Civils Prelims Exam: వీటిపై దృష్టిపెడితే... విజయం మీదే..
- అక్టోబర్ 10వ తేదీన సివిల్స్ ప్రిలిమ్స్
- అడ్మిట్ కార్డులు జారీ చేసిన యూపీఎస్సీ
- ఇప్పుడు కొత్త టాపిక్స్ జోలికి వెళ్లొద్దు
- రోజూ మాక్ టెస్టుల ప్రాక్టీస్ తప్పనిసరి అంటున్న నిపుణులు
సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్.. దేశంలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ వంటి 19 ఉన్నత స్థాయి కేంద్ర సర్వీసుల్లో అభ్యర్థుల ఎంపికకు జాతీయ స్థాయిలో నిర్వహించే మూడంచెల ప్రక్రియ! తొలి దశ ప్రిలిమ్స్ పరీక్షకు ఏటా లక్షల మంది ప్రతిభావంతులు పోటీపడుతుంటారు. ఈ ఏడాది మొత్తం 712 పోస్టుల భర్తీకి ప్రిలిమినరీ పరీక్ష అక్టోబర్ 10వ తేదీన నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు యూపీఎస్సీ ఇప్పటికే అడ్మిట్ కార్డులు(హాల్ టికెట్లు) జారీ చేసింది. యూపీఎస్సీ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రిలిమ్స్ రాసే అభ్యర్థులు ప్రస్తుత సమయంలో రివిజన్, మాక్ టెస్టులపై ఎక్కువగా దృష్టిపెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. పరీక్ష తేదీ సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో.. సివిల్స్ ప్రిలిమ్స్‌లో విజయానికి నిపుణుల సలహాలు...
సివిల్స్ ఎంపిక ప్రక్రియలో ప్రిలిమ్స్ అర్హత పరీక్ష మాత్రమే. అయితే ఇది ఎంతో కీలకమైంది. పరీక్ష రాసేవారిలో 2 నుంచి 3 శాతం మంది మాత్రమే మెయిన్‌కు ఎంపికవుతారు. పరీక్షకు మరో 20 రోజుల వ్యవధి మాత్రమే ఉన్నందున ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యే వారు రివర్స్ కౌంట్‌డౌన్(మిగిలి ఉన్న సమయాన్ని సమర్థంగా ఉపయోగిం చుకునేలా..) విధానం అనుసరించాలని నిపుణులు చెబుతున్నారు. ఏటా సివిల్స్ రాస్తున్నవారిలో ఎక్కువమంది అప్పుడే డిగ్రీ పూర్తిచేసిన వారు, మొదటిసారి పరీక్షకు హాజరవుతున్నవారే ఉంటున్నారు. అ«ధిక శాతం మంది సరైన ప్రణాళిక లేకపోవడంతో మొదటి ప్రయత్నంలో విఫలమవుతున్నారు. కాని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ప్రిలిమ్స్‌లో విజయం సాధించొచ్చుని నిపుణులు చెబుతున్నారు.
పేపర్1 అత్యంత కీలకం
- సివిల్స్ పరీక్ష ఆబ్జెక్టివ్ తరహాలో జరుగుతుంది. ఇందులో రెండు పేపర్లు ఒక్కో పేపరు 200 మార్కులకు చొప్పున మొత్తం 400 మార్కులకు ప్రిలిమ్స్ నిర్వహిస్తారు. ప్రతి పేపరుకు పరీక్ష సమయం రెండు గంటలు.
- పేపర్ 2 అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో కనీసం 33శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది. పేపర్ 2లో.. కాంప్రెహెన్షన్; ఇంటర్‌పర్సనల్ స్కిల్స్–కమ్యూనికేషన్ స్కిల్స్; లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ; డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లం సాల్వింగ్; జనరల్ మెంటల్ ఎబిలిటీ; బేసిక్ న్యూమరసీ నుంచి ప్రశ్నలు అడుగుతారు.
- ప్రిలిమ్స్ నుంచి మెయిన్‌కు అర్హత సాధించే క్రమంలో.. పేపర్ 1 అత్యంత కీలకం. ఇందులో జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు; భారత చరిత్ర, జాతీయ ఉద్యమం; భారత–ప్రపంచ జాగ్రఫీ; ఇండియన్ పాలిటీ–గవర్నెన్స్; ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్‌మెంట్; ఎన్విరాన్‌మెంట్; జనరల్ సైన్స్ తదితర అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
కొత్త టాపిక్స్ చదవొద్దు
వాస్తవానికి సివిల్స్ ప్రిలిమ్స్ సిలబస్ చాలా విస్తృతం. ఏ మూల నుంచి ఎలాంటి ప్రశ్న వస్తుందో అంచనా వేయలేం. కాబట్టి అభ్యర్థులు ఇప్పటికే సుదీర్ఘంగా సాగించిన ప్రిపరేషన్‌లో భాగంగా చాలా వరకూ సిలబస్‌ను అధ్యయనం చేసి ఉంటారు. అయినా ‘ఏదైనా వదిలేశామా..!’ అన్న సంశయంతో పరీక్ష రోజు వరకు కొత్త టాపిక్స్ చదువుతూనే ఉంటారు. కాని ప్రస్తుత సమయంలో కొత్త టాపిక్స్ చదవడం సరికాదని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు హడావుడిగా చదివింది గుర్తుండటం కష్టమంటున్నారు. కాబట్టి కొత్తవాటిని కవర్ చేయడానికి బదులుగా.. ఇప్పటికే చదివిన వాటిని రివిజన్ చేసుకోవడం మేలు.
మాక్ టెస్ట్‌లకు ప్రాధాన్యం
ప్రిపరేషన్‌లో భాగంగా అభ్యర్థులు సొంతంగా నోట్స్ రాసుకుని ఉంటారు. ఒకవైపు ఆ నోట్స్‌ను చదువుతూ.. మరోవైపు ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ విధానంలో ప్రిలిమ్స్ మాక్ టెస్టులు రాయడం మంచిది. ప్రతిరోజు ఒక మాక్ టెస్ట్ రాసి.. ఎక్కడ తప్పు సమాధానం ఇచ్చారో గమనించాలి. ఆయా టాపిక్‌పై రాసుకున్న షార్ట్ నోట్స్‌ను మరింత లోతుగా అధ్యయనం చేయాలి. దీనివల్ల మొదటిసారి పరీక్ష రాస్తున్నవారికి అసలైన పరీక్షను ఎలా ఎదుర్కోవాలో అవగాహన వస్తుంది. దాంతోపాటు ఎక్కడ బలహీనంగా ఉన్నారో కూడా తెలుస్తుంది.
సీశాట్‌పై దృష్టి
ప్రిలిమ్స్‌లో పేపర్ 2(సీశాట్) అర్హత పరీక్షే అయినప్పటికీ.. ఇందులో కనీసం 33 శాతం మార్కులు సాధించాలి. కాబట్టి ఈ పేపర్‌ను తక్కువగా అంచనా వేయొద్దు. సీశాట్ ప్రాక్టీస్ కోసం ప్రతిరోజూ రెండు గంటలు కేటాయించాలి. ఇందులోని మ్యాథ్స్, రీజనింగ్ విభాగాల్లో ముఖ్యమైన టాపిక్స్‌ను పరీక్షకు ముందు మరోసారి రివైజ్ చేసుకోవాలి. ఈ పేపర్‌లో స్కోర్ కోసం రీజనింగ్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ తరువాత రీడింగ్ కాంప్రహెన్షన్ బాగా ప్రాక్టీస్ చేయాలి.
ఒత్తిడి నియంత్రణ
పోటీ పరీక్షలు అంటేనే ఎక్కువగా ఒత్తిడి ఉంటుంది. సివిల్స్ వంటి జాతీయ స్థాయి పరీక్ష అంటే అది ఇంకా ఎక్కువే. కాని ఈ ప్రిలిమ్స్‌ను కూడా సాధారణ అకడమిక్ పరీక్షగానే భావించి ప్రిపరేషన్ సాగించాలి. అయితే అందరి కంటే ఎక్కువ మార్కులు స్కోరు చేయాలన్న పట్టుదలతో చదవాలి. ఒత్తిడి నియంత్రణలో ఉంచుకోవాలి. తగినంత నిద్ర ఉంటే ఒత్తిడి దరిచేరదు. సరిపడ నిద్రతోపాటు ఎక్కువ మొత్తంలో నీరు, పళ్ల రసాలు తీసుకోవాలి. రోజువారీ షెడ్యూల్‌లో కనీసం 30 నిమిషాల వ్యాయామం, ఒక గంట విశ్రాంతి ఉండాలి. పరీక్షకు ఒక రోజు ముందు ఏమీ చదవొద్దు. మనసుకు పూర్తి విశ్రాంతి ఇవ్వాలి.
అడ్మిట్ కార్డు జాగ్రత్త
పరీక్షకు వెళ్లేందుకు అత్యంత ముఖ్యమైనది హాల్ టికెట్(అడ్మిట్ కార్డు). దీంతోపాటు పరీక్ష కేంద్రం అధికారులకు చూపించేందుకు ఐడీ ప్రూఫ్ ఒరిజినల్, జిరాక్స్, పాస్‌పోర్ట్ ఫొటో కూడా వెంట తీసుకెళ్లాలి. పరీక్షకు ఒక రోజు ముందు అవసరమైన అన్ని డాక్యుమెంట్లను సేకరించుకొని..మరోమారు చెక్ చేసుకోవాలి. వీలైతే ఒకరోజు ముందే పరీక్ష కేంద్రాన్ని పరిశీలించి రావడం మంచిది.
తెలిస్తేనే జవాబు
నెగిటివ్ మార్కుల విధానం ఉన్నందున అభ్యర్థులు ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం తెలిస్తేనే గుర్తించాలి. ఇప్పటికే సాధ్యమైనన్ని మాక్ టెస్టులు రాసి ఉంటే.. కచ్చితత్వం గురించి అవగాహన వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఊహాగానం చేయొద్దు. ఇది నెగిటివ్ మార్కింగ్‌కు దారితీస్తుంది. మొదటి రౌండ్‌లో బాగా తెలిసిన ప్రశ్నలకు సమాధానాలను గుర్తించాలి. రెండో రౌండ్‌లో ఎలిమినేషన్ టెక్నిక్ ద్వారా జవాబులు ఇవ్వాలి. ఏమాత్రం సమాధానం తెలియని ప్రశ్నలు అసలు అటెంప్ట్ చేయకపోవడమే మంచిది.
సౌకర్యవంతంగా
కాస్త వదులుగా, శరీరానికి అనువుగాను ఉండే దుస్తులను ధరించడం మంచిది. ఎందుకంటే పరీక్ష ఉదయం, మధ్యాహ్నం సుదీర్ఘంగా జరుగుతుంది. ఇక రెండు మూడు మాస్క్‌లను వెంట తీసుకెళ్లడం మంచిది. అలాగే డీహైడ్రేట్ కాకుండా తగినంత నీటిని తాగాలి.
ఆత్మ విశ్వాసం
సివిల్స్ అభ్యర్థులకు ఎంత చదివినా.. విజయం వరించదేమోననే భయం వెంటాడుతుంటుంది. ఈసారి లక్ష్యాన్ని చేరుకోలేనేమోనని ఆందోళన చెందుతుంటారు. ఇలాంటి భయాన్ని, ఆందోళనను వీడి.. నిండైన ఆత్మవిశ్వాసంతో ప్రిపరేషన్ సాగించాలి. ఇతరులతో పోల్చుకొని.. ఆత్మ న్యూనతకు గురికాకూడదు. కచ్చితంగా సాధిస్తాను అనే నమ్మకం ఉండాలి. ప్రశాంతమైన పట్టుదలతో ముందుకు సాగాలి. పూర్తి ఏకాగ్రతతో ప్రిపరేషన్ కొనసాగించాలి. అప్పుడే విజయం వరిస్తుంది.
గెస్సింగ్ చేయొద్దు
- ఈ ఏడాది సివిల్స్‌లో ఉన్న పోస్టుల సంఖ్య చాలా తక్కువ. 712 పోస్టులు మాత్రమే ఉన్నాయి. 1:13 నిష్పత్తిలో అభ్యర్థులను మెయిన్‌కు ఎంపిక చేస్తారు. కరోనా వల్ల ఇంటి నుంచే పని చేస్తున్న వర్కింగ్ పీపుల్ కూడా సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నారు. కాబట్టి ఈసారి పోటీ తీవ్రంగా ఉండవచ్చు. అభ్యర్థి సాధించే ప్రతి మార్కు వారి విజయాన్ని నిర్ణయిస్తుంది.
- చాలా మందికి పేపర్ చూడగానే కష్టంగా ఉన్నట్టు, తమకేమీ తెలియదని అనిపిస్తుంది. కానీ ప్రశ్నలను ఒకటికి రెండుసార్లు చదివితే జవాబులు గుర్తించవచ్చు. పరీక్షరోజు ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని ప్రశ్నలకు జవాబులు గుర్తించి.. చివరిలో ఓఎంఆర్ షీట్‌పై కాపీ చేద్దామనుకుంటే పొరపాట్లు జరిగే ఆస్కారం ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఓఎంఆర్ షీట్ సమాధానాలు గుర్తించడమే మంచిది.
- నెగిటివ్ మార్కింగ్ ఉన్నందున అభ్యర్థులు స్టేట్‌మెంట్స్, ప్రశ్నలు ఒకటికి రెండుసార్లు క్షుణ్నంగా చదివి జవాబులు గుర్తించాలి. గెస్సింగ్ అనేది తప్పనిసరి అయితే మాత్రమే చేయాలి. అంటే ప్రశ్నకు ఇచ్చిన నాలుగు ఆఫ్షనల్లో రెండు మీకు తెలిసినవి ఉంటేనే గెస్సింగ్‌కు వెళ్లాలి. ఏదైనా ప్రశ్నకు ఏమీ తెలియకపోతే వదిలివేయడమే మంచిది.
- పేపర్‌లో ఇచ్చిన అన్ని ప్రశ్నలకు జవాబులు గుర్తించనవసరం లేదు. మొత్తం ప్రశ్నల్లో 55 శాతం సరిగ్గా గుర్తిస్తే చాలు. పరీక్షలో 40 శాతం ప్రశ్నలు బాగా తెలిసినవే ఉంటాయి. సీశాట్ పేపర్‌లో మ్యాథ్స్‌తో మొదలు పెట్టడం మంచిది. ఇంజనీరింగ్, మ్యాథ్స్ విద్యార్థులు సీశాట్ చాలా సులువనుకుంటారు. సీశాట్‌లో 66 మార్కులు, జీఎస్‌లో 100 మార్కులు దాటితే మెయిన్‌కు అర్హత లభిస్తుంది. ఎక్కువ మార్కులు సాధించాలని తెలియని ప్రశ్నలకు ఊహించి జవాబులు గుర్తిస్తే.. మైనస్ మార్కుల్లోకి వెళ్లిపోతారు.
–వి.గోపాలకృష్ణ, బ్రెయిన్ ట్రీ అకాడమీ, డైరెక్టర్