Skip to main content

కెరీర్ గైడెన్స్... జ్యూయలరీ డిజైన్

అందమైన, కొత్తవైన, నాజూకైన డిజైన్లను సృష్టించగల ఊహాశక్తి, అభిరుచి, ఆసక్తి కలిగిన వారికి జ్యూయలరీ డిజైనింగ్ అద్బుతమైన కోర్సు. ప్రముఖ వ్యాపార దిగ్గజం ‘టాటా గ్రూప్’ వంటి కార్పొరేట్ సంస్థలు కూడా జ్యూయలరీ మార్కెట్లో అడుగుపెట్టడంతో ఈ రంగంలో చక్కటి అవకాశాలున్నాయి. అయితే, ఏ సంస్థ అయినా... ఎప్పటికప్పుడు ముచ్చటైన, తాజా డిజైన్లతో ఆభరణాలను వినియోగదారుల ముందుంచితేనే మనుగడ. అలా తీసుకువచ్చే సంస్థలకే మార్కెట్లో ఆదరణ. ఈ మొత్తం వ్యవహారంలో జ్యూయలరీ డిజైనర్ల పాత్ర ఎంతో కీలకం.

ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుని డిజైన్లు రూపొందిస్తూ రెండు చేతులా ఆదాయార్జన సాగిస్తున్నారు నేటి తరం జ్యూయలరీ డిజైనర్లు. అంతేకాకుండా జ్యూయలరీ అంటే బంగారం మాత్రమే అనే అభిప్రాయానికి కాలం చెల్లి.. లోహ మిశ్రమాలతో రెడీ టూ వేర్ ఆభరాణాలు రూపొందుతున్నాయి. ఈ ధోరణులన్నీ జ్యూయలరీ డిజైనర్ల డిమాండ్ పెంచుతున్నాయి. ప్రస్తుతం భారత జ్యూయలరీ పరిశ్రమ 13 లక్షల మందికి ఉద్యోగాలను కల్పిస్తూ వేగంగా విస్తరిస్తోంది.

ఈ స్కిల్స్ ఉంటే:
ఈ రంగం పట్ల మక్కువతో పాటు ఆభరణాల డిజైనింగ్‌కు సంబంధించి సజనాత్మక ఆలోచనలు, ఇలస్ట్రేషన్ నైపుణ్యం, సాంకేతిక నైపుణ్యం, లోహాలు, లోహ మిశ్రమాలకు సంబంధించిన రసాయన శాస్త్ర అవగాహన, రసాయన సమీకరణాలు అర్ధం చేసుకోగల గణితపరమైన వేగం డిజైనర్‌కు కావాలి. ఈ అంశాలను ప్రముఖ సంస్థలైన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్‌ఐడీ), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్)లు కోర్సులో భాగంగా బోధిస్తాయి. ఈ కోర్సుల ద్వారా డిజైనింగ్ స్కిల్స్‌తో పాటు క్యాస్టింగ్, స్టోన్ కట్టింగ్, ఎన్‌గ్రేవింగ్, పాలిషింగ్, ఎలక్ట్రోప్లేటింగ్, మెటల్ కలరింగ్, ఏనోడైజింగ్, ఎనామ్లింగ్, స్టోన్‌సెట్టింగ్, సిల్వర్ స్మిత్తింగ్ వంటి అనేక నైపుణ్యాలను కూడా బోధిస్తారు.

అర్హత:
జ్యూయలరీ డిజైనింగ్‌లో సర్టిఫికేట్ నుంచి పీజీ డిగ్రీ వరకూ అనేక కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 10+2 (ఇంటర్మీడియెట్) ఉత్తీర్ణులైనవారు సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీ కోర్సులకు అర్హులు. అర్హతలున్నప్పటికీ అభిరుచి కలిగిన విద్యార్ధులే ఈ రంగంలో రాణించగలరు.

వేతనం:
జ్యూయలరీ రంగంలో ప్రెవేటు సంస్థలే అధికంగా ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. అందువల్ల డిజైనర్ల వేతనాలు సంస్థ ఆదాయం ప్రాతిపదికగా మారుతుంటాయి. డిజైనర్ నైపుణ్యాలు, అనుభవం ఆధారంగా వేతనాలు ఉంటాయి. ప్రారంభ వేతనం నెలకు రూ.10,000 నుంచి 25,000 వరకు ఉంటుంది. తర్వాత సామర్ధ్యానికి అనుగు ణంగా నెలకు రూ. 1 లక్ష వరకు పెరిగే అవకాశం ఉంది.

ఆఫర్ చేసే ఇన్‌స్టిట్యూట్ లు:
ఢిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, నోయిడా (యూపీ)లోని జ్యూయలరీ డిజైన్ అండ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ (జేడీటీఐ), ముంబైలోని జిమ్మలాజికల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, చెన్నైలోని ధమంబాల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్, సూరత్‌లోని డైమండ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలు కొన్ని ముఖ్యమైనవి. ఇవి జ్యూయలరీ డిజైనింగ్‌తో పాటు సంబంధిత అనేక కోర్సులను అందిస్తున్నాయి.
జిమ్మలాజికల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ముంబై) పెరల్ ఐడెంటిఫికేషన్ అండ్ స్టిర్రింగ్, జ్యూయలరీ కాస్టింగ్, డైమండ్ గ్రేడింగ్ అండ్ జిమ్మాలజీ కోర్సులను అందిస్తుండగా, చెన్నై పాలిటెక్నిక్ కాలేజీ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్‌తో సంయుక్తం (జాయింట్ ప్రాజెక్టు)గా గోల్డ్ స్మిత్తింగ్ అండ్ స్టోన్ సెట్టింగ్ కోర్సులను అందిస్త్తుంది. అలాగే డైమండ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (సూరత్) డైమండ్స్, కలర్ జెమ్ స్టోన్స్, మెషిన్ కాస్ట్ జ్యూయలరీలో పీజీ డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సులను ఆఫర్ చేస్తుంది.
వెబ్‌సైట్: www.giionline.com

జ్యూయలరీ డిజైన్ అండ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ (నోయిడా) జ్యూయలరీ డిజైన్ అండ్ టెక్నాలజీలో రెండేళ్ల డిప్లొమా ప్రోగ్రాంను, ఏడాది సర్టిఫికేట్ కోర్సును అందిస్తోంది. ఈ కోర్సులో ప్రవేశానికి +2 ఉత్తీర్ణులు కావాలి. ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ అధారంగా అడ్మిషన్లు కల్పిస్తారు.
వివరాలకు: www.jdtiindia.com

పెరల్ అకాడెమీ ఆఫ్ ఫ్యాషన్ (ఢిల్లీ) జ్యూయలరీ డిజైన్‌లో నాలుగేళ్ల బీఏ ఆనర్స్ డిగ్రీని అందిస్తుంది. 10+2 (ఇంటర్మీడియెట్) కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైనవారు అర్హులు. ప్రవేశ పరీక్ష అధారంగా అడ్మిషన్లు ఉంటాయి.
వివరాలకు: www.pearlacademy.com

మనం రాష్ట్రంలో:
హైదరాబాద్(కుకట్‌పల్లి)లోని డీనాడ్స్ డీన్యూయేజ్ స్కూల్ ఆఫ్ డిజైన్ సంస్థ జ్యూయలరీ డిజైనింగ్‌లో మూడు నెలల సర్టిఫికేట్ కోర్సు, ఆరు నెలల సర్టిఫికేట్ కోర్సు, ఏడాది డిప్లొమా కోర్సులను అందిస్తుంది. వీటికి కనీసం 10 వతరగతి పాసైన వారు అర్హులు. అప్టిట్యూడ్ టెస్ట్ ఆధారంగా అడ్మిషన్లు ఉంటాయి.
హైదరాబాద్‌లోని రేఫిల్స్ మిలీనియం ఇంటర్నేషనల్ సంస్థ జ్యూయలరీ డిజైనింగ్‌లో మూడేళ్ల డిగ్రీ కోర్సును ఆఫర్ చేస్తోంది. ఇంటర్మీడియెట్ (10+2) ఉత్తీర్ణులైన వారు అర్హులు. ప్రవేశ పరీక్ష ద్వారా అడ్మిషన్లు ఇస్తారు. డిగ్రీని ఆస్ట్రేలియాకు చెందిన రేఫిల్స్ కాలేజ్ ఆఫ్ డిజైన్ అండ్ కామర్స్ అందిస్తోంది.
హైదరాబాద్‌లోని సిన్‌జెమ్ జ్యూయలరీ ఎడ్యుకేషన్ సంస్థ డిప్లొమా (జ్యూయలరీ డిజైన్), బీఎస్సీ (జ్యూయలరీ డిజైన్), మాస్టర్స్ ఇన్ జ్యూయలరీ డిజైన్ టెక్నాలజీ, మాస్టర్స్ ఇన్ జ్యూయలరీ మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, మాస్టర్స్ ఇన్ ఫ్యాషన్ జ్యూయలరీ అండ్ యాక్ససరీస్, మాస్టర్స్ ఇన్ జ్యూయలరీ రిటైల్ టెక్నాలజీ కోర్సులను ఆఫర్ చేస్తుంది.

వివరాలకు
: https://singem.org

ఇవి కాకుండా మరెన్నో ఇన్‌స్టిట్యూట్‌లు కూడా జ్యూయలరీ డిజైన్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి.
Published date : 07 Jan 2013 06:40PM

Photo Stories