Skip to main content

Geography: Major Port Towns... తూర్పు తీరంలోని ఏకైక సహజ రేవు పట్టణం?

Major Port Towns: Indian Geography Notes for competitive exams Group 1, 2
Major Port Towns: Indian Geography Notes for competitive exams Group 1, 2

భారత్‌లో 7517 కిలోమీటర్ల తీరరేఖ వెంబడి 12 ప్రధాన రేవు పట్టణాలు... సుమారు 200 చిన్న, మధ్యతరహా రేవు పట్టణాలు ఉన్నాయి. ప్రధాన రేవు పట్టణాలను కేంద్ర ప్రభుత్వం నేరుగా పోర్టు ట్రస్టుల ద్వారా నిర్వహిస్తోంది. చిన్న, మధ్య తరహా పోర్టుల నిర్వహణ బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకుంటున్నాయి.

ప్రధాన రేవు పట్టణాలు

అంతర్జాతీయ వాణిజ్యంలో రేవు పట్టణాలపాత్ర కీలకం. ఇవి తీరప్రాంత వాణిజ్యంలోనూ ప్రధానపాత్ర పోషిస్తున్నాయి. నౌకాశ్రయంతో సంబంధం ఉన్న ప్రాంతం(హింటర్‌లాండ్‌) ఆర్థికాభివృద్ధికి తోడ్పడతాయి. మన దేశంలో సుమారు 75 శాతం సరకు రవాణా కేవలం 12 ప్రధాన రేవు పట్టణాల నుంచే జరుగుతోంది.
ప్రధాన రేవు పట్టణాలు
1) కోల్‌కతా–హాల్దియా    
2) ముంబై
3) జేఎన్‌పీటీ    
4) చెన్నై
5) ఎన్నూరు        
6) పారాదీప్‌
7) విశాఖపట్నం    
8) కాండ్లా
9) ట్యూటికోరిన్‌    
10) కొచ్చిన్‌
11) మార్ముగావ్‌    
12) న్యూ మంగళూరు

కోల్‌కతా–హాల్దియా

హుగ్లీ నది ముఖద్వారం నుంచి 148 కి.మీ. దూరంలో కోల్‌కతా నదీ రేవు పట్టణం ఉంది. దీని పృష్టభూమి తూర్పు, ఈశాన్య భారతదేశమంతా విస్తరించి ఉంది. విశాఖపట్నం, పారాదీప్‌ రేవు పట్టణాలు అభివృద్ధి చెందాక కోల్‌కతా రేవు పట్టణ ప్రాధాన్యం తగ్గింది. పూడిక వల్ల కూడా దీని సామర్థ్యం పడిపోయింది. 1978లో ఈ రేవు పట్టణానికి 90 కి.మీ. దిగువన ఉన్న హాల్దియా రేవు పట్టణాన్ని అభివృద్ధి చేశారు. తేయాకు, అబ్రకం, తోళ్లు ముఖ్య ఎగుమతులు.

Geography Notes for Group 1, 2: రాణిగంజ్‌.. దేశంలోని అతిపెద్ద బొగ్గు క్షేత్రం

ముంబై

ఇది పశ్చిమ తీరంలోని అతిపెద్ద రేవు పట్టణం. స్వాతంత్య్రానికి పూర్వమే ఈ ఓడ రేవు అభివృద్ధి చెందింది. సూయజ్‌ కాలువ ప్రారంభం దీని అభివృద్ధికి దోహదం చేసింది. ఈ రేవు పట్టణాన్ని భారతదేశ ముఖద్వారంగా వ్యవహరించేవారు. ఇది కూడా సహజసిద్ధ రేవు పట్టణం. దీని హింటర్‌లాండ్‌ మహారాష్ట్ర, గుజరాత్, తూర్పు రాజస్థాన్, కర్ణాటకల్లో విస్తరించి ఉంది. పత్తి, యంత్ర పరికరాలు ప్రధాన ఎగుమతులు. ఎరువులు, పెట్రోలియం ఉత్పత్తులు, కాగితం ప్రధాన దిగుమతులు.

జవహర్‌లాల్‌ నెహ్రూ పోర్ట్‌ ట్రస్ట్‌

ముంబై రేవుపై రద్దీని తగ్గించడానికి 1989లో ముంబై పోర్ట్‌కు 15 కి.మీ. దక్షిణాన నావసేవా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో జవహర్‌లాల్‌ నెహ్రూ పోర్ట్‌ ట్రస్ట్‌(జేఎన్‌పీటీ)ను అభివృద్ధి చేశారు.


Geography Notes for Groups: మృత్తికలు.. సాగుకు మూలాధారం!

చెన్నై రేవు పట్టణం

చెన్నై పోర్ట్‌ ట్రస్ట్‌ హింటర్‌లాండ్‌ దక్షిణ భారతదేశమంతటా విస్తరించింది. ఈ రేవు పట్టణం నుంచి ప్రధానంగా పెట్రోలియం ఉత్పత్తులు, బొగ్గు, నూనె ఉత్పత్తులు, యంత్ర పరికరాలు దిగుమతి అవుతున్నాయి. అబ్రకం, పొగాకు, తోళ్లు, పసుపు ప్రధాన ఎగుమతులు.

ఎన్నూర్‌ రేవు

చెన్నై రేవు పట్టణంపై ఒత్తిడిని తగ్గించడానికి సమీపంలో ఎన్నూర్‌ రేవు పట్టణాన్ని ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేశారు. 

పారాదీప్‌

ఒడిశా తీరంలో కటక్‌కు సమీపంలోని పారాదీప్‌ దేశంలోకెల్లా లోతైన రేవు పట్టణం. ప్రధానంగా ఇది ఎగుమతి రేవు పట్టణం. ముఖ్యంగా ఒడిశాలో ఉత్పత్తి అవుతోన్న ఇనుప ఖనిజం ఇక్కడి నుంచి ఎగుమతి అవుతుంది.

Geography Notes for Group 1, 2 Exams: అరణ్యాలు... దేశంలో అత్యధిక వర్షపాతాన్ని పొందే తీరం ఏది?

విశాఖపట్నం

తూర్పు తీరంలోని ఏకైక సహజసిద్ధ రేవు పట్టణం విశాఖపట్నం. యారాడ కొండచరియ బంగాళాఖాతంలోకి చొచ్చుకొని పోవడం వల్ల ఈ సహజసిద్ధ రేవు పట్టణం ఏర్పడింది. ఈ రేవు పట్టణం హింటర్‌లాండ్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ , మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లోకి విస్తరించింది. బైలడిల్లా గనుల్లో ఉత్పత్తయిన ఇనుప ఖనిజం ఇక్కడి నుంచే జపాన్‌కు ఎగుమతి అవుతోంది.

కాండ్లా

 ఇది గుజరాత్‌లోని కచ్‌ సింధుశాఖ తీరంలో భుజ్‌కు 48 కి.మీ. దూరంలో ఉన్న సహజసిద్ధ రేవు పట్టణం. స్వాతంత్య్రం వచ్చాక దీన్ని అభివృద్ధి చేశారు. దేశ విభజనలో కరాచీ రేవు పట్టణం పాకిస్తాన్‌కు వెళ్లడంతో.. భారత ప్రభుత్వం కాండ్లా రేవు పట్టణాన్ని అభివృద్ధి చేసింది. ఈ నౌకాశ్రయ హింటర్‌లాండ్‌ పశ్చిమ, వాయవ్య భారతదేశంలోకి విస్తరించింది. ఇది ప్రధానంగా దిగుమతి రేవు పట్టణం. పెట్రోలియం ఉత్పత్తులు, ఎరువులు, గంధకం, ఫాస్పేట్‌ ప్రధాన దిగుమతులు. పత్తి, తేయాకు, ఆహారధాన్యాలు ముఖ్య ఎగుమతులు.

ట్యూటికోరిన్‌

తమిళనాడు తీరంలోని ట్యూటికోరిన్‌ కృత్రిమ లోతైన రేవు పట్టణం. జాతీయ రహదారులు, బ్రాడ్‌గేజ్‌ రైలు మార్గాల ద్వారా ఈ రేవు పట్టణం అంతర్భాగాలతో పటిష్టంగా అనుసంధానించారు. ట్యూటికోరిన్‌లో ఆధునిక కంటైనర్, కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ టెర్మినళ్లను నిర్మించారు.

కొచ్చిన్‌

కేరళ తీరంలో వెంబనాడ్‌ సరస్సు ముఖద్వారం వద్ద కొచ్చిన్‌ రేవు పట్టణం ఉంది. సూయజ్‌ కాలువ–కొలంబో అంతర్జాతీయ సముద్ర వాణిజ్య మార్గానికి సమీపంలో ఉండటం వల్ల కొచ్చిన్‌ రేవు పట్టణం బాగా అభివృద్ధి చెందింది. కొబ్బరిపీచు, కొబ్బరి కాయలు,తేయాకు, కాఫీ,జీడిపప్పు,చేపలు ప్రధాన ఎగుమతులు. పెట్రోలియం,నూనె ఉత్పత్తు లు,ఎరువులు,రసాయనాలు ప్రధాన దిగుమతులు.

Geography Notes for Group 1, 2 Exams: శీతోష్ణస్థితి... ఎడారీకరణ సమస్యను ఎదుర్కొంటున్న ప్రాంతాలు?

మార్ముగావ్‌

గోవా తీరంలో జువారీ నది ముఖద్వారం వద్ద మార్ముగావ్‌ రేవు పట్టణం ఉంది. ఇది కూడా సహజసిద్ధ రేవు పట్టణమే. ఇక్కడ నుంచి ప్రధానంగా ముడి ఇనుము ఎగుమతి అవుతోంది. మాంగనీసు, ఉప్పు, జీడిపప్పు ఇతర ఎగుమతులు. పెట్రోలియం ఉత్పత్తులు ప్రధాన దిగుమతులు. కొంకణ్‌ రైలు మార్గ నిర్మాణంతో ఈ రేవు పట్టణం ప్రాధాన్యత బాగా పెరిగింది.

న్యూమంగళూరు

మంగళూరు రేవుకు ఉత్తరంగా 10 కి.మీ. దూరంలో న్యూమంగళూరు రేవు పట్టణాన్ని అభివృద్ధి చేశారు. ఇది గురుపూర్‌ నదీ ముఖద్వారానికి సమీపంలో ఉంది.
గురజాల శ్రీనివాసరావు, సబ్జెక్ట్‌ నిపుణులు

​​​​​​​
Geography for Groups Exams: భారత నైసర్గిక స్వరూపం... హిమాలయాలు ఎన్ని దేశాల్లో విస్తరించాయి?

Published date : 12 May 2022 05:31PM

Photo Stories