Skip to main content

UCEED 2023 Notification: కెరీర్‌ డిజైన్‌.. యూసీడ్‌కు దరఖాస్తుకు అర్హతలు, పరీక్ష విధానం, ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

uceed 2023 notification

అండర్‌ గ్రాడ్యుయేట్‌ కామన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ ఫర్‌ డిజైన్‌.. సంక్షిప్తంగా.. యూసీడ్‌. ఈ ఎంట్రన్స్‌లో ఉత్తీర్ణత సాధిస్తే.. ప్రతిష్టాత్మక ఐఐటీ క్యాంపస్‌ల్లో బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ కోర్సుల్లో చేరే అవకాశం లభిస్తుంది! ఈ కోర్సు పూర్తి చేసుకోవడం ద్వారా డిజైన్, ఫ్యాషన్‌ ప్రపంచంలో ఉజ్వల కెరీర్‌ సొంతం చేసుకునే వీలుంది. తాజాగా యూసీడ్‌-2023కు నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ నేపథ్యంలో.. యూసీడ్‌కు దరఖాస్తుకు అర్హతలు, పరీక్ష విధానం, ప్రిపరేషన్‌ గైడెన్స్‌.. 

  • బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ కోర్సుల్లో ప్రవేశానికి యూసీడ్‌
  • ఐఐటీ-ముంబై ఆధ్వర్యంలో ఎంట్రన్స్‌ నిర్వహణ
  • అయిదు క్యాంపస్‌లలో అందుబాటులో కోర్సులు
  • యూసీడ్‌-2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

ఆట బొమ్మల నుంచి ఆటోమొబైల్స్‌ వరకు.. హ్యాండిక్రాఫ్ట్స్‌ నుంచి హెలికాప్టర్స్‌ దాకా.. ఇంటీరియర్‌ డెకరేషన్‌ నుంచి ఇంటర్నెట్‌ వెబ్‌సైట్స్‌ వరకు.. ప్రస్తుత పోటీ ప్రపంచంలో వినియోగదారులను ఆకట్టుకోవడంలో డిజైన్‌ కీలక పాత్ర పోషిస్తోంది. అంతేకాదు ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌లో ప్రధానంగా నిలిచే సాధనం డిజైన్‌. సంబంధిత నిపుణులను తీర్చిదిద్దే కోర్సులే.. డిజైన్‌ కోర్సులు. ఇలాంటి కోర్సులను టాప్‌ ఇన్‌స్టిట్యూట్స్‌లో చదివేందుకు మార్గం..యూసీడ్‌. ఈ పరీక్షలో ర్యాంకు ద్వారా ఐఐటీ-ముంబై, ఢిల్లీ, గువహటి, హైదరాబాద్, ఐఐఐటీడీఎంలలో బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ కోర్సుల్లో చేరొచ్చు. ప్రతి ఏటా ఐఐటీ-ముంబై ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ఎంట్రన్స్‌కు సంబంధించి యూసీడ్‌-2023 నోటిఫికేషన్‌ విడుదలైంది.

చ‌ద‌వండి: Fashion Designing: ఫ్యాష‌న్ రంగం.. ఉద్యోగాల త‌రంగం

అర్హతలు

  • 2022లో ఇంటర్మీడియెట్‌/10+2 ఉత్తీర్ణులైన వారు, 2023లో ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్న వారు మాత్రమే అర్హులు. ఐఐఐటీడీఎం-జబల్‌పూర్, ఐఐటీ-గువహటిలలో సీటు కోరుకునే విద్యార్థులు ఇంటర్మీడియెట్‌లో తప్పనిసరిగా ఎంపీసీ గ్రూప్‌ చదివుండాలి.
  • వయసు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ-ఎన్‌సీఎల్‌ అభ్యర్థులు అక్టోబర్‌ 1,1998 తర్వాత జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అక్టోబర్‌ 1, 1993 తర్వాత జన్మించి ఉండాలి.

అయిదు క్యాంపస్‌లు..199 సీట్లు

  • యూసీడ్‌ ఎంట్రన్స్‌లో ర్యాంకు ఆధారంగా.. ఐఐటీ-ముంబై, ఐఐటీ-ఢిల్లీ, ఐఐటీ-గువహటి, ఐఐటీ-హైదరాబాద్,ఐఐఐటీడీఎం-జబల్‌పూర్‌ క్యాంపస్‌లలో బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ కోర్సుల్లో సీట్ల భర్తీ చేస్తున్నారు. 
  • ఐఐటీ-ముంబైలో 37; ఢిల్లీలో 20, గువహటిలో 56, హైదరాబాద్‌లో 20, ఐఐఐటీడీఎం-జబల్‌పూర్‌లో 66 చొప్పున మొత్తం 199 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
  • వీటితోపాటు గురుగోవింద్‌ సింగ్‌ ఇంద్రప్రస్థ యూనివర్సిటీ, యూపీఈఎస్‌-డెహ్రాడూన్, డి.వై. పాటిల్‌ యూనివర్సిటీ తదితర 20కి పైగా ప్రభుత్వ, ప్రైవేట్‌ ఇన్‌స్టిట్యూట్‌లు, యూనివర్సిటీలు.. యూసీడ్‌ స్కోర్‌ ఆధారంగా బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తున్నాయి.

యూసీడ్‌.. ఇలా

నాలుగు ఐఐటీ క్యాంపస్‌లు, ఐఐఐటీడీఎంలోని బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే యూసీడ్‌ పరీక్షను రెండు సెక్షన్‌లు పార్ట్‌ ఏ, పార్ట్‌ బీగా నిర్వహిస్తారు.మూడు గంటల వ్యవధిలో మొత్తం 300 మార్కులకు పరీక్ష జరుగుతుంది.

పార్ట్‌-ఎ.. 240 మార్కులు

  • పార్ట్‌-ఎలో మూడు రకాల ప్రశ్నలు ఉంటాయి. అవి.. ఎన్‌ఏటీ(న్యూమరికల్‌ ఆన్సర్‌ టైప్‌) ప్రశ్నల సంఖ్య 18-72 మార్కులు, ఎంఎస్‌క్యూ(మల్టిపుల్‌ సెలక్ట్‌ కొశ్చన్స్‌) ప్రశ్నల సంఖ్య 18-72 మార్కులు, ఎంసీక్యూ(మల్టిపుల్‌ ఛాయిస్‌ కొశ్చన్స్‌) ప్రశ్నల సంఖ్య 32- 96 మార్కులు. ఇలా.. మొత్తం 68 ప్రశ్నలు-240 మార్కులకు పరీక్ష జరుగుతుంది. 
  • సెక్షన్‌-1, 2లలో ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు, సెక్షన్‌-3లో ఒక్కో ప్రశ్నకు మూడు మార్కులు కేటాయించారు. ∙పరీక్ష పూర్తిగా కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌గా నిర్వహిస్తారు.

పార్ట్‌-బి.. స్కెచింగ్‌

  • పార్ట్‌-బిలో స్కెచింగ్‌ పరీక్ష నిర్వహిస్తారు. దీనికి కేటాయించిన మార్కులు 60. ఈ విభాగంలో అభ్యర్థులకు ఏదైనా ఒక అంశాన్ని ఇచ్చి.. దానికి సంబంధించిన డ్రాయింగ్‌ వేయమని అడుగుతారు. ఈ పరీక్షను పెన్, పేపర్‌ విధానంలో నిర్వహిస్తారు.
  • ఇలా.. మొత్తం రెండు సెక్షన్లు కలిపి 300 మార్కులకు పరీక్ష ఉంటుంది.

చ‌ద‌వండి: Fashion Career: ప్యాషన్‌ పట్ల మక్కువ... ఆక‌ర్షణీయ వేత‌నాలు ఎక్కువ‌

విజయం సాధించాలంటే

  • యూసీడ్‌ పరీక్షలో విజయం సాధించాలంటే.. అభ్యర్థులు క్రియేటివ్‌ అప్రోచ్‌ను అలవర్చుకోవాలి. దాని ఆధారంగా తమ ప్రిపరేషన్‌ను సాగించాలి. 
  • పార్ట్‌-ఎకు సంబంధించి విజువలైజేషన్‌ అండ్‌ స్పేషియల్‌ ఎబిలిటీ, అబ్జర్వేషన్‌ అండ్‌ డిజైన్‌ సెన్సిటివిటీ, ఎన్విరాన్‌మెంటల్‌ అండ్‌ సోషల్‌ అవేర్‌నెస్,అనలిటికల్‌ అండ్‌ లాజికల్‌ రీజనింగ్, లాంగ్వేజ్‌ అండ్‌ క్రియేటివిటీ, డిజైన్‌ థింకింగ్‌ అండ్‌ ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ అంశాలపై దృష్టి పెట్టాలి.
  • పార్ట్‌-బికు సంబంధించి.. ప్రొడక్ట్‌ డ్రాయింగ్, సిట్యుయేషన్‌ బేస్డ్‌ డ్రాయింగ్‌ అంశాలపై పట్టు సాధించాలి.
  • పార్ట్‌-ఎలో ప్రశ్నలను న్యూమరికల్‌ ఆన్సర్‌ టైప్, మల్టిపుల్‌ సెలక్ట్‌ టైప్, మల్టిపుల్‌ ఛాయిస్‌ విధానంలో అడుగుతారు. కాబట్టి అభ్యర్థులు సిలబస్‌కు అనుగుణంగా ఆయా అంశాలపై అన్ని కోణాల్లోనూ అవగాహన పెంచుకోవాలి.
  • వెర్బల్, నాన్‌-వెర్బల్‌ రీజనింగ్‌ అంశాలు, ఇంగ్లిష్‌ గ్రామర్, రీడింగ్‌ కాంప్రహెన్షన్, వొకాబ్యులరీపైనా పట్టు పెంచుకోవాలి.
  • దీంతోపాటు.. జనరల్‌ అవేర్‌నెస్‌కు సంబంధించి సామాజిక అభివృద్ధిలో డిజైన్‌ ప్రాముఖ్యత, పర్యావరణం, కాలుష్యం తదితర అంశాలపై పట్టు సాధించాలి.

ఉమ్మడి కౌన్సెలింగ్‌

  • ఈ ఎంట్రన్స్‌ను పరిగణనలోకి తీసుకునే క్యాంపస్‌లలో సీట్ల భర్తీకి ఉమ్మడి ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు.
  • ఐఐటీ-ముంబై ఆధ్వర్యంలో యూసీడ్‌ స్కోర్‌ ఆధారంగా జాయింట్‌ సీట్‌ అలొకేషన్‌ ప్రక్రియ నిర్వహిస్తారు.
  • యూసీడ్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ ప్రక్రియలో పాల్గొని కామన్‌ అప్లికేషన్‌ ఫామ్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది.
  • దరఖాస్తు సమయంలో అభ్యర్థులు పేర్కొన్న ఇన్‌స్టిట్యూట్‌ ప్రాథమ్యాలు, అందుబాటులో ఉన్న సీట్లు, అభ్యర్థులు పొందిన స్కోర్‌లను బేరీజు వేస్తూ సీట్‌ అలాట్‌మెంట్‌ చేస్తారు.
  • ఈ మొత్తం ప్రక్రియను ఐఐటీ-ముంబైలోని డిజైన్‌ డిపార్ట్‌మెంట్‌ నిర్వహిస్తుంది.

ఉజ్వల భవిష్యత్తు

  • ప్రస్తుత ఆధునిక యుగంలో ఉజ్వల అవకాశాలకు కేరాఫ్‌గా డిజైన్‌ రంగం నిలుస్తోంది. ముఖ్యంగా ఫ్యాషన్‌ డిజైన్, ప్రొడక్ట్‌ డిజైన్‌; ఆటోమొబైల్‌ డిజైన్, టాయ్‌ డిజైన్, ఇంటీరియర్‌ డిజైన్, ఆర్కిటెక్చర్‌ డిజైన్, వెబ్‌ డిజైనింగ్, గ్రాఫిక్‌ డిజైన్‌-యానిమేషన్‌ ఫిల్మ్‌ డిజైన్‌ వంటి రంగాల్లో అవకాశాలు లభిస్తున్నాయి. 
  • ఉత్పత్తి పరిశ్రమలు, ఎంఎన్‌సీలు, పరిశోధన సంస్థలు ప్రధానమైన ఉపాధి వేదికలుగా నిలుస్తున్నాయి.
  • ప్రారంభంలో డిజైన్‌ ఎగ్జిక్యూటివ్‌ హోదాలో అడుగుపెట్టి.. రెండు, మూడేళ్ల అనుభవంతో డిజైన్‌ సూపర్‌వైజర్, డిపార్ట్‌మెంట్‌ హెడ్, చీఫ్‌ డిజైనర్‌ వంటి ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చు.

క్యాంపస్‌ డ్రైవ్స్‌

డిజైన్‌ రంగంలో నిపుణుల కోసం ఎంటర్‌టైన్‌మెంట్, ప్రొడక్షన్‌ అండ్‌ మాన్యుఫ్యాక్చరింగ్, ఆటోమొబైల్‌ రంగాలకు చెందిన పలు సంస్థలు క్యాంపస్‌ డ్రైవ్స్‌ నిర్వహించి ఆఫర్లు ఖరారు చేస్తున్నాయి. సగటు వార్షిక వేతనం రూ.8 లక్షలుగా ఉంటోంది.

ఉన్నత విద్య

  • బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ కోర్సులు పూర్తి చేసుకున్న వారికి ఉన్నత విద్య అవకాశాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఐఐటీలు, నిఫ్ట్, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ తదితర ఇన్‌స్టిట్యూట్‌లలో మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌లో తమకు ఆసక్తి ఉన్న స్పెషలైజేషన్‌ అభ్యసించొచ్చు. 

యూసీడ్‌-2023 ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: అక్టోబర్‌ 21, 2022.
  • రూ.500 ఆలస్య రుసుముతో చివరి తేదీ: అక్టోబర్‌ 29.
  • అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌ సదుపాయం: జనవరి 13, 2023 నుంచి.
  • యూసీడ్‌ పరీక్ష తేదీ: జనవరి 22, 2023. 
  • తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం.
  • ఫలితాల వెల్లడి: మార్చి 9, 2023.
  • వెబ్‌సైట్‌: www.uceed.iitb.ac.in/2023

ఆసక్తి ప్రధానం

ప్రస్తుతం డిజైన్‌ రంగంలో నైపుణ్యాలున్న వారికి డిమాండ్‌ పెరుగుతోంది. డిజైన్‌ కోర్సులు పూర్తి చేసుకుంటే కెరీర్‌ అవకాశాలకు ఢోకాలేదు. ఈ రంగంలో ప్రవేశించాలనుకునే యువతకు ఆసక్తి ఎంతో ప్రధానం. ఎప్పటికప్పుడు మార్కెట్‌ ట్రెండ్స్, వస్తున్న మార్పులను గమనిస్తూ.. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ప్రొడక్ట్‌ డిజైన్‌ చేసే దూరదృష్టి అవసరం. 
- ప్రొఫెసర్‌ బి.కె.చక్రవర్తి, ఐడీసీ స్కూల్‌ ఆఫ్‌ డిజైన్, ఐఐటీ-ముంబై

Published date : 10 Oct 2022 05:58PM

Photo Stories