Skip to main content

Exam Guidance: కొత్త సంవత్సరంలో.. వీటిపై ప‌ట్టు.. కొలువు కొట్టు !

Exam Guidance
Exam Guidance

క్యాలెండర్‌లో మరో కొత్త సంవత్సరం వచ్చేసింది. ఈ ఏడాది కూడా పలు నోటిఫికేషన్లు ఉద్యోగార్థులను పలకరించనున్నాయి. ముఖ్యంగా బ్యాచిలర్‌ డిగ్రీ అర్హతతో భర్తీ చేసే యూపీఎస్సీ సివిల్స్‌ మొదలు ఎస్‌ఎస్‌సీ, రాష్ట పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు, ఎస్‌బీఐ, ఐబీపీఎస్‌ వరకూ.. పలు నియామక సంస్థలు ఉద్యోగ ప్రకటనలు ఇవ్వనున్నాయి. అభ్యర్థులు నోటిఫికేషన్లకు అనుగుణంగా సన్నద్ధమైతే కొత్త సంవత్సరంలో కొలువుల కల నెరవేరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో.. ఆయా ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు, అర్హతలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, విజయానికి మార్గాలపై ప్రత్యేక కథనం..

  • యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ, బ్యాంకు నోటిఫికేషన్లు
  • రాష్ట్ర స్థాయిలోనూ పలకరించనున్న ఉద్యోగ ప్రకటనలు
  • ముందస్తు వ్యూహం, ప్రణాళికతో విజయానికి బాటలు

సర్కారీ కొలువు సాధించడం.. సుస్థిర భవితను సొంతం చేసుకోవడం.. ప్రతి ఒక్కరి కల! బీటెక్‌ వంటి టెక్నికల్‌ కోర్సులు మొదలు బీఏ, బీకాం, బీఎస్సీ విద్యార్థుల వరకూ.. ఎవరిని అడిగినా వచ్చే సమాధానం ఇదే! ఇందుకోసం ఆయా రిక్రూట్‌మెంట్‌ సంస్థల నోటిఫికేషన్లకు సన్నద్ధమవుతూ విజయం కోసం నిరంతరం ప్రిపరేషన్‌ కొనసాగిస్తుంటారు. యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ(స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌) నిర్దిష్ట క్యాలెండర్‌ విధానంలో ఎంపిక ప్రకియ చేపడుతున్నాయి. ఉద్యోగార్థులు ఎంతో క్రేజ్‌గా భావించే బ్యాంకింగ్‌ రంగంలో సైతం ఐబీపీఎస్, ఎస్‌బీఐల నుంచి ప్రతి ఏటా నోటిఫికేషన్లు వస్తూనే ఉన్నాయి. కాబట్టి వీటిని లక్ష్యంగా చేసుకున్న అభ్యర్థులు నోటిఫికేషన్లు వెలువడే వరకు ఎదురు చూడకుండా.. ఆయా పరీక్షల సిలబస్‌కు అనుగుణంగా ముందుగానే నిర్దిష్ట ప్రణాళికతో ప్రిపరేషన్‌ సాగించాలి.

యూపీఎస్సీ.. నిర్దిష్ట క్యాలెండర్‌

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ).. అఖిల భారత సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్‌ తదితర సర్వీసులకు నిర్వహించే సివిల్స్‌ మొదలు, ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్, ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్, కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీస్‌ ఎగ్జామినేషన్, కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీస్‌ ఎగ్జామినేషన్‌.. ఇలా పలు విభాగాల్లో పోస్ట్‌ల భర్తీకి ఎంపిక ప్రక్రియ చేపడుతోంది.


చ‌ద‌వండి: Civils Prelims Exam: వీటిపై దృష్టిపెడితే... విజ‌యం మీదే..

సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌

  • ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్‌ఎస్, ఐఎఫ్‌ఎస్‌ తదితర సివిల్‌ సర్వీసుల్లో పోస్ట్‌ల భర్తీకి నిర్వహించే పరీక్ష ఇది. ఎంపిక ప్రక్రియలో మూడు దశలు.. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఉంటాయి. ప్రిలిమ్స్‌ పరీక్షను ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో రెండు పేపర్లు.. జనరల్‌ స్టడీస్, సివిల్‌ సర్వీసెస్‌ అప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఉంటాయి. ఒక్కో పేపర్‌కు రెండు వందల మార్కుల చొప్పున మొత్తం నాలుగు వందల మార్కులకు పరీక్ష జరుగుతుంది.
  • ప్రిలిమ్స్‌లో విజయం సాధించిన వారికి తదుపరి దశలో మెయిన్‌ పరీక్ష ఉంటుంది. ఇది ఏడు పేపర్లలో డిస్క్రిప్టివ్‌ విధానంలో జరుగుతుంది. వీటితోపాటు ఇంగ్లిష్, స్థానిక భాష పేపర్లు అర్హత పరీక్షలుగా ఉంటాయి. మెయిన్‌ పరీక్ష 1750మార్కులకు నిర్వహిస్తారు. మెయిన్‌లో మెరిట్‌ జాబితాలో నిలిచిన వారికి చివరగా పర్సనాలిటీ టెస్ట్‌(పర్సనల్‌ ఇంటర్వ్యూ) ఉంటుంది. దీనికి కేటాయించిన మార్కులు 275. మెయిన్, పర్సనల్‌ ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా.. విజేతలను ప్రకటించి సర్వీస్‌లు కేటాయిస్తారు.

ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌

సివిల్‌ సర్వీసెస్‌ తర్వాత అంతటి ప్రాముఖ్యం సంతరించుకున్న సర్వీస్‌.. ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌. సివిల్‌ సర్వీసెస్‌ మాదిరిగానే ఇందులోనూ.. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ.. ఇలా మూడు దశలుగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఐఎఫ్‌ఎస్, సివిల్స్‌కు ప్రిలిమినరీ పరీక్ష ఒకటే ఉంటుంది. ఆ తర్వాత ఐఎఫ్‌ఎస్‌ మెయిన్‌కు ప్రత్యేకంగా పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఆరు పేపర్లు.. జనరల్‌ ఇంగ్లిష్, జనరల్‌ నాలెడ్జ్, రెండు ఆప్షనల్‌ సబ్జెక్ట్‌లకు సంబంధించి నాలుగు పేపర్లు ఉం టాయి. వీటిలో జనరల్‌ ఇంగ్లిష్, జనరల్‌ నాలెడ్జ్‌ పేపర్లకు 300 మార్కులు చొప్పున; నాలుగు ఆప్షనల్‌ పేపర్లకు 200 మార్కులు చొప్పున కేటాయించారు. మెయిన్‌లో ప్రతిభ చూపితే  చివరగా పర్సనాలిటీ టెస్ట్‌ ఉంటుంది. మెయిన్, ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా తుది విజేతలను ప్రకటిస్తారు.

ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌

బీటెక్‌ అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఇంజనీరింగ్‌ విభాగాల్లో కొలువుదీరే అవకాశం కల్పించే పరీక్ష.. ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌. ఈ పరీక్ష కూడా మూడు దశలుగా ఉంటుంది. మొదటి దశలో ఆబ్జెక్టివ్‌ విధానంలో జనరల్‌ స్టడీస్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ అప్టిట్యూడ్‌ పేపర్‌(పేపర్‌–1), ఇంజనీరింగ్‌ పేపర్‌ (పేపర్‌–2)లు ఉంటాయి. వీటిలో ప్రతిభ ఆధారంగా తదుపరి దశలో మెయిన్‌ ఎగ్జామినేషన్‌ను నిర్వహిస్తారు. మెయిన్‌ పరీక్షలో ఇంజనీరింగ్‌ సబ్జెక్ట్‌ నుంచే రెండు పేపర్లు ఉంటాయి. మెయిన్‌లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులకు చివరి దశలో పర్సనాలిటీ టెస్ట్‌ ఉంటుంది. ఇందులోనూ ప్రతిభ చూపితే కేంద్ర ప్రభుత్వ శాఖల్లో గ్రూప్‌–ఎ, గ్రూప్‌–బి కేడర్‌లో ఇంజనీర్లుగా కొలువు దీరొచ్చు.

కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ పరీక్ష

ఎంబీబీఎస్‌ పూర్తి చేసుకున్న తర్వాత ప్రభుత్వ కొలువు సొంతం చేసుకోవాలనుకునే వారికి చక్కటి మార్గం.. కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌. ఈ పరీక్ష ద్వారా కేంద్ర ప్రభుత్వ శాఖల్లో గ్రూప్‌–ఎ హోదాలో మెడికల్‌ ఆఫీసర్లుగా ఉద్యోగాలు పొందొచ్చు. ఈ పరీక్ష రెండు దశల్లో జరుగుతుంది. అవి.. రాత పరీక్ష, పర్సనాలిటీ టెస్ట్‌. రాత పరీక్షను రెండు పేపర్లలో నిర్వహిస్తారు. ఇందులో చూపిన ప్రతిభ ఆధారంగా మెరిట్‌ జాబితా రూపొందించి.. అందులో చోటు సాధించిన వారికి పర్సనాలిటీ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఈ రెండింటిలోనూ పొందిన మెరిట్‌ ఆధారంగా.. తుది విజేతలను ఖరారు చేస్తారు.

కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌

దేశ త్రివిధ దళాల్లో ఆఫీసర్‌ కేడర్‌ పోస్ట్‌ల భర్తీకి నిర్వహించే పరీక్ష.. కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌. ఈ ఎంపిక ప్రక్రియలో విజయం ద్వారా ఇండియన్‌ మిలిటరీ అకాడమీ, నేవల్‌ అకాడమీ, ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ, ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీల్లో ప్రవేశం లభిస్తుంది. అక్కడ నిర్దేశిత సమయంలో శిక్షణ తర్వాత ఆయా దళాల్లో పర్మనెంట్‌ కమిషన్డ్‌ ర్యాంకుతో కొలువు ఖరారు చేస్తారు. ఈ పరీక్షను రెండు దశల్లో నిర్వహిస్తారు. మొదటి దశలో రాత పరీక్ష జరుగుతుంది. రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డ్‌లు నిర్వహించే ఎంపిక ప్రక్రియలోనూ విజయం సాధించాల్సి ఉంటుంది.

  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: http://www.upsc.gov.in

ఐబీపీఎస్, ఎస్‌బీఐ పరీక్షలు

  • ఉద్యోగార్థులకు క్రేజీ కెరీర్‌.. బ్యాంకింగ్‌ రంగం. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లరికల్, పీఓ కేడర్‌ పోస్ట్‌ల భర్తీకి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌(ఐబీపీఎస్‌) క్రమం తప్పకుండా నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. 
  • దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) కూడా ప్రత్యేక నోటిఫికేషన్‌ల ద్వారా క్లరికల్, పీఓ కేడర్‌ పోస్ట్‌ల భర్తీ చేపడుతోంది.


చ‌ద‌వండి: IBPS Jobs: త్వరలో క్లర్క్, ఎస్‌వో పోస్టులకు పరీక్షలు.. సిలబస్‌ విశ్లేషణ, ప్రిపరేషన్ వివ‌రాలు ఇలా..

ఐబీపీఎస్‌.. ఎంపిక ఇలా

 

  • ఐబీపీఎస్‌ క్లరికల్‌ పోస్ట్‌ల ప్రిలిమ్స్‌ పరీక్షలో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్, న్యూమరికల్‌ ఎబిలిటీ, రీజనింగ్‌ ఎబిలిటీ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇందులో ప్రతిభ ఆధారంగా మెయిన్‌ పరీక్ష నిర్వహిస్తారు. మెయిన్‌లో జనరల్‌/ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్, జనరల్‌ ఇంగ్లిష్, రీజనింగ్‌ ఎబిలిటీ అండ్‌ కంప్యూటర్‌ అప్టిట్యూడ్, క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. వీటిలో మెరిట్‌ ఆధారంగా అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి.. తుది విజేతలను ఖరారు చేస్తారు.
  • ఐబీపీఎస్‌ పీఓ పోస్ట్‌లకు ఎంపిక ప్రక్రియలోనూ ప్రిలిమినరీ, మెయిన్‌ దశలు ఉంటాయి. ప్రిలిమినరీలో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ, రీజనింగ్‌ ఎబిలిటీల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రిలిమినరీలో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులకు మెయిన్‌ ఎగ్జామ్‌ నిర్వహిస్తారు. మెయిన్‌లో రీజనింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ అప్టిట్యూడ్‌; జనరల్‌/ఎకానమీ/బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌; ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌; డేటా అనాలిసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రిటేషన్‌ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. వీటికి అదనంగా ఎస్సే రైటింగ్‌ పేపర్‌ కూడా ఉంటుంది. రాత పరీక్షలో చూపిన మెరిట్‌ ఆధారంగా ఇంటర్వ్యూ నిర్వహించి నియామకాలు ఖరారు చేస్తారు.
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.ibps.in

ఎస్‌బీఐ ఎంపిక ప్రక్రియ.. ఇలా

 

  • ఎస్‌బీఐ క్లరికల్‌ పోస్ట్‌లకు ప్రిలిమ్స్, మెయిన్స్‌ పరీక్షలను నిర్వహిస్తోంది. ప్రిలిమ్స్‌ పరీక్షలో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్, న్యూమరికల్‌ ఎబిలిటీ, రీజనింగ్‌ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు అడుగుతారు. మెయిన్‌లో.. జనరల్‌ ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్, జనరల్‌ ఇంగ్లిష్, క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్, రీజనింగ్‌ ఎబిలిటీ అండ్‌ కంప్యూటర్‌ అప్టిట్యూడ్‌ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. 
  • ఎస్‌బీఐ ప్రొబేషనరీ ఆఫీసర్‌ పోస్ట్‌లకు కూడా ప్రిలిమ్స్, మెయిన్‌ పరీక్షలను నిర్వహిస్తోంది. ప్రిలిమినరీ పరీక్షలో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్, రీజనింగ్‌ ఎబిలిటీ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇందులో మెరిట్‌ ఆధారంగా మెయిన్‌ పరీక్ష నిర్వహిస్తారు. మెయిన్‌లో రీజనింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ అప్టిట్యూడ్‌; డేటా అనాలిసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రిటేషన్‌; జనరల్‌/ఎకానమీ/బ్యాంకింగ్‌ అవేర్‌నెస్, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. వీటితోపాటు పాటు లెటర్‌ రైటింగ్, ఎస్సే రైటింగ్‌ ఉంటాయి. వీటిలో ప్రతిభ ఆధారంగా చివరగా ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
  • ఎస్‌బీఐ నోటిఫికేషన్ల వివరాలకు వెబ్‌సైట్‌: https://bank.sbi/careers, https://www.sbi.co.in/careers

ఎస్‌ఎస్‌సీ.. కేంద్ర కొలువులకు మార్గం

కేంద్ర ప్రభుత్వ శాఖల్లో కొలువు సొంతం చేసుకునేందుకు మరో మార్గం.. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ). కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో సివిల్‌ సర్వీసెస్‌ తర్వాత స్థాయి ఉద్యోగాల భర్తీకి ఎస్‌ఎస్‌సీ ఎంపిక ప్రక్రియ చేపడుతుంది. డిగ్రీ అర్హతతో ఎస్‌ఎస్‌సీ నిర్వహించే పరీక్షల్లో ప్రధానమైంది కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌ ఎగ్జామినేషన్‌(సీజీఎల్‌). దీనిద్వారా గ్రూపు–బీ, సీ ఉద్యోగాలను భర్తీ చేస్తారు.

  • సీజీఎల్‌ ద్వారా అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్, ఇన్‌స్పెక్టర్‌(ఇన్‌కం ట్యాక్స్, సెంట్రల్‌ ఎక్సైజ్, ప్రివెంటివ్‌ ఆఫీసర్స్, ఎగ్జామినర్, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పోస్ట్‌), అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్, వివిధ మంత్రిత్వ శాఖల్లో అసిస్టెంట్లు, అసిస్టెంట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(సీబీఐ, నార్కోటిక్స్, ఎన్‌ఐఏ), డివిజినల్‌ అకౌంటెంట్, స్టాటిస్టికల్‌ ఇన్వెస్టిగేటర్స్, ఆడిటర్స్, జూనియర్‌ అకౌంటెంట్, సీనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్, ట్యాక్స్‌ అసిస్టెంట్‌ తదితర పోస్టులను సీజీఎల్‌ పరీక్ష ద్వారానే భర్తీ చేస్తారు. 
  • ఈ పోస్టులకు ఆయా ఉద్యోగాలను బట్టి మూడు/నాలుగు దశల్లో(టైర్‌–1, టైర్‌–2, టైర్‌–3, టైర్‌–4) పరీక్ష నిర్వహిస్తారు. మొదట టైర్‌–1 ఆన్‌లైన్‌ పరీక్ష ఉంటుంది. ఇందులో నిర్దేశిత మార్కులు సాధించిన వారిని తర్వాతి దశ టైర్‌–2కు పిలుస్తారు. ఇందులో కూడా అర్హత సాధిస్తే.. టైర్‌–3(డిస్క్రిప్టివ్‌ పరీక్ష)కు హాజరవ్వాలి. చివరగా కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌/స్కిల్‌ టెస్ట్‌/డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఉంటాయి.
  • టైర్‌–1లో ఒక పేపర్‌లో పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌(25 ప్రశ్నలు), జనరల్‌ అవేర్‌నెస్‌(25 ప్రశ్నలు), క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌(25 ప్రశ్నలు), ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌(25 ప్రశ్నలు) నుంచి ప్రశ్నలు అడుగుతారు. 
  • టైర్‌–2ను నాలుగు పేపర్లుగా నిర్వహిస్తారు. టైర్‌–2 పేపర్‌–1లో క్వాంటిటేటివ్‌ ఎబిలిటీస్‌ నుంచి 100 ప్రశ్నలు, పేపర్‌–2 ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌లో 200 ప్రశ్నలు, పేపర్‌–3 స్టాటిస్టిక్స్‌లో 100 ప్రశ్నలు, పేపర్‌–4ను జనరల్‌ స్టడీస్‌ (ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌)లో 100 ప్రశ్నలతో నిర్వహిస్తారు. 
  • టైర్‌–2లోని పేపర్‌–1, పేపర్‌–2లు అభ్యర్థులందరూ హాజరవ్వాల్సిన పేపర్లు. పేపర్‌–3, పేపర్‌–4లు మాత్రం నిర్దేశిత పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రాయాల్సి ఉంటుంది. జూనియర్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్, స్టాటిస్టికల్‌ ఇన్వెస్టిగేటర్‌ పోస్ట్‌ల అభ్యర్థులు పేపర్‌–3ని, అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ పోస్ట్‌ల అభ్యర్థులు పేపర్‌–4కు హాజరవ్వాలి.
  • టైర్‌–3 పరీక్ష డిస్క్రిప్టివ్‌ విధానంలో జరుగుతుంది. ఇందులో ఎస్సే రైటింగ్, ప్రెసిస్‌ రైటింగ్, లెటర్‌ రైటింగ్, అప్లికేషన్‌ రైటింగ్‌ విభాగాలు ఉంటాయి. 
  • టైర్‌–4గా స్కిల్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఇందులో కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్, డేటా ఎంట్రీ స్పీడ్‌ టెస్ట్‌లను నిర్వహిస్తారు.
  • వెబ్‌సైట్‌: http://ssc.nic.in

పీఎస్‌యూ వయా గేట్‌

ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలకు సరైన మార్గం.. గ్రాడ్యుయేట్‌ అప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజనీరింగ్‌(గేట్‌). ఈ పరీక్షలో స్కోర్‌ ఆధారంగా.. మహారత్న, నవరత్న, మినీరత్న హోదాలు పొందిన ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు ఇతర పీఎస్‌యూలలోనూ ట్రైనీ ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ వంటి ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. గేట్‌లో జనరల్‌ అప్టిట్యూడ్, ఇంజనీరింగ్‌ మ్యాథమెటిక్స్, సబ్జెక్ట్‌ పేపర్‌(సంబంధిత ఇంజనీరింగ్‌ విభాగం) నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇందులో పొందిన స్కోర్‌ ఆధారంగా ఆయా పీఎస్‌యూలకు దరఖాస్తు చేసుకుంటే.. మలి దశలో గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూలు నిర్వహించి నియామకాలు ఖరారు చేస్తున్నారు.

చ‌ద‌వండి: Civils Prelims 2021: సివిల్స్‌ ప్రిలిమ్స్‌... ఈ నాలుగు అంశాలే సక్సెస్‌కు కీలకం

Published date : 18 Jan 2022 06:11PM

Photo Stories