Skip to main content

Fashion Designing: ఫ్యాష‌న్ రంగం.. ఉద్యోగాల త‌రంగం

నేటి తరం లైఫ్‌ స్టైల్‌లో ‘ఫ్యాషన్‌’ ఓ భాగం. తలపై పెట్టుకొనే హ్యాట్‌ నుంచి పాదరక్షల వరకు.. అన్నింటా ఫ్యాషన్‌ ఉట్టిపడాలనుకుంటున్న రోజులివి. ఫలితంగా ఫ్యాషన్‌ ఇండస్ట్రీ ఆకాశమే హద్దుగా వృద్ధి చెందుతోంది. అందుకే ఈ రంగంలో అవకాశాలు విస్తృతమవుతున్నాయి. దాంతో యువత ఫ్యాషన్‌ కోర్సుల వైపు మొగ్గు చూపుతోంది.
Career Opportunities in Fashion Designing
Career Opportunities in Fashion Designing

ఈ నేపథ్యంలో.. ఫ్యాషన్‌ కోర్సులు, అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు, ఫ్యాషన్‌ రంగంలో ముఖ్యమైన జాబ్‌ ప్రొఫైల్స్, ఉద్యోగావకాశాల గురించి తెలుసుకుందాం..

కోర్సులు..
  • ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో ఏడాది వ్యవధితో డిప్లొమా, మూడు/నాలుగేళ్ల వ్యవధితో బ్యాచిలర్, రెండేళ్ల వ్యవధితో మాస్టర్‌ డిగ్రీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
  • డిప్లొమా కోర్సులు: డిప్లొమా ఇన్‌ ఫ్యాషన్‌ డిజైన్, డిప్లొమా ఇన్‌ ఫ్యాషన్‌ కమ్యూనికేషన్‌.
  • బ్యాచిలర్‌ కోర్సులు: బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌(ఫ్యాషన్‌ డిజైన్‌), బీఎస్సీ ఫ్యాషన్‌ డిజైన్, బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌(ఫ్యాషన్‌ కమ్యూనికేషన్‌), బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ(బీఎఫ్‌టెక్‌).
  • పోస్టుగ్రాడ్యుయేట్‌ కోర్సులు: మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్, మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ, మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌.
అర్హతలు..
ఇంటర్‌ ఉత్తీర్ణులు ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో బ్యాచిలర్‌ డిగ్రీలో ప్రవేశానికి అర్హులు. అలాగే ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో మాస్టర్స్‌ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు.
టాప్‌ ఇన్‌స్టిట్యూట్‌లు..
మన దేశంలో ఫ్యాషన్‌ డిజైన్, ఫ్యాషన్‌ డిజైన్‌ టెక్నాలజీ కోర్సులకు సంబంధించి పలు ఇన్‌స్టిట్యూట్‌లు ప్రముఖంగా నిలుస్తున్నాయి. అవి..నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ(నిఫ్ట్‌), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌(నిడ్‌), ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్రాఫ్ట్‌ అండ్‌ డిజైన్, ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌.

ప్రవేశ విధానం..
నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ(నిఫ్ట్‌) ప్రవేశాలకు సంబంధించి జాతీయ స్థాయిలో రాత పరీక్ష నిర్వహిస్తుంది. అందులో ఉత్తీర్ణులైన వారికి సిట్యుయేషన్‌ టెస్టు/గ్రూప్‌ డిస్కషన్‌/పర్సనల్‌ ఇంటర్వూ రౌండ్లు ఉంటాయి. కొవిడ్‌–19 కారణంగా ఈ సంవత్సరం ప్రవేశ పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా ఆన్‌లైన్‌ ఇంటర్వూలు నిర్వహించి ప్రవేశాలను ఖరారు చేస్తున్నారు. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌లో ప్రవేశాలను డిజైన్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు(డాట్‌) ద్వారా ప్రవేశం కల్పిస్తారు. డాట్‌ను ప్రిలిమ్స్, మెయిన్‌ విధానంలో నిర్వహిస్తారు. వీటితోపాటు సీడ్, యూసీడ్‌లకు హాజరవ్వడం ద్వారా ఫ్యాషన్‌ డిజైన్‌ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు.

జాబ్‌ ప్రొఫైల్స్‌..
ఫ్యాషన్‌ డిజైన్‌ కోర్సులు పూర్తి చేసుకున్న అభ్యర్థులు ఫ్యాషన్‌ డిజైనర్, ఫ్యాషన్‌ ఇల్లస్ట్రేటర్, ఫ్యాషన్‌ స్టైలిస్ట్, ఫ్యాషన్‌ కోఆర్డినేటర్, ఫ్యాషన్‌ మర్చండైజర్‌ వంటి ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు.
 

ఫ్యాషన్‌ డిజైనర్‌..
ఫ్యాషన్‌ డిజైనర్లు నూతన ఫ్యాషన్‌ ఆకృతులకు రూపకల్పన చేస్తారు. వినూత్న ఆలోచనలు చేస్తూ.. వాటిని హ్యాండ్‌(స్కెచ్‌) లేదా కంప్యూటర్‌ ఎయిడెడ్‌ డిజైన్‌(క్యాడ్‌) ద్వారా ఓ రూపునిస్తారు. అంతేకాకుండా ఆయా స్టైల్స్‌ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసేందుకు అవసరమైన సాంకేతిక అంశాలు, విధానాలను పేర్కొంటారు. క్లయింట్స్‌కు చూపించేందుకు మూడ్‌బోర్డ్స్‌ రూపొందిస్తారు. సెల్లింగ్, బయ్యింగ్, ప్రొడక్షన్‌ బృందాలతో కలసి పనిచేస్తారు.
ఫ్యాషన్‌ ఇల్లస్ట్రేటర్‌..
ఇల్లస్ట్రేషన్, డ్రాయింగ్, పెయింటింగ్‌ తదితర నైపుణ్యాలను ఉపయోగించి ఫ్యాషన్‌ ఆలోచనలు, థీమ్స్, స్టైలింగ్‌ను పేర్కొనటాన్ని ఫ్యాషన్‌ ఇల్లస్ట్రేషన్‌ అంటారు. దీన్నే ఫ్యాషన్‌ స్కెచ్చింగ్‌ అని కూడా పిలుస్తుంటారు. దుస్తులు, ఇతర వస్తువుల తయారీకి ముందు ప్రివ్యూ, విజువల్‌ డిజైన్స్‌ విధుల్లో ఫ్యాషన్‌ ఇల్లస్ట్రేటర్లు కీలకంగా వ్యవహరిస్తారు.
ఫ్యాషన్‌ స్టైలిస్ట్..
ఫ్యాషన్‌ స్టైలిస్టులు వ్యక్తులతోపాటు ఫ్యాషన్‌ హౌజ్‌లు, క్లాతింగ్‌ బ్రాండ్స్‌ కోసం పనిచేస్తుంటారు. ఫ్యాషన్‌కు సంబంధించిన సలహాలు అందిస్తుంటారు. మోడల్స్, సెలబ్రిటీలకు ఫోటోషూట్, షూటింగ్, ఈవెంట్స్‌ వంటి సమయాల్లో ధరించేందుకు దుస్తులు, యాక్ససరీలను ఎంపిక చేస్తారు. వీరికి ఈ–కామర్స్, ఫోటోగ్రాఫిక్, క్యాట్‌వాక్, టెలివిజన్‌ అండ్‌ ఫిల్మ్‌ విభాగాల్లో అవకాశాలు లభిస్తాయి.
ఫ్యాషన్‌ కోఆర్డినేటర్‌..
ఫ్యాషన్‌ కోఆర్డినేటర్లు దుస్తులు, ఇతర ఫ్యాషన్‌ యాక్ససరీస్‌కి లేటెస్ట్‌ లుక్‌ అద్దేందుకు కృషిచేస్తుంటారు. ఇందులో భాగంగా తాజా ఫ్యాషన్‌ ట్రెండ్స్‌ గురించి రీసెర్చ్‌ చేస్తారు. ఫ్యాషన్‌ వెబ్‌సైట్స్, మ్యాగజీన్స్‌ను అధ్యయనం చేస్తారు. డిజైనర్స్‌తో ఎప్పటికప్పుడు కోఆర్డినేట్‌ చేస్తుంటారు. ఫ్యాషన్‌ కోఆర్డినేటర్లకు రిటైల్‌ స్టోర్స్, ఫ్యాషన్‌ మ్యాగజీన్స్, డిజైన్‌ హౌజ్‌ల్లో కొలువులు లభిస్తాయి. l
ఫ్యాషన్‌ మర్చండైజర్‌..
ఫ్యాషన్‌ మర్చండైజింగ్‌ను డైనమిక్, ఎగై్జటింగ్‌ విభాగంగా పేర్కొనవచ్చు. ఫ్యాషన్‌ మర్చండైజర్లు వ్యూహాత్మక విశ్లేషణ, మార్కెటింగ్, మేనేజ్‌మెంట్, డిస్ట్రిబ్యూషన్‌ విధులు నిర్వర్తిస్తుంటారు. ఫ్యాషన్‌ మర్చండైజర్లు డిజైనర్లు కాకపోయినప్పటికీ.. డిజైనర్లకు దగ్గరగా మెలుగుతుంటారు. ఆయా సై్టల్స్‌కు సంబంధించి ఎంత స్టాక్‌ను నిల్వ ఉంచాలో నిర్ణయిస్తారు. అలాగే మాన్యుఫ్యాక్చర్లతో క్రయవిక్రయాలకు సంబంధించిన చర్చలు సాగిస్తారు. తద్వారా సంస్థ లాభాలను పెంచేందుకు కృషిచేస్తారు.
రిక్రూటర్స్‌
  • లైఫ్‌స్టైల్, పాంటలూన్, అలెన్‌సోలీ, అర్వింద్‌ స్టోర్, అడిడాస్‌
  • రేమండ్‌
  • స్పైకర్‌
  • స్వరోస్కి(జ్యులరీ డిజైన్‌)
  • ఏఎన్‌డీ(అండ్‌)
  • బాటా
  • ఐటీసీ విల్స్‌ లైఫ్‌స్టైల్
  • లిబర్టీ షూస్‌ లిమిటెడ్‌
  • రీడ్‌ అండ్‌ టేలర్‌
  • యునైటెడ్‌ కలర్స్‌ ఆఫ్‌ బెనటన్
  • మార్క్స్‌ అండ్‌ స్పెన్సర్స్‌
  • షాపర్‌స్టాప్‌
  • ఉడ్‌లాండ్‌
  • గ్యాప్‌
  • ఇండియన్‌ టెరైన్
  • రిలయన్స్‌ ఫుట్‌వేర్‌
  • మోంటెకార్లో.
ప్లేస్‌మెంట్‌ పక్కా..
ఫ్యాషన్‌ అనుబంధ కోర్సుల పట్ల యువతలో ఇప్పుడిప్పుడే అవగాహన వస్తోంది. నిఫ్ట్‌లో కోర్సులు పూర్తి చేసిన విద్యార్థుల్లో 75 శాతం మందికి క్యాంపస్‌లోనే ప్లేస్‌మెంట్స్‌ లభిస్తున్నాయి. మరో 20శాతం మంది ఎంట్రప్రెన్యూర్‌ రంగంలోకి వెళ్తున్నారు. ఎడ్యుకేషన్, ఎంప్లాయ్‌మెంట్‌ అవకాశాల పరంగా ఫ్యాషన్‌ ఇండస్ట్రీని డిజైన్, టెక్నాలజీ, మేనేజ్‌మెంట్‌ విభాగాలుగా చూడాలి. ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి మర్చండైజింగ్‌లో మంచి అవకాశాలు లభిస్తున్నాయి. బాటా, అర్వింద్‌స్టోర్స్, పాంటలూన్స్, అడిడాస్‌ తదితర అన్ని కంపెనీల్లోని టాప్‌ స్థానాలను నిఫ్ట్‌ విద్యార్థులు దక్కించుకుంటున్నారు. రూ.4 లక్షల నుంచి రూ.18లక్షల ప్యాకేజ్‌తో కంపెనీలు విద్యార్థులకు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.
ప్రొఫెసర్‌ అన్నాజీ శర్మ,చైర్‌పర్సన్‌–ఎఫ్‌ఎంఎస్, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ
 
చ‌ద‌వండిFashion Designing
Published date : 08 Jan 2024 05:35PM

Photo Stories