COE Notification: సీవోఈ నోటిఫికేషన్ ఎప్పుడో?.. ప్రవేశం దక్కితే విద్యార్థులకు వరం..
ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, సంక్షేమ, జనరల్ గురుకులాల్లో ఐదో తరగతిలో ప్రవేశానికి ఉమ్మడి ప్రవేశపరీక్షకు డిసెంబర్ 18న నోటిఫికేషన్ విడుదల కాగా, సీవోఈలో ప్రవేశానికి నోటిఫికేషన్ జారీలో జాప్యం జరుగుతోంది. ఏటా డిసెంబర్ రెండు లేదా మూడో వారంలో నోటిఫికేషన్ విడుదల చేస్తుండగా ఈసారి ఆలస్యం అవుతుండటంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పదో తరగతిలో సాధించిన మార్కుల ప్రాతిపదికన విద్యార్థులకు ఈసారి అడ్మిషన్ కల్పిస్తారనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్) ఈవిషయంలో అధికారికంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయకపోయినప్పటికీ రకరకాలుగా ఊహాగానాలు వస్తున్నాయి. ఈకారణంగా ప్రస్తుత విద్యా సంవత్సరంలో పది వార్షిక పరీక్షలు రాయబోతున్న విద్యార్థులు ఎటూ తేల్చుకోలేక సతమతమవుతున్నారు. సీవోఈ ప్రవేశపరీక్షకు సిద్ధం కావాలా లేక పదో తరగతి పరీక్ష మెరుగ్గా రాయాలా అనే సందిగ్ధంలో ఉన్నారు.
ఉమ్మడి జిల్లాలో రెండు సీవోఈలు..
ఉమ్మడి జిల్లాలో సాంఘిక సంక్షేమ గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీలు రెండు ఉన్నాయి. మంచిర్యాల జిల్లాలో బెల్లంపల్లి కేంద్రంగా బాలుర సీవోఈ, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బాలికల సీవోఈ కళాశాలలు ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం ప్రవేశపరీక్ష నిర్వహించి వీటిలో మెరిట్ విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తారు.
ఒక్కో కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో రెండేసి సెక్షన్ల చొప్పున 80 మంది విద్యార్థులకు అడ్మిషన్ కల్పిస్తారు. సాధారణ గురుకులాల కన్నా సీవోఈ కళాశాలల్లో ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలకు దీటుగా ఇంటర్ విద్యాబోధన చేస్తూనే నీట్, ఎంసెట్ తదితర పోటీ పరీక్షలకు విద్యార్థులకు శిక్షణ ఇచ్చి ఉన్నతంగా తీర్చిదిద్దుతారు. సీవోఈ కళాశాలల్లో ప్రవేశానికి విద్యార్థుల్లో విపరీతమైన క్రేజీ ఏర్పడి ఏటేటా పోటీ రెట్టింపవుతోంది.
చదవండి: Inter Board: ఉత్తీర్ణత పెంచడమే లక్ష్యం!.. ఈ కాలేజీలకు ఇంటర్ బోర్డ్ ఆదేశాలు
విద్యార్థులకు వరం..
సీవోఈల్లో ప్రవేశం దక్కితే చాలు విద్యార్థుల భవిష్యత్ బంగారు మయమవుతుందనేది తల్లిదండ్రుల ఆశ. ఈకారణంగానే పదో తరగతి చదువుతున్న తమ పిల్లలకు సీవోఈ ప్రవేశపరీక్ష రాయడానికి ప్రత్యేకంగా కోచింగ్ ఇప్పిస్తుండటం చేస్తున్నారు.
ప్రవేశం పొందిన విద్యార్థి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చదువులో, పోటీ పరీక్షల్లో నెగ్గేలా ఉన్నతంగా తీర్చిదిద్దడంలో సీవోఈలు ప్రత్యేకతను ఏర్పర్చుకున్నాయి. ఈ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు పోటీ పరీక్షలు రాసి ఏటా పదులసంఖ్యలో ఇంజినీరింగ్, మెడిసిన్ సీట్లతోపాటు ఐఐటీలోనూ ప్రవేశం పొందుతున్నారు.
వారంలో వస్తుంది
విద్యార్థులు ఎలాంటి గందరగోళానికి గురికావద్దు. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ కళాశాలల్లో ప్రవేశానికి ఎప్పటిమాదిరిగా ఈసారి ప్రవేశపరీక్ష నిర్వహిస్తాం. పదో తరగతిలో వచ్చిన మార్కుల ప్రాతిపదికన సీటు కేటాయించడం జరగదు. ప్రవేశపరీక్షకు సంబఽంధించి వారంలో నోటిఫికేషన్ వస్తుంది. విద్యార్థులు పరీక్షకు సిద్ధమై ప్రతిభను చాటుకోవాలి.
– అరుణకుమారి, జోనల్ అధికారి, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ
Tags
- COE Notification
- Telangana Social Welfare Gurukula Center of Excellence
- Inter 1st Year Admissions
- Telangana Tribal Welfare Residential Educational Institutions Society
- admissions
- Common Entrance Test
- TGSWREIS
- Telangana Social Welfare Residential Educational Institutions Society
- Inter Admissions
- Adilabad District News
- Telangana News