Skip to main content

Banking, Financial Services and Insurance Sectors: బీఎఫ్‌ఎస్‌ఐ.. నియామకాల జోరు!

Jobs in BFSI Sector, Demanding Job Profiles, Qualifications, Skills
Jobs in BFSI Sector, Demanding Job Profiles, Qualifications, Skills

బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌.. బీఎఫ్‌ఎస్‌ఐగా సుపరిచితం. ఇటీవల ఈ రంగంలో.. కార్యకలాపాల నిర్వహణలో టెక్నాలజీ ప్రవేశం ఊపందుకుంది. సంప్రదాయ బ్యాంకులు మొదలు.. పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలో సేవలందిస్తున్న ఫిన్‌టెక్‌ సంస్థల వరకూ.. అన్నీ డిజిటల్‌ బాటపట్టాయి. అటు.. వినియోగదారులు సైతం బ్యాంకింగ్‌ లావాదేవీల్లో డిజిటల్‌కు ప్రాధాన్యమిస్తున్నారు. ఫలితంగా ఈ రంగం.. యువతకు కొలువుల కల్పవృక్షంగా నిలవనుంది అంటున్నారు నిపుణులు. సంప్రదాయ డిగ్రీ మొదలు.. ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్‌ వంటి ప్రొఫెషనల్‌ కోర్సుల వరకూ.. అన్ని నేపథ్యాల వారికి.. బీఎఫ్‌ఎస్‌ఐ అవకాశాలకు వేదికగా మారనుంది! ఈ నేపథ్యంలో.. బీఎఫ్‌ఎస్‌ఐ రంగంలో జాబ్‌ ట్రెండ్స్, డిమాండింగ్‌ జాబ్‌ ప్రొఫైల్స్, అవసరమైన అర్హతలు, నైపుణ్యాలు తదితర అంశాలపై విశ్లేషణ...

  • 2022లో భారీగా అందుబాటులోకి రానున్న కొలువులు
  • ట్రెడిషనల్, టెక్నికల్, డిజిటల్‌ ప్రొఫైల్స్‌లో ఉద్యోగాలు
  • టాప్‌–5 రిక్రూటింగ్‌ సెక్టార్స్‌గా నిలవనున్న బీఎఫ్‌ఎస్‌ఐ
  • ఫిన్‌టెక్‌ సంస్థలే ప్రధాన కారణం అంటున్న నిపుణులు

జాబ్‌ మార్కెట్లో అడుగుపెట్టే యువత.. తమకు సరితూగే రంగం ఏది.. అందులో నియామకాల ట్రెండ్‌ ఎలా ఉంది? అనే ఆలోచనతో అన్వేషణ సాగిస్తుంటారు. అలాంటి వారందరికీ.. ఈ ఏడాది చక్కటి వేదిక బీఎఫ్‌ఎస్‌ఐ అనడంలో సందేహం లేదు అంటున్నారు నిపుణులు. కాబట్టి ఈ రంగంలో నియామక తీరుతెన్నులపై అవగాహన పెంచుకోవడం ద్వారా కొలువులు సొంతం చేసుకోవచ్చు.

 

చ‌ద‌వండి: Job Trends: ఫైనాన్షియల్‌ రంగం.. కొలువులు, అర్హతలు, నైపుణ్యాలు​​​​​​​

గత ఏడాది కంటే అధికం

  • బీఎఫ్‌ఎస్‌ఐ రంగంలో గతేడాది కంటే ఈ సంవత్సరం నియామకాలు భారీగా ఉంటాయని పలు కన్సల్టింగ్, రిక్రూటింగ్‌ సంస్థల అంచనా. 
  • నౌకరీ జాబ్‌ స్పీక్‌ ఇండెక్స్‌ ప్రకారం– గతేడాదితో పోల్చితే.. 2022లో బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌లో కొత్త నియామకాలు 31 శాతం పెరిగే అవకాశం ఉంది. అదే విధంగా ఇన్సూరెన్స్‌ రంగంలోనూ 8 శాతం ఎక్కువగా కొత్త నియామకాలు జరగనున్నాయి.
  • మాన్‌స్టర్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఇండెక్స్‌ ప్రకారం–బీఎఫ్‌ఎస్‌ఐలో జనవరి నెలలో 34 శాతం మేర కొత్త నియామకాల్లో పెరుగుదల కనిపించింది. ఇదే ధోరణి ఈ ఏడాది అంతా కొనసాగుతుందని.. ఫలితంగా గత ఏడాదితో పోల్చితే ఈ సంవత్సరం ఈ రంగంలో 35 నుంచి 40 శాతం మేరకు నూతన నియామకాలు జరిగే అవకాశం ఉందని సదరు నివేదిక గణాంకాలు స్పష్టం చేస్త్నునాయి.
  • నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ అంచనాల ప్రకారం– ఈ ఏడాది చివరికి బీఎఫ్‌ఎస్‌ఐ సెక్టార్‌లో 1.6 లక్షల మంది నిపుణులైన మానవ వనరుల అవసరం ఉంటుంది. 
  • సీఐఐ, సన్‌స్టోన్‌ ఎడ్యువర్సిటీలు సంయుక్తంగా నిర్వహించిన సర్వే ప్రకారం– బీఎఫ్‌ఎస్‌ఐలో కనీసం 30 శాతానికిపైగా నూతన నియామకాలు జరగనున్నాయి.
  • టీమ్‌లీజ్, ఇండీడ్‌ వంటి సంస్థల నివేదికల ప్రకారం–30 నుంచి 40 శాతం మేరకు కొత్త నియామకాలు జరిగే అవకాశం ఉంది.
  • పూర్తిగా టెక్నాలజీ ఆధారంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఫిన్‌టెక్‌ సంస్థల్లోనూ భారీ ఎత్తున నియామకాలకు అవకాశం ఉందని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఆయా నివేదికల అంచనా ప్రకారం–ఫిన్‌టెక్‌ విభాగంలో మూడో స్థానంలో ఉన్న భారత్‌లో ఈ ఏడాది దాదాపు లక్ష కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఫ్రెషర్స్‌కు ఆశావాహంగా

ఈ ఏడాది నియామకాల సంఖ్యను పెంచనున్న బీఎఫ్‌ఎస్‌ఐ సంస్థలు తాజా గ్రాడ్యుయేట్లకు కూడా ప్రాధాన్యం ఇవ్వనున్నాయి. పలు అంచనాల ప్రకారం–మొత్తం నియామకాల్లో 50 శాతం 0–3 ఏళ్ల అనుభవం ఉన్న వారితో చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఇక 3 నుంచి 8 ఏళ్ల అనుభవం ఉన్న వారికి మొత్తం నియామకాల్లో 35 నుంచి 40 శాతం మేరకు; 8 నుంచి 12 ఏళ్ల అనుభవం ఉన్న వారితో 5 నుంచి 10 శాతం మేరకు; ఆపై అనుభవం ఉన్న వారికి 5 నుంచి పది శాతం మేరకు నూతన కొలువుల్లో అవకాశం లభించనుంది.

టెక్‌ ప్రొఫైల్స్‌కూ పెద్దపీట

బీఎఫ్‌ఎస్‌ఐలో కొత్త నియామకాలు, లభించే కొలువుల పరంగా టెక్‌ ప్రొఫైల్స్‌ ముందంజలో నిలవనున్నాయి. ఏఐ–ఎంఎల్‌ ఇంజనీర్స్, క్లౌడ్‌ ఎక్స్‌పర్ట్స్, డేటా ఇంజనీరింగ్, రోబోటిక్స్‌ ప్రొఫైల్స్‌లో ఈ నియామకాలు జరగనున్నాయి. దీనికి ప్రధాన కారణం..బ్యాంకింగ్‌ రంగ కార్యకలాపాల్లో అధిక శాతం టెక్నాలజీ ఆధారంగా జరగుతుండటమే. అంతేకాకుండా చివరకు కస్టమర్‌ సపోర్ట్‌ సర్వీస్‌ విభాగాల్లోనూ చాట్‌బోట్‌ వంటి టెక్నాలజీ వినియోగం పెరుగుతోంది. దాంతో టెక్‌ ప్రొఫైల్స్‌ నియామకాలకు పెద్ద పీట వేసేందుకు ఈ రంగంలోని సంస్థలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి.

డిజిటల్‌ రూపీ.. బ్లాక్‌చైన్‌కు డిమాండ్‌

ఇటీవల కేంద్ర ప్రభుత్వం డిజిటల్‌ రూపీ పేరిట ఆన్‌లైన్‌ లావాదేవీలకు అనుమతిస్తున్నట్లు బడ్జెట్‌లో పేర్కొంది. దీంతో ఈ లావాదేవీలు పారదర్శకంగా, అవకతవకలకు తావు లేకుండా ఉండేందుకు బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ అవసరం ఏర్పడుతుంది. అందుకే ఆ బాధ్యతలు నిర్వహించే బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ నిపుణులకు డిమాండ్‌ నెలకొందని బ్యాంకింగ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. బ్లాక్‌చైన్‌ ఇంజనీర్, డెవలపర్, ప్రాజెక్ట్‌ మేనేజర్‌ వంటి హోదాల్లో కొలువులు లభించనున్నాయి.

చ‌ద‌వండి: Job Interview: ఐబీపీఎస్ ‘ పీవో ’ ఇంటర్వ్యూలో విజయానికి టిప్స్..

ట్రెడిషనల్‌ కొలువులు కూడా

సంప్రదాయ డిగ్రీ కోర్సులు చదివిన విద్యార్థులకు కూడా అవకాశాలు లభిస్తాయని నిపుణులు అంటున్నారు. వీరికి కస్టమర్‌ సపోర్ట్‌ సర్వీసెస్, మార్కెటింగ్, సేల్స్, ఆపరేషన్స్‌ వంటి విభాగాల్లో ఉద్యోగాలు లభించనున్నాయి.

కోర్‌తో కోరుకున్న కొలువు

బీఎఫ్‌ఎస్‌ఐ రంగంలో కార్యకలాపాలకు ఎంతో కీలకం ఆడిటింగ్, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ ఆడిట్, యాక్చుయరీ సైన్స్‌. వీటికి సంబంధించిన కోర్‌ విభాగాల్లో అర్హతలు, నైపుణ్యాలు ఉంటే.. కోరుకున్న కొలువు ఖాయం అంటున్నారు. బ్యాంకులు తమ వ్యాపారా లావాదేవీలను విస్తరించడం, అదే విధంగా ఇన్సూరెన్స్‌ సెక్టార్‌లో పెరుగుతున్న ఐపీఓలు, కార్యకలాపాల వల్ల కోర్‌ విధులు నిర్వహించే వారి కోసం సంస్థలు అన్వేషిస్తున్నాయి. దీంతో సీఏ, ఎంబీఏ–ఫైనాన్స్‌ వంటి కోర్సులు చదివిన వారికి, ఇన్సూరెన్స్, మేనేజ్‌మెంట్‌ కోర్సులు పూర్తిచేసుకున్న అభ్యర్థులకు బీఎఫ్‌ఎస్‌ఐ సంస్థలు స్వాగతం పలుకుతున్నాయి.

క్యాంపస్‌లవైపు సంస్థలు

బీఎఫ్‌ఎస్‌ఐ రంగ సంస్థలు నిపుణులైన మానవ వనరుల కోసం క్యాంపస్‌లవైపు అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే ఐఐఎం, ఐఐటీల వంటి ప్రముఖ ఇన్‌స్టిట్యూట్స్‌లో క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్స్‌లో పాల్గొని ఫ్రెషర్స్‌ నియామకాలు చేపడుతున్నాయి. పలు బ్యాంకులు తమ క్యాంపస్‌ సెలక్షన్స్‌ ప్రణాళికలను కూడా ప్రకటించాయి. దీని ప్రకారం–యాక్సిస్‌ బ్యాంక్‌ గత ఏడాది కంటే 50 శాతం ఎక్కువగా క్యాంపస్‌ నియామకాలు చేపడతామని స్పష్టం చేసింది. అదే విధంగా సిటీ బ్యాంక్, డ్యూట్స్‌చె బ్యాంక్‌లు కూడా క్యాంపస్‌ నియామకాలకు సిద్ధమవుతున్నాయి. వీటితోపాటు ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌లో పేరొందిన గోల్డ్‌మన్‌ శాచ్‌ గత ఏడాది కంటే 27 శాతం అధికంగా..జేపీ మోర్గాన్‌ 23శాతం అధికంగా క్యాంపస్‌ నియామకాలు చేపడతామని పేర్కొన్నాయి. 

  • మొత్తంగా చూస్తే ట్రెడిషనల్‌ కళాశాలల్లో 43 శాతం, ఇంజనీరింగ్‌ కళాశాలల్లో 24 శాతం, బిజినెస్‌ స్కూల్స్‌లో 6 శాతం మేర క్యాంపస్‌ నియామకాల్లో పెరుగుదల నమోదవుతుందని పలు నివేదికలు తెలుపుతున్నాయి. మరోవైపు ఇటీవల ఐఐటీలు, ఐఐఎంలలోని క్యాంపస్‌ డ్రైవ్స్‌ గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటే.. బీఎఫ్‌ఎస్‌ఐ సంస్థల హవా కనిపించడం తెలిసిందే.

వేతనాల్లోనూ వృద్ధి

బీఎఫ్‌ఎస్‌ఐ రంగంలో వేతనాల్లోనూ ఈ ఏడాది పెరుగుదల ఆశాజనకంగా ఉంటుందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఫ్రెషర్స్‌కు సగటున రూ.4 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు; మిడ్‌ లెవల్‌ ఎగ్జిక్యూటివ్స్‌కు రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు; సీనియర్స్‌కు రూ.పది లక్షల కనీస వార్షిక వేతనాలు లభించనున్నాయి. ఇప్పటికే పనిచేస్తున్న ఉద్యోగుల విషయంలోనూ వేతన వృద్ధి కనిపిస్తుందని.. కనీసం పది శాతం మేరకు ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు ఇచ్చేందుకు బ్యాంకింగ్‌ సంస్థలు సిద్ధంగా ఉన్నట్లు పలు సర్వేల నివేదికల్లో స్పష్టమైంది. 

టెక్‌ నైపుణ్యాలు తోడుగా

బీఎఫ్‌ఎస్‌ఐ రంగంలో కొలువు కోసం అభ్యర్థులు టెక్‌ నైపుణ్యాల తోడుగా అన్వేషణ సాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏఐ–ఎంఎల్, బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ, క్లౌడ్‌ కంప్యూటింగ్, సైబర్‌ సెక్యూరిటీ, రోబోటిక్‌ ప్రాసెస్‌ ఇంజనీరింగ్, డేటా అనలిటిక్స్, డేటా మేనేజ్‌మెంట్‌ వంటి టెక్‌ నైపుణ్యాలు సొంతం చేసుకోవాలంటున్నారు. ఇక బ్యాంకింగ్‌ రంగంలో కీలకంగా భావించే స్ట్రాటజిస్ట్స్, అనలిటిక్స్, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ వంటి విభాగాల్లో కొలువులు ఖాయం చేసుకోవడానికి కోర్‌ నైపుణ్యాలకు పదును పెట్టుకోవడమే కాకుండా.. నేషనల్‌ స్టాక్‌ ఎక్సే్ఛంజ్, ముంబై స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌ల ఆధ్వర్యంలో అందుబాటులో ఉన్న ఆన్‌లైన్‌ కోర్సులను అభ్యసించడం మేలు చేస్తుందని సూచిస్తున్నారు.

నైపుణ్యాలకు.. ఎన్నో మార్గాలు

  • బీఎఫ్‌ఎస్‌ఐ రంగంలో డిజిటల్‌ ప్రొఫైల్స్‌లో అడుగుపెట్టేందుకు అవసరమైన నైపుణ్యాలు అందుకునేందుకు ఎన్నో మార్గాలు అందుబాటులోకి వస్తున్నాయి.
  • ఐబీఎం,సిస్కో, మైక్రోసాఫ్ట్, ఇంటెల్, వీఎం వేర్, సిస్కో వంటి సంస్థలు.. ఏఐ–ఎంఎల్, రోబోటిక్స్, క్లౌడ్‌ కంప్యూటింగ్, సైబర్‌ సెక్యూరిటీ సర్టిఫికేషన్‌ కోర్సులు పూర్తి చేయడం ఉపయుక్తంగా ఉంటుంది.
  • బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీకి సంబంధించి బ్లాక్‌ చైన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, యుడెమీ, కోర్సెరా వంటి సంస్థలు మూక్స్‌ విధానంలో అందిస్తున్న కోర్సుల ద్వారా ఇందులో నైపుణ్యం సొంతం చేసుకోవచ్చు.

కమ్యూనికేషన్‌ స్కిల్స్‌కూ ప్రాధాన్యం

బీఎఫ్‌ఎస్‌ఐ రంగంలో కొలువులు ఆశిస్తున్న వారు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ను కూడా పెంచుకోవాల్సిన ఆవశ్యకత నెలకొంది. ముఖ్యంగా బ్యాంకింగ్‌ సంస్థలు చేపట్టే నియామకాల్లో అభ్యర్థుల్లోని కమ్యూనికేషన్‌ స్కిల్స్‌కు ప్రాధాన్యం లభిస్తోంది. దీనికి ప్రధాన కారణం.. విధుల నిర్వహణ క్రమంలో అంతర్గతంగా సహచర సిబ్బందితో, అదే విధంగా కస్టమర్లతోనూ మెప్పించే విధంగా వ్యవహరించాల్సిన పరిస్థితులు నెలకొనడమే. కాబట్టి యువత కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పెంచుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలని.. ముఖ్యంగా లాంగ్వేజ్‌ స్కిల్స్, ఇంటర్‌–పర్సనల్‌ స్కిల్స్, బిహేవియరల్‌ స్కిల్స్‌ పెంచుకునే దిశగా కృషి చేయాలని సూచిస్తున్నారు.

బీఎఫ్‌ఎస్‌ఐ రిక్రూట్‌మెంట్‌ ట్రెండ్స్‌–2022

  • పలు నివేదికల ప్రకారం–30 నుంచి 40శాతం మేరకు పెరగనున్న కొత్త నియామకాలు.
  • ఎన్‌ఎస్‌డీసీ అంచనాల ప్రకారం– ఈ ఏడాది 1.6 లక్షల మంది నిపుణుల అవసరం.
  • ఆన్‌లైన్‌ లావాదేవీలు, డిజిటలైజేషన్, డిజిటల్‌ రూపీ వంటి ప్రణాళికల నేపథ్యంలో టెక్‌ ప్రొఫైల్స్‌కు పెరగనున్న డిమాండ్‌.
  • బ్లాక్‌చైన్‌ ఎక్స్‌పర్ట్స్,క్లౌడ్‌ టెక్‌ నిపుణులు, ఏఐ –ఎంఎల్,రోబోటిక్స్,సైబర్‌ సెక్యూరిటీ, క్లౌడ్‌ ఇంజనీరింగ్‌ విభాగాల్లో టెక్‌ కొలువులు.
  • సంప్రదాయ విభాగాల్లో కస్టమర్‌ సపోర్ట్‌ ఎగ్జిక్యూటివ్స్, మార్కెటింగ్, సేల్స్, బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ ప్రొఫైల్స్‌లో నియామకాలు.
  • ఫిన్‌టెక్‌ సంస్థల్లోనూ ఈ ఏడాది దాదాపు లక్ష ఉద్యోగాలు లభించే అవకాశం.
  • ఫ్రెషర్స్‌ కోసం క్యాంపస్‌ డ్రైవ్స్‌ సైతం చేపడుతున్న ప్రైవేట్‌ బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సెక్టార్‌ సంస్థలు.
  • అర్హతలు, జాబ్‌ ప్రొఫైల్స్, అనుభవం ఆధారంగా రూ.4 లక్షల నుంచి రూ.పది లక్షల వరకు వార్షిక వేతనం పొందే అవకాశం

విస్తరణ, నూతన విధానాలే కారణం

బీఎఫ్‌ఎస్‌ఐ రంగంలో భారీ స్థాయిలో కొలువులకు కారణం.. ఈ రంగంలోని సంస్థలు విస్తరణ ప్రణాళికలు, కార్యకలాపాల నిర్వహణ నూతన ఆధునిక విధానాలవైపు మళ్లుతుండడమే. ఆపరేషనల్, టెక్నికల్‌ రెండు రకాల విభాగాల్లోనూ నిపుణులకు డిమాండ్‌ నెలకొంది. దీన్ని అభ్యర్థులు తమకు అనుకూలంగా మలచుకోవాలి. లేటెస్ట్‌ టెక్నాలజీస్, అదే విధంగా కోర్‌ బ్యాంకింగ్‌కు సంబంధించి ఆపరేషనల్‌ స్కిల్స్‌ను మరింత పెంచుకునేందుకు కృషి చేయాలి.
– శశి కుమార్, ఎండీ, ఇండీడ్‌ ఇండియా

చ‌ద‌వండి: ప్రస్తుతం డిగ్రీ ఫైనల్‌ చదువుతున్నాను. బ్యాంకింగ్‌ రంగంలో కెరీర్‌ అవకాశాల గురించి చెప్పండి?​​​​​​​

Published date : 30 Mar 2022 07:30PM

Photo Stories