాధానాలు
1) 1; 2) 1; 3) 2; 4) 4;
5) 1; 6) 4.
☛ Join our WhatsApp Channel (Click Here)
మాదిరి ప్రశ్నలు
1. కొంకణ్ తీరం ఏ రాష్ట్రంలో విస్తరించి ఉంది?
1) కర్ణాటక 2) తమిళనాడు
3) కేరళ 4) మహారాష్ట్ర
2. అత్యధిక సంఖ్యలో సరస్సులు, లాగూన్‌లను కలిగి ఉన్న తీర ప్రాంతం ఏది?
1) కేరళ తీరం 2) తమిళనాడు తీరం
3) ఒడిశా తీరం 4) గుజరాత్ తీరం
3. అష్టముడి సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది?
1) తమిళనాడు 2) కేరళ
3) పశ్చిమ బెంగాల్ 4) మణిపూర్
4. శ్రీహరికోటలోని ‘సతీష్‌ధావన్’ రాకెట్ ప్రయోగ కేంద్రం ఏ సరస్సులో విస్తరించి ఉంది?
1) చిలుకా సరస్సు
2) కొల్లేరు సరస్సు
3) పులికాట్ సరస్సు
4) వెంబనాడ్ సరస్సు
5. పగులులోయ ద్వారా ప్రవహిస్తున్న నది?
1) గంగా 2) నర్మదా
3) బ్రహ్మపుత్ర 4) గోదావరి
6. టిబెట్‌లో ‘త్యాంగ్‌పో’ అని ఏ నదిని పిలుస్తారు?
1) సింధూ 2) బ్రహ్మపుత్ర
3) గంగా 4) గండక్
7. గంగానది ఉపనదుల్లో ఉత్తరానికి ప్రవహించేది?
1) కోసి 2) ఘాగ్ర
3) సోన్ 4) గండక్
8. కిందివాటిలో పశ్చిమానికి ప్రవహించే నది?
1) గోదావరి 2) చంబల్
3) మహానది 4) నర్మదా
9. ఒడిశా రాష్ట్రంలో డెల్టాను ఏర్పరిచే నది?
1) సువర్ణరేఖ 2) మహానది
3) కావేరి 4) నర్మదా
10. బెంగాల్ దుఃఖదాయని అని ఏ నదిని పిలుస్తారు?
1) కోసి 2) హుబ్లీ
3) దామోదర్ నది 4) గంగానది
☛ Join our Telegram Channel (Click Here)
11. బీహార్ దుఃఖదాయని అని ఏ నదిని పిలుస్తారు?
1) దామోదర్ 2) కోసి
3) బ్రహ్మపుత్ర 4) వైతరణి
12. కృష్ణా – గోదావరి నదుల మధ్య విస్తరించిన సరస్సు ఏది?
1) పులికాట్ 2) కొల్లేరు
3) చిలుకా 4) అష్టముడి
13. గంగానది ఉపనదుల్లో కెల్లా అతిపెద్దది?
1) చంబల్ 2) ఘాగ్ర
3) కోసి 4) యమునా
14. కపిలధార జలపాతం ఏ నదిపై ఉంది?
1) యమునా 2) నర్మదా
3) గోదావరి 4) కావేరి
15. అలకనంద, భాగీరథిలు ఎక్కడ కలుస్తాయి?
1) రుద్ర ప్రయాగ్ 2) దేవ ప్రయాగ్
3) రిషికేష్ 4) ప్రయాగ్
16. నర్మదా నది ఎక్కువ భాగం ఏ రాష్ట్రం ద్వారా ప్రవహిస్తుంది?
1) రాజస్థాన్ 2) గుజరాత్
3) మధ్యప్రదేశ్ 4) మహారాష్ట్ర
సమాధానాలు
1) 4; 2) 1; 3) 2; 4) 3;
5) 2; 6) 2; 7) 3; 8) 4;
9) 2; 10) 3; 11) 2; 12) 2;
13) 4; 14) 2; 15) 2; 16) 3.
Tags
- indian geography material
- study material and bit banks for groups exams
- appsc and tspsc materials
- bit banks and study materials for group exams
- appsc and tspsc indian geography
- practice and model questions
- bit banks and material for indian geography
- government exams materials
- Education News
- Sakshi Education News