Skip to main content

Civil Service Exam Preparation Tips: ప్రిలిమ్స్‌పై.. పట్టు సాధించేలా!

సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌ ద్వారా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ సహా మొత్తం 21 సర్వీసులకు యూపీఎస్సీ అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. మూడంచెల ఈ ఎంపిక ప్రక్రియలో తొలిదశ పరీక్ష ప్రిలిమ్స్‌ను మే 28వ తేదీన నిర్వహించనుంది. అత్యున్నత స్థాయి సర్వీసులైన సివిల్‌ సర్వీసులకు.. ఫ్రెషర్స్‌ నుంచి రిపీటర్స్‌ వరకు లక్షల మంది పోటీ పడుతుంటారు. ఇందుకోసం ఏళ్ల తరబడి కృషి చేస్తుంటారు. పోటీ తీవ్రంగా ఉంటుంది. కాబట్టి పరీక్ష సమీపిస్తున్న నేపథ్యంలో.. సివిల్స్‌ ప్రిలిమ్స్‌లో రాణించేందుకు నిపుణులు మెలకువలు...
Civil Service Exam Preparation Tips in telugu
  • మే 28న సివిల్స్‌ ప్రిలిమినరీ
  • రెండు పేపర్లుతో 400 మార్కులకు పరీక్ష 
  • దాదాపు ఆరు లక్షల మంది పోటీ పడే అవకాశం
  • 1:12 లేదా 1:13 నిష్పత్తిలో మెయిన్‌కు ఎంపిక
  • 21 సర్వీసుల్లో 1105 పోస్ట్‌లకు ఎంపిక ప్రక్రియ

సివిల్‌ సర్వీసెస్‌-2023 ద్వారా 21 సర్వీసుల్లో మొత్తం 1105 పోస్ట్‌లకు అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. తొలి దశ ప్రిలిమ్స్‌కు దేశవ్యాప్తంగా దాదాపు ఆరు లక్షల మంది పోటీ పడే అవకాశముంది. ప్రిలిమ్స్‌లో రాణిస్తేనే తదుపరి దశ మెయిన్స్‌కు అర్హత లభిస్తుంది. ఒక్కో పోస్ట్‌కు 1:12.5 నిష్పత్తిలో మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. అంటే.. తొలి దశకు ఆరు లక్షల మంది హాజరైతే.. రెండో దశకు అర్హత పొందేది 14వేల మంది మాత్రమే!ఈ జాబితాలో నిలవాలంటే.. ఎంతో అప్రమత్తంగా ప్రిపరేషన్‌ సాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. 

మిగిలింది 40 రోజులే

సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష తేదీ మే 28ని పరిగణనలోకి తీసుకుంటే.. అభ్యర్థులకు అందుబాటులో ఉన్న సమయం 40 రోజులు. ఎంతో విలువైన ఈ సమయాన్ని  అభ్యర్థులు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. విశ్లేషణాత్మక అధ్యయనం, పునశ్చరణ, సమయ పాలన, ప్రాక్టీస్‌ వంటి వాటితో నిరంతరం తమ ప్రిపరేషన్‌కు పదును పెట్టుకోవాలి.

చ‌ద‌వండి: Civils Prelims Study Material

సమయ పాలనతో.. సక్సెస్‌

ప్రిలిమ్స్‌ అభ్యర్థులు ప్రస్తుతం పేపర్‌-1 జనరల్‌ స్టడీస్‌ సిలబస్‌లోని అన్ని అంశాలను నిత్యం చదివేలా టైమ్‌ ప్లాన్‌ రూపొందించుకోవాలి. ప్రతి రోజు కనీసం ఎనిమిది నుంచి పది గంటలు ప్రిపరేషన్‌కు కేటాయించాలి. దీంతోపాటు ప్రతి వారం ప్రిపరేషన్‌  పూర్తి చేసుకున్న తర్వాత సెల్ఫ్‌ టెస్ట్‌లు, మాక్‌ టెస్ట్‌లు రాయడం కూడా ఉపకరిస్తుంది.

సమకాలీనంపై దృష్టి

ప్రస్తుత సమయంలో అభ్యర్థులు సమకాలీన అంశాలపై అవగాహనకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలి. అదేవిధంగా సిలబస్‌లో పేర్కొన్న కోర్‌ టాపిక్స్‌ను కరెంట్‌ అఫైర్స్‌తో సమ్మిళితం చేసుకుంటూ చదవాలి. ప్రిలిమ్స్‌లో ప్రశ్నలు కరెంట్‌ అఫైర్స్‌ సమ్మిళితంగా ఉంటున్నాయి. కాబట్టి ఈ ఏడాది మే ముందు నుంచి ఏడాది, ఏడాదిన్నర కాలంలోని ముఖ్యమైన కరెంట్‌ ఈవెంట్స్‌పై దృష్టి పెట్టాలి. వాటిని సంబంధిత సబ్జెక్ట్‌ అంశాలతో అనుసంధానం చేసుకుంటూ చదవాలి. నేపథ్యం,ప్రభావం, ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తు అంచనా వంటి కోణాల్లో విశ్లేషించుకోవాలి.

చ‌ద‌వండి: Competitive Exams Preparation Tips: కోచింగ్‌ లేకుండానే... సివిల్స్, గ్రూప్స్‌!

అనుసంధానం చేసుకుంటూ

అభ్యర్థులు ఎకానమీ-పాలిటీ, ఎకానమీ-జాగ్రఫీ, జాగ్రఫీ-ఎకాలజీ; జాగ్రఫీ-సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగాలను అనుసంధానం చేసుకుంటూ ప్రిపరేషన్‌ సాగించాలి. ఫలితంగా ప్రిపరేషన్‌ పరంగా కొంత సమయం కలిసొస్తుంది. ఈ సమయాన్ని తమకు క్లిష్టంగా భావించే ఇతర అంశాలపై దృష్టి పెట్టేందుకు వినియోగించొచ్చు.

చ‌ద‌వండి: Civils Prelims Guidance

ముఖ్యాంశాల పునశ్చరణ

సబ్జెక్ట్‌ వారీగా ముఖ్యాంశాలను గుర్తించి.. వాటి­పై ప్రత్యేక దృష్టి సారించాలి.ఇప్పటికే సిద్ధం చేసుకు న్న సొంతనోట్స్‌ ద్వారా పునశ్చరణకు ప్రాధాన్యం ఇవ్వాలి. గత నాలుగైదేళ్ల ప్రశ్న పత్రాలను పరిశీలించాలి. వాటిల్లో ఆయా సబ్జెక్ట్‌ల నుంచి ఎలాంటి ప్ర­శ్నలు అడుగుతున్నారు..ఏ అంశాలకు అధిక ప్రాధా న్యం లభిస్తుందో గుర్తించాలి. వాటికి ప్రిపరేషన్‌లో ప్రాధాన్యం ఇవ్వాలి. అంతర్జాతీయ పరిణామాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ప్రతి సబ్జెక్ట్‌ను కనీసం రెండుసార్లు పునశ్చరణ చేసేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. వాస్తవానికి ప్రిలిమ్స్‌ అభ్యర్థులు ఇప్పటికే తమ ప్రిపరేషన్‌ను పూర్తి చేసుకుని ఉంటారు. కాబట్టి ఇక నుంచి పూర్తిగా రివిజన్‌పై దృష్టిపెట్టాలి.

కొత్త అంశాలకు ఇలా

ప్రిపరేషన్‌ సమయంలో అభ్యర్థులు క్లిష్టంగా భావించిన అంశాలను తర్వాత చదవచ్చనే ధోరణితో విస్మరిస్తారు. ఇలా వదిలేసిన టాపిక్స్‌కు సంబంధించి ఇప్పుడు కొత్తగా ప్రిపరేషన్‌ ప్రారంభించడం సరికాదని సబ్జెక్ట్‌ నిపుణుల అభిప్రాయం. ప్రస్తుత సమయంలో ఇప్పటికే పట్టు సాధించిన అంశాలపై మరింత లోతైన అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో కొత్త అంశాలను చదవాల్సి వస్తే.. వాటికి సంబంధించి సినాప్సిస్, కాన్సెప్ట్‌లపై దృష్టిపెట్టాలని పేర్కొంటున్నారు.

చ‌ద‌వండి: Civils Prelims Exam: వీటిపై దృష్టిపెడితే... విజ‌యం మీదే..

గత ప్రశ్న పత్రాల సాధన

ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో ప్రిలిమ్స్‌ అభ్యర్థులకు ఉపకరించే మరో సాధనం.. గత ప్రశ్న పత్రాలను ప్రాక్టీస్‌ చేయడం. ఇప్పటి నుంచి పరీక్ష ముందు రోజు వరకు ప్రతి రోజు ఒక ప్రీవియస్‌ పేపర్‌ ప్రాక్టీస్‌ చేసేలా సమయం కేటాయించుకోవాలి. దీని ద్వారా తమ బలాలు, బలహీనతలపై అవగాహన ఏర్పడుతుంది.

చ‌ద‌వండి: Civils Preliminary Examination Preparation: ముప్ఫై రోజుల్లో.. మెరిసేలా!

పేపర్‌-2ను విస్మరించొద్దు

ప్రిలిమ్స్‌లో పేపర్‌-2ను అర్హత పేపర్‌గానే పేర్కొన్నప్పటికీ.. ఇందులో 33 శాతం మార్కులు సాధిస్తేనే పేపర్‌-1 మూల్యాంకన చేస్తారు. దాని ఆధారంగానే మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. కాబట్టి పేపర్‌-2లో అర్హత మార్కులు సాధించేందుకు ప్ర ధానంగా మ్యాథమెటిక్స్,లాజికల్‌ రీజనింగ్‌ స్కిల్స్, ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌ అంశాలను ప్రాక్టీస్‌ చేయాలి.

ఇలా గుర్తుంచుకోవచ్చు

విస్తృతంగా ఉండే సిలబస్‌ అంశాలను గుర్తు పెట్టుకోవడం ఎంతో కష్టమైన పని. కాని వ్యక్తిగత మెమొరీ టిప్స్‌ ద్వారా ఈ సమస్యను అధిగమించే అవకాశం ఉంది. పాయింటర్స్, ఫ్లో చార్ట్స్, విజువలైజేషన్‌ టెక్నిక్స్‌ వంటి వాటిని అనుసరించాలి. ముఖ్యమైన సంవత్సరాలు, గణాంకాలను గుర్తుంచుకునే క్రమంలో వ్యక్తిగతంగా అన్వయించుకోవడం కూడా మరో ముఖ్యమైన మెమొరీ టిప్‌గా నిలుస్తోంది. ఇలా.. టైమ్‌ ప్లాన్‌ నుంచి రివిజన్‌ వరకు నిర్దిష్ట వ్యూహంతో అడుగులు వేస్తే ప్రిలిమ్స్‌లో విజయావకాశాలు మెరుగుపరచుకోవచ్చు.

ప్రిలిమ్స్‌.. ముఖ్య టాపిక్స్‌ 
కరెంట్‌ అఫైర్స్‌

  • బడ్జెట్, ఆర్థిక సర్వే, అంతర్జాతీయ ఒప్పందాలు.
  • జాతీయ ప్రాధాన్యం సంతరించుకున్న అంశాలు. 
  • ఇటీవల కాలంలో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన విధానాలు.
  • గత ఏడాది కాలంలో అమల్లోకి వచ్చిన సంక్షేమ పథకాలు.
  • ప్రభుత్వం చేపట్టిన ముఖ్యమైన ప్రాజెక్ట్‌లు వాటి ఉద్దేశం.

చ‌ద‌వండి: Groups Preparation Tips: 'కరెంట్‌ అఫైర్స్‌'పై పట్టు.. సక్సెస్‌కు తొలి మెట్టు!

చరిత్ర

  • ఆధునిక చరిత్ర; జాతీయోద్యమం. 
  • ప్రాచీన, మధ్యయుగ చరిత్రకు సంబంధించి సాహిత్యం, కళలు, మత ఉద్యమాలు, రాజకీయ-సామాజిక-ఆర్థిక చరిత్ర అంశాలు. 
  • ఆధునిక చరిత్రలో బ్రిటిష్‌ సామ్రాజ్య స్థాపన-పరిపాలన విధానాలు; బ్రిటిష్‌ వ్యతిరేక తిరుగుబాట్లు-ఉద్యమాలు(ప్రధానంగా స్వాతంత్య్ర పోరాటం), సంస్కరణోద్యమాలు.

చ‌ద‌వండి: Indian History Study Material

రాజ్యాంగం

  • రాజ్యాంగం: రాజ్యాంగ పరిషత్, రాజ్యాంగ సవరణ ప్రక్రియ,పీఠిక,తాజా రాజ్యాంగ సవరణలు-వాటికి సంబంధించిన రాజ్యాంగ ప్రకరణలు.
  • రాజకీయ వ్యవస్థ: పార్లమెంటరీ వ్యవస్థ, అర్థ సమాఖ్య, రాష్ట్రపతి, గవర్నర్, పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలు, సుప్రీంకోర్టు, హైకోర్టు, ఎన్నికల కమిషన్, ఆర్థిక కమిషన్, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు, అటార్నీ జనరల్, అడ్వకేట్‌ జనరల్, వాటికి సంబంధించి రాజ్యాంగ ప్రకరణలు.
  • పంచాయతీరాజ్‌ వ్యవస్థ: బల్వంత్‌రాయ్, అశోక్‌మెహతా, హన్మంతరావ్, జి.వి.కె. రావ్, సింఘ్వీ కమిటీల సిఫార్సులు. 73వ రాజ్యాంగ సవరణ చట్టం.
  • ప్రభుత్వ విధానం: విధాన రూపకల్పన జరిగే తీరు. విధానాల అమలు, వాటి సమీక్ష. -ఇటీవల ప్రభుత్వం తీసుకున్న ముఖ్య విధానపర నిర్ణయాలు.
  • కేంద్ర-రాష్ట్ర సంబంధాలు: గత కొద్ది రోజులుగా చర్చనీయాంశంగా మారిన న్యాయ వ్యవస్థ క్రియాశీలత.

చ‌ద‌వండి: Indian Polity

ఎకానమీ

  • ఆర్థికాభివృద్ధిలో సహజ వనరులు-మూలధన వనరుల పాత్ర.
  • ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాల ప్రగతి(వ్యవసా­య రంగం, పారిశ్రామిక రంగం, సేవారంగం). పారిశ్రామిక తీర్మానాలు-వ్యవసాయ విధానం.
  • బ్యాంకింగ్‌ రంగం ప్రగతి-సంస్కరణలు-ఇటీవల కాలంలో బ్యాంకింగ్‌ రంగంలో స్కామ్‌లు, ఆర్థిక వ్యవస్థపై వాటి ప్రభావం.
  • తాజా మానవాభివృద్ధి, ప్రపంచ అభివృద్ధి నివేదికలు.

చ‌ద‌వండి: Indian Polity

సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ

  • గత ఏడాది కాలంలో ఇస్రో ప్రయోగించిన ఉపగ్రహాలు.
  • ఇటీవల కాలంలో సంభవిస్తున్న వ్యాధులు-కారకాలు.
  • సైబర్‌ సెక్యూరిటీ యాక్ట్‌.
  • రక్షణ రంగంలో కొత్త మిస్సైల్స్‌ ప్రయోగాలు.
  • జాతీయ ముఖ్యమైన వన్యమృగ సంరక్షణ కేంద్రాలు.
  • పర్యావరణ పరిరక్షణ ఒప్పందాలు, చర్యలు. 
  • వివిధ ఐటీ పాలసీలు.

జాగ్రఫీ

  • భౌగోళిక వనరులు, సహజ సంపద.
  • పర్యావరణ సమస్యలు-ఎక్కువగా కేంద్రీకృతమైన ప్రాంతాలు, దేశాలు. 
  • సౌర వ్యవస్థ, భూమి అంతర్‌ నిర్మాణం, శిలలు, జియలాజికల్‌ టైం స్కేల్, రుతుపవనాలు, ప్రపంచ పవనాలు, చక్రవాతాలు, ఉష్ణోగ్రత విలోమం, భూకంపాలు, సునామీలు. 
  • మన దేశ పరిస్థితుల నేపథ్యంలో నగరీకరణ; ఆదివాసులు;రుతుపవనాలు; మాన్‌సూన్‌ మెకానిజం; నదులు; జలాల పంపిణీ; వివాదాలు.

చ‌ద‌వండి: Indian Geography

Published date : 20 Apr 2023 05:28PM

Photo Stories