NCHM JEE 2025 Exam Guidance: ఎన్‌సీహెచ్‌ఎం–జేఈఈ–2025 నోటిఫికేషన్ విడుదల.. కెరీర్ అవకాశాలపై ప్రత్యేక కథనం..
ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్, సైన్స్ తదితర కోర్సులకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఐఐటీలు, ఐఐఎంలు, ఐఐఎస్‌ఈఆర్‌లు వంటి ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లు ఏర్పాటైన సంగతి తెలిసిందే. వాటి ద్వారా విద్యార్థులను ఆయా రంగాల్లో నిపుణులుగా తీర్చిదిద్దుతున్నారు.
అదే విధంగా.. హోటల్ మేనేజ్‌మెంట్ విభాగంలోనూ నిపుణులైన మానవ వనరులను తీర్చిదిద్దే ఉద్దేశంతో కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన విద్యాసంస్థలే.. ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ క్యాంపస్‌లు. ఇవి అందించే బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష.. ఎన్‌సీహెచ్‌ఎం–జేఈఈ. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ఆధ్వర్యంలో ఈ పరీక్ష జరుగుతుంది.
అర్హతలు
ఇంటర్మీడియెట్ తత్సమాన కోర్సు ఉత్తీర్ణత ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
13 వేలకు పైగా సీట్లు
ఎన్‌సీహెచ్‌ఎం–జేఈఈలో స్కోర్ ఆధారంగా జాతీయ స్థాయిలో ప్రభుత్వ, ప్రైవేటు విభాగాల్లోని 79 హోటల్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్స్‌లో 13,148 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో 21 ఇన్‌స్టిట్యూట్‌లు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో 30 ఇన్‌స్టిట్యూట్‌లు, 24 ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌లు, ఒక పీఎస్‌యూ ఇన్‌స్టిట్యూట్, 2 పీపీపీ మోడల్ ఇన్‌స్టిట్యూట్స్‌లో బీఎస్సీ హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు అందుబాటులో ఉంది. వీటన్నింటి పర్యవేక్షణకు జాతీయ స్థాయిలో ప్రత్యేకంగా నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ సంస్థను పర్యాటక శాఖ ఏర్పాటు చేసింది.
చదవండి: ‘ఆతిథ్యం’లో వైవిధ్యం.. డాక్టర్ వైఎస్‌ఆర్ నిథమ్
ఎన్‌సీహెచ్‌ఎం–జేఈఈ ఇలా
ఎన్‌సీహెచ్‌ఎం–జేఈఈ పరీక్ష మొత్తం అయిదు విభాగాల్లో 200 మార్కులకు జరుగుతుంది. ఇందులో న్యూమరికల్ ఎబిలిటీ అండ్ అనలిటికల్ ఆప్టిట్యూడ్ 30 ప్రశ్నలు, రీజనింగ్ అండ్ లాజికల్ డిడక్షన్ 30 ప్రశ్నలు, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 30 ప్రశ్నలు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ 60 ప్రశ్నలు, ఆప్టిట్యూడ్ ఫర్ సర్వీస్ సెక్టార్ 50 ప్రశ్నలకు ఉంటాయి. పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో ఆబ్జెక్టివ్ ప్రశ్నలతో ఈ పరీక్ష నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు నాలుగు మార్కులు కేటాయిస్తారు. నెగెటివ్ మార్కింగ్ నిబంధన కూడా ఉంది. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు కోత విధిస్తారు. పరీక్షకు కేటాయించిన సమయం మూడు గంటలు. మెరిట్ జాబితాను రూపొందించే క్రమంలో ఇంగ్లిష్ లాంగ్వేజ్‌లో అత్యధిక మార్కులు పొందిన వారిని ముందుగా పరిగణనలోకి తీసుకుంటారు.
ప్రవేశాలకు ఆన్‌లైన్ కౌన్సెలింగ్
ఎన్‌సీహెచ్‌ఎం–జేఈఈ స్కోర్ ఆధారంగా ఆన్‌లైన్ విధానంలో ఉమ్మడి కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ఎంట్రన్స్‌లో ఉత్తీర్ణత సాధించిన వారు ఆన్‌లైన్ కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకుని.. తమ ఇన్‌స్టిట్యూట్ ప్రాథమ్యాలతో ఛాయిస్ ఫిల్లింగ్ పూర్తిచేయాలి. అనంతరం అందుబాటులో ఉన్న సీట్లు, ఎంట్రన్స్ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకొని ప్రవేశం ఖరారు చేస్తారు.
చదవండి: హాస్పిటాలిటీ కెరీర్‌కు చక్కటి వేదిక ఎన్‌సీహెచ్‌ఎంసీటీ-జేఈఈ
లభించే కొలువులు
బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు పూర్తి చేసిన వారికి.. గెస్ట్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్స్, ఫ్రంట్ డెస్క్ మేనేజర్, క్రూయిజ్ మేనేజర్, కిచెన్ ఎగ్జిక్యూటివ్, మార్కెటింగ్ మేనేజర్, సర్వీస్ ఎగ్జిక్యూటివ్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ట్రిప్ అడ్వైజర్, బ్యాక్ ఎండ్ ఎగ్జిక్యూటివ్స్, చెఫ్స్ వంటి ఉద్యోగాలు లభిస్తున్నాయి. ప్రారంభంలో సగటున రూ.4లక్షల నుంచి రూ.5లక్షల వార్షిక వేతనాన్ని సంస్థలు అందిస్తున్నాయి.
రాత పరీక్షలో రాణించేలా న్యూవురికల్ ఎబిలిటీ అండ్ అనలిటికల్ ఆప్టిట్యూడ్
అభ్యర్థులకు మ్యాథమెటిక్స్‌లో ఉన్న బేసిక్ నైపుణ్యాలను పరీక్షించే విభాగం ఇది. ఇందులో రాణించేందకు హెస్కూల్ స్థాయిలోని మ్యాథమెటిక్స్ అంశాల్లో అవగాహన ఏర్పరచుకోవాలి. వీటిలోనూ ముఖ్యంగా శాతాలు, లాభ నష్టాలు, నెంబర్ సిస్టమ్, సగటు, కాలం–పని, సాధారణ వడ్డీ, బారు వడ్డీ, కాలం–వేగం–దూరం, నిష్పత్తులు, జామెట్రీ వంటి అంశాల్లో మరింత పట్టు సాధించాలి. అనలిటికల్ ఆప్టిట్యూడ్ కోసం నిర్దిష్టంగా డేటాను విశ్లేషించగలిగే సామర్థ్యం, డేటాలోని ముఖ్య సమాచారాన్ని క్రోడీకరించి ఇచ్చిన ప్రశ్నకు సరైన సమాధానం గుర్తించే నైపుణ్యం సొంతం చేసుకోవాలి. ఇందుకోసం గ్రాఫ్‌లు, పై చార్ట్‌లు, ఫ్లో చార్ట్‌లు వంటి వాటిని ప్రాక్టీస్ చేయాలి.
చదవండి: Career in Fashion: ఫ్యాషన్ కెరీర్‌కు కేరాఫ్.. నిఫ్ట్.. బ్యాచిలర్ కోర్సులివే..
రీజనింగ్ అండ్ లాజికల్ డిడక్షన్
అభ్యర్థుల్లోని సునిశిత పరిశీలన, తార్కిక విశ్లేషణ నైపుణ్యాలను పరీక్షించే విభాగమిది. ఇందులో మెరుగైన ప్రతిభ కనబర్చాలంటే.. మ్యాథమెటికల్ ఆపరేషన్స్, కోడింగ్– డీకోడింగ్, నంబర్ సిరీస్, బ్లడ్ రిలేషన్ వంటి రీజనింగ్ ఆధారిత అంశాలపై పట్టు సాధించాలి. ఇందుకోసం ప్రిపరేషన్ సమయంలో ప్రాక్టీస్‌కు ప్రాధాన్యమివ్వాలి. అదే విధంగా డేటా సఫీషియన్సీ, వెన్ డయాగ్రమ్స్ ప్రాక్టీస్ చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది.
జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్
ఈ విభాగంలో మంచి మార్కులు పొందాలంటే.. హైస్కూల్ స్థాయిలోని చరిత్ర, రాజ్యాంగం, జాగ్రఫీ, ఎకనామిక్స్ పాఠ్యాంశాలు చదవాలి. హిస్టరీకి సంబంధించి ముఖ్యమైన యుద్ధాలు–పరిణామాలు–పర్యవసానాలు, స్వాతంత్య్రోద్యమం వంటి అంశాలపై అవగాహన లాభిస్తుంది. జాగ్రఫీలో దేశంలోని ముఖ్యమైన ప్రదేశాలు, ఖనిజ వనరులు–అవి ఎక్కువగా లభించే ప్రాంతాలు, నదులు, సరస్సులు, పర్వతాల గురించి క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. కరెంట్ అఫైర్స్‌కు సంబంధించి ముఖ్యమైన సదస్సులు, సమావేశాలు, వార్తల్లోని వ్యక్తులు, అంతర్జాతీయంగా ప్రాముఖ్యం సంతరించుకున్న అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి.
ఇంగ్లిష్ లాంగ్వేజ్
ర్యాంకుల పరిగణనలో, తుది జాబితా రూపకల్పనలో కీలకమైన విభాగం.. ఇంగ్లిష్ లాంగ్వేజ్. ఇందులో రాణించడానికి అభ్యర్థులు గ్రామర్‌ను ఔపోసన పట్టాలి. టెన్సెస్, ప్రిపోజిషన్స్, వన్ వర్డ్ సబ్‌స్టిట్యూట్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, యాంటానిమ్స్, సినానిమ్స్, సెంటెన్స్ ఫార్మేషన్, స్పాటింగ్ ద ఎర్రర్స్, సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్‌పై పూర్తి స్థాయిలో పట్టు సాధించాలి. దీనికోసం బేసిక్ గ్రామర్ పుస్తకాలను అధ్యయనం చేయాలి. న్యూస్ పేపర్లను చదవడం, వాటిలోని కొత్త పదాలను తెలుసుకోవడం, ఆ పదాలను వినియోగించిన తీరుపై అవగాహన పెంచుకోవడం వంటివి లాభిస్తాయి. పదో తరగతి స్థాయి ఇంగ్లిష్ పుస్తకాలను చదవాలి.
ఆప్టిట్యూడ్ ఫర్ సర్వీస్ సెక్టార్
ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈలో ప్రత్యేకమైన విభాగంగా ఆప్టిట్యూడ్ ఫర్ సర్వీస్ సెక్టార్‌ను పేర్కొనొచ్చు. ఇందులో ప్రధానంగా అభ్యర్థికి ఆతిథ్య, పర్యాటక రంగాలపై ఉన్న ఆసక్తి, దృక్పథాన్ని పరీక్షించే ప్రశ్నలు ఉంటాయి. వాస్తవ సంఘటన లేదా అంశం ఇచ్చి దానికి ఎలా స్పందిస్తారు? అనే తరహా ప్రశ్నలు అడుగుతారు. ఈ ప్రశ్నలు అభ్యర్థుల్లో ఎదుటి వారిని మెప్పించే తీరు, సందర్భానికి తగినట్లు వ్యవహరించే శైలికి సంబంధించి ఉంటాయి.
ముఖ్య సమాచారం
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: 2025, ఫిబ్రవరి 15
దరఖాస్తు సవరణ అవకాశం: 2025, ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు
ఎన్‌సీహెచ్‌ఎం–జేఈఈ పరీక్ష తేదీ: 2025, ఏప్రిల్ 27
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://exams.nta.ac.in/NCHM
Tags
- NCHM JEE 2025
- NCHMCT JEE 2025
- NCHM JEE 2025 Exam Guidance
- NCHMCT JEE 2025 Preparation
- NCHMCT JEE Preparation 2025 Tips
- NCHMCT JEE Syllabus 2025
- NCHM JEE 2025 Application Begins
- admissions
- Information about NCHM JEE 2025
- How To Prepare For NCHMCT JEE 2025
- NCHMCT JEE Eligibility Criteria 2025
- NCHMCT JEE Entrance Exam 2025
- Hotel Management
- Nchm jee 2025 guidance pdf
- NCHMCT JEE 2025 syllabus
- NCHMCT JEE 2025 registration last date
- NCHMCT JEE 2025 exam Date
- National Council for Hotel Management and Catering Technology
- NTA
- NATIONAL COUNCIL FOR HOTEL MANAGEMENT JOINT ENTRANCE EXAMINATION
- National Testing Agency
- NCHM-JEE 2025
- Hotel management careers
- Apply for NCHM-JEE 2025
- NCHM-JEE syllabus and pattern
- NCHM-JEE exam tips
- NCHM-JEE benefits