Skip to main content

Fashion Career: డిజైనింగ్‌ రంగం... కొలువుల త‌రంగం

Courses and Career Opportunities in Designing Field or Industry
Courses and Career Opportunities in Designing Field or Industry

క్రియేటివిటీ, టెక్నాలజీల కలయిక.. డిజైనింగ్‌. మనం ధరించే దుస్తులు.. నడిపే వాహనం.. కూర్చునే కుర్చీ.. వినియోగించే యాప్స్‌.. ఇలా దేన్ని తీసుకున్నా.. దాని వెనుక డిజైనింగ్‌ అనే కళ దాగుంటుంది. ఒక విధంగా డిజైనర్లు ఈ ప్రపంచానికి ఎప్పటికప్పుడు కొత్త ఆకృతులను అద్దుతుంటారని చెప్పొచ్చు. ప్రస్తుతం డిజైనింగ్‌ హాట్‌ కెరీర్‌గా కొనసాగుతోంది. డిజైనింగ్‌ రంగంలో.. ఫ్యాషన్‌ డిజైన్, ఇంటీరియర్‌ డిజైన్, ప్రొడక్ట్‌ డిజైన్, యూజర్‌ ఎక్స్‌పీరియెన్స్‌ డిజైన్‌ కీలకంగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. డిజైన్‌ కోర్సులు, కెరీర్‌ అవకాశాల గురించి తెలుసుకుందాం...

ఫ్యాషన్‌ డిజైన్‌

నవతరం జీవనశైలిలో ‘ఫ్యాషన్‌’ఓ భాగంగా మారింది. అన్ని వయసుల వారు ప్యాషన్‌ పట్ల మక్కువ చూపుతున్నారు. ఫ్యాషన్‌ ఇండస్ట్రీ ఆకాశమే హద్దుగా విస్తరిస్తోంది. దాంతో యువత ఫ్యాషన్‌ కోర్సులవైపు ఆకర్షితులవుతున్నారు.

కోర్సులు

  • ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో ఏడాది వ్యవధితో డిప్లొమా, మూడు లేదా నాలుగేళ్ల వ్యవధితో బ్యాచిలర్‌ డిగ్రీ, రెండేళ్ల వ్యవధితో మాస్టర్‌ డిగ్రీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 
  • డిప్లొమా కోర్సులు: డిప్లొమా ఇన్‌ ఫ్యాషన్‌ డిజైన్, డిప్లొమా ఇన్‌ ఫ్యాషన్‌ కమ్యూనికేషన్‌.
  • బ్యాచిలర్‌ కోర్సులు: బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌(ఫ్యాషన్‌ డిజైన్‌); బీఎస్సీ ఫ్యాషన్‌ డిజైన్‌; బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌(ఫ్యాషన్‌ కమ్యూనికేషన్‌); బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ(బీఎఫ్‌టెక్‌).
  • పోస్టుగ్రాడ్యుయేట్‌ కోర్సులు: మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌; మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ; మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌.
  • అర్హతలు: ఇంటర్‌ ఉత్తీర్ణులు ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో బ్యాచిలర్‌ డిగ్రీలో ప్రవేశానికి అర్హులు. అలాగే ఫ్యాషన్‌ డిజైనింగ్‌ బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో మాస్టర్స్‌లో ప్రవేశించొచ్చు. 

ఇంటీరియర్‌ డిజైన్‌

కార్పొరేట్‌ బిల్డింగ్స్, రెసిడెన్షియల్‌ కాంప్లెక్సులు, వ్యక్తిగత గృహాలు.. ఇలా వేటిని చూసినా.. ఇప్పుడు చూపుతిప్పుకోలేనంత అందమైన ఆకృతులు కనిపిస్తున్నాయి. గోడలకు వేసే రంగు నుంచి కూర్చునే సోఫా, దాని ముందు ఉండే టీపాయ్, లైటింగ్, స్పేస్‌.. ఇలా.. అన్నీ కన్నుల పండుగ చేస్తున్నాయి. వీటి వెనుక ఉన్న కళే.. ఇంటీరియర్‌ డిజైన్‌. ప్రస్తుతం ఇంటీరియర్‌ డిజైనర్లకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. 

కోర్సులు

  • బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌(ఇంటీరియర్‌ డిజైన్‌); బీఎస్సీ ఇంటీరియర్‌ డిజైన్‌; బీఏ ఇంటీరియర్‌ డిజైన్‌; బీఎఫ్‌ఏ ఇంటీరియర్‌ డిజైన్‌; ఎండీఈఎస్‌ ఇంటీరియర్‌ డిజైన్‌; ఎమ్మెస్సీ ఇంటీరియర్‌ డిజైన్‌; సర్టిఫికెట్‌ డిప్లొమా ఇన్‌ ఇంటీరియర్‌ డిజైన్‌ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 
  • టాప్‌ ఇన్‌స్టిట్యూట్‌లు: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్, అహ్మదాబాద్‌; సీఈపీటీ యూనివర్సిటీ, అహ్మదాబాద్‌; అలహాబాద్‌ స్టేట్‌ యూనివర్సిటీ; బెంగళూరు సెంట్రల్‌ యూనివర్సిటీ; అలీఘర్‌ ముస్లిం యూనివర్సిటీ; గోవా యూనివర్సిటీ.
  • జాబ్‌ ప్రొఫైల్స్‌: ఇంటీరియర్‌ స్పేషియల్‌ డిజైనర్, లైటింగ్‌ డిజైనర్, విజువల్‌ మర్చండైజర్, ఎగ్జిబిషన్‌ డిజైనర్‌.
  • రిక్రూటర్స్‌: ఇంటీరియా, ఆక్రోపోలిస్, ట్యాగ్‌కాన్సెప్ట్స్, లివ్‌స్పేస్, అర్బన్‌ ల్యాడెర్, బొనిటో డిజైన్స్, ఫిల్మ్స్‌ ఫ్యాక్టరీ, ఇన్చ్, హోమ్‌లేన్‌ తదితర సంస్థల్లో అవకాశాలు అందుకోవచ్చు. 

ప్రొడక్ట్‌ డిజైన్‌

ఇది ఇండస్ట్రియల్‌ డిజైన్‌కు ఉప విభాగంగా ఉంటుంది. ప్రొడక్ట్‌ డిజైనర్లు తమ నైపుణ్యాలు, సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించి.. నూతన ప్రొడక్స్‌ను రూపొందిస్తారు. అలాగే అందుబాటులో ఉన్న వస్తువుల ఆకృతులను, పనితీరును మెరుగుపరుస్తారు. 

  • అర్హతలు: సైన్స్‌ గ్రూపుతో ఇంటర్మీడియెట్‌ పూర్తి చేసిన వారు బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌/మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌ ఇన్‌ ఇండస్ట్రియల్‌ డిజైన్‌/ప్రొడక్ట్‌ డిజైన్‌ కోర్సులను పూర్తి చేయొచ్చు. లేదా బీటెక్‌ ఆటోమొబైల్, మెకానికల్, ఎలక్ట్రికల్‌ ఇంజనీర్లు.. ప్రొడక్ట్‌ డిజైనింగ్‌ కెరీర్‌ను ఎంచుకోవచ్చు. 

ఇన్‌స్టిట్యూట్‌లు

  • నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌; ఐఐటీ బాంబే, ఐఐటీ గువహటి, ఐఐఐటీడీఎం జబల్‌పూర్‌; ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్, బెంగళూరు; ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆర్ట్, డిజైన్‌ అండ్‌ టెక్నాలజీ, బెంగళూరు వంటి వాటిల్లో ప్రవేశం పొందొచ్చు. 
  • జాబ్‌ ప్రొఫైల్స్‌: ఎగ్జిబిషన్‌ డిజైనర్, ఫర్నిచర్‌ డిజైనర్, ప్రొడక్ట్‌/ఇండస్ట్రియల్‌ డిజైన్‌ రీసెర్చర్‌ తదితర ఉద్యోగాలు లభిస్తున్నాయి. 

యూజర్‌ ఎక్స్‌పీరియెన్స్‌ డిజైన్‌

వినియోగదారులకు అర్ధవంతమైన అనుభవాలను అందించే ఉత్పత్తుల రూపకల్పననే యూజర్‌ ఎక్స్‌పీరియెన్స్‌ డిజైన్‌ అంటారు. యూజర్‌ ఎక్స్‌పీరియెన్స్‌ డిజైనర్లు..డిజైన్, బ్రాండింగ్,పనితీరు, వినియోగం వంటి అన్ని అంశాల్లో పాలుపంచుకుంటారు. 

  • జాబ్‌ ఫ్రొఫైల్స్‌: యూజర్‌ రీసెర్చర్, యూజర్‌ ఎక్స్‌పీరియెన్స్‌ డెవలపర్, యూఐ లీడ్, యాప్‌ డెవలపర్, వెబ్‌ డెవలపర్‌.
  • రిక్రూటింగ్‌ కంపెనీలు: గూగుల్, ఇన్ఫోసిస్, విప్రో, గెయిల్, ఓఎన్‌జీసీ, బీహెచ్‌ఈఎల్, ఇస్రో, హెచ్‌సీఎల్, జాన్సన్‌ అండ్‌ జాన్సన్, రాన్‌బాక్సీ, సిప్లా వంటివి.
Published date : 23 Sep 2021 07:07PM

Photo Stories