Skip to main content

IBPS Jobs: త్వరలో క్లర్క్, ఎస్‌వో పోస్టులకు పరీక్షలు.. సిలబస్‌ విశ్లేషణ, ప్రిపరేషన్ వివ‌రాలు ఇలా..

How to Crack IBPS Clerk and SO Exams: preparation Guidence, bank exam pattern details here
How to Crack IBPS Clerk and SO Exams: preparation Guidence, bank exam pattern details here

ఆకర్షణీయమైన వేతనం, మంచి కెరీర్‌ సొంతం చేసుకునేందుకు మార్గం.. బ్యాంకింగ్‌ రంగం. అందుకే బ్యాంకు కొలువులు సాధించేందుకు లక్షల మంది అభ్యర్థులు పోటీపడుతుంటారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పోస్టుల భర్తీకి ఐబీపీఎస్‌ (ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌) ఏటా నియామక ప్రక్రియ (సీఆర్‌పీ) చేపడుతోంది. అందులో భాగంగా త్వరలో క్లర్క్‌ పోస్టులకు, ఎస్‌వో (స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌) పోస్టులకు ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో.. క్లర్క్, ఎస్‌వో పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఉపయోగపడేలా ఆయా పరీక్షల విధానం, సిలబస్‌ విశ్లేషణ,ఉమ్మడి ప్రిపరేషన్‌పై ప్రత్యేక కథనం.. 

  • త్వరలో ఐబీపీఎస్‌ క్లర్క్, ఎస్‌వో పోస్టులకు ఆన్‌లైన్‌ పరీక్షలు
  • ఉమ్మడి ప్రిపరేషన్‌తో రెండు పోస్టులకూ పోటీ పడొచ్చు
  • కామన్‌ సిలబస్‌ కలిసొస్తుందంటున్న నిపుణులు

బ్యాంకుల్లోని ఆర్థిక కార్యకలాపాల్లో పాలుపంచుకోవడం, నగదు లావాదేవీలు, ఖాతాదారులకు సేవలు, వినియోగదారులకు ప్రత్యక్ష సేవలు.. క్లర్క్‌లు నిర్వహిస్తారు. బ్యాంకుల్లోని హెచ్‌ఆర్, ఐటీ, లా, మార్కెటింగ్‌ తదితర ప్రత్యేకమైన విధులను స్పెషలిస్ట్‌ ఆఫీసర్లు(ఎస్‌వో)లు చేపడతారు. 
క్లర్క్‌ పోస్టులకు ప్రిలిమినరీ, మెయిన్‌ పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎస్‌వో పోస్టుల భర్తీకి ప్రిలిమినరీ, మెయిన్‌ పరీక్షలు, ఇంటర్వ్యూలతో కూడిన మూడంచెల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

చ‌దవండి: Job Trends: ఫైనాన్షియల్‌ రంగం.. కొలువులు, అర్హతలు, నైపుణ్యాలు

కామన్‌ సిలబస్‌

  • క్లర్క్, ఎస్‌వో ప్రిలిమినరీ పరీక్షల సిలబస్‌లో ఉమ్మడి టాపిక్స్‌ ఉన్నాయి. క్లర్క్‌ ప్రిలిమినరీ పరీక్షలో.. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్, న్యూమరికల్‌ ఎబిలిటీ, రీజనింగ్‌ ఎబిలిటీల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఎస్‌వో–ఐటీ ఆఫీసర్, అగ్రికల్చర్‌ ఫీల్డ్‌ ఆఫీసర్, హెచ్‌ఆర్‌/పర్సనల్‌ ఆఫీసర్, మార్కెటింగ్‌ ఆఫీసర్‌ ప్రిలిమినరీ పరీక్షల్లోనూ.. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్, రీజనింగ్‌ ఎబిలిటీల నుంచి ప్రశ్నలు ఎదురవుతాయి. 
  • ఎస్‌వో–లా ఆఫీసర్, రాజ్‌భాషా అధికారి ప్రశ్నపత్రంలో మాత్రం క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌కు బదులు జనరల్‌ అవేర్‌నెస్‌/బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌ల నుంచి ప్రశ్నలు ఇస్తారు. 
  • క్లర్క్‌ మెయిన్‌ పరీక్షలో.. జనరల్‌/ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్, జనరల్‌ ఇంగ్లిష్, రీజనింగ్‌ ఎబిలిటీ/కంప్యూటర్‌ అప్టిట్యూడ్‌ సబ్జెక్టులుండగా.. ఎస్‌వో మెయిన్‌ పరీక్షలో ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌పై ప్రశ్నలు ఇవ్వనున్నారు. 
  • రెండు పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఉమ్మడి ప్రిపరేషన్‌ కొనసాగిస్తే.. ఒకే సమయంలో రెండు పరీక్షల్లోనూ మెరుగైన ప్రతిభ చూపే అవకాశం ఉంటుంది.

ఐబీపీఎస్‌ క్లర్క్‌

  • ఐబీపీఎస్‌ క్లర్క్‌ ఎంపిక ప్రక్రియలో రెండు దశలు.. ప్రిలిమినరీ, మెయిన్‌ ఉంటాయి. క్లర్క్‌ పోస్టులకు గుర్తింపు పొందిన కళాశాల/యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. వయోపరిమితి: 20–28 ఏళ్లు. 

ప్రిలిమినరీ పరీక్ష

క్లర్క్‌ ప్రిలిమినరీ పరీక్ష ఆన్‌లైన్‌ విధానం(కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌)లో జరుగుతుంది. ఈ పరీక్షలో మూడు విభాగాల నుంచి మొత్తం 100 ప్రశ్నలకుగాను 100 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం గంట(60 నిమిషాలు). 

  • ఇంగ్లిష్‌ 30 ప్రశ్నలు–30 మార్కులు, న్యూమరికల్‌ ఎబిలిటీ 35 ప్రశ్నలు–35 మార్కులకు, రీజనింగ్‌ ఎబిలిటీ 35 ప్రశ్నలు–35 మార్కులకు పరీక్ష ఉంటుంది. 
  • నెగిటివ్‌ మార్కుల విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత విధిస్తారు. 

చ‌దవండి: Job Trends: ఫైనాన్షియల్‌ రంగం.. కొలువులు, అర్హతలు, నైపుణ్యాలు

మెయిన్‌ పరీక్ష

  • క్లర్క్‌ మెయిన్‌ పరీక్షను ఆన్‌లైన్‌(కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌) విధానంలో నిర్వహిస్తారు. మొత్తం 190 ప్రశ్నలకుగాను 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం 160 నిమిషాలు. 
  • జనరల్‌/ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌ 50 ప్రశ్నలు–50 మార్కులు, జనరల్‌ ఇంగ్లిష్‌ 40 ప్రశ్నలు–40 మార్కులు, రీజనింగ్‌ ఎబిలిటీ అండ్‌ కంప్యూటర్‌ అప్టిట్యూడ్‌ 50 ప్రశ్నలు–60 మార్కులు, క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌ 50 ప్రశ్నలు–50 మార్కులకు ఉంటాయి. నెగిటివ్‌ మార్కుల విధానం అమల్లో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కుల నుంచి నాలుగో వంతు మార్కుల కోత విధిస్తారు.

ముఖ్య సమాచారం

క్లర్క్‌ ప్రిలిమినరీ పరీక్ష తేదీలు: 2021 డిసెంబర్‌ 12, 18, 19 తేదీల్లో
మెయిన్‌ పరీక్ష తేదీ: 2022 జనవరి/ఫిబ్రవరి
 

చ‌దవండి: Banks - Guidance

ఎస్‌వో(స్పెషలిస్ట్‌ ఆఫీసర్స్‌)

  • ఐబీపీఎస్‌ ఎస్‌ఓ నియామక ప్రక్రియ ద్వారా ఆయా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో–ఐటీ ఆఫీసర్,అగ్రికల్చరల్‌ ఫీల్డ్‌ ఆఫీసర్, రాజ్‌ భాషా అధికారి, లా ఆఫీసర్, హెచ్‌ఆర్‌/పర్సనల్‌ ఆఫీసర్, మార్కెటింగ్‌ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేస్తుంది. 
  • కనీస విద్యార్హత: ఐటీ ఆఫీసర్‌ పోస్టుకు నాలుగేళ్ల ఇంజనీరింగ్‌ డిగ్రీ, అగ్రికల్చర్‌ ఫీల్డ్‌ ఆఫీసర్‌కు వ్యవసాయ, అనుబంధ విభాగంలో నాలుగేళ్ల డిగ్రీ, రాజ్‌భాషా అధికారి పోస్టుకు హిందీ/సంస్కృతంలో పీజీ, లా ఆఫీసర్‌–‘లా’లో బ్యాచిలర్‌ డిగ్రీ, హెచ్‌ఆర్‌/ పర్సనల్‌ ఆఫీసర్‌ పోస్టుకు హెచ్‌ఆర్, పర్సనల్‌ మేనేజ్‌మెంట్‌ తదితర విభాగాల్లో పీజీ లేదా రెండేళ్ల పీజీ డిప్లొమా, మార్కెటింగ్‌ ఆఫీసర్‌కు పీజీలో ఎంబీఏ(మార్కెటింగ్‌) లేదా మార్కెటింగ్‌ స్పెషలైజేషన్‌తో రెండేళ్ల పీజీ డిప్లొమా ఉండాలి. వయోపరిమితి: 20–30ఏళ్లు.

ప్రిలిమినరీ పరీక్ష

  • ఎస్‌వోలో వేర్వేరు పోస్టులు ఉండటంతో ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ పరీక్ష విధానం కూడా భిన్నంగా ఉంటుంది. ప్రశ్నల సంఖ్య,మార్కుల్లో తేడా లేకున్నా.. సబ్జెక్టులు మాత్రం వేర్వేరుగా ఉంటాయి. 
  • ఐటీ ఆఫీసర్, అగ్రికల్చర్‌ ఫీల్డ్‌ ఆఫీసర్, హెచ్‌ఆర్‌/పర్సనల్‌ ఆఫీసర్, మార్కెటింగ్‌ ఆఫీసర్‌ పోస్టులకు ప్రిలిమ్స్‌ పరీక్ష 150 ప్రశ్నలు–125 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో.. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 50 ప్రశ్నలు–25 మార్కులు, రీజనింగ్‌ ఎబిలిటీ 50 ప్రశ్నలు–50 మార్కులు, క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌ 50 ప్రశ్నలు–50 మార్కులకు ఉంటాయి. పరీక్ష సమయం 120 నిమిషాలు.
  • లా ఆఫీసర్, రాజభాష అధికారి పోస్టులకు ప్రిలిమినరీ పరీక్ష 150 ప్రశ్నలు–125 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 50 ప్రశ్నలు–25 మార్కులు, రీజనింగ్‌ 50 ప్రశ్నలు–50 మార్కులు, జనరల్‌ అవేర్‌నెస్‌(బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌) 50 ప్రశ్నలు–50 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం 120 నిమిషాలు.

మెయిన్‌ పరీక్ష

 

  • రాజ్‌ భాషా అధికారి మినహా మిగతా పోస్టులకు ఒకే విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. లా, ఆఫీసర్, ఐటీ ఆఫీసర్, అగ్రికల్చర్‌ ఫీల్డ్‌ ఆఫీసర్, హెచ్‌ఆర్‌/పర్సనల్‌ ఆఫీసర్, మార్కెటింగ్‌ ఆఫీసర్‌ పోస్టులకు ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌ నుంచి 60 ప్రశ్నలు–60 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం 45 నిమిషాలు. రాజ్‌భాషా అధికారి పోస్టుకు ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌కు సంబంధించిన 45 ఆబ్జెక్టివ్, 2 డిస్క్రిప్టివ్‌ ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 60 మార్కులకు 60 నిమిషాల పాటు పరీక్ష నిర్వహిస్తారు. 
  • నెగిటివ్‌ మార్కులు: ఈ పరీక్షలో నెగిటివ్‌ మార్కుల విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి సదరు ప్రశ్నకు కేటాయించిన మార్కుల నుంచి నాలుగోవంతు మార్కులను తగ్గిస్తారు. 
  • ఇంటర్వ్యూ: మెయిన్‌ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇది మొత్తం 100మార్కులకు ఉంటుంది. ఇందులో ప్రతిభ చూపిన అభ్యర్థులను తుది ఎంపిక చేస్తారు.

ముఖ్య సమాచారం

ఎస్‌వో ప్రిలిమ్స్‌ పరీక్ష తేదీలు:2021డిసెంబర్‌ 26
ఎస్‌వో మెయిన్‌ పరీక్ష తేదీ: 2022 జనవరి 30

ఉమ్మడి ప్రిపరేషన్‌!

  • ఇంగ్లిష్‌: ఐబీపీఎస్‌ క్లర్క్, ఎస్‌వో పరీక్షల్లో ఇంగ్లిష్‌ ముఖ్యమైన సబ్జెక్ట్‌. ఇందులో రీడింగ్‌ కాంప్రెహెన్షన్, పారా జంబుల్స్, క్లోజ్‌ టెస్ట్, సెంటెన్స్‌ ఇంప్రూవ్‌మెంట్, ఫిల్‌ ఇన్‌ ది బ్లాంక్స్, స్పాటింగ్‌ ద ఎర్రర్స్‌ టాపిక్స్‌ ముఖ్యమైనవి. వొకాబ్యులరీ, గ్రామర్‌ అంశాల్లో అభ్యర్థి అవగాహనను పరీక్షించే విధంగా ప్రశ్నలు అడుగుతారు. స్పాటింగ్‌ ద ఎర్రర్స్, ఇడియమ్స్‌ అండ్‌ ప్రేసెస్, సినానిమ్స్, ఆంటోనిమ్స్, సెంటెన్స్‌ కరెక్షన్, సెంటెన్స్‌ రీ అరేంజ్‌మెంట్, వన్‌ వర్డ్‌ సబ్‌స్టిట్యూట్స్‌ను బాగా నేర్చుకోవాలి. 
  • రీజనింగ్‌ ఎబిలిటీ: క్లర్క్, ఎస్‌వో పరీక్షల్లో అభ్యర్థుల విశ్లేషణ, తార్కిక సామర్థ్యాన్ని పరీక్షించేలా రీజనింగ్‌ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఇందులో కోడింగ్,డీకోడింగ్, డైరెక్షన్‌ టెస్ట్, బ్లడ్‌ రిలేషన్, సిలాయిజమ్స్, సీటింగ్‌ అరేంజ్‌మెంట్స్, పజిల్స్, ఇన్‌పుట్‌ అండ్‌ అవుట్‌పుట్, డెసిషన్‌ మేకింగ్, సింబల్స్‌ అండ్‌ నొటేషన్స్, డేటా సఫీషియన్సీ, క్రిటికల్‌ రీజనింగ్‌ అంశాలు ఉంటాయి. 
  • న్యూమరికల్‌ ఎబిలిటీ/క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌: క్లర్క్, ఎస్‌వో పరీక్షల్లో ప్రశ్నల క్లిష్టతలో వ్యత్యాసం ఉంటుంది. క్లర్క్, ఎస్‌వో పరీక్షల్లో న్యూమరికల్‌ ఎబిలిటీలో సింప్లిఫికేషన్‌లు,అప్రాక్సిమేషన్‌లు, డేటా ఇంటర్‌ప్రిటేషన్, నంబర్‌ సిరీస్, వర్గ సమీకరణాలు ముఖ్యమైనవి. వీటి నుంచి దాదాపు 70 శాతం ప్రశ్నలు ఇచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు శాతాలు, సగటు, నిష్పత్తి–అనుపాతం, లాభ నష్టాలు, బారువడ్డీ, చక్రవడ్డీ, కాలం–దూరం, కాలం–పని, పర్ముటేషన్స్‌–కాంబినేషన్స్, సంభావ్యత తదితర అంశాలు కూడా కీలకమే. వీటì కి సంబంధించి ముందుగా అభ్యర్థులు బేసిక్స్‌ను క్షుణ్నంగా నేర్చుకోవాలి. బోడ్‌మస్‌ క్రమంలో క్యాలికులేషన్స్‌ వేగంగా, కచ్చితత్వంతో చేయగలగాలి. అలాగే వర్గాలు, ఘనాలు, వర్గమూలాలు గుర్తుంచుకోవాలి. వీటితోపాటు డేటా ఇంటర్‌ప్రిటేషన్, డేటా అనాలసిస్‌ అంశాలకు ప్రాధాన్యం ఉంటుంది. 
  • జనరల్‌ అవేర్‌నెస్‌: క్లర్క్‌ మెయిన్‌ పరీక్షలో మరో ముఖ్యమైన విభాగం.. జనరల్‌ అవేర్‌నెస్‌. ఎస్‌వో పోస్టులకు సంబంధించిన లా ఆఫీసర్, రాజ్‌భాషా అధికారి పరీక్షల్లోనూ ఇది ముఖ్యమైనది. సమకాలీన అంశాలపై పట్టు ఉన్న అభ్యర్థులు ఈ విభాగంలో సులభంగా స్కోర్‌ చేయవచ్చు. బ్యాంకింగ్‌ అవేర్‌నెస్, కరెంట్‌ అఫైర్స్, స్టాటిక్‌ జనరల్‌ నాలెడ్జ్‌పై ప్రశ్నలు అడుగుతారు. 

ప్రాక్టీస్‌తో వేగం

ఐబీపీఎస్‌ క్లర్క్స్‌ దరఖాస్తు చేసుకున్నవారిలో చాలామంది ఎస్‌వో పరీక్షలు కూడా రాస్తారు. క్లర్క్, ఎస్‌వో పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు తొలుత పరీక్ష విధానం, సిలబస్‌పై పూర్తి అవగాహన పెంచుకోవాలి. ప్రాక్టీస్‌ టెస్టులు, పాత ప్రశ్న పత్రాలు, మోడల్‌ పేపర్లను ప్రాక్టీస్‌ చేయాలి. వీలైనంత వేగంగా ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేలా సన్నద్ధమవ్వాలి. 
–ఎన్‌.వినయ్‌కుమార్‌ రెడ్డి, సబ్జెక్ట్‌ నిపుణులు

చ‌దవండి: Banks - Study Material

Published date : 09 Dec 2021 05:59PM

Photo Stories