Admission: నేషనల్ ఇన్సూరెన్స్ అకాడమీలో కోర్సుల ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.. వివరాలు ఇలా..
ఎన్‌ఐఏ
నేషనల్ ఇన్సూరెన్స్ అకాడమీ(ఎన్‌ఐఏ).. బీమా రంగానికి అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించేందుకు భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటైన సంస్థ. తొలుత 1980లో ముంబై కేంద్రంగా ఎన్‌ఐఏ ప్రారంభమైంది. 1990లో దీన్ని మహారాష్ట్రలోని పుణెకు మార్చారు. బీమా రంగానికి నిపుణులను అందించడమే లక్ష్యంగా ఎన్‌ఐఏ పనిచేస్తుంది. ఈ సంస్థ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్(పీజీడీఎం)కోర్సులో ప్రవేశాలు కల్పిస్తోంది.
చదవండి: Job Trends: ఫైనాన్షియల్ రంగం.. కొలువులు, అర్హతలు, నైపుణ్యాలు
రెండేళ్ల కోర్సు
ఎన్‌ఐఏ అందించే పీజీడీఎం కోర్సు కాలవ్యవధి రెండేళ్లు. మొత్తం 6 సెమిస్టర్లు ఉంటాయి. ఇందులో మొదటి మూడు సెమిస్టర్లలో బేసిక్ అంశాలపై శిక్షణ ఇస్తారు. మిగతా మూడు సెమిస్టర్లు విద్యార్థులు ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్‌లతో కలిపి ఉంటాయి.
అర్హతలు
కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో మూడేళ్ల బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. లేదా యూజీసీ గుర్తింపు పొందిన తత్సమాన కోర్సు పూర్తి చేసుకోవాలి. ఫైనల్ ఇయర్ లేదా ఫైనల్ సెమిస్టర్ చదివే విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వీరు ఎంబీఏ ప్రవేశ పరీక్షలైన క్యాట్ 2021, సీమ్యాట్ 2022కు హాజరై ఉండాలి.
వయసు: 28ఏళ్లకు మించకుండా ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు వయో సడలింపు లభిస్తుంది.
ఎంపిక విధానం
ఎన్‌ఐఏ–పీజీడీఎం కోర్సుల్లో ప్రవేశం కోసం క్యాట్ 2021, సీమ్యాట్ 2022 వ్యాలిడ్ స్కోర్, అకడమిక్ రికార్డ్(పదో తరగతి, ఇంటర్, డిగ్రీ) ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. దరఖాస్తుదారుల వ్యాలిడ్ మెరిట్ స్కోర్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన వారికి గ్రూప్ డిస్కషన్(జీఐ), పర్సనల్ ఇంటర్వ్యూ (పీఐ) నిర్వహిస్తారు. ఇందులో చూపిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
ప్లేస్‌మెంట్స్
2021లో ఎన్‌ఐఏలో పీజీడీఎం కోర్సు పూర్తిచేసుకున్న విద్యార్థులు 100శాతం ప్లేస్‌మెంట్స్ పొందారు. బీమా రంగంలోని కంపెనీలతో ఎన్‌ఐఏకు మంచి సంబంధాలు ఉన్నాయి. చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు, ఎంఎన్‌సీ బ్రోకరేజ్ సంస్థలు, ఫైనాన్స్ కంపెనీలు, కన్సల్టెన్సీలు, ఐటీ కంపెనీలు ఎన్‌ఐఏ విద్యార్థులకు ఆఫర్స్ ఇస్తున్నాయి. దుబాయ్, మారిషస్, మలేషియా, లండన్, ఖతర్ వంటి దేశాల్లోని సంస్థలు సైతం ఎన్‌ఐఏ విద్యార్థులకు అవకాశాలు కల్పిస్తున్నాయి. ఆయా కంపెనీలు అందించే సగటు వార్షిక ప్యాకేజీ రూ.10లక్షల వరకూ ఉంటుంది.
టాప్ రిక్రూటర్స్
బజాజ్ అలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కో, టాటా ఏఐజీ, గోడిజిట్ జీఐ కో, హెచ్‌డీఎఫ్‌సీ ఈఆర్‌గో, భారతీ యాక్సా జీ కో, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కో, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఫ్యూచర్ జెనరాలి, మణిపాల్ సిగ్నా హెచ్‌ఐకో, అదిత్యా బిర్లా హెచ్‌ఐకో తదితర సంస్థలు ఎన్‌ఐఏ విద్యార్థులను నియమించుకుంటున్నాయి.
అవకాశాలు
బీమా రంగానికి సంబంధించిన కోర్సులు పూర్తిచేసిన వారికి ఉపాధి పరంగా ఎలాంటి ఢోకా ఉండదు. ఈ రంగంలో ప్రస్తుతం నైపుణ్యం కలిగిన నిపుణుల కొరత అధికంగా ఉంది. దాంతో బీమా కోర్సుల అభ్యర్థులకు నైపుణ్యాలుంటే..చక్కటి అవకాశాలు లభిస్తున్నాయి. చాలా సంస్థలు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ద్వారానే అభ్యర్థులను నియమించుకుంటున్నాయి. ఐటీ, కార్పొరేట్, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ తదితర రంగాలకు చెందిన జాతీయ, అంతర్జాతీయ సంస్థల్లో ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి.
కెరీర్ స్కోప్
కెరీర్‌కు భరోసానిచ్చే రంగాల్లో బీమా ముందుంటుంది. ఈ రంగం సుస్థిరంగా కొనసాగుతోంది. అంతేకాకుండా ఈ రంగంలోని సంస్థలు కొత్త కొత్త పాలసీలు, నిత్య నూతన పథకాలతో ప్రజల ముందుకొస్తున్నాయి. కాబట్టి ఈ రంగంలో కెరీర్ అవకాశాలకు కొదవలేదని చెప్పొచ్చు.
నైపుణ్యాలు కీలకం
బీమా రంగాన్ని కెరీర్‌గా ఎంచుకునే వారికి నైపుణ్యాలు చాలా ముఖ్యం. సృజనాత్మకత, ఓర్పు, సహనం, చురుకుదనం, అందరితో పనిచేయగలిగే తత్వం, ఇతరులను ఆకట్టుకునే నేర్పు ఉన్నవారు ఈ రంగంలో రాణిస్తారు.
ముఖ్యమైన సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తులకు చివరి తేదీ: 15.03.2022
- వెబ్‌సైట్: https://www.niapune.org.in/
చదవండి: Banking & Insurance Careers