Skip to main content

Competitive Exams Preparation Tips: కోచింగ్‌ లేకుండానే... సివిల్స్, గ్రూప్స్‌!

సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌.. జాతీయ స్థాయిలో.. అత్యున్నత ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ వంటి సివిల్‌ సర్వీసుల్లోకి.. ప్రతిభావంతులను ఎంపిక చేసే పరీక్ష! తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్‌1, 2.. ఆర్‌డీవో మొదలు డిప్యూటీ తహసీల్దార్‌ వరకూ.. కీలక పోస్టుల భర్తీకి నిర్వహించే ఎంపిక ప్రక్రియ. ఈ పోస్టులకు లక్షల మంది అభ్యర్థులు పోటీపడుతుంటారు. కాబట్టి పోటీ ఎక్కువగా ఉంటుంది. ఎంపిక ప్రక్రియ కూడా క్లిష్టంగానే ఉంటుంది. అందరికీ కోచింగ్‌ సౌలభ్యం అందుబాటులో ఉండదు. అలాంటప్పుడు మరి ఇంతటి కఠినమైన పరీక్షల్లో విజయం కోచింగ్‌ లేకుండా సాధ్యమేనా.. అనే సందేహం అభ్యర్థుల్లో వ్యక్తమవుతోంది. శిక్షణ లేకుండా సివిల్స్, గ్రూప్స్‌ సాధించడం ఎలాగో తెలుసుకుందాం...
Competitive Exams: how to prepare civil service and group exams
Competitive Exams: how to prepare civil service and group exams
  • సివిల్స్, గ్రూప్స్‌ శిక్షణ లేకుండా సాధించేందుకు మార్గాలు
  • తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్స్‌కు లక్షల మంది హాజరు
  • పక్కా ప్రణాళిక, వ్యూహాత్మక ప్రిపరేషన్‌తోనే విజయం

కోచింగ్‌ తీసుకుని, నిపుణుల సలహాలు, సూచనలు పాటిస్తూ విజయం సాధించాం. అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాం. అయితే శిక్షణ తీసుకున్నా.. అభ్యర్థులకు తమకంటూ స్వీయ ప్రణాళిక, నిర్దిష్ట వ్యూహాలు ఉండాల్సిందే. –సివిల్స్, గ్రూప్స్‌ గత విజేతల్లో పలువురు చెప్పే మాటలు.

ఎలాంటి కోచింగ్‌ తీసుకోలేదు. నిర్దిష్ట ప్రణాళిక అనుసరిస్తూ.. సొంత ప్రిపరేషన్‌తో స్వప్నాన్ని సాకారం చేసుకున్నాం. –ఎలాంటి కోచింగ్‌ లేకుండా సివిల్స్, గ్రూప్స్‌లో విజయం సాధించి సర్వీసులు సొంతం చేసుకున్న వారు చెప్పే మాట.

ఈ రెండు సందర్భాల్లో మనకు కనిపించే ఉమ్మడి విజయ సూత్రం.. స్వీయ ప్రణాళిక, వ్యూహాలు...

డిగ్రీ పూర్తి చేసుకుంటూనే.. సివిల్స్‌కు,గ్రూప్స్‌కు హాజరవ్వాలనుకునే విద్యార్థుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ఇటీవల తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై ప్రకటన, అటు ఆంధ్రప్రదేశ్‌ జాబ్‌ నోటిఫికేషన్లతో.. సర్కారీ కొలువు సాధించాలని ఆశించే వారి సంఖ్య పెరుగుతోంది. వీరిలో గ్రామీణ ప్రాంత అభ్యర్థులు, ప్రైవేట్‌ ఉద్యోగాలు చేస్తూ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారు, శిక్షణ సదుపాయాలు సరిగా లేని ఔత్సాహికుల్లో ఆందోళన కొంత ఎక్కువగానే ఉంటుంది. ఇంతటి తీవ్ర పోటీలో కోచింగ్‌ లేకుండా పోస్టు కొట్టగలమా అనే సందేహం వారిని వెంటాడుతూ ఉంటుంది.
 

చ‌ద‌వండి: Competitive Exams Preparation Tips: జనరల్ ఎస్సేకు ఇలా సన్నద్ధమైతే.. కొలువు కొట్టడం సులువే! 

స్టార్ట్‌ విత్‌ సిలబస్‌

సివిల్స్, గ్రూప్స్‌ ఎంపిక ప్రక్రియ, అందుకు నిర్వహించే రాత పరీక్షలను చూస్తే.. విస్తృతమైన సిలబస్, ప్రతి అంశాన్ని క్షుణ్నంగా అధ్యయనం చేయాల్సిన అవసరం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి సొంత ప్రిపరేషన్‌పై ఆధారపడాలనుకునే అభ్యర్థులు ముందుగా రాత పరీక్షలకు సంబంధించి సిలబస్‌ను క్షుణ్నంగా, లోతుగా పరిశీలించాలి. తమ అకడమిక్‌ నేపథ్యానికి అనుగుణంగా తమకు అనుకూలంగా ఉండే అంశాలు.. ప్రతికూలంగా లేదా కొత్తగా ఉండే అంశాలు ఏవో గుర్తించాలి. సివిల్స్, గ్రూప్స్‌ సిలబస్‌లో.. హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ విస్తృతంగా ఉంటాయి. వీటితోపాటు కరెంట్‌ అఫైర్స్, కాంటెంపరరీ ఇష్యూస్‌కూ ప్రాధాన్యం ఉంటుంది.

పరీక్ష విధానంపై అవగాహన

శిక్షణ తీసుకోకుండా సివిల్స్, గ్రూప్స్‌కు హాజరవ్వాలనుకునే అభ్యర్థులు..తొలుత ఆయా పరీక్ష విధానం తెలుసుకోవాలి. సివిల్స్, గ్రూప్‌1లో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ.. ఇలా మూడు దశలు ఉంటాయి. గ్రూప్‌ 2 ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. ఇలా సదరు పరీక్షల విధానం, పేపర్లు, సిలబస్‌ టాపిక్స్‌ గురించి పూర్తిస్థాయి అవగాహన పెంచుకోవాలి. ఇది మున్ముందు సొంతంగా ప్రిపరేషన్‌ సాగించేందుకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. పరీక్ష విధానాన్ని తెలుసుకోవడం వల్ల ప్రిలిమ్స్, మెయిన్స్‌ రెండింటిలో ఉన్న పేపర్లు, అంశాల గురించి క్షుణ్నమైన అవగాహన ఏర్పడి.. ప్రిపరేషన్‌ సమయంలో నిర్దిష్ట వ్యూహంతో చదివే సంసిద్ధత లభిస్తుంది.

పాత ప్రశ్న పత్రాల అధ్యయనం

సివిల్స్, గ్రూప్స్‌కు సొంతంగా సన్నద్ధమవ్వాలనుకునే అభ్యర్థులు..పాత ప్రశ్న పత్రాలను అధ్యయనం చేయడంతోపాటు వాటిని సాధన చేయడం మేలు చేస్తుంది. ఇలా ప్రశ్న పత్రాలను అధ్యయనం చేయడం ద్వారా ఆయా అంశాలకు లభిస్తున్న వెయిటేజీ, ప్రశ్నలు అడుగుతున్న తీరు తెలుసుకోవచ్చు. దీనివల్ల ప్రిపరేషన్‌ సమయంలో ఏ అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి? ఆయా అంశాలను ఏ శైలిలో చదవాలి అనే విషయాలపై స్పష్టత వస్తుంది. కనీసం అయిదేళ్ల పాత ప్రశ్న పత్రాలను సాధన చేస్తే.. ప్రశ్నల సరళిపై పూర్తి అవగాహన లభిస్తుంది.

చ‌ద‌వండి: Exam Guidance: కొత్త సంవత్సరంలో.. వీటిపై ప‌ట్టు.. కొలువు కొట్టు !

ప్రామాణిక పుస్తకాలు

సిలబస్, పరీక్ష తీరు, ప్రశ్నల శైలిపై అవగాహన పొందిన తర్వాత.. అభ్యర్థులు ప్రామాణిక పుస్తకాలను సేకరించుకోవాలి. పరీక్ష సిలబస్‌కు అనుగుణంగా ఆయా సబ్జెక్ట్‌లకు సంబంధించి..అన్ని అంశాలు ఉండే పుస్తకాలను సమీకరించుకోవాలి. ఇందుకోసం వీలైతే ప్రత్యేకంగా వారం పది రోజుల సమయం కేటాయించడానికి కూడా వెనుకాడకూడదు. పుస్తకాలు,మెటీరియల్‌ ఎంపికలో గత విజేతలు లేదా సబ్జెక్ట్‌ నిపుణుల సలహా తీసుకోవడం మేలు చేస్తుంది.

నిర్దిష్ట స్టడీ ప్లాన్‌

మెటీరియల్‌ కూడా చేతిలో ఉంటే.. ఇక ఆయా పోటీ పరీక్షల ప్రిపరేషన్‌ దిశగా తొలి అడుగు పడినట్లే! సివిల్స్, గ్రూప్స్‌కు సన్నద్ధమయ్యే అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌ శాస్త్రీయంగా, నిర్దిష్ట ప్రణాళికతో ఉండేలా చూసుకోవాలి. అన్ని సబ్జెక్ట్‌లకు సమయం కేటాయించేలా టైమ్‌ ప్లాన్‌ రూపొందించుకోవాలి. ప్రతిరోజు, ప్రతి సబ్జెక్ట్‌ చదివేలా సమయ విభజన చేసుకోవాలి. క్లిష్టమైన అంశాలకు కొంత ఎక్కువ సమయం కేటాయించాలి.

నోట్స్‌ రాసుకుంటూ

ప్రిపరేషన్‌ సమయంలో ప్రతి సబ్జెక్ట్‌ను చదువుతున్నప్పుడే.. అందులోని ముఖ్యాంశాలతో సొంత నోట్స్‌ రాసుకోవాలి. ఈ నోట్స్‌లో సదరు సిలబస్‌ అంశానికి సంబంధించి సినాప్సిస్,నేపథ్యం,సమకాలీన పరిణామాలు ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల పరీక్షకు ముందు కీలకంగా భావించే రివిజన్‌ వేగంగా పూర్తిచేసుకోవచ్చు.

సమాధానాలు రాస్తూ

సివిల్స్, గ్రూప్‌1 మెయిన్‌లో విజయం సాధించేందుకు సమాధానాలు రాసే నైపుణ్యం చాలా అవసరం. కాబట్టి ప్రతి రోజు తాము చదివిన అంశాలకు సంబంధించి పాత ప్రశ్న పత్రాలు లేదా నమూనా ప్రశ్న పత్రాల ఆధారంగా సమాధానాలు రాసి సరిచూసుకోవాలి. తద్వారా రైటింగ్‌ స్కిల్స్, ప్రజెంటేషన్‌ నైపుణ్యాలు మెరుగుపడతాయి. పదిసార్లు చదివిన దానికంటే ఒకసారి రాసిన విషయం మదిలో మరింతగా నిక్షిప్తమై ఉంటుందనే అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు.

సమకాలీన పరిజ్ఞానం

ప్రస్తుతం సివిల్స్, గ్రూప్స్‌ పరీక్షల శైలిని పరిశీలిస్తే.. అభ్యర్థులు సమకాలీన పరిజ్ఞానంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత కనిపిస్తోంది. ట్రెండింగ్‌ టాపిక్స్‌కు సంబంధించి టీవీ డిబేట్స్, న్యూస్‌ పేపర్‌ అనాలిసిస్‌లను అనుసరించాలి. ఇవి ఆయా అంశాలపై లోతైన అవగాహన పొందేందుకు ఆస్కారం కల్పిస్తాయి.

చ‌ద‌వండి: Job Trends: కొత్త సంవత్సరంలో.. భరోసానిచ్చే కొలువులివే!

నిరంతర ‘స్వీయ’ విశ్లేషణ

స్వీయ ప్రిపరేషన్‌తో అడుగులు వేసే అభ్యర్థులు.. తమ ప్రిపరేషన్, అవగాహన స్థాయిపై నిరంతరం స్వీయ విశ్లేషణ, సమీక్ష చేసుకోవాలి. అందుకోసం నమూనా ప్రశ్న పత్రాలను సాధించడం, తాము చదివిన టాపిక్స్‌కు సంబంధించి ప్రశ్నలు అడిగే అవకాశం ఉన్న వాటికి సమాధానాలు రాయడం చేయాలి. ఆ తర్వాత వీటిని మూల్యాంకన చేసుకుని తమ స్థాయిని విశ్లేషించుకోవాలి.

మెంటారింగ్‌

స్వీయ ప్రిపరేషన్‌ సాగించే అభ్యర్థులు మెంటారింగ్‌ సదుపాయం ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. గత విజేతలు, సబ్జెక్ట్‌ ఎక్స్‌పర్ట్స్‌తో సంప్రదింపులు సాగించేలా ఏర్పాటు చేసుకోవాలని సలహా ఇస్తున్నారు. తద్వారా అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌ సమయంలో నిరంతరం వారితో సంప్రదిస్తూ తమకు ఎదురయ్యే సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. అదే విధంగా తమ ప్రిపరేషన్‌ స్థాయిపై కచ్చితమైన విశ్లేషణ, అవగాహన పొందేందుకు కూడా ఈ మెంటారింగ్‌ సౌకర్యం ఉపయోగపడుతుంది.

ఆన్‌లైన్‌ సదుపాయాలు

ప్రస్తుతం సివిల్స్, గ్రూప్స్‌ పరీక్షలకు పలు ఆన్‌లైన్‌ సాధనాలు అందుబాటులోకి వచ్చాయి. యూట్యూబ్‌లో ఉచితంగానే పరీక్షలకు ఉపయోగపడే సమాచారం లభిస్తోంది. సబ్జెక్ట్‌ నిపుణులు ఇచ్చే సలహాలు, సూచనలు పొందే అవకాశం కూడా ఉంది. కరెంట్‌ అఫైర్స్, జనరల్‌ ఎస్సే తదితర విభాగాలకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని కూడా సదరు ఆన్‌లైన్‌ పోర్టల్స్‌ అందిస్తున్నాయి. ఫలితంగా అభ్యర్థులు కూడా అప్‌డేటెడ్‌ నాలెడ్జ్‌తో ముందుకు సాగే అవకాశం ఉంటుంది.

ఓర్పు, సహనం కీలకం

స్వీయ ప్రిపరేషన్‌తో సివిల్స్, గ్రూప్స్‌కు సన్నద్ధమవ్వాలనుకునే అభ్యర్థులకు ఓర్పు, సహనం ఉండాలి. ఎందుకంటే.. ఈ పరీక్షల ఎంపిక ప్రక్రియ సుదీర్ఘంగా సాగుతుంది. కొన్ని సందర్భాల్లో సహనానికి పరీక్షగానూ మారుతుంది. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మానసిక సమతుల్యత పాటించడం ఎంతో అవసరం. ఓర్పుగా, సహనంతో అడుగులు వేయాలి. అభ్యర్థులు తమ లక్ష్య సాధన దిశగా అన్ని ఆటుపోట్లు తట్టుకుంటూ.. ఏకాగ్రత కోల్పోకుండా అడుగులు వేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా క్లిష్టంగా భావించే అంశాలను చదివేటప్పుడు బోర్‌గా ఫీలవడం లేదా ఈ పరీక్షలో విజయం సాధించగలమా? అనే సందేహం తలెత్తుతుంది. వీటిని తట్టుకునే ఆత్మవిశ్వాసం, నిబ్బరం పెంపొందించుకోవాలి. ఎలాంటి అంశాన్నయినా చదవగలం అనే ఆత్మస్థైర్యం సొంతం చేసుకోవాలి. ఇలా సిలబస్‌ విశ్లేషణ నుంచి పరీక్ష రోజు వరకూ.. పక్కా ప్రణాళికతో, ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తే విజయం సాధించే అవకాశాలు మెరుగవుతాయి. ఒకవేళ విజయం లభించకపోయినా.. తదుపరి యత్నంలో, భవిష్యత్‌లో ఈ ప్రిపరేషన్‌ అనుభవం ఉపయోగపడుతుంది. 

స్వీయ సన్నద్ధత ప్రధానం

కోచింగ్‌ తీసుకున్నా.. తీసుకోకపోయినా.. సివిల్స్, గ్రూప్స్‌ వంటి పరీక్షల్లో విజయానికి స్వీయ సన్నద్ధత, స్వీయ నైపుణ్యాలు ఎంతో ముఖ్యం. కోచింగ్‌ వల్ల మనం ఏ దారిలో నడవాలో తెలుస్తుంది. ఆ దారిలో ఎదురయ్యే ఒడిదుడుకులను అధిగమించడం, గమ్యాన్ని చేరుకోవడం అభ్యర్థుల చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి కోచింగ్‌ తీసుకుంటేనే విజయం సాధిస్తామనే ఆందోళన వీడాలి. 
– సీహెచ్‌. యశ్వంత్‌కుమార్‌ రెడ్డి, సివిల్స్‌–2021 విజేత (93వ ర్యాంకు)

చ‌ద‌వండి: Competitive Exams: సివిల్స్, బ్యాంక్స్.. ఇలా.. ప‌రీక్షలు ఏవైనా.. జనరల్‌ స్టడీస్‌లో రాణిస్తేనే విజయం..

Published date : 16 Mar 2022 06:32PM

Photo Stories