Bank Exam Preparation Tips: వేయికి పైగా ఎగ్జిక్యూటివ్ పోస్ట్‌లు.. ప్రిపరేషన్‌తోపాటు కెరీర్ స్కోప్ గురించి తెలుసుకుందాం..
బ్యాంకింగ్ కెరీర్ అభ్యర్థులకు శుభవార్త! ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ).. ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది! కాంట్రాక్ట్ విధానంలో వెయ్యికిపైగా ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్(పీజీడీబీఎఫ్)కోర్సులో ప్రవేశం కల్పించడం ద్వారా.. 500 మేనేజర్ గ్రేడ్–ఎ పోస్ట్‌ల భర్తీ చేపట్టనుంది. వచ్చే నెలలో రాత పరీక్షలు నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో.. ఐడీబీఐ ఎంపిక విధానం, అందులో విజయానికి ప్రిపరేషన్‌తోపాటు కెరీర్ స్కోప్ గురించి తెలుసుకుందాం..
- ఐడీబీఐలో వేయికి పైగా ఎగ్జిక్యూటివ్ పోస్ట్‌లు
- పీజీడీబీఎఫ్ ప్రోగ్రామ్ ద్వారా 500 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు
- రాత పరీక్ష, ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా ఎంపిక
- బ్యాంకింగ్ రంగంలో ఉజ్వల కెరీర్‌కు మార్గం
ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. సంక్షిప్తంగా ఐడీబీఐ. కొన్నేళ్ల క్రితం వరకు మెట్రో నగరాలు, టైర్–1 పట్టణాలకే పరిమితమైన ఈ బ్యాంకు.. తన కార్యకలాపాలను ఇతర ప్రాంతాలకూ విస్తరిస్తోంది. అన్ని వర్గాల వినియోదారులకు సేవలందించేలా ప్రణాళికలు రూపొందిస్తూ.. తన శాఖలను విస్తరిస్తోంది. ఆయా కార్యకలాపాల నిర్వహణకు అవసరమైన సిబ్బంది నియామకాలను చేపడుతోంది. తాజాగా కాంట్రాక్ట్ పద్ధతిలో ఎగ్జిక్యూటివ్ పోస్ట్‌లు, పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కోర్సులో ప్రవేశ మార్గం ద్వారా అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్–ఎ పోస్ట్‌ల భర్తీకి ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది.
1544 ఉద్యోగాలు
- ఐడీబీఐ తాజా నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1544 పోస్ట్‌ల భర్తీకి శ్రీకారం చుట్టింది.
- కాంట్రాక్ట్ పద్ధతిలో 1044 ఎగ్జిక్యూటివ్ పోస్ట్‌లను భర్తీ చేయనుంది.
- పీజీడీబీఎఫ్ కోర్సులో ప్రవేశం ద్వారా 500 అసి స్టెంట్ మేనేజర్ గ్రేడ్–ఎ పోస్ట్‌లకు అభ్యర్థులను సదరు కోర్సులో ప్రవేశం కల్పించనుంది.
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తుకు అర్హులు. వయసు: ఎగ్జిక్యూటివ్ పోస్ట్‌లకు 20 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి. పీజీడీబీఎఫ్ అభ్యర్థుల వయసు 20 నుంచి 28 ఏళ్ల మధ్యలో ఉండాలి.
Banking, Financial Services and Insurance Sectors: బీఎఫ్‌ఎస్‌ఐ.. నియామకాల జోరు!
పీజీడీబీఎఫ్..కోర్సు+కొలువు
- ఐడీబీఐ పీజీడీబీఎఫ్ కోర్సును అందిస్తోంది. ఇందులో తొమ్మిది నెలల క్లాస్ రూం లెర్నింగ్, మరో మూడు నెలలు బ్యాంకు శాఖల్లో ఇంటర్న్‌షిప్ విధానంలో మొత్తం ఏడాది వ్యవధిలో ఈ ప్రోగ్రామ్ ఉంటుంది.
- ఈ కోర్సులో చూపిన ప్రతిభ ఆధారంగా సదరు అభ్యర్థులకు అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్–ఎ పోస్ట్‌లలో నియామకాలు ఖరారు చేస్తారు.
- కోర్సు పూర్తి చేసుకున్న వారికి కొలువుతోపాటు పీజీడీబీఎఫ్ సర్టిఫికెట్ కూడా అందిస్తారు.
- ఈ కోర్సు నిర్దేశించిన ఫీజు మెత్తాన్ని చెల్లించే విషయంలో అభ్యర్థులకు ఐడీబీఐ బ్యాంకు లోన్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తోంది.
స్టయిఫండ్..కొలువు
- పీజీడీబీఎఫ్‌లో ప్రవేశం పొందిన విద్యార్థులకు కోర్సు సమయంలో తరగతి బోధన ఉండే 9 నెలల పాటు నెలకు రూ.2.5 వేలు, మూడు నెలల ఇంటర్న్‌షిప్ సమయంలో నెలకు రూ.10 వేలు చొప్పున స్టయిఫండ్ అందిస్తారు.
- కోర్సు పూర్తి చేసుకుని అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్–ఎ హోదాలో నియామకం ఖరారు చేసుకు న్న వారికి ప్రారంభంలో నెలకు రూ.36వేల మూల వేతనం అందిస్తారు.
- అదే విధంగా అసిస్టెంట్ మేనేజర్ హోదాలో ఏడాది కాలాన్ని ప్రొబేషన్ పిరియడ్‌గా పరిగణిస్తారు.
- అభ్యర్థులందరూ బ్యాంకులో కనీసం మూడేళ్లు పని చేసే విధంగా సర్వీస్ బాండ్ ఇవ్వాల్సి ఉంటుంది.
కాంట్రాక్ట్ విధానం
ఐడీబీఐ కాంట్రాక్ట్ విధానంలో వెయ్యికి పైగా ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనుంది. వీరికి తొలుత ఏడాది పాటు కాంట్రాక్ట్ పద్ధతిలో నియా మకాలు ఖరారు చేస్తారు. ఆ తర్వాత పనితీరు, ప్రతిభ ఆధారంగా ఈ ఒప్పంద వ్యవధిని మరో రెండేళ్లు పొడిగిస్తారు. మొత్తం మూడేళ్ల కాంట్రాక్ట్ పిరియడ్ పూర్తి చేసుకున్న వారు.. బ్యాంకు అంతర్గతంగా నిర్వహించే అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్–ఎ పోస్ట్‌ల ఎంపిక ప్రక్రియకు అర్హులవుతారు.
Job Trends: ఫైనాన్షియల్ రంగం.. కొలువులు, అర్హతలు, నైపుణ్యాలు
ఆకర్షణీయ వేతనాలు
కాంట్రాక్ట్ విధానంలో ఎగ్జిక్యూటివ్స్‌గా నియ మితులైన వారికి ఆకర్షణీయ వేతనాలు లభించ నున్నాయి. మొదటి ఏడాది నెలకు రూ.29 వేలు, రెండో ఏడాది నెలకు రూ.31 వేలు, మూడో ఏడాది నెలకు రూ.34 వేలు చొప్పున వేతనం అందిస్తారు.
ఎంపిక ప్రక్రియ.. ఇలా
- కాంట్రాక్ట్ ఎగ్జిక్యూటివ్స్, అదేవిధంగా పీజీడీబీఎఫ్ కోర్సులో ప్రవేశానికి వేర్వేరు విధానాలను అమలు చేస్తున్నారు.
- ఎగ్జిక్యూటివ్స్ పోస్ట్‌లకు ఆన్‌లైన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ప్రీ–రిక్రూట్‌మెంట్ మెడికల్ టెస్ట్ దశలు ఉంటాయి.
- పీజీడీబీఎఫ్ కోర్సుకు సంబంధించి ఆన్‌లైన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, పర్సనల్ ఇంటర్య్వూ, ప్రీ రిక్రూట్‌మెంట్ మెడికల్ టెస్ట్ దశల్లో ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా
రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను తదుపరి ఎంపిక ప్రక్రియకు పిలుస్తారు. పీజీడీబీఎఫ్ అభ్యర్థులకు మలి దశలో పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. కోర్సుకు నిర్దేశించిన మొత్తం సీట్లకు మూడు రెట్లకు సమానమైన సంఖ్యలో అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. గత ఏడాది 650 సీట్లకు గాను ఆన్‌లైన్ టెస్ట్‌లో ప్రతిభ ఆధారంగా 3,150 మందిని పర్సనల్ ఇంటర్వ్యూకు ఎంపిక చేశారు.
విజయానికి కదలండిలా
- లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్‌కు సంబంధించి డైరక్షన్స్, డిస్టెన్స్, అనాలజీ, బ్లడ్ రిలేషన్స్, సిరీస్, డబుల్ లైనప్, డయాగ్రమ్స్, ఫ్లో చార్స్‌లను ప్రాక్టీస్ చేయాలి. ఇంగ్లిష్‌కు సంబంధించి గ్రామర్ అంశా లపై పూర్తి అవగాహన పెంచుకోవాలి. ముఖ్యం గా వొకాబ్యులరీ, కాంప్రహెన్షన్‌లపై పట్టు సాధించాలి. అదే విధంగా సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ సెంటెన్స్‌లను ప్రాక్టీస్ చేయాలి.
- క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌కు సంబంధించి మ్యాథమెటిక్స్‌లోని కోర్ అంశాలతోపాటు అర్థమెటిక్ అంశాలు(నిష్పత్తులు, శాతాలు, టైం అండ్ డిస్టెన్స్, టైం అండ్ వర్క్, యావరేజెస్, స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్, కూడికలు, హెచ్చవేతలు తదితర)పై దృష్టి పెట్టాలి.
- నాలుగో విభాగంలోని జనరల్ అవేర్‌నెస్‌కు సం బంధించి కరెంట్ అఫైర్స్‌పై పట్టు సాధించాలి. ఎకానమీలో ఇటీవల కాలంలో ఆర్థిక రంగంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు తెలుసు కోవాలి. బ్యాంకింగ్ అవేర్‌నెస్‌లో బ్యాంకింగ్ వ్య వస్థ స్వరూపంతోపాటు తాజా పరిణామా లు, బ్యాంకింగ్ టెర్మినాలజీపై అవగాహన ఏర్పరచు కోవాలి. కంప్యూటర్/ఐటీ అవేర్‌నెస్ విభాగం కోసం అభ్యర్థులు కంప్యూటర్ ఆపరేషన్ టూల్స్ పై పట్టు సాధించాలి.
- ఆన్‌లైన్ టెస్ట్ తేదీ: జూలై 9(ఎగ్జిక్యూటివ్స్ ఆన్ కాంట్రాక్ట్), జూలై 23 (పీజీడీబీఎఫ్)
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.idbibank.in
‘రెండింటి’కీ ఉమ్మడిగా
కాంట్రాక్ట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల ఎంపికకు, అదే విధంగా బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్–ఎ పోస్ట్‌లకు నిర్దేశించిన పీజీడీబీఎఫ్ కోర్సులో ప్రవేశానికి ఆన్‌లైన్ టెస్ట్‌ను ఉమ్మడిగా నిర్వహించ నున్నారు. నాలుగు విభాగాల్లో మొత్తం 200 మార్కులకు ఈ పరీక్ష ఉంటుంది. వివరాలు..
- పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉండే ఈ ఆన్‌లైన్ టెస్ట్‌కు కేటాయించిన సమయం 2:30 గంటలు. నెగెటివ్ మార్కింగ్ నిబంధన (ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కు)ఉంది.
సబ్జెక్ట్ | ప్రశ్నలు | మార్కులు |
లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్ | 60 | 60 |
ఇంగ్లిష్ లాంగ్వేజ్ | 40 | 40 |
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | 40 | 40 |
జనరల్ / ఎకానమీ / బ్యాంకింగ్ అవేర్‌నెస్ / కంప్యూటర్ / ఐటీ | 60 | 60 |
మొత్తం | 200 | 200 |