Career in Fashion: ఫ్యాషన్ కెరీర్‌కు కేరాఫ్.. నిఫ్ట్.. బ్యాచిలర్ కోర్సులివే..
ఫ్యాషన్ టెక్నాలజీకి సంబంధించి ఆధునిక నైపుణ్యాలు అందించే ఉద్దేశంతో కేంద్ర టెక్స్‌టైల్ శాఖ నిఫ్ట్ క్యాంపస్‌లను ఏర్పాటు చేసింది. ఫ్యాషన్ రంగానికి సంబంధించి ప్రొడక్షన్, డిజైన్ తదితర విభాగాల్లో.. ఈ ఇన్‌స్టిట్యూట్స్ పలు కోర్సులు అందిస్తున్నాయి.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 19 నిఫ్ట్ క్యాంపస్‌లు ఉన్నాయి. వీటిలో బ్యాచిలర్, మాస్టర్ స్థాయి కోర్సులకు సంబంధించి 4,837 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రవేశాల కోసం ప్రతి ఏటా నిఫ్ట్–అడ్మిషన్ టెస్ట్ పేరిట ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
బ్యాచిలర్ కోర్సులివే
- నిఫ్ట్ క్యాంపస్‌ల్లో బ్యాచిలర్ స్థాయిలో ఏడు కోర్సులు, పీజీ స్థాయిలో మూడు ఉన్నాయి. బ్యాచిలర్ స్థాయిలో బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ పేరుతో అందుబాటులో ఉన్న కోర్సుల వివరాలు.. యాక్ససరీ డిజైన్; ఫ్యాషన్ కమ్యూనికేషన్; బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్; ఫ్యాషన్ ఇంటీరియర్; నిట్‌వేర్ డిజైన్; లెదర్ డిజైన్; టెక్స్‌టైల్ డిజైన్; బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ–అపెరల్ ప్రొడక్షన్.
- నిఫ్ట్ అందిస్తున్న ప్రోగ్రామ్‌లలో ప్రత్యేకమైనది.. బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ. ఫ్యాషన్ విభాగంలో టెక్నికల్ నైపుణ్యాలను అందించే ప్రత్యేక కోర్సు ఇది.
- పీజీ స్థాయిలో మాస్టర్ ఆఫ్ డిజైన్, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్‌మెంట్, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి.
అర్హతలు
- బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ కోర్సులు: ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత ఉండాలి.
- బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ: ఎంపీసీ గ్రూప్‌తో ఇంటర్మీడియెట్ లేదా గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ నుంచి మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి.
- మాస్టర్ ఆఫ్ డిజైన్, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ కమ్యూనికేషన్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత లేదా నిఫ్ట్ లేదా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ నుంచి అండర్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
- మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ: నిఫ్ట్ నుంచి బి.ఎఫ్.టెక్ ఉత్తీర్ణులు లేదా ఏఐసీటీఈ గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ నుంచి బీటెక్ ఉత్తీర్ణులు.
వయసు
2025 ఆగస్ట్ 1 నాటికి 24 సంవత్సరాలలోపు ఉండాలి. పీజీ ప్రోగ్రామ్‌లకు ఎలాంటి గరిష్ట వయో పరిమితి లేదు. ఆయా కోర్సుల చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
చదవండి: NIFT Admissions 2025 : ఫ్యాషన్ డిజైనింగ్‌లో కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం.... చివరి తేదీ ఇదే
మూడు దశల ఎంపిక ప్రక్రియ
నిఫ్ట్–అడ్మిషన్ ప్రక్రియను మూడు దశల్లో నిర్వహిస్తారు. తొలి దశలో క్రియేటివ్ ఎబిలిటీ టెస్ట్ (సీఏటీ), జనరల్ ఎబిలిటీ టెస్ట్(జీఏటీ)ను నిర్వహిస్తారు. ఆ తర్వాత దశలో సిట్యుయేషన్ టెస్ట్ ఉంటుంది. చివరగా పర్సనల్ ఇంటర్వ్యూ/గ్రూప్ డిస్కషన్‌లు నిర్వహించి వాటిలో విజయం సాధిస్తే సీటు ఖరారు చేస్తారు.
తొలిదశ జీఏటీ
- తొలిదశలో జీఏటీ(జనరల్ ఎబిలిటీ టెస్ట్)ని బ్యాచిలర్, పీజీ కోర్సుల అభ్యర్థులకు నిర్వహిస్తారు. పరీక్ష ప్రశ్నల క్లిష్టత స్థాయి మాస్టర్ కోర్సుల్లో కొంత ఎక్కువగా ఉంటుంది. బీడిజైన్ జీఏటీ 100 ప్రశ్నలకు రెండు గంటల వ్యవధిలో జరుగుతుంది. అదేవిధంగా ఎండిజైన్ జీఏటీ 120 ప్రశ్నలకు రెండు గంటల వ్యవధిలో నిర్వహిస్తారు.
- జీఏటీలోనూ పలు విభాగాల నుంచి నిర్దిష్ట సంఖ్యలో ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు క్వాంటిటేటివ్ ఎబిలిటీ, కమ్యూనికేషన్ ఎబిలిటీ, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్, అనలిటికల్ ఎబిలిటీ,జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్‌కు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది.
ఫ్యాషన్ టెక్నాలజీ.. ప్రత్యేకంగా
- బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, మాస్టర్ ఫ్యాషన్ టెక్నాలజీ, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్‌మెంట్ కోర్సులకు తొలి దశ ప్రవేశ పరీక్ష జీఏటీ ప్రత్యేకంగా నిర్వహిస్తారు. మూడు గంటల వ్యవధిలో నిర్వహించే ఈ పరీక్షలో క్యాంటిటేటివ్ ఎబిలిటీ, కమ్యూనికేషన్ ఎబిలిటీ అండ్ ఇంగ్లిష్ కాంప్రహెన్షన్, అనలిటికల్ అండ్ లాజికల్ ఎబిలిటీ విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. వీటితోపాటు ఒక కేస్ స్టడీ కూడా ఉంటుంది. మొత్తంగా ఈ పరీక్ష బి.ఎఫ్‌టెక్, ఎం.ఎఫ్‌టెక్‌లకు సంబంధించి 100 ప్రశ్నలు ఉంటాయి. బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీకి సంబంధించి జీఏటీని సెక్షన్–ఎ, సెక్షన్–బిలుగా నిర్వహిస్తారు.
- సెక్షన్–ఎలో కమ్యూనికేషన్ ఎబిలిటీ అండ్ ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ (40 ప్రశ్నలు), క్వాంటిటేటివ్ ఎబిలిటీ (20 ప్రశ్నలు), అనలిటికల్ అండ్ లాజికల్ ఎబిలిటీ (15 ప్రశ్నలు), జీకే అండ్ కరెంట్ అఫైర్స్(25 ప్రశ్నలు) ఉంటాయి.
- సెక్షన్–బిలో క్వాంటిటేటివ్ ఎబిలిటీ (15 ప్రశ్నలు), అనలిటికల్ అండ్ లాజికల్ ఎబిలిటీ (15 ప్రశ్నలు), కేస్ స్టడీ (20 ప్రశ్నలు) ఉంటాయి.
- మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీకి సంబంధించి. కమ్యూనికేషన్ ఎబిలిటీ అండ్ ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ (45 ప్రశ్నలు), కేస్ స్టడీ (25ప్రశ్నలు), క్వాంటిటేటివ్ ఎబిలిటీ (30 ప్రశ్నలు), అనలిటికల్ అండ్ లాజికల్ ఎబిలిటీ (25 ప్రశ్నలు), జీకే అండ్ కరెంట్ అఫైర్స్ (25 ప్రశ్నలు) విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి.
- మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్‌మెంట్ కోర్సుకు మాత్రం కమ్యూనికేషన్ ఎబిలిటీ అండ్ ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ విభాగంలో 50 ప్రశ్నలు, క్వాంటిటేటివ్ ఎబిలిటీ విభాగంలో 20 ప్రశ్నలు, అనలిటికల్ అండ్ లాజికల్ ఎబిలిటీలో 25 ప్రశ్నలు, జీకే అండ్ కరెంట్ అఫైర్స్‌లో 25 ప్రశ్నలు, కేస్ స్టడీ విభాగంలో 30 ప్రశ్నలు చొప్పున అడుగుతారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
రెండో దశ సీఏటీ
మొదటి దశలో చూపిన ప్రతిభ ఆధారంగా రెండో దశలో క్రియేటివ్ ఎబిలిటీ టెస్ట్ (సీఏటీ) నిర్వహిస్తారు. అభ్యర్థుల్లోని పరిశీలనాత్మక నైపుణ్యం, సృజనాత్మకత, డిజైన్ సామర్థ్యాలను పరీక్షించే విధంగా ఈ పరీక్ష ఉంటుంది.
మూడో దశ సిట్యుయేషన్ టెస్ట్
రెండు దశల్లోనూ చూపిన ప్రతిభను ప్రామాణికంగా తీసుకుని చివరిగా సిట్యుయేషన్ టెస్ట్ నిర్వహిస్తారు. బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ అభ్యర్థులు తమలోని సృజనాత్మక ప్రతిభను చూపే విధంగా ఈ పరీక్ష ఉంటుంది. అభ్యర్థులకు నిర్ణీత మెటీరియల్ అందించి ఏదైనా ఆకృతిని రూపొందించమని లేదా ఏదైనా ఒక సందర్భాన్ని పేర్కొని దానికి తగినట్లుగా ఊహా చిత్రం గీయమని అడుగుతారు.
చివరగా.. జీడీ, ఇంటర్వ్యూ
జీఏటీ, సీఏటీలలో విజయం సాధించిన అభ్యర్థులకు చివరగా గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. భావ వ్యక్తీకరణ సామర్థ్యం, ఒక అంశంపై స్పష్టత, పరిజ్ఞానం, ఆలోచన సామర్థ్యాలను పరీక్షించే విధంగా గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి. పర్సనల్ ఇంటర్వ్యూ పూర్తిగా ఫ్యాషన్ కెరీర్ పట్ల అభ్యర్థికున్న ఆసక్తి, దానికి సరితూగే తత్వాలను గ్రహించే విధంగా ఉంటుంది.
వెయిటేజీ విధానం
- తుది ఫలితాలు విడుదల చేసే క్రమంలో వెయిటేజీ విధానాన్ని అనుసరిస్తారు.
- బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ కోర్సులకు సీఏటీకి 50 శాతం, జీఏటీకి 30 శాతం, సిట్యుయేషన్ టెస్ట్‌కు 20 శాతం వెయిటేజీ ఉంటుంది.
- బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సుల్లో జీఏటీ సెక్షన్–ఎకు 70 శాతం, జీఏటీ సెక్షన్–బికు 30 శాతం వెయిటేజీ ఇస్తారు.
- మాస్టర్ ఆఫ్ డిజైన్ కోర్సుకు సీఏటీకి 40 శాతం, జీఏటీకి 30 శాతం, పర్సనల్ ఇంటర్వ్యూకు 30 శాతం వెయిటేజీ కల్పిస్తారు.
- మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో జీఏటీకి 70 శాతం, పర్సనల్ ఇంటర్వ్యూకు 30 శాతం వెయిటేజీ ఉంటుంది.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 2025 జనవరి 6
- ఆన్‌లైన్ దరఖాస్తు సవరణ: 2025, జనవరి 10 నుంచి 12 వరకు
- ఆన్‌లైన్ ఎంట్రన్స్ టెస్ట్ తేదీ: 2025, ఫిబ్రవరి 9
- వివరాలకు వెబ్‌సైట్: https://exams.nta.ac.in/NIFT
బెస్ట్ స్కోర్‌కు మార్గమిదే
క్వాంటిటేటివ్ ఎబిలిటీ
మ్యాథమెటిక్స్, అర్థమెటిక్స్ అంశాలపై పట్టు సాధించాలి. వర్క్ అండ్ టాస్క్, శాతాలు, నిష్పత్తులు, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్ సంబంధించిన అంశాలు బాగా ప్రాక్టీస్ చేయాలి.
కమ్యూనికేషన్ ఎబిలిటీ, ఇంగ్లిష్
ఇంగ్లిష్ భాషలో ప్రాథమిక నైపుణ్యాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి బేసిక్ గ్రామర్ అంశాలపై అవగాహన పెంచుకోవాలి.
అనలిటికల్ అండ్ లాజికల్ ఎబిలిటీ
విశ్లేషణ సామర్థ్యాన్ని, తార్కిక నైపుణ్యాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. నిర్దిష్టంగా ఒక అంశంలో ఇమిడున్న ప్రధాన అంశాలు, వాటికి సంబంధించి అప్లికేషన్ అప్రోచ్‌తో ప్రాక్టీస్ చేయాలి.
జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్
ఈ విభాగానికి సంబంధించిన ప్రశ్నలు ౖహె స్కూల్ స్థాయి సోషల్ సబ్జెక్ట్ నుంచి ఉంటాయి. అదే విధంగా ముఖ్యమైన తేదీలు – సందర్భాలు వంటివి కూడా అడుగుతారు. కాబట్టి అభ్యర్థులు తాజాగా జరిగిన ముఖ్యమైన సంఘటనలు సైతం తెలుసుకోవాలి.
కేస్ స్టడీ
బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్‌మెంట్ కోర్సు అభ్యర్థులకు నిర్వహించే కేస్ స్టడీ.. ఒక వాస్తవ సమస్యను ఇచ్చి దానికి పరిష్కారం అడిగేలా ఉంటుంది. అభ్యర్థులకు అన్వయ దృక్పథం, సమస్యను గుర్తించే లక్షణం అవసరం.
Tags
- Fashion Industry
- Career in fashion industry
- Careers in fashion
- NIFT
- National Institute of Fashion Technology
- Bachelor Courses
- NIFT 2025 Notification
- NIFT 2025 Entrance Exam
- NIFT Entrance Exam 2025
- Nift 2025 Notification Release
- Careers Fashion Designing
- NIFT Master of Design Admission 2025
- NIFT Master Programs 2025
- Fashion technology programs
- NIFT application