Skip to main content

Competitive Exams: సివిల్స్, బ్యాంక్స్.. ఇలా.. ప‌రీక్షలు ఏవైనా.. జనరల్‌ స్టడీస్‌లో రాణిస్తేనే విజయం..

జనరల్‌ అవేర్‌నెస్‌.. అత్యున్నత స్థాయి పరీక్షగా పేర్కొనే.. సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌ మొదలు బ్యాంక్‌ క్లర్క్‌ పరీక్షల వరకూ.. అన్నింటిలో కీలక విభాగం. ఆయా పరీక్షల్లో నిర్ణయాత్మకంగా నిలుస్తోంది జనరల్‌ అవేర్‌నెస్‌. దీంతో.. అభ్యర్థులు ఈ విభాగంపై పట్టు సాధించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన పరిస్థితి! విస్తృతంగా ఉండే జనరల్‌ అవేర్‌నెస్‌ సిలబస్‌లో.. పరీక్ష కోణంలో ఏది ముఖ్యమో గుర్తించడం చాలా ముఖ్యం. ప్రస్తుతం పలు పోటీ పరీక్షలకు నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో.. పోటీ పరీక్షల విజయంలో కీలకంగా మారుతున్న జనరల్‌ అవేర్‌నెస్‌లో మెరుగ్గా రాణించేందుకు మార్గాలు..
Preparation Tips for General Awareness section in various Competitive Exams
Preparation Tips for General Awareness section in various Competitive Exams
  • అన్ని ఉద్యోగ పరీక్షల్లోనూ కీలకం జనరల్‌ అవేర్‌నెస్‌
  • విస్తృతమైన సిలబస్, ఎన్నో అంశాల సమ్మిళితం
  • ‘ప్రత్యేక’ పద్ధతుల్లో చదివితేనే పట్టు అంటున్న నిపుణులు

జనరల్‌ స్టడీస్, జనరల్‌ అవేర్‌నెస్‌కు అన్ని పోటీ పరీక్షల్లోనూ ప్రత్యేక వెయిటేజీ ఉంది. ముఖ్యంగా యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్, ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ తదితర పరీక్షల్లో జనరల్‌ స్టడీస్‌కు అత్యంత ప్రాధాన్యం ఉంది. ప్రిలిమ్స్, మెయిన్స్‌.. రెండు దశల్లోనూ జనరల్‌ స్టడీస్‌ కీలకంగా నిలుస్తోంది. యూపీఎస్సీతోపాటు ఎస్‌ఎస్‌సీ, బ్యాంక్స్, రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షలు.. ఇలా.. ఏ నియామక పరీక్షను చూసినా.. జనరల్‌ స్టడీస్‌లో రాణిస్తేనే విజయం దరి చేరుతుంది. 

రెండు రకాలుగా

  • ప్రస్తుతం ఆయా పోటీ పరీక్షల్లో జనరల్‌ అవేర్‌నెస్‌/జనరల్‌ స్టడీస్‌ సబ్జెక్ట్‌లలోని సిలబస్‌ను పరిగణనలోకి తీసుకుంటే.. రెండు రకాలుగా దీన్ని వర్గీకరించొచ్చు. అవి.. సంప్రదాయ జనరల్‌ స్టడీస్‌ అంశాలు; జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌.
  • సంప్రదాయ జనరల్‌ స్టడీస్‌లో.. హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, జనరల్‌ సైన్స్, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలను పేర్కొనొచ్చు.
  • జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌లో.. ముఖ్యమైన వ్యక్తులు, సదస్సులు, అవార్డులు, ఒప్పందాలు వంటి స్టాక్‌ జీకేతోపాటు సమకాలీన పరిణామాలకు సంబంధించిన జాతీయ, అంతర్జాతీయ అంశాలు, క్రీడలను అధ్యయనం చేయాల్సి ఉంటుంది.

పుస్తకాల ఎంపిక
జనరల్‌ స్టడీస్, జనరల్‌ అవేర్‌నెస్‌పై పట్టు సాధించేందుకు అభ్యర్థులు పుస్తకాల ఎంపిక నుంచే ప్రత్యేక శ్రద్ధ చూపాలి. తాము పోటీ పడే పరీక్షల సిలబస్‌ను పరిశీలించి.. దానికి సంబంధించిన అంశాలన్నీ ఉండేలా ఒకట్రెండు ప్రామాణిక పుస్తకాలను గుర్తించాలి. అలాకాకుండా ఒక్కో టాపిక్‌కు ఒక్కో పుస్తకం చదివితే.. ప్రిపరేషన్‌లో సమన్వయం లోపిస్తుంది. అందుకే అభ్యర్థులు పుస్తకాల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరించి..పరీక్షకు సరితూగే వాటినే చదవాలి.

ప్రాధాన్యత గుర్తింపు

  • చాలామంది అభ్యర్థులు ఆయా సిలబస్‌ అంశాలను నవలగానో లేదా కథలానో చదువుకుంటూ ముందుకు వెళతారు. ఇలా చదవడం వల్ల పరీక్షకు అవసరమైన ముఖ్యాంశాలను గుర్తించి..గుర్తు పెట్టుకోవడం సాధ్యం కాదు. దీనికి పరిష్కారంగా.. సదరు టాపిక్‌ చదవడం ప్రారంభించినప్పుడే.. ఆయా అంశం ఉద్దేశం, ప్రాధాన్యతల గురించి తెలుసుకోవాలి. పుస్తకంలో దీనికి సంబంధించి ఉన్న సమాచారాన్ని గుర్తించి.. దాన్ని సొంత నోట్స్‌లో ముఖ్యమైన పాయింట్స్‌లా రాసుకోవాలి.
  • ఉదాహరణకు చరిత్రనే పరిగణనలోకి తీసుకుంటే..ఈ సబ్జెక్ట్‌ను ఎంత చదివినా తక్కువే అన్న భావన కలుగుతుంది. కాని పరీక్ష కోసం చరిత్రలో ముఖ్య ఘట్టాలు, కళలు, సంస్కృతి వంటి వాటిపై ఎక్కువగా దృష్టిపెట్టాలి. అలాగే ఎకానమీ ప్రిపరేషన్‌లో..మూల భావనలను తెలుసుకుంటూ.. వాటిని సమకాలీన పరిణామాలతో సమన్వయం చేసుకుంటూ చదవడం మేలు చేస్తుంది.

ప్రాధాన్య అంశాలు గుర్తించడం

  • జనరల్‌ స్టడీస్, జనరల్‌ అవేర్‌నెస్‌లో మెరుగ్గా రాణించేందుకు ఆయా అంశాలకు సంబంధించి ఎలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉందో గుర్తించాలి. దీనికోసం ముందుగా సదరు పోటీ పరీక్షల గత నాలుగైదేళ్ల ప్రశ్న పత్రాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు.. వాటి శైలి ఎలా ఉంటుంది అనే విషయాలను పరిశీలించాలి. దీనిద్వారా ప్రశ్నలు అడిగే అవకాశం ఉన్న లేదా ప్రశ్నార్హమైన అంశాలను గుర్తించడం తేలికవుతుంది. 
  • ఉదాహరణకు పాలిటీలో..రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 73, 74లు ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వీటికి సంబంధించిన ప్రశ్నలు దాదాపు ప్రతి పోటీ పరీక్షలోనూ కనిపిస్తాయి. అలాగే తాజా సవరణలు, చట్టాలకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి అభ్యర్థులు ఆయా ఆర్టికల్స్‌ ముఖ్య ఉద్దేశం తెలుసుకుంటూ.. తాజా పరిణామాలతో సమన్వయం చేసుకుంటూ చదవాలి. అదే విధంగా కేంద్ర–రాష్ట్ర సంబంధాలపైనా సమకాలీన అంశాల సమ్మేళనంగా ప్రశ్నలు అడిగే ధోరణి కనిపిస్తోంది. దీనికి అనుగుణంగా అభ్యర్థులు తాజా పరిణామాలను రాజ్యాంగంలోని సంబంధిత ఆర్టికల్స్‌తో అనుసంధానిస్తూ చదవాలి. మూల భావనలు, తాజా పరిణామాలు రెండింటిపైనా పట్టు సాధించాలి.

కరెంట్‌ అఫైర్స్‌

  • ప్రస్తుతం పోటీ పరీక్షల్లో ముఖ్యమైన సదస్సులు, వ్యక్తులు, అవార్డులు, ప్రదేశాలు వంటి కరెంట్‌ అఫైర్స్‌కు ప్రాధాన్యం లభిస్తోంది. వీటికి కూడా ప్రత్యేకంగా అధ్యయనం సాగించాలి. వార్తల్లో వ్యక్తులు, సదస్సులు, ప్రదేశాలు, అవార్డులు..వాటి ప్రాధాన్యాన్ని గుర్తించాలి. అలాంటి అంశాలకే ప్రిపరేషన్‌లో ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. అదే విధంగా ఆయా అవార్డులు, వ్యక్తులకు జాతీయంగా, అంతర్జాతీయంగా ఉన్న ప్రాధాన్యం తెలుసుకోవాలి. 
  • కరెంట్‌ అఫైర్స్‌లో.. ద్వైపాక్షిక సంబంధాలు, ఒప్పందాలపైనా దృష్టిపెట్టాలి. వీటివల్ల మన దేశానికి కలిగే ప్రయోజనాలను అవగాహన చేసుకుంటూ..అధ్యయనం సాగించాలి. వాస్తవానికి కరెంట్‌ అఫైర్స్‌ విభాగంలో ‘జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్య అంశాలు’ అనే పేరుతో సిలబస్‌ను పేర్కొంటున్నారు. ఆయా ‘ప్రాధాన్య’ అంశాలను గుర్తించే నేర్పు సొంతం చేసుకోవాలి. అంతర్జాతీయంగా, జాతీయంగా జరిగే ప్రతి సమావేశాన్ని, లేదా సంఘటనను చదువుకుంటూ వెళ్లడం వల్ల ప్రయోజనం ఉండదు. ఆయా సంఘటనలు, సమావేశాల ప్రభావం, ప్రయోజనం, ఉద్దేశం ఆధారంగా.. ప్రాధాన్యం ఇవ్వాలి. 
  • బ్యాంకు పరీక్షల్లో బ్యాంకింగ్‌/ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌ పేరుతో ప్రశ్నలు అడుగుతున్నారు. వీటిలో పట్టు సాధించేందుకు బ్యాంకింగ్, ఆర్థిక రంగంలో ముఖ్య పరిణామాలు, దేశ ఆర్థిక ప్రగతిలో బ్యాంకింగ్‌ రంగం ఆవశ్యకతను తెలుసుకుంటూ చదవాలి. 

సమకాలీనం.. సమన్వయం
పోటీ పరీక్షల్లో సమకాలీన అంశాలతో సమ్మిళితం చేస్తూ ప్రశ్నలు అడిగే ధోరణి పెరుగుతోంది. ఉదాహరణకు ఆర్థిక రంగాన్నే పరిగణనలోకి తీసుకుంటే.. బ్యాంకింగ్‌ వ్యవస్థలో తాజా మార్పులకు సంబంధించిన ప్రశ్న అడిగితే.. ఆ మార్పులకు కారణం, మార్పులు జరిగిన అంశాలకు సంబంధించి ఆర్థిక శాస్త్రంలో పేర్కొన్న మూల భావనలు తెలియాల్సిన రీతిలో ప్రశ్నలు ఉంటున్నాయి. కాబట్టి అభ్యర్థులు అన్ని విభాగాలకు సంబంధించిన అంశాలను సమకాలీన పరిణామాలతో సమన్వయం చేసుకుంటూ అధ్యయనం సాగించాలి. 

సొంత నోట్స్‌
పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు సొంత నోట్స్‌ రాసుకోవడం చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఈ సొంత నోట్స్‌ రూపొందించుకునే విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ చూపాలి. పరీక్ష ముందు పునశ్చరణ చేసేటప్పుడు ఆ ముఖ్యాంశాలను చూడగానే పూర్తి సమాచారం మెదడులో మెదిలేలా నోట్స్‌ ఉండాలి. గణాంకాలన్నిం టినీ నోట్స్‌లో రాసుకోవడం కాకుండా..వాటికున్న ప్రాధాన్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. 

మెమొరీ టెక్నిక్స్‌
ప్రతి అభ్యర్థికి తనకంటూ సొంత మెమొరీ టెక్నిక్స్‌ ఉంటాయి. కొందరు విజువలైజేషన్‌ టెక్నిక్స్, కొందరికి మైండ్‌ మ్యాపింగ్‌(మనసులోనే ఆయా అంశాలను గుర్తుంచుకునే విధానం) వంటివి అనుసరిస్తారు. అదే విధంగా కొందరికి ఆయా అంశాలను టేబుల్స్, గ్రాఫ్స్‌లో రూపంలో రాసుకొని.. సులువుగా జ్ఞప్తికి తెచ్చుకునే లక్షణం ఉంటుంది. జనరల్‌ అవేర్‌నెస్‌ ప్రిపరేషన్‌లో..అభ్యర్థులు తమకు ఏది అనుకూలమో ఆ విధానాన్ని అనుసరించాలి. 

పేపర్‌ రీడింగ్‌
జనరల్‌ స్టడీస్, జనరల్‌ అవేర్‌నెస్‌ ప్రిపరేషన్‌లో మరో కీలక సాధనం.. న్యూస్‌ పేపర్‌ రీడింగ్‌. పత్రికల్లోని వార్తలు, ఎడిటోరియల్స్, ఇతర ముఖ్యమైన వ్యాసాలు చదివేటప్పుడు వాటి ఉద్దేశాన్ని గుర్తించాలి. ఆ తర్వాత వాటి సారాంశాన్ని పాయింట్ల రూపంలో నోట్స్‌ రాసుకోవాలి. ఒక వ్యాసానికి సంబంధించి ముఖ్య పాయింట్లను గుర్తించే క్రమంలో..విషయ ప్రాధానాన్ని గుర్తించాలి. 

అన్నింటికీ ప్రాధాన్యం
జనరల్‌ అవేర్‌నెస్‌ టాపిక్స్‌ ప్రిపరేషన్‌లో అభ్యర్థులు చేసే పొరపాటు.. తమకు ఆసక్తి లేని, లేదా క్లిష్టంగా భావించే అంశాలను విస్మరించడం. ప్రస్తుతం పోటీ పరీక్షల తీరును చూస్తే.. ఏ ఒక్క అంశాన్ని విస్మరించలేని పరిస్థితి నెలకొంది. కాబట్టి అభ్యర్థులు అన్ని అంశాలకు ప్రిపరేషన్‌ సాగించడం అలవర్చుకోవాలి. ఇలా.. పుస్తకాల ఎంపిక నుంచి న్యూస్‌ పేపర్‌ రీడింగ్‌ వరకూ.. అడుగడుగునా శాస్త్రీయంగా అడుగులు వేస్తే.. జనరల్‌ అవేర్‌నెస్‌లో పట్టు సాధించి.. విజయావకాశాలను మెరుగు పరచుకోవచ్చు.

స్పష్టతతో.. సులువుగా
జనరల్‌ స్టడీస్‌ అంటే ఓ మహా సముద్రం అనే భావన అభ్యర్థుల్లో నెలకొన్న మాట వాస్తవమే. ప్రిపరేషన్‌కు ఉపక్రమించే ముందే జీఎస్‌లోని సిలబస్‌ అంశాలపై స్పష్టత తెచ్చుకోవాలి. దాంతో సగం భయం దూరమవుతుంది. ఆ తర్వాత ఆయా పరీక్షల్లో లభిస్తున్న వెయిటేజీ ఆధారంగా ­సదరు టాపిక్స్‌ను శాస్త్రీయ దృక్పథంతో చదవాలి. కాన్సెప్ట్‌లు, కాంటెంపరరీ ఇష్యూస్‌ను సమ్మిళితం చేసుకుంటూ చదవడం ఎంతో మేలు చేస్తుంది. ఏ టాపిక్‌నైనా ముఖ్యాంశాలతో టేబుల్స్, గ్రాఫ్స్‌ రూపంలో నోట్స్‌ రాసుకుంటే.. రివిజన్‌ సమయంలో ఉపయుక్తంగా ఉంటుంది.
–శ్రీరామ్, డైరెక్టర్, శ్రీరామ్స్‌ ఐఏఎస్‌ అకాడమీ

చ‌ద‌వండి: Exam Guidance: కొత్త సంవత్సరంలో.. వీటిపై ప‌ట్టు.. కొలువు కొట్టు !

Published date : 26 Jan 2022 06:42PM

Photo Stories