NIFT 2023 Notification: నిఫ్ట్ ప్రవేశ ప్రక్రియ, కోర్సులు.. కెరీర్ అవకాశాల గురించి తెలుసుకుందాం..
- నిఫ్ట్ క్యాంపస్‌ల్లో బ్యాచిలర్, పీజీ, డాక్టోరల్ కోర్సులు
- డిజైనింగ్ నుంచి టెక్నాలజీ వరకు పలు స్పెషలైజేషన్‌లు
- సర్టిఫికెట్ సొంతం చేసుకుంటే ఉజ్వల కెరీర్ అవకాశాలు
- నిఫ్ట్ 2023 ఎంట్రన్స్ ద్వారా ప్రవేశాలు
చదవండి: Admissions in NIFT: నిఫ్ట్‌లో యూజీ, పీజీ, పీహెచ్‌డీలో ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా..
ఫ్యాషన్ టెక్నాలజీకి సంబంధించి నైపుణ్యాలు అందించే ఉద్దేశంతో.. కేంద్ర టెక్స్‌టైల్ శాఖ నిఫ్ట్ క్యాంపస్‌లను ఏర్పాటు చేసింది. నిఫ్ట్ అందించే కోర్సుల ద్వారా ఫ్యాషన్ రంగానికి సంబంధించి ప్రొడక్షన్, డిజైన్ తదితర విభాగాల్లో స్కిల్స్ సొంతం చేసుకోవచ్చు. నిఫ్ట్‌కు దేశవ్యాప్తంగా 18 క్యాంపస్‌లు ఉన్నాయి. ఇవి బ్యాచిలర్, పోస్ట్‌గ్రాడ్యుయేట్, డాక్టోరల్ స్థాయి కోర్సులు అందిస్తున్నాయి. వీటిలో ఇంటర్మీడియెట్ అర్హతతో ప్రవేశం లభించే బ్యాచిలర్ స్థాయి కోర్సులు ఏడు; అదే విధంగా బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో అడ్మిషన్ కల్పించే పీజీ కోర్సులు మూడు ఉన్నాయి. ఇవేకాకుండా డాక్టోరల్ కోర్సులను సైతం అందిస్తున్నారు. నిఫ్ట్ క్యాంపస్‌ల్లో అందుబాటులో ఉన్న మొత్తం సీట్ల సంఖ్య 5,199. వీటిలో ప్రవేశాల కోసం ప్రతి ఏటా నిఫ్ట్-అడ్మిషన్ టెస్ట్ పేరిట ప్రత్యేక ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
చదవండి: Fashion Designing: ఫ్యాషన్ రంగం.. ఉద్యోగాల తరంగం
బ్యాచిలర్ స్థాయి కోర్సులు
బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్, బ్యాచిలర్ ఆఫ్ లెదర్ డిజైన్, బ్యాచిలర్ ఆఫ్ యాక్ససరీ డిజైన్, బ్యాచిలర్ ఆఫ్ టెక్స్‌టైల్ డిజైన్, బ్యాచిలర్ ఆఫ్ నిట్‌వేర్ డిజైన్, బ్యాచిలర్ ఆఫ్ అపరెల్ ప్రొడక్షన్, బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ కమ్యూనికేషన్.
అర్హత: బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ కోర్సుల్లో ప్రవేశానికి ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత ఉండాలి. అలాగే బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సుకు ఎంపీసీ గ్రూప్‌తో ఇంటర్మీడియెట్ లేదా గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ నుంచి మూడేళ్ల డిప్లొమా ఉతీర్ణులు దరఖాస్తుకు అర్హులు. ఆయా కోర్సుల చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(బి.ఎఫ్ టెక్)
బ్యాచిలర్ స్థాయిలోనే ఫ్యాషన్ విభాగంలో టెక్నికల్ నైపుణ్యాలను అందించే ప్రత్యేక కోర్సు.. బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(అపెరల్ ప్రొడక్షన్). ఇందులో ప్రవేశానికి ఎంపీసీ గ్రూప్‌తో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత తప్పనిసరి.ఈ కోర్సుకు మూడు లేదా నాలుగేళ్ల వ్యవధిలోని డిప్లొమా కోర్సుల ఉత్తీర్ణులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
చదవండి: Fashion Career: డిజైనింగ్ రంగం... కొలువుల తరంగం
పీజీ ప్రోగ్రామ్‌లు
- పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో మాస్టర్ ఆఫ్ డిజైన్, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్‌మెంట్, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి.
- మాస్టర్ ఆఫ్ డిజైన్, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్‌మెంట్ కోర్సులకు బ్యాచిలర్ డిగ్రీ లేదా నిఫ్ట్/నిడ్ నుంచి డిప్లొమా లేదా అండర్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఉత్తీర్ణులు అర్హులు.
- మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సుకు నిఫ్ట్ అందించే బీ.ఎఫ్ టెక్ ఉత్తీర్ణులు లేదా ఏఐసీటీఈ గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ నుంచి బీటెక్/బీఈ ఉత్తీర్ణులు అర్హులు.
- ఆయా కోర్సుల చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక ప్రక్రియ మూడు దశలుగా
నిఫ్ట్-అడ్మిషన్ ప్రక్రియను మూడు దశల్లో నిర్వహిస్తారు. తొలి దశలో క్రియేటివ్ ఎబిలిటీ టెస్ట్(సీఏటీ); జనరల్ ఎబిలిటీ టెస్ట్(జీఏటీ) ఉంటాయి. తర్వాత దశలో సిట్యుయేషన్ టెస్ట్ ఉంటుంది. చివరగా పర్సనల్ ఇంటర్వ్యూ/గ్రూప్ డిస్కషన్‌లు నిర్వహించి.. వాటిలో విజయం సాధిస్తే సీటు ఖరారు చేస్తారు.
తొలి దశ జీఏటీ
- తొలి దశలో నిర్వహించే జీఏటీ(జనరల్ ఎబిలిటీ టెస్ట్)ను బ్యాచిలర్, పీజీ కోర్సుల అభ్యర్థులకు ఉమ్మడిగానే నిర్వహిస్తారు. పరీక్ష ప్రశ్నల క్లిష్టత స్థాయి మాస్టర్ కోర్సుల్లో కొంచెం ఎక్కువగా ఉంటుంది.
- బీడిజైన్ కోర్సుకు జీఏటీలో 100 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం రెండు గంటలు. ఎండిజైన్ కోర్సుకు జీఏటీలో 120 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం రెండు గంటలు.
- జీఏటీలోనూ పలు విభాగాల నుంచి నిర్దిష్ట సంఖ్యలో ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు క్వాంటిటేటివ్ ఎబిలిటీ; కమ్యూనికేషన్ ఎబిలిటీ; ఇంగ్లిష్ కాంప్రహెన్షన్; అనలిటికల్ ఎబిలిటీ; జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్‌కు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది.
చదవండి: ఫ్యాషన్ డిజైన్ నిఫ్ట్
ఫ్యాషన్ టెక్నాలజీ.. పరీక్ష
- బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, మాస్టర్ ఫ్యాషన్ టెక్నాలజీ, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్‌మెంట్ కోర్సులకు తొలిదశ ప్రవేశ పరీక్ష జీఏటీ ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఇందులో క్వాంటిటేటివ్ ఎబిలిటీ, కమ్యూనికేషన్ ఎబిలిటీ, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్, అనలిటికల్ అండ్ లాజికల్ ఎబిలిటీ విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. వీటితో పాటు ఒక కేస్ స్టడీ కూడా ఉంటుంది. మొత్తంగా ఈ పరీక్షలో 150 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం మూడు గంటలు.
- మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్‌మెంట్ కోర్సుకు మాత్రం కమ్యూనికేషన్ ఎబిలిటీ అండ్ ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ విభాగంలో 50 ప్రశ్నలు, కేస్ స్టడీ 40 ప్రశ్నలు, క్వాంటిటేటివ్ ఎబిలిటీ విభాగంలో 10 ప్రశ్నలు చొప్పున అడుగుతారు.
రెండో దశ సీఏటీ
ప్రవేశ ప్రక్రియ రెండో దశలో నిర్వహించే పరీక్ష.. క్రియేటివ్ ఎబిలిటీ టెస్ట్(సీఏటీ). అభ్యర్థుల్లోని పరిశీలనాత్మక నైపుణ్యం, సృజనాత్మకత, డిజైన్ సామర్థ్యాలను పరీక్షించే విధంగా ఈ పరీక్ష ఉంటుంది.
మూడో దశ.. సిట్యుయేషన్ టెస్ట్
పూర్తిగా ప్రాక్టికల్ అప్రోచ్‌తో సిట్యుయేషన్ టెస్ట్ ఉంటుంది. బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ అభ్యర్థులు తమలోని సృజనాత్మక ప్రతిభను ప్రదర్శించే విధంగా సిట్యుయేషన్ టెస్ట్ నిర్వహిస్తారు. అభ్యర్థులకు నిర్ణీత మెటీరియల్ అందించి ఏదైనా ఆకృతిని రూపొందించమని లేదా ఏదైనా ఒక సందర్భాన్ని పేర్కొని దానికి తగినట్లుగా ఊహా చిత్రం గీయమని అడుగుతారు.
గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ
నిఫ్ట్ అడ్మిషన్ టెస్ట్‌లోని జీఏటీ, సీఏటీలలో విజయం సాధించిన అభ్యర్థులకు చివరగా గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. భావ వ్యక్తీకరణ సామర్థ్యం, ఒక అంశంపై స్పష్టత, పరిజ్ఞానం, ఆలోచన సామర్థ్యాలను పరీక్షించే విధంగా గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి. పర్సనల్ ఇంటర్వ్యూ పూర్తిగా ఫ్యాషన్ కెరీర్ పట్ల అభ్యర్థికున్న ఆసక్తి, దానికి సరితూగే తత్వాలను గ్రహించే విధంగా ఉంటుంది.
వెయిటేజీ విధానం
- నిఫ్ట్ ప్రవేశ ప్రక్రియలోని మూడు దశల్లోనూ ప్రతిభ చూపిన వారితో మెరిట్ జాబితా రూపొందిస్తారు. ఆయా టెస్ట్‌లలో పొందిన మార్కులకు నిర్దిష్ట వెయిటేజీ కల్పిస్తూ ఈ జాబితా రూపొందిస్తారు.
- బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ కోర్సులకు సీఏటీకి 50 శాతం, జీఏటీకి 30 శాతం, పర్సనల్ ఇంటర్వ్యూకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది.
- మాస్టర్ ఆఫ్ డిజైన్ కోర్సుకు సీఏటీకి 40 శాతం, జీఏటీకి 30 శాతం, పర్సనల్ ఇంటర్వ్యూకు 30 శాతం వెయిటేజీ కల్పిస్తారు.
- మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో జీఏటీకి 70 శాతం, పర్సనల్ ఇంటర్వ్యూకు 30 శాతం వెయిటేజీ ఉంటుంది.
- బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సుకు మాత్రం కేవలం జీఏటీ స్కోర్ ఆధారంగానే తుది జాబితా రూపొందిస్తారు.
చదవండి: కెరీర్ గైడెన్స్... జ్యూయలరీ డిజైన్
మంచి మార్కులకు మార్గమిదే
- క్వాంటిటేటివ్ ఎబిలిటీ: పదో తరగతి స్థాయిలోని మ్యాథమెటిక్స్, అర్థమెటిక్స్ అంశాలపై పట్టు సాధించాలి. వర్క్ అండ్ టాస్క్, శాతాలు, నిష్పత్తులు, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్‌కు సంబంధించిన అంశాలు ప్రాక్టీస్ చేయాలి.
- కమ్యూనికేషన్ ఎబిలిటీ, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్: ఇంగ్లిష్ భాషలో ప్రాథమిక నైపుణ్యాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి బేసిక్ గ్రామర్ అంశాలపై అవగాహన పెంచుకోవాలి.
- అనలిటికల్ అండ్ లాజికల్ ఎబిలిటీ: విశ్లేషణ సామర్థ్యాన్ని, తార్కిక నైపుణ్యాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. నిర్దిష్టంగా ఒక అంశంలో ఇమిడి ఉన్న ప్రధాన అంశాలు, వాటికి సంబంధించి అప్లికేషన్ అప్రోచ్‌తో ప్రాక్టీస్ చేయడం అలవర్చుకోవాలి.
- జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్: ఈ విభాగానికి సంబంధించిన ప్రశ్నలు హైస్కూల్ స్థాయి సోషల్ సబ్జెక్ట్ నుంచి ఉంటాయి. అదే విధంగా ముఖ్యమైన తేదీలు-సందర్భాలు వంటివి కూడా అడుగుతారు. కాబట్టి అభ్యర్థులు తాజాగా జరిగిన ముఖ్యమైన సంఘటనలు కూడా తెలుసుకోవాలి.
- కేస్ స్టడీ: బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్‌మెంట్ కోర్సు అభ్యర్థులకు నిర్వహించే కేస్ స్టడీ.. ఒక వాస్తవ సమస్యను ఇచ్చి దానికి పరిష్కారం అడిగేలా ఉంటుంది. అభ్యర్థులకు అన్వయ దృక్పథం, సమస్యను గుర్తించే లక్షణం అవసరం.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: డిసెంబర్31,2022
- ఆన్‌లైన్ ఎంట్రన్స్ టెస్ట్ తేదీ: ఫిబ్రవరి 5, 2023
- తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం
- వివరాలకు వెబ్‌సైట్: www.nift.ac.in
క్రియేటివ్ స్కిల్స్‌తో మెరుగ్గా
ఫ్యాషన్ రంగంలో ప్రవేశించాలనుకునే వారికి స్వతహాగా క్రియేటివ్ స్కిల్స్ ఉండాలి. తద్వారా అకడమిక్స్‌లో ముందు వరుసలో నిలిచే అవకాశం ఉంటుంది. నిరంతరం మార్కెట్ పరిస్థితులు, జీవన శైలిలో వస్తున్న మార్పులను గమనిస్తూ.. దానికి అనుగుణంగా వ్యక్తుల అభిరుచులను పసిగట్టగలిగే నైపుణ్యం ఎంతో అవసరం.
-ప్రొ.ఎం.వసంత, నిఫ్ట్, హైదరాబాద్