Skip to main content

Civils 2024 Notification: 1056 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. పరీక్ష విధానం, సిలబస్‌ విశ్లేషణ, ప్రిపరేషన్‌ గైడెన్స్...

సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌.. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ వంటి 21 ఉన్నత సర్వీసుల్లో.. నియామకాల కోసం జాతీయ స్థాయిలో ప్రతి ఏటా నిర్వహించే పరీక్ష! యూపీఎస్సీ తాజాగా 1056 పోస్టుల భర్తీకి సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ -2024కు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మూడంచెల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహించనుంది. ఏదైనా డిగ్రీతో పోటీపడొచ్చు. ఈ నేపథ్యంలో సివిల్స్‌-2024 నోటిఫికేషన్‌ సమాచారం, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, సిలబస్‌ విశ్లేషణ, ప్రిపరేషన్‌ తదితర వివరాలు..
Civil Services Examination 2024 Notification    Eligibility Criteria  Civils 2024 Notification details Exam Pattern Syllabus Analysis Preparation Tips
  • సివిల్స్‌-2024 నోటిఫికేషన్‌ విడుదల
  • 21 సర్వీసుల్లో 1,056 పోస్ట్‌లతో నోటిఫికేషన్‌
  • మే 26న తొలి దశ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌

21 సర్వీసులు.. 1,056 పోస్ట్‌లు
యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌-2024 ద్వారా... ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ సహా మొత్తం 21 ఉన్నత స్థాయి సర్వీసుల్లో 1,056 పోస్ట్‌ల భర్తీకి ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది.

అర్హత
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత లేదా తత్సమాన అర్హత ఉండాలి. 2024లో చివరి సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వారు మెయిన్స్‌ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే సమయానికి ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.

వయసు
ఆగస్ట్‌ 1, 2024 నాటికి 21 నుంచి 32 ఏళ్ల మధ్యలో ఉండాలి. గరిష్ట వయోపరిమితిలో ఎస్‌సీ/ఎస్టీ వర్గాలకు అయిదేళ్లు, ఓబీసీ వర్గాలకు మూడేళ్ల వరకు సడలింపు లభిస్తుంది. జనరల్‌ కేటగిరీ అభ్యర్థులకు గరిష్టంగా ఆరుసార్లు మాత్రమే పరీక్షకు హాజరయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఓబీసీలు తొమ్మిదిసార్లు, ఎస్సీ/ఎస్టీలు గరిష్ట వయోపరిమితికి లోబడి ఎన్నిసార్లయినా పరీక్షకు హాజరుకావచ్చు.

చదవండి: AP TRT Notification: 6,100 పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. ఎంపిక విధానం, సిలబస్‌ విశ్లేషణ, పరీక్షలో విజయానికి ప్రిపరేషన్‌ గైడెన్స్...

మూడు దశల ఎంపిక ప్రక్రియ
సివిల్‌ సర్వీసెస్‌ పోస్టుల భర్తీకి మూడంచెల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. అవి.. ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్‌ ఎగ్జామినేషన్, పర్సనాలిటీ టెస్ట్‌ (పర్సనల్‌ ఇంటర్వ్యూ).

ప్రిలిమినరీ పరీక్ష
సివిల్‌ సర్వీసెస్‌ ఎంపిక ప్రక్రియలోని మొదటి దశ ప్రిలిమినరీ పరీక్ష. ఈ పరీక్ష రెండు పేపర్లుగా 400 మార్కులకు ఉంటుంది. పేపర్‌-1 జనరల్‌ స్టడీస్‌ 200 మార్కులు, పేపర్‌-2 జనరల్‌ స్టడీస్‌200 మార్కులకు ఉంటాయి. ప్రిలిమినరీ పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. నెగెటివ్‌ మార్కింగ్‌ నిబంధన ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3వంతు మార్కులను తగ్గిస్తారు. పేపర్‌-2లో 33 శాతం మార్కులను కనీస అర్హత మార్కులుగా పేర్కొన్నారు.

రెండో దశ మెయిన్‌ ఎగ్జామినేషన్‌
సివిల్‌ సర్వీసెస్‌ ఎంపిక ప్రక్రియలో రెండో దశ మెయిన్‌ ఎగ్జామినేషన్‌. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన వారిని ఒక్కో పోస్ట్‌కు 12 లేదా 13 మందిని చొప్పున మెయిన్‌కు ఎంపిక చేస్తారు.

మెయిన్‌ ఎగ్జామ్‌.. ఇలా

  • సివిల్స్‌ రెండో దశ పరీక్ష మెయిన్‌ ఎగ్జామినేషన్‌.. రెండు లాంగ్వేజ్‌ పేపర్లు, ఒక జనరల్‌ ఎస్సే పేపర్, నాలుగు జనరల్‌ స్టడీస్‌ పేపర్లు, రెండు ఆప్షనల్‌ పేపర్లతో నిర్వహిస్తారు. మెయిన్స్‌ పరీక్షలోని రెండు లాంగ్వేజ్‌ పేపర్లు 300 మార్కులకు చొప్పున ఉంటాయి. అవి..పేపర్‌-ఎ ఇండియన్‌ లాంగ్వేజ్‌-300 మార్కులు, పేపర్‌-బి ఇంగ్లిష్‌ -300 మార్కులు. ఈ రెండు పేపర్లలో కనీస మార్కులు పొందితేనే మిగతా పేపర్ల మూల్యాంకన చేసి.. మెరిట్‌ జాబితా రూపొందిస్తారు. 
  • పేపర్‌-1 జనరల్‌ ఎస్సే-250 మార్కులకు; పేపర్‌-2 జనరల్‌ స్టడీస్‌-1 (ఇండియన్‌ హెరిటేజ్, కల్చర్, హిస్టరీ అండ్‌ జాగ్రఫీ, సొసైటీ) 250 మార్కులకు; పేపర్‌-3 జనరల్‌ స్టడీస్‌-2 (గవర్నెన్స్, కాన్‌స్టిట్యూషన్, పాలిటీ, సోషల్‌ జస్టిస్, అండ్‌ ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌) 250 మార్కులకు; పేపర్‌-4 జనరల్‌ స్టడీస్‌-3 (టెక్నాలజీ, ఎకనామిక్‌ డెవలప్‌మెంట్, బయో డైవర్సిటీ, ఎన్విరాన్‌మెంట్, సెక్యూరిటీ అండ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌) 250 మార్కులకు; పేపర్‌-5 జనరల్‌ స్టడీస్‌-4 (ఎథిక్స్, ఇంటెగ్రిటీ, ఆప్టిట్యూడ్‌) 250 మార్కులకు; పేపర్‌-6 ఆప్షనల్‌ సబ్జెక్ట్‌ పేపర్‌-1, 250 మార్కులకు; పేపర్‌-7 ఆప్షనల్‌ సబ్జెక్ట్‌ పేపర్‌-2, 250 మార్కులకు ఉంటాయి. ఇలా మెయిన్‌ ఎగ్జామినేషన్‌ను ఏడు పేపర్లలో మొత్తం 1,750 మార్కులకు పూర్తి డిస్క్రిప్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు.

చదవండి: Civils Prelims Guidance

చివరగా పర్సనల్‌ ఇంటర్వ్యూ
సివిల్‌ సర్వీసెస్‌ ఎంపిక ప్రక్రియలో చివరి దశ పర్సనాలిటీ టెస్ట్‌. దీనినే ఇంటర్వ్యూ అని కూడా పిలుస్తారు. మెయిన్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా ఒక్కో పోస్ట్‌కు ఇద్దరిని చొప్పున ఎంపిక చేసి పర్సనాలిటీ టెస్ట్‌ నిర్వహిస్తారు. దీనికి కేటాయించిన మార్కులు 275. మెయిన్స్‌+ పర్సనాలిటీ టెస్ట్‌లోనూ చూపిన ప్రతిభ ఆధారంగా తుది విజేతలను ప్రకటిస్తారు.

ప్రిలిమ్స్‌లో.. విజయం సాధించేలా
తొలి దశ ప్రిలిమినరీ పరీక్షలో.. జనరల్‌ స్టడీస్‌ పేపర్‌-1లో హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, కరెంట్‌ అఫైర్స్, ఇంటర్నేషనల్‌ ఈవెంట్స్‌కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. పేపర్‌ 2లో.. రీడింగ్‌ కాంప్రహెన్షన్, న్యూమరికల్‌ ఎబిలిటీ, డెసిషన్‌ మేకింగ్‌ తదితర అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.

సిలబస్‌పై అవగాహన
సివిల్స్‌ అభ్యర్థులు ముందుగా.. సిలబస్‌ను ఆసాంతం పరిశీలించాలి. సిలబస్‌లో పేర్కొన్న అంశాలు, సదరు అంశాల్లో తమ వ్యక్తిగత సామర్థ్య స్థాయి తెలుసుకోవాలి. ఫలితంగా ప్రిపరేషన్‌లో తాము ఎక్కువగా దృష్టి సారించాల్సిన అంశాలపై అవగాహన ఏర్పడుతుంది. దీని ద్వారా ఏ అంశాలకు ఎంత సమయం కేటాయించాలి.. ఏ పుస్తకాలు చదవాలో స్పష్టత వస్తుంది. దీంతోపాటు గత ప్రశ్న పత్రాల పరిశీలన, విశ్లేషణ ద్వారా ప్రశ్నలు అడుగుతున్న శైలి.. ఏఏ అంశాలకు ఎంత ప్రాధాన్యం ఉంటుంది? వంటి వాటిపై అవగాహన కలుగుతుంది. 

ప్రామాణిక పుస్తకాలు
సిలబస్‌పై అవగాహన పొందాక.. వాటికి సంబంధించిన ప్రామాణిక పుస్తకాలను సేకరించుకోవాలి. సిలబస్‌లో పేర్కొన్న అన్ని అంశాలు పొందుపర్చిన పుస్తకాల్ని ఎంపిక చేసుకోవాలి. ఆయా సబ్జెక్టులకు ప్రామాణికంగా భావించే ఒకట్రెండు పుస్తకాలకు పరిమితమవడం మేలు. సిలబస్, మెటీరియల్‌ సేకరణలో స్పష్టత లభించిన అభ్యర్థులు.. పూర్తి స్థాయి ప్రిపరేషన్‌కు ఉపక్రమించాలి.

సమకాలీనంపై పట్టు
అభ్యర్థులు ప్రిపరేషన్‌లో కరెంట్‌ అఫైర్స్‌కు ప్రాధాన్యం ఇవ్వడం ఉపయుక్తంగా ఉంటుంది. కారణం.. గత మూడు, నాలుగేళ్లుగా కరెంట్‌ అఫైర్స్‌కు సంబంధించిన ప్రశ్నల సంఖ్య పెరుగుతోంది. కాబట్టి కరెంట్‌ అఫైర్స్‌ టాపిక్స్‌ను కోర్‌ అంశాలతో అనుసంధానం చేసుకుంటూ ప్రిపరేషన్‌ సాగించాలి. దీంతోపాటు అభ్యర్థులు ఒక సబ్జెక్ట్‌ను మరో సబ్జెక్ట్‌తో అనుసంధానం చేసుకుంటూ అధ్యయనం చేయడం ఉపయుక్తంగా ఉంటుంది. ఉదాహరణకు.. జాగ్రఫీని చదివేటప్పుడు అందులో ఉండే జనాభా, పంటలు, సహజ వనరులు-ఉత్పాదకత తదితర అంశాలను ఎకనామిక్స్‌తో సమన్వయం చేసుకుంటూ చదవాలి. ఫలితంగా ఒకే సమయంలో రెండు అంశాలపైనా పట్టు లభిస్తుంది. ఇదే తరహాలో పాలిటీ-ఎకానమీ ప్రిపరేషన్‌ సాగించొచ్చు.

డిస్క్రిప్టివ్‌ అప్రోచ్‌
ప్రిలిమినరీ పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. కాని అభ్యర్థులు డిస్క్రిప్టివ్‌ పద్ధతిలో ప్రిపరేషన్‌ సాగించడం మేలు చేస్తుంది. దీనివల్ల ఆయా అంశాలపై అన్ని కోణాల్లో అవగాహన లభిస్తుంది. ఇది మెయిన్స్‌ ప్రిపరేషన్‌ను సులభం చేస్తుంది.

ఇవెంతో ముఖ్యం
ప్రిలిమ్స్‌ ప్రిపరేషన్‌ సమయంలో అభ్యర్థులు ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అంశాలు.. జాగ్రఫీ, ఎకాలజీ-ఎన్విరాన్‌మెంట్, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ! ఎందుకంటే.. ఇటీవల కాలంలో చర్చనీయాంశంగా మారిన పర్యావరణ కాలుష్యం, అందుకు సంబంధించి అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో చేపడుతున్న చర్యలు వంటి అంశాలపై ప్రశ్నలు అడుగుతున్నారు. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి సంబంధించి తాజాగా మన దేశం ప్రయోగించిన ఉపగ్రహాలు, వాటి లక్ష్యాలు వంటి అంశాలు తెలుసుకోవాలి.

చదవండి: Previous Question Papers: పరీక్ష ఏదైనా ప్రీవియస్‌పేపెర్లే ‌.. ప్రిపరేషన్‌ కింగ్‌

పేపర్‌-2కు ఇలా
అర్హత పేపర్‌గానే పేర్కొంటున్నప్పటికీ.. పేపర్‌-2 పైనా అభ్యర్థులు ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎందుకంటే..ఈ పేపర్‌లో కనీసం 33 శాతం మార్కులు సాధిస్తేనే పేపర్‌-1ను మూల్యాంకన చేస్తారు. దాని ఆధారంగా మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. పేపర్‌ 2 కోసం బేసిక్‌ ఇంగ్లిష్‌ గ్రామర్, రీ­డింగ్‌ కాంప్రహెన్షన్‌లపై పట్టు సాధించాలి. ఇంగ్లిష్‌ దినపత్రికలను చదవడం అలవాటు చేసుకోవాలి. న్యూమరికల్‌ ఎబిలిటీకి సంబంధించి పదో తరగతి స్థాయిలో మ్యాథమెటిక్స్, ప్రధానంగా అర్థమెటిక్‌కు సంబంధించిన అంశాలపై పట్టు సాధించాలి.

మెయిన్స్‌తో అనుసంధానం
ప్రిలిమ్స్‌ ప్రిపరేషన్‌ సమయంలోనే.. మెయిన్స్‌తో అనుసంధానం చేసుకుంటూ చదవాలి. మెయిన్స్‌లో ఆప్షనల్‌ సబ్జెక్ట్‌ పేపర్లు, ఎథిక్స్‌ పేపర్‌ మినహా.. మిగతా అన్ని పేపర్లు ప్రిలిమ్స్‌ జనరల్‌ స్టడీస్‌లో నిర్దేశించిన విభాగాలకు సంబంధించినవే. ఆయా సబ్జెక్ట్‌లను డిస్క్రిప్టివ్‌ అప్రోచ్‌తో చదివితే మెయిన్స్‌కు కూడా ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఆయా సిలబస్‌ అంశం నేపథ్యంతోపాటు సమకాలీన పరిణామాలతో అనుసంధానం చేసుకుంటూ చదివితే..ప్రిలిమ్స్‌లో అడుగుతున్న విభిన్న శైలి ప్రశ్నలకు సమాధానం ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది.

టైమ్‌ మేనేజ్‌మెంట్‌-రివిజన్‌
అభ్యర్థులు సమయ పాలన పాటించాలి. ప్రతి రోజు కనీసం ఎనిమిది గంటలు ప్రిపరేషన్‌ సాగించే విధంగా సమయ ప్రణాళిక రూపొందించుకోవాలి. ప్రతి రోజు అన్ని సబ్జెక్ట్‌లను చదివే విధంగా వ్యవహరించాలి. దీంతోపాటు ప్రిపరేషన్‌లో భాగంగా రివిజన్‌ను అత్యంత కీలకమని గుర్తించాలి. పరీక్షకు నెల రోజుల ముందు నుంచి పూర్తిగా రివిజన్‌కే సమయం కేటాయించే విధంగా టైమ్‌ ప్లాన్‌ రూపొందించుకోవాలి. రివిజన్‌తోపాటు మాక్‌ టెస్ట్‌లు, మోడల్‌ టెస్ట్‌లకు హాజరు కావడం కూడా మేలు చేస్తుంది.

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 2024, మార్చి 5
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు సవరణ అవకాశం: 2024 మార్చి 6 - 12 వరకు
  • ప్రిలిమినరీ పరీక్ష తేదీ: 2024, మే 26
  • మెయిన్‌ ఎగ్జామ్‌: సెప్టెంబర్‌ 20 నుంచి అయిదు రోజులు
  • వెబ్‌సైట్‌: https://upsc.gov.in/
Published date : 21 Feb 2024 10:37AM

Photo Stories