Geography Notes for Groups: ఖండ చలనం.. పలక విరూపణ
భూగోళం విశాలమైన ఖండభాగాలు, సముద్రాలతో నిండి ఉంది. మనం నివసిస్తున్న ఖండాలు, వాటిపై ఉన్న నగరాలు, గ్రామాల ఉనికి స్థిరమైనవని భావిస్తుంటాం. అయితే, ఖండాలు స్థిరంగా ఒకేచోట ఉండవనీ.. అవి చలిస్తున్నాయని... మెుట్టమెుదటగా జర్మనీకి చెందిన ఆల్‌ఫ్రెడ్ వెజనర్ తన ఖండ చలన సిద్ధాంతంలో పేర్కొన్నాడు. ఆ తర్వాత తెరపైకి వచ్చిన పలక విరూపణ సిద్ధాంతం... ఖండాలే కాదు, సముద్రాలు కూడా చలిస్తున్నాయని పేర్కొంటోంది!!
ప్రస్తుతం ఖండం ఉన్న ప్రాంతంలో.. ఒకప్పుడు సముద్రం ఉండేది. నేడు సముద్రాలున్న ప్రాంతాల్లో.. గతంలో ఖండాలుండేవి. మనం నివసిస్తున్న ద్వీపకల్ప భారతదేశం..దాదాపు 250మిలియన్ సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియా, అంటార్కిటికా, ఆఫ్రికాలతో కలిసి ఉండేది. ఖండచలన సిద్ధాంతం ప్రకారం.. 250 మిలియన్ సంవత్సరాల క్రితం ప్రపంచంలోని ఖండాలన్నీ కలిసి ఒకే మహాఖండం (పాంజియా)గా ఉండేది. పాంజియాను ఆవరించి మహాసముద్రం (పాం«థలేసా) ఉండేది. టెథీస్ సముద్రం పాంజియాను రెండు భాగాలుగా విభజిస్తుండేది. ఉత్తర అమెరికా, యురేషియా (ద్వీపకల్ప భారతం మినహా)లతో కూడిన ఉత్తర పాంజియాను.. ‘అంగారాలాండ్’ (లారెన్షియా)గా పిలుస్తారు. దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా, ద్వీపకల్ప భారతదేశాలతో కూడిన దక్షిణ పాంజియా భాగాన్ని... ‘గోండ్వానా’ అంటారు.
ప్రత్యేక ఖండాలుగా..
సుమారు 250 మిలియన్ సంవత్సరాల క్రితం పాంజియా చిన్న చిన్న ముక్కలుగా ఉండేది. అయితే, దీనికి కారణమైన బలాలను వెజనర్ సరిగా వివరించలేకపోయాడు. కొన్ని ఖండభాగాలు పశ్చిమంగా చలించగా.. కొన్ని ఖండభాగాలు భూమధ్యరేఖ వైపు కదిలిపోయాయి. ఉత్తర, దక్షిణ అమెరికాలు యురేషియా, ఆఫ్రికాల నుంచి వేరుపడి పశ్చిమంగా జరిగి.. ప్రత్యేక ఖండాలుగా ఏర్పడ్డాయి. ద్వీపకల్ప భారతదేశం ఆఫ్రికా నుంచి విడిపోయి, భూమధ్యరేఖ వైపుగా ప్రయాణించి.. చివరగా యురేషియా ఖండంతో కలిసిపోయింది. ఆస్ట్రేలియా, అంటార్కిటికా నుంచి వేరుపడి... ఈశాన్యంగా ప్రయాణించి, ప్రత్యేక ఖండంగా ఏర్పడింది. మడగాస్కర్ ఆఫ్రికా నుంచి వేరుపడి దీవిగా మారింది.
చదవండి: Geography for Groups Exams: భారత నైసర్గిక స్వరూపం... హిమాలయాలు ఎన్ని దేశాల్లో విస్తరించాయి?
ఒకేరకమైన జీవజాతులు
ఖండాలు చలించాయనడానికి ఆధారంగా.. ప్రపంచ పటంలో మళ్లీ ఖండాలను ఒక దగ్గరికి చేర్చితే.. అవి ఒకదానిలో ఒకటి అమరి, పాంజియా రూపొందుతుందని వెజనర్ నిరూపించాడు. ప్రపంచ పటంలోని ఈశాన్య బ్రెజిల్ ఉబ్బుప్రాంతం... ఆఫ్రికాలోని గినియా సింధుశాఖలోకి సరిగ్గా అమరుతుంది. అయితే,200మిలియన్ సంవత్సరాల క్రితం విడిపోయిన ఖండభాగాల తీర రేఖలు.. తీవ్రమైన క్రమక్షయానికి గురై ఉంటాయి. అవి వాటి స్వరూపాన్ని కూడా కోల్పోతాయి. వాటిని ఇప్పుడు మళ్లీ కలిపితే అమరకూడదు.అయితే,వెజనర్ తన సిద్ధాంతాన్ని రుజువు చేసేందుకు శిలాజాల వివరాలను సేకరించాడు. ఈ సమాచారం ఆధారంగా..గోండ్వానా ప్రాంతమంతా ఒకేరకమైన వృక్ష జీవజాతులు నివసించేవని నిరూపించాడు.తద్వారా ఈ ఖండభాగాలన్నీ ఒకప్పుడు కలిసి ఉండేవని అభిప్రాయపడ్డాడు. అయితే, ఒకేరకమైన శీతోష్ణస్థితి ఉన్న ప్రాంతాల్లో..ఒకేరకమైన జీవజాతులు వృద్ధి చెందే అవకాశముందని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. మృదువైన ఖండపటలం(సియాల్).. దళసరిగా ఉండే సముద్రపటలం(సీమా)లోకి చొచ్చుకొని పోవటానికి వీలులేదు. ఈ కారణాల వల్ల ఖండచలన సిద్ధాంతం అందరి ఆమోదాన్ని పొందలేదు.
విరూపణ సిద్ధాంతం
1950 నాటికల్లా ఆధునిక సముద్ర భూతల పరిశోధనల వల్ల లభ్యమైన సమాచారం ఆధారంగా సముద్ర భూతలం విస్తరిస్తోందని నిర్ధారితమైంది. ఇందులో ఖండాలు, సముద్ర భాగాల విస్తరణను వివరించటానికి పలక విరూపణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. ఈ సిద్ధాంతం ప్రకారం... భూపటలం చిన్న చిన్న ముక్కలుగా ఖండనకు గురై ఉంది. వీటిని ఆస్మావరణ పలకలుగా వ్యవçహరిస్తారు. ఖండాలు, సముద్రాలు ఉన్న ఈ ఆస్మావరణ పలకలు... స్నిగ్ధత కూడిన ఆస్థినో ఆవరణ పొరలో పడవల మాదిరిగా తేలుతున్నాయి.
ఆస్థినో ఆవరణంలో సంవాహన ప్రవాహాలు ఉన్నాయి. ఉష్ణోగ్రత వ్యత్యాసాల వల్ల ఇవి ఏర్పడతాయి. సంవాహన ప్రవాహాల వల్ల చోదితమై, ఆస్మావరణ పలకలు వివిధ దిశల్లో చలిస్తుంటాయి. అంటే... ఆస్మావరణ పలకల మీద ఉన్న ఖండాలు, సముద్రాలు చలిస్తున్నాయి. పలకలు చలిస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఇవి ఒకదానికొకటి అభిసరణం చెందుతాయి. మరికొన్ని సందర్భాల్లో ఇవి అపసరణం చెందుతాయి.. లేదా సమాంతరంగా ప్రయాణిస్తుంటాయి.
చదవండి: Geography Notes for Group 1, 2 Exams: అరణ్యాలు... దేశంలో అత్యధిక వర్షపాతాన్ని పొందే తీరం ఏది?
సముద్ర పలకతో అభిసరణం
పలకల చలనంతో అభిసరణ, అపసరణ, సమాంతర సరిహద్దులు ఏర్పడతాయి. ఈ సరిహద్దుల వల్ల పర్వతోద్భవనం, ద్వీపవక్రతల సృష్టి, అగ్నిపర్వత ప్రక్రియ, భూకంపాలు సంభవిస్తున్నాయి. అంటే... నైసర్గిక స్వరూపాల ఆవిర్భావం, అగ్నిపర్వత, భూకంప ప్రక్రియలను అర్థం చేసుకోవటానికి పలకల సరిహద్దులను గుర్తించాలి. యురేషియా ఖండపలక ద్వీపకల్ప భారత ఖండ పలకతో అభిసరణం చెందటం వల్ల... సరిహద్దు ప్రాంతంలో పర్వతోద్భవనం జరిగి, హిమాలయ పర్వత శ్రేణులు ఆవిర్భవించాయి. ఉత్తర–దక్షిణ అమెరికా ఖండ పలకలు.. పసిఫిక్ సముద్ర పలకతో అభిసరణం చెందటం వల్ల.. రాకీ పర్వతాలు, ఆండీస్ పర్వతాలు ఏర్పడ్డాయి.
మిడ్ ఓషియానిక్ రిడ్జ్
పసిఫిక్ సముద్ర పలక.. చిన్న చిన్న కరోలిన్, బిస్మార్క్, ఫిలిప్పైన్ సముద్ర పలకలతో అభిసరణం చెందటం వల్ల పసిఫిక్ మహాసముద్రంలో అగ్నిపర్వత ద్వీపవక్రతలు ఏర్పడ్డాయి. జువాన్‌డిప్యుకా పలక, ఉత్తర అమెరికా పలక సమాంతరంగా చలించటం వల్ల.. యూఎస్‌ఏ పసిఫిక్ తీరంలోని కాలిఫోర్నియా ప్రాంతంలో.. సాన్ ఆండ్రియాన్ భ్రంశం ఏర్పడింది. అట్లాంటిక్ మహాసముద్ర భూతలం పైన మధ్యభాగంలో.. పలకలు అపసరణం చెంది సముద్ర పటలం విచ్ఛిన్నం కావడంతో లావా పెల్లుబికి, మిడ్ ఓషియానిక్ (అట్లాంటిక్) రిడ్జ్ ఏర్పడింది. పసిఫిక్ పరివేష్టిత అగ్నిపర్వత వలయం, తరచు భూకంపాలు సంభవించే ప్రాంతాలన్నీ అభిసరణ లేదా అపసరణ సరిహద్దుల వద్దే కేంద్రీకృతమై ఉన్నాయని గమనించాలి.
ఉదాహరణకు జపాన్, కుర్లీ, కొరియా, సఖాలిన్, ఫిలిప్పీన్స్, ఇండోనేసియా, న్యూజిలాండ్, ఆండీస్ పర్వతాలు, మధ్య అమెరికా మెుదలైనవి. యురేషియా ఖండంలో తరచు తీవ్ర భూకంపాలు సంభవించే టర్కీ, ఇరాన్, అఫ్గానిస్థాన్, భారతదేశంలోని జమ్మూకశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్ తదితర ప్రాంతాలన్నీ పలక సరిహద్దు వద్ద ఉండటం గమనార్హం. సాన్ ఆండ్రియిస్ భ్రంశం ఏర్పడిన సమాంతర సరిహద్దు (కాలిఫోర్నియా) వద్ద కూడా తరచు తీవ్ర భూకంపాలు సంభవిస్తున్నాయి!!
గురజాల శ్రీనివాసరావు, సబ్జెక్ట్ నిపుణులు
చదవండి: Geography: Major Port Towns... తూర్పు తీరంలోని ఏకైక సహజ రేవు పట్టణం?