Indian Americans success Journey: అమెరికాలోనూ మనోళ్లదే జోష్.. బడా కంపెనీల్లోనూ సీఈవోలుగా రాణిస్తూ
భారతీయ అమెరికన్లు...
టెక్నాలజీ ప్రపంచం రూపురేఖలు మారుస్తున్నారు..
వైద్యుల రూపంలో ప్రాణాలు కాపాడుతున్నారు..
విద్యావేత్తలుగా భావితరాలను తీర్చిదిద్దుతున్నారు..
కళాకారులుగా సాంస్కృతిక రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తున్నారు..
మేధావులుగా జ్ఞానాన్ని పంచుతున్నారు..
శాస్త్రవేత్తలుగా విశ్వం రహస్యాలను ఛేదిస్తున్నారు
.. పట్టుదల.. నైపుణ్యం.. వైవిధ్యతల కలబోతగా అమెరికన్ సమాజాన్ని సమృద్ధం చేస్తున్నారు. ఈ విజయాలు, గాథలు.. అమెరికా పురోగతి, సమైక్యతల్లో భారతీయ అమెరికన్ల పాత్రకు తార్కాణాలు!!’’
.. ఇది భారతీయుల గురించి మనకు మనం చెప్పుకుంటున్న గొప్పలు కాదు.. అంతర్జాతీయ ఖ్యాతి గడించిన కన్సల్టింగ్ సంస్థ బీసీజీ గ్లోబల్ ఇటీవల విడుదల చేసిన నివేదికలో వెల్లడించిన అచ్చమైన వాస్తవం.దశాబ్దాల క్రితం ఉపాధి కోసం, సంపాదన కోసం ఖండాలు దాటి అగ్రరాజ్యం అమెరికాలో అడుగిడిన భారతీయులు అక్కడి సమాజంతో మమేకమైపోయారు. భారత్‌లో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుంటే.. అమెరికాలో మాత్రం మనవాళ్లు ఐదో వంతు మంది ఇప్పటికీ తాతముత్తాతల ఇళ్లలోనే ఉంటున్నారు.
సంపాదించే ప్రతి డాలర్‌లో కొంత దాచుకునే ప్రయత్నం, పిల్లలకు మంచి చదువులు చెప్పించడం వంటివి కూడా మన భారతీయ అలవాట్లే. అంతేకాదు.. ప్రతి భారతీయ అమెరికన్ తన కోసం, తన కుటుంబం బాగు కోసం చేస్తున్న ప్రయత్నాలన్నీ.. అక్కడి సమాజానికి, ఆ దేశ పురోగతి మొత్తానికి కూడా ఉపయోగపడుతుండటం విశేషం. దీనిపై ‘సాక్షి’ప్రత్యేక కథనం..
భారతీయ అమెరికన్లు అమెరికా సమా జానికి, ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన స్థాయి లో సేవలు అందిస్తున్నారు. వలస వచ్చి ఒక దేశంలో బతకడమే కష్టమనుకునే పరిస్థితుల్లో.. భారతీయులు అక్కడి సమాజంతో మమేకం అవడమే కాకుండా టెక్నాలజీ, వైద్యం, విద్య, వ్యాపారాల్లో రాణించి అమెరికన్లకూ మేలు చేయగలుగుతున్నారు. సుమారు 30 కోట్ల జనాభా ఉన్న ‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్‌ఏ)’లో భారతీయుల సంఖ్య యాభై లక్షల వరకు ఉంటుందని అంచనా. అంటే అక్కడి జనాభాలో సుమారు రెండు శాతం.
కానీ ఆ దేశంలోని 60% హోటళ్లు, సూపర్ మార్కెట్లు, కిరాణా దుకాణాలు ఇతర వ్యాపా రాలలో వీరికి భాగస్వామ్యం ఉంది. కోటి మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయిలో ఉన్నారు. వందల కోట్ల డాలర్ల విలువైన స్టార్టప్ కంపెనీలు స్థాపించగలిగారు. టాప్ టెక్నాలజీ కంపెనీల సీఈవోల నుంచి ట్రక్ డ్రైవర్ల దాకా ఎన్నో ఉద్యోగాల్లో రాణిస్తున్నారు. అమెరికా స్థానికుల కంటే సగటు భారతీయ అమెరికన్ కుటుంబం రెట్టింపు వార్షికాదాయాన్ని కలిగి ఉందంటేనే పరిస్థితి ఏమిటన్నది అర్థమవుతుంది.
చదువే పెట్టుబడిగా..
భారతీయ అమెరికన్లు తమ పిల్లలకు మంచి విద్య అందించేందుకు కృషి చేస్తున్నారు. కనీసం 70శాతం మంది బ్యాచిలర్స్ డిగ్రీ వరకూ చదువుకుంటున్నారు. 2007 నుంచి 2023 ఏప్రిల్ మధ్య 16 లక్షల మంది గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. భారతీయ అమెరికన్లలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినవారు 40 శాతం ఉంటే.. అమెరికా స్థానికులలో ఇది కేవలం 13 శాతమే కావడం గమనార్హం.
భారతీయ అమెరికన్లు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేథమెటిక్స్ రంగాల కోర్సులు చేస్తున్నారు. బాగా చదువుకున్న తల్లిదండ్రులు ఉండటం భారతీయ అమెరికన్ కుటుంబాల్లోని భావితరాలకు మరో వరం అని చెప్పవచ్చు. ప్రతిష్టాత్మక స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీలు 34 సార్లు జరిగితే అందులో 28సార్లు ఇండియన్ అమె రికన్లే విజేతలుగా నిలిచారు.
మంచి చదువు, నైపుణ్యాలతో.. మనవాళ్లు ఏ రంగంలో స్థిర పడ్డా బాగా రాణించగలుగుతున్నారు. జీతా లు మెరుగ్గా ఉంటున్నాయి. భారతీయ అమెరికన్ కుటుంబం సగటు వార్షికా దాయం 1,23,700 డాలర్లు (కోటి రూపా యలకుపైనే) ఉంది. అమెరికా స్థానిక కుటుంబాలతో పోలిస్తే ఇది సుమారు రెట్టింపు కావడం గమనార్హం.
330కోట్ల డాలర్లు
అమెరికాలోని వివిధ యూనివర్సిటీల్లో చదువుతున్నభారతీయ విద్యార్థులు పెడుతున్న ఖర్చులు, చెల్లిస్తున్న ఫీజులు కలిపి సుమారు 330 కోట్ల డాలర్లు ఉంటాయని అంచనా. అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఈ సొమ్ము కూడా కీలకమే.
విద్యారంగం పైనా మన ముద్ర
భారతీయ అమెరికన్లు అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాల్లో ఉన్నత హోదాల్లో పనిచేస్తు న్నారు. అగ్రరాజ్యంలో విద్యారంగంపై తమదైన ముద్ర వేస్తున్నారు. డాక్టర్ నీలి బెండపూడి పెన్‌స్టేట్ యూనివర్సిటీ తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికై చరిత్ర సృష్టించగా.. ప్రఖ్యాత స్టాన్‌ఫర్డ్ యూని వర్సిటీకి చెందిన ‘డోయిర్ స్కూల్ ఆఫ్ సస్టెయిన బిలిటీ తొలి డీన్‌గా అరుణ్ మజుందార్ పనిచేస్తు న్నారు.
శుభ్ర సురేశ్ కార్నెగీ మెలన్ యూనివర్సిటీ అధ్యక్షులుగా ఉండగా.. యూనివర్సిటీ అఫ్ కాలిఫో ర్నియా చాన్సలర్‌గా ప్రదీప్ ఖోస్లా వ్యవహరిస్తున్నారు. ఇదే యూనివర్సిటీ బర్క్‌లీ క్యాంపస్ ఇంజనీరింగ్ కాలేజీ డీన్‌గా ఎస్.శంకర శాస్త్రి ఉన్నారు. అంతేకాదు మరెన్నో వర్సిటీల్లో భారతీయ అమెరికన్లు అధ్యాపకులుగా పనిచేస్తు న్నారు. ఒక అంచనా ప్రకారం అమెరికాలోని యూనివర్సిటీలు, కాలేజీలన్నింటిలో కలిపి సుమారు 22 వేల మంది భారతీయ అమెరికన్ అధ్యాపకులు ఉన్నారు.
మొత్తం అధ్యాపకుల్లో మనవాళ్ల వాటా 2.6 శాతం. సిలికాన్ వ్యాలీలోని హార్వర్డ్ లా స్కూల్, కార్నెగీ మెలన్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ సభ్యు డిగా వివేక్ వాధ్వా సేవలందిస్తుండగా.. ఆన్‌లైన్ విద్య విప్లవానికి నాంది పలికిన ‘ఎడ్‌ఎక్స్’ కంపెనీ సీఈవో, ఎంఐటీ అధ్యాపకుడు అనంత్ అగర్వాల్ కూడా భారతీయ అమెరికనే.
ఆర్థిక ఇంధనం
అమెరికా స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 2023లో 27.36 లక్షల కోట్ల డాలర్లు. ఇందులో భార తీయ అమెరికన్ల వాటా సుమారు లక్ష కోట్ల డాలర్లు. ఖర్చు పెట్టగల స్థోమత, పన్నుల చెల్లింపు, వ్యాపారాల ద్వారా ఇంత మొత్తాన్ని అమెరికా ఆర్థిక వ్యవస్థకు జోడించగలుగుతున్నారు మనవాళ్లు. ఏటా భారతీయ అమెరికన్లు చెల్లించే పన్నులు 30,000 కోట్ల డాలర్లుగా అంచనా.
Two Days Schools Holidays 2024 : బ్రేకింగ్ న్యూస్.. రెండు రోజుల పాటు స్కూల్స్ బంద్
భారతీయ అమెరికన్లు అక్కడ ఏర్పాటు చేసిన హోటళ్ల ద్వారా వచ్చే ఆదాయం 70,000 కోట్ల డాలర్లు. భారతీయ అమెరికన్లు రోజువారీ సరుకులు మొదలు.. వినోద, విహారాల దాకా ఏటా పెడుతున్న ఖర్చు 37,000 కోట్ల డాలర్ల నుంచి 46,000 కోట్ల డాలర్ల వరకూ ఉంటుంది. ఈ క్రమంలో అక్కడి ప్రభుత్వానికి అందే సేల్స్ ట్యాక్స్, ఇతర పన్నుల రూపంలో భారీగానే ఆదాయం సమకూరుతోంది.
పరిశోధనలు, పేటెంట్లతోనూ..
యూనివర్సిటీలు, కాలేజీల పాలన, బోధన మాత్రమే కాకుండా.. పరిశోధనల ద్వారా కూడా భారతీయ అమెరికన్లు విద్యా వ్యవస్థలో భాగమవుతున్నారు. అమెరికాలో 2023లో ప్రచురితమైన పరిశోధన వ్యాసాలన్నింటిలో భారతీయ సంతతి పరిశోధకుల భాగస్వామ్యం 13 శాతానికిపైగా ఉండటం ఈ విషయాన్ని రుజువు చేస్తోంది. అలాగే పది శాతం పేటెంట్లు కూడా మనవాళ్ల పేరుతోనే జారీ అవుతున్నాయి. పరిశోధనలకు అందించే ఎన్‌ఐహెచ్ గ్రాంట్లలోనూ భారతీయ అమెరికన్ల వాటా 11 శాతం కంటే ఎక్కువే.
విస్తరిస్తున్న వ్యాపార సామ్రాజ్యం
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాప్ట్ సీఈవో సత్య నాదెళ్ల, అడోబ్ సిస్టమ్స్ శాంతను నారాయణన్.. మనం తరచూ ఈ పేర్లువింటుంటాం. ప్రపంచంలోనే టాప్ కంపెనీలను నడుపుతున్న భారతీయ అమెరికన్లు వారు. అంతేకాదు అమెరికాలో భారతీయులు సృష్టించిన వ్యాపార సామ్రాజ్యం చాలా పెద్దది.
ప్రపంచం గతిని మార్చేసిన సిలికాన్ వ్యాలీ టెక్ కంపెనీల్లో 15.5 శాతం భారతీయ సంతతి వాళ్లు ఏర్పాటు చేసినవే. టెక్ కంపెనీలే కాదు.. ప్రతి వీధి చివర ఒక సూపర్ మార్కెట్, లేదంటే హోటల్ నడుపుతున్నది మనవాళ్లే. అమెరికా మొత్తమ్మీద ఉన్న హోటళ్లలో 60శాతం భారతీయులవే.
ఉద్యోగ కల్పనకు ఇతోధిక తోడ్పాటు
గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్ వంటి 16 పెద్ద కంపెనీలను నడిపిస్తున్న భారతీయ అమెరికన్లు.. ఉద్యోగ కల్పన విషయంలోనూ ముందున్నారు. ఈ కంపెనీల్లో సుమారు 27 లక్షల మంది అమెరికన్లు ఉద్యోగం చేస్తున్నారు. వంద కోట్ల డాలర్లకుపైగా విలువైన యూనికార్న్ కంపెనీలు అమెరికాలో 648 వరకూ ఉంటే.. అందులో భారతీయ అమెరికన్లు ఏర్పాటు చేసినవే 72. వీటి మొత్తం విలువ 195 బిలియన్ డాలర్లు. సుమారు 55,000 మంది ఉపాధి పొందుతున్నారు.
మరోవైపు అమెరికాలోని హోటళ్లలో 60శాతం భారతీయ అమెరికన్లవే. ఈ రంగం ప్రత్యక్షంగా, పరోక్షంగా 40 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తోందని అంచనా. అంటే భారతీయ అమెరికన్లు 24 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించినట్టు లెక్క. చిన్న దుకాణాలు, సూపర్ మార్కెట్ల ద్వారా మరో 3.5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. మొత్తంగా భారతీయ అమెరికన్లు కోటి మంది జీవనానికి సాయపడుతున్నట్టు అంచనా.
స్టార్టప్‌ల స్థాపనలోనూ..
సోషల్ నెట్‌వర్కింగ్ అనగానే ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటివి గుర్తుకొస్తాయి. అలా కాకుండా ఆడియో ద్వారా కూడా సోషల్ ప్లాట్‌ఫామ్ నడపవచ్చని నిరూపించారు భారతీయ అమెరికన్ రోహన్ సేథ్. ‘క్లబ్‌హౌస్’ పేరుతో ఆయన అభివృద్ధి చేసిన అప్లికేషన్ ఇప్పుడు పాపులర్. షేర్ల వ్యాపారం చేసే రాబిన్‌హుడ్, ఇంటికే సరుకులు తీసుకొచ్చిన ‘ఇన్‌స్టాకార్ట్’ వంటి స్టార్టప్‌లు భారతీయ అమెరికన్ల బుర్రల్లోంచి పుట్టుకొచ్చినవే.
టాప్ భారతీయ అమెరికన్‌లు వీరే..
జయ్ చౌధురి
సీఈవో, జెడ్ స్కేలర్ (సైబర్ సెక్యూరిటీ రంగంలో అగ్రగామి సంస్థ)
వినోద్ ఖోస్లా
సన్ మైక్రో సిస్టమ్స్‌సహ వ్యవస్థాపకుడు, ఖోస్లా వెంచర్స్ అధినేత
రొమేశ్ టి.వాధ్వానీ
సింఫనీ టెక్నాలజీగ్రూప్ వ్యవస్థాపకుడు, సీఈవో
రాకేశ్ గంగ్వాల్
ఇండిగో విమానాల సంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ సహ వ్యవస్థాపకుడు
అనిల్ భుస్రీ
క్లౌడ్ ఆధారిత ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్ కంపెనీ ‘వర్క్‌డే’ సహ వ్యవస్థాపకుడు
నీరజ్ షా
ఇంటి సామన్లు అమ్మే ఈ–కామర్స్ కంపెనీ వేఫెయిర్ సీఈవో, సహ వ్యవస్థాపకుడు
బైజూ భట్
కమీషన్ లేకుండా ట్రేడింగ్ సౌకర్యం అందించే కంపెనీ రాబిన్ హుడ్ వ్యవస్థాపకుడు
రోహన్ సేథ్
ఆడియో ఆధారిత సోషల్ నెట్‌వర్కింగ్ అప్లికేషన్ ‘క్లబ్‌హౌస్’ కంపెనీ సహ వ్యవస్థాపకుడు.
-శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి కంచర్ల యాదగిరిరెడ్డి