CUET 2025 Key Changes: సీయూఈటీలో కీలక మార్పులివే!.. పరీక్ష విధానం ఇలా..
రెండేళ్ల క్రితం వరకు.. సెంట్రల్ యూనివర్సిటీల్లో ప్రవేశం కోసం ఆయా యూనివర్సిటీలకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. దీంతో బ్యాచిలర్, పీజీ స్థాయిలో ప్రవేశాలకు విద్యార్థులకు ఎన్నో వ్యయ ప్రయాసలు ఎదురయ్యేవి. వీటి నుంచి విద్యార్థులకు ఉçపశమనం కల్పించేందుకు యూజీసీ సీయూఈటీ–యూజీ, పీజీని ప్రవేశ పెట్టింది. అప్పటి నుంచి ఈ పరీక్షకు భారీగా విద్యార్థులు పోటీ పడుతున్నారు. ఈ పరీక్ష విధానంపై ఇటీవల నిపుణుల కమిటీ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించిన యూజీసీ.. 2025 నుంచి సీయూఈటీలో కీలక మార్పులు చేయాలని ప్రతిపాదించింది.
పూర్తిగా సీబీటీ విధానం
సీయూఈటీ–యూజీ, పీజీ పరీక్షను పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో జరపాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు కొన్ని పేపర్లను సీబీటీ విధానంలో, మరికొన్ని పేపర్లను పెన్–పేపర్ పద్ధతిలో నిర్వహించారు. 2025 నుంచి మాత్రం ఈ హైబ్రీడ్ విధానానికి స్వస్తి పలికి.. పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌గానే నిర్వహిస్తారు.
సబ్జెక్ట్‌ల సంఖ్య కుదింపు
సీయూఈటీ–యూజీ, పీజీ మార్పుల్లో మరో ముఖ్యమైన మార్పు.. సబ్జెక్ట్‌ల సంఖ్యను తగ్గించడం. ప్రస్తుతం 63 సబ్జెక్ట్‌లలో పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంది. తాజా మార్పుల్లో భాగంగా ఇక నుంచి 37 సబ్జెక్ట్‌లలోనే పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇలా తగ్గించిన సబ్జెక్ట్ విభాగాల్లో ప్రవేశాలకు సంబంధించి జనరల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ స్కోర్‌ను ప్రామాణికంగా తీసుకోనున్నారు.
చదవండి: National Testing Agency: ఉన్నత విద్య ప్రవేశ పరీక్షలకే ఎన్‌టీఏ పరిమితం
అయిదు సబ్జెక్ట్‌లకే అవకాశం
సీయూఈటీ–యూజీ పరీక్షలో అభ్యర్థులు ఎంచుకునే సబ్జెక్ట్‌ల సంఖ్య ఆరు నుంచి అయిదుకు తగ్గించారు. అంతేకాకుండా.. విద్యార్థులు ఇంటర్మీడియెట్‌లో చదివిన గ్రూప్‌తో సంబంధం లేకుండా.. సీయూఈటీ–యూజీలో ఏ సబ్జెక్ట్‌నైనా ఎంచుకునే అవకాశం కల్పిస్తారు. దీనివల్ల భవిష్యత్తులో ఫ్లెక్సిబుల్ లెర్నింగ్, మల్టీ డిసిప్లినరీ కోర్సుల్లో చేరే అవకాశం విద్యార్థులకు లభించనుంది.
ఒకటే పరీక్ష వ్యవధి
సీయూఈటీ మార్పుల్లో మరో అంశం.. అన్ని సబ్జెక్ట్‌లకు పరీక్ష సమయం ఒకే విధంగా ఉండాలని ప్రతిపాదించడం. ఇప్పటి వరకు ఆయా సబ్జెక్ట్‌లను బట్టి 45 నిమిషాల నుంచి 60 నిమిషాల వరకూ పరీక్ష వ్యవధి ఉండేది. కానీ.. ఇకపై ఏ సబ్జెక్ట్ అయినా 60 నిమిషాలు పరీక్ష వ్యవధి లభించనుంది.
చదవండి: UGC: మిగిలిన సీట్లకు ప్రవేశ పరీక్ష పెట్టుకోవచ్చు
ఛాయిస్ విధానం తొలగింపు
సీయూఈటీ మార్పుల్లో విద్యార్థులకు ప్రతికూలమైనదిగా భావిస్తున్న మార్పు.. ఛాయిస్ విధానాన్ని తొలగించడం. ఇప్పటి వరకు లాంగ్వేజ్ సబ్జెక్ట్ విభాగాలు, డొమైన్ సబ్జెక్ట్ విభాగంలో 50 ప్రశ్నలకు గాను 40 ప్రశ్నలు, జనరల్ టెస్ట్‌లో 60 ప్రశ్నలకుగాను 50 ప్రశ్నలకు సమాధానం ఇస్తే సరిపోయేది. అయితే ఇక నుంచి ఈ ఛాయిస్ విధానాన్ని తొలగించాలని నిర్ణయించారు.
లాంగ్వేజ్ పేపర్ల కుదింపు
సీయూఈటీ–యూజీ కొత్త విధానంలో లాంగ్వేజ్ సంబంధిత పేపర్ల సంఖ్యను తగ్గించనున్నారు. ఇంగ్లిష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మళయాళం, మరాఠి, ఒడియా, పంజాబీ, తమిళం, ఉర్దూ భాషల్లో లాంగ్వేజ్ ఆధారిత పేపర్లను యథాతథంగా నిర్వహిస్తారు. మిగతా 13 లాంగ్వేజ్ పేపర్లను మాత్రం తొలగించారు. ఈ లాంగ్వేజ్‌లకు సంబంధించిన బ్యాచిలర్ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశానికి జనరల్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో ప్రతిభను ప్రామాణికంగా తీసుకుంటారు. గతంలో ఉన్న జనరల్ టెస్ట్ విభాగాన్ని కొత్తగా జనరల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ విభాగంగా నిర్వహిస్తారు.
సీయూఈటీ–పీజీ మార్పులు
పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నిర్వహించే సీయూఈటీ–పీజీ పరీక్షను కూడా పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌గా నిర్వహించనున్నారు. అన్ని సబ్జెక్ట్‌లకు 90 నిమిషాలు చొప్పున సమయం అందుబాటులో ఉంటుంది. అదే విధంగా అన్ని ప్రశ్నలకు సమాధానాలు తప్పనిసరి చేయడంతోపాటు నెగెటివ్ మార్కింగ్ నిబంధన కూడా ఉంటుంది. జనరల్ పేపర్‌లో స్కిల్ బేస్డ్ ప్రశ్నలు ఉంటాయి. సీయూఈటీ–పీజీలో ప్రతి పేపర్/సబ్జెక్ట్‌లో 75 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు చొప్పున 300 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్షకు కేటాయించే సమయం గంటన్నర.
వేర్వేరు ప్రవేశ విధానాలు
అన్ని సెంట్రల్ యూనివర్సిటీల్లో యూజీ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశానికి సీయూఈటీ –యూజీని నిర్వహిస్తున్నప్పటికీ.. మలి దశలో మాత్రం ఆయా వర్సిటీలు స్వీయ ప్రవేశ విధానాన్ని అనుసరిస్తాయి. సీయూఈటీ–యూజీ స్కోర్ ఆధారంగా సెంట్రల్ యూనివర్సిటీలకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించిన తర్వాత సెంట్రల్ యూనివర్సిటీలు అందుబాటులో ఉన్న సీట్లు, సీయూఈటీ స్కోర్ ఆధారంగా ప్రవేశాలు ఖరారు చేయనున్నాయి.
56 సెంట్రల్ యూనివర్సిటీలు
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్–యూజీ, పీజీ స్కోర్ ఆధారంగా దేశంలోని 56 సెంట్రల్ యూనివర్సిటీల్లోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ, జాతీయ సంస్కృత విశ్వ విద్యాలయం; తెలంగాణలో.. ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ), యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లలో సీయూఈటీ స్కోర్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
సన్నద్ధతకు మార్గాలు
సీయూఈటీ–యూజీ, పీజీలో మార్పులు ప్రతిపాదించి.. వాటిపై అభిప్రాయాలను తెలపాలని యూజీసీ పేర్కొంది. దీంతో ఈ ప్రతిపాదిత మార్పులు ఖాయం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాబట్టి విద్యార్థులు ఇప్పటి నుంచే.. సీయూఈటీలో కొత్త మార్పులకు అనుగుణంగా సన్నద్ధత కొనసాగించడం మేలు. పదో తరగతి, ఇంటర్మీడియెట్ అకడమిక్ పుస్తకాలను ఔపోసన పట్టాలి. డొమైన్ సంబంధిత సబ్జెక్ట్‌ల కోసం ఎన్‌సీఈఆర్‌టీ 12వ తరగతి పుస్తకాలను పూర్తిగా అధ్యయనం చేయాలి. లాంగ్వేజ్ సబ్జెక్ట్‌ల కోసం సంబంధిత లాంగ్వేజ్‌ల గ్రామర్‌పై పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలి. అదే విధంగా వాక్య నిర్మాణం, ప్రెసిస్ రైటింగ్, ప్యాసెజ్ రీడింగ్ ప్రాక్టీస్ చేయడమే కాకుండా.. సంబంధిత ప్రశ్నలను సాధన చేయాలి. అదే విధంగా.. రీడింగ్ కాంప్రహెన్షన్, సంబంధిత లాంగ్వేజ్‌లో లిటరరీ ఆప్టిట్యూడ్, వొకాబ్యులరీపై పట్టు సాధించాలి.
జనరల్ ఆప్టిట్యూడ్ టెస్ట్
ఇందులో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ రీజనింగ్, లాజికల్ అండ్ అనలిటికల్ రీజనింగ్ నైపుణ్యాలను పరిశీలించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థులు హిస్టరీ, జాగ్రఫీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ పుస్తకాలను చదవాలి. అదే విధంగా కరెంట్ ఈవెంట్స్‌పై అవగాహన పెంచుకోవాలి. దీంతోపాటు క్వాంటిటేటివ్ రీజనింగ్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, లాజికల్ అండ్ అనలిటికల్ రీజనింగ్ అంశాల్లో రాణించడానికి అర్థ గణిత అంశాలు, కోడింగ్–డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, సీటింగ్ అరేంజ్‌మెంట్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, నంబర్ సిస్టమ్స్‌పై పట్టు సాధించాలి.
Tags
- CUET 2025
- Common University Entrance Test
- CUET 2025 Exam UG Pattern
- CUET PG 2025 Exam Dates Releasing Soon
- CUET Exam
- CUET Exam Syllabus 2025
- Common university entrance test pdf
- CUET Result 2025
- CUET 2025 Exam Guidance
- Ministry of Education
- National Testing Agency
- NTA CUET UG 2025 Pattern
- CUET 2025 Preparation
- CUETBenefitsForStudents
- CUETGuidelines
- CUETPGBenefits
- CUETUGStructure
- CUETExamUpdates
- CUETChanges2025
- CUETExamPattern