Skip to main content

600 SBI PO Jobs: క్రేజీ కొలువు.. బ్యాంక్‌ పీవో!.. ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, సిలబస్‌ తదితర వివరాలు ఇలా..

బ్యాంక్‌ ఉద్యోగాల్లో అత్యంత క్రేజీ కొలువు.. ప్రొబేషనరీ ఆఫీసర్‌(పీవో)! దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు.. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ).. ప్రొబేషనరీ ఆఫీసర్‌ పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జూనియర్‌ మేనేజ్‌మెంట్‌ స్కేల్‌–1 హోదాలో మొత్తం 600 పీవో పోస్ట్‌లకు నియామక ప్రక్రియ చేపట్టనుంది. బ్యాచిలర్‌ డిగ్రీ మొదలు, ప్రొఫెషనల్, టెక్నికల్‌ ఇలా.. అన్ని డిగ్రీల అభ్యర్థులు పోటీ పడేందుకు అర్హులే!! ఈ నేపథ్యంలో... స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తాజాగా విడుదల చేసిన పీఓ నోటిఫికేషన్‌ వివరాలు.. ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, సిలబస్‌ అంశాలు, ప్రిపరేషన్‌ తదితర వివరాలు..
SBI Bank PO Job Guidance  SBI PO recruitment 2025 notification for 600 posts  State Bank of India Probationary Officer job opportunities  Eligibility criteria for SBI PO recruitment SBI PO selection process and preparation tips   SBI Probationary Officer Junior Management Scale-1 posts

మొత్తం 600 పోస్ట్‌లు

ఎస్‌బీఐ తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం–జూనియర్‌ మేనేజ్‌మెంట్‌ గ్రేడ్‌ స్కేల్‌–1 హోదాలో 600 ప్రొబేషనరీ ఆఫీసర్‌ పోస్ట్‌ల భర్తీకినోటిఫికేషన్‌ విడుదల చేసింది. వీటిలో 586 పోస్ట్‌లను రెగ్యులర్‌ పోస్ట్‌లుగా.. మరో 14 పోస్ట్‌లను బ్యాక్‌లాగ్‌ పోస్ట్‌లుగా పేర్కొంది.

అర్హతలు

  • 2025,ఏప్రిల్‌ 30నాటికి బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. 
  • వయసు: 2024, ఏప్రిల్‌ 1 నాటికి 21–30 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అయిదేళ్లు, ఓబీసీ వర్గాలకు మూడేళ్లు చొప్పున గరిష్ట వయో పరిమితిలో సడలింపు లభిస్తుంది.

మూడు దశల ఎంపిక

ఎస్‌బీఐ పీఓ నియామక ప్రక్రియ ఫేజ్‌–1, ఫేజ్‌–2, ఫేజ్‌–3 పేరిట.. మూడంచెల విధానంలో కొనసాగుతుంది. ఫేజ్‌–1 (ప్రిలిమినరీ పరీక్ష), ఫేజ్‌–2(మెయిన్‌ ఎగ్జామినేషన్‌), ఫేజ్‌–3 (ఇంటర్వూ్వ/గ్రూప్‌ ఎక్సర్‌సైజెస్‌).

చదవండి: 600 SBI Jobs: ఎస్‌బీఐలో 600 ప్రొబేషనరీ ఆఫీసర్‌ పోస్టులు.. నెలకు రూ.85,920 జీతం..

వంద మార్కులకు ప్రిలిమ్స్‌

ఎంపిక ప్రక్రియలో తొలిదశ ఫేజ్‌–1గా పేర్కొనే ప్రిలిమినరీ పరీక్షను 100 మార్కులకు మూడు విభాగాల్లో నిర్వహిస్తారు. ఇందులో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 40 ప్రశ్నలు–40 మార్కులకు, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ 30 ప్రశ్నలు–30 మార్కులకు, రీజనింగ్‌ ఎబిలిటీ 30 ప్రశ్నలు–30 మార్కులకు ఉంటాయి. పరీక్ష సమయం ఒక గంట. పరీక్ష పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలోనే జరుగుతుంది. 

మెయిన్‌ ఎగ్జామినేషన్‌

ఎంపిక ప్రక్రియలో రెండో దశ మెయిన్‌ ఎగ్జామినేషన్‌. ఈ పరీక్ష కూడా ఆబ్జెక్టివ్‌ విధానంలో ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌గా జరుగుతుంది. ఫేజ్‌–1 ప్రిలిమినరీ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా.. మొత్తం ఖాళీలను పరిగణనలోకి తీసుకుని ఒక్కో పోస్ట్‌కు పది మంది(1:10 నిష్పత్తిలో)ని రెండో దశ మెయిన్‌కు ఎంపిక చేస్తారు. మెయిన్‌ పరీక్ష మొత్తం 170 ప్రశ్నలు–200 మార్కులకు జరుగుతుంది. ఇందులో రీజనింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌ 40 ప్రశ్నలు–60 మార్కులకు, డేటా అనాలిసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రిటేషన్‌ 30 ప్రశ్నలు–60 మార్కులకు, జనరల్‌/ఎకానమీ /బ్యాంకింగ్‌ నాలెడ్జ్‌ 60 ప్రశ్నలు–60 మార్కులకు, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 40 ప్రశ్నలు–20 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం మూడు గంటలు.

చదవండి: CBI Recruitment: సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 62 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

ఫేజ్‌–2లోనే డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌

ఫేజ్‌–2 మెయిన్‌లో భాగంగానే ఆబ్జెక్టివ్‌ టెస్ట్‌తోపాటు మరో 50 మార్కులకు డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌ను నిర్వహిస్తారు. ఇందులో కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ (ఈమెయిల్, రిపోర్ట్స్, సిట్యు­వేషన్‌ అనాలసిస్‌ అండ్‌ ప్రిసైజ్‌ రైటింగ్‌) అంశాలు ఉంటాయి. అభ్యర్థులు ఇచ్చిన అంశంపై 30 నిమిషాల వ్యవధిలో కంప్యూటర్‌ ఆధారంగా తమ సమాధానాన్ని రాయాల్సి ఉంటుంది.

తుదిదశ.. సైకోమెట్రిక్‌ టెస్ట్‌

ఎంపిక ప్రక్రియలో తుది దశ (ఫేజ్‌–3).. సైకో మెట్రిక్‌ టెస్ట్‌. ఇందులో గ్రూప్‌ ఎక్సర్‌సైజ్, ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. మెయిన్‌లో పొందిన మార్కుల ఆధారంగా.. ఒక్కో పోస్ట్‌కు ముగ్గురిని చొప్పున (1:3 నిష్పత్తిలో) తుది దశకు ఎంపిక చేస్తారు. మొత్తం 50 మార్కులకు నిర్వహించే చివరి దశ ఎంపిక ప్రక్రియలో గ్రూప్‌ ఎక్సర్‌సైజ్‌కు 20 మార్కు­లు, పర్సనల్‌ ఇంటర్వ్యూకు 30 మార్కులు ఉంటాయి. 

చదవండి: 1267 SO Jobs: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో 1267 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
గ్రూప్‌ ఎక్సర్‌సైజ్‌: ఈ దశకు ఎంపికైన అభ్యర్థులను బృందాలుగా ఏర్పాటు చేస్తారు. ఒక్కో బృందంలో గరిష్టంగా అయిదుగురు అభ్యర్థులు ఉండేలా చూస్తారు. వీరికి నిర్దిష్టంగా ఒక అంశాన్ని పేర్కొని దానికి అభ్యర్థుల అభిప్రాయం లేదా సమాధానాన్ని అడుగుతారు. అభ్యర్థుల్లోని సామాజిక అంశాలపై అవగాహన, టీమ్‌ స్కిల్స్‌ వంటి వాటిని పరిశీలిస్తారు. ఠి  పర్సనల్‌ ఇంటర్వ్యూ: గ్రూప్‌ ఎక్సర్‌సైజ్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా.. పర్సనల్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులో అభ్యర్థులకు ఉన్న బ్యాంకింగ్‌ నాలెడ్జ్, బ్యాంకింగ్‌ రంగంలో కెరీర్‌పై ఉన్న ఆసక్తి, నాయకత్వ లక్షణాలను పరిశీలిస్తారు.

తుది ఎంపికలో వెయిటేజీ విధానం

రెండో దశ మెయిన్,చివరి దశ(ఫేజ్‌–3) పర్సనల్‌ ఇంట­ర్వ్యూ, గ్రూప్‌ ఎక్సర్‌సైజెస్‌ల్లో చూపిన ప్రతిభ ఆధారంగా.. నిర్దిష్ట అర్హత మార్కులను, ఖాళీలను, రిజర్వేషన్, తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని తుది విజేతలను నిర్ణయిస్తారు. ఈ జాబితాలో నిలిస్తే ఎస్‌బీఐలో పీఓగా కొలువుదీరినట్లే. తుది విజేతల ఎంపికలో ఎస్‌బీఐ వెయిటేజీ విధానాన్ని అనుసరిస్తోంది. మెయిన్‌లో పొందిన మార్కులకు 75 శాతం, చివరి దశలోని గ్రూప్‌ డిస్కషన్, పర్సనల్‌ ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభకు 25 శాతం వెయిటేజీ ఇస్తోంది. ఇలా మొత్తం వంద శాతానికి అభ్యర్థులు పొందిన మార్కులను క్రోడీకరించి తుది విజేతలను నిర్ణయిస్తుంది.

చదవండి: UCO Bank SO Recruitment: యూకో బ్యాంక్, కోల్‌కతాలో 68 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

సీజీఎం, చైర్‌ పర్సన్‌ స్థాయికి

ఎస్‌బీఐలో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా కెరీర్‌ ప్రారంభించిన వారు పనితీరు, ప్రతిభ ఆధారంగా సీజీఎం, చైర్‌ పర్సన్‌ స్థాయిలకు సైతం చేరుకోవచ్చు. తొలుత పీఓగా ఎంపికైన వారికి రెండేళ్ల శిక్షణ తర్వాత స్కేల్‌–1 హోదా లభిస్తుంది. రెండేళ్ల శిక్షణ తర్వాత నిర్వహించే పరీక్షలో ఉత్తమ ప్రతిభ చూపితే నేరుగా స్కేల్‌–2 కేడర్‌లో డిప్యూటీ మేనేజర్‌ హోదా లభిస్తుంది. పదోన్నతి ఇచ్చే క్రమంలో ఎస్‌బీఐ అంతర్గత పరీక్షలు నిర్వహిస్తుంది. సా«ధారణంగా పీఓగా ఎంపికైన వారందరూ స్కేల్‌–7 స్థాయికి చేరుకుంటారు. ఆ క్రమంలో పనితీరు, ప్రతిభ ఆధారంగా మేనేజింగ్‌ డైరెక్టర్, చైర్‌ పర్సన్‌ హోదాకు కూడా చేరుకునే అవకాశముంది.

రాత పరీక్షలో రాణించేలా

పీఓ పోస్ట్‌ల ఎంపిక ప్రక్రియలో విజయం సాధించాలంటే.. దరఖాస్తు సమయం నుంచే ప్రిపరేషన్‌ను వ్యూహాత్మకంగా సాగించాలి. ప్రిలిమ్స్, మెయిన్స్‌లో ఉన్న ఉమ్మడి అంశాలను గుర్తించి.. వాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. తద్వారా ఒకే సమయంలో రెండు దశలకు సన్నద్ధత లభిస్తుంది. ముఖ్యంగా రెండు దశల్లోనూ ఉన్న ఇంగ్లిష్, రీజనింగ్‌లకు ఉమ్మడి ప్రిపరేషన్‌ మేలు చేస్తుంది. మెయిన్‌లో క్లిష్టత స్థాయి కొంత ఎక్కువగా ఉంటుంది. 

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

రీజనింగ్‌

ఈ విభాగంలో రాణించేందుకు ప్రాక్టీస్‌కు ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి. విశ్లేషణ సామర్థ్యం, తార్కికత్వం పెంచుకునే విధంగా కృషి చేయాలి. సిరీస్, అనాలజీ, కోడింగ్‌–డీ కోడింగ్, డైరెక్షన్స్, బ్లడ్‌ రిలేషన్స్, ర్యాంకింగ్స్, సీటింగ్‌ అరేంజ్‌మెంట్స్‌ అంశాలపై పట్టు సాధించాలి.

డేటా అనాలిసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రిటేషన్‌

అభ్యర్థులు ప్రత్యేకంగా దృష్టిసారించాల్సిన మరో విభాగం.. డేటా అనాలిసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రిటేషన్‌. ఇందులో రాణించడానికి కాలిక్యులేషన్‌ స్కిల్స్‌ను పెంచుకోవాలి. టేబుల్స్, డయాగ్రమ్స్, నంబర్‌ డేటా, లైన్‌ గ్రాఫ్, బార్‌ గ్రాఫ్‌ తదితర గ్రాఫ్‌ ఆధారిత డేటాలలోని సమాధానాన్ని క్రోడీకరించే విధంగా ప్రాక్టీస్‌ చేయాలి.
జనరల్‌/ఎకనామీ/బ్యాంకింగ్‌ నాలెడ్జ్‌
జనరల్‌/ఎకానమీ/బ్యాంకింగ్‌ నాలెడ్జ్‌ విభాగాంపై ప్ర­త్యేక దృష్టి పెట్టాలి. ఇటీవల కాలంలో జాతీయ ఆర్థిక రంగంలో మార్పులు, బ్యాంకుల విధి విధానాల్లో మార్పులు, అవి కొత్తగా ప్రకటిస్తున్న పథకాల గురించి తెలుసుకోవాలి.
ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌
ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ విభాగంలో రాణించేందుకు.. బేసిక్‌ గ్రామర్‌తో మొదలు పెట్టి వొకాబ్యులరీ పెంచుకోవడం వరకు కృషి చేయాలి. రీడింగ్‌ కాంప్రహెన్షన్, కరెక్షన్‌ ఆఫ్‌ సెంటెన్సెస్, జంబుల్డ్‌ సెంటెన్సెస్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్‌ వంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌
క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌కు సంబంధించి అర్థమెటిక్‌పై పట్టు సాధించాలి. స్క్వేర్‌ రూట్స్, క్యూబ్‌ రూట్స్, పర్సంటేజెస్,టైం అండ్‌ డిస్టెన్స్,టైం అండ్‌ వర్క్,ప్రాఫిట్‌ అండ్‌ లాస్, రేషియోస్‌ సంబంధిత ప్రశ్నలను బాగా ప్రాక్టీస్‌ చేయాలి.
గ్రూప్‌ ఎక్సర్‌సైజ్, పర్సనల్‌ ఇంటర్వ్యూ
గ్రూప్‌ ఎక్సర్‌సైజెస్, పర్సనల్‌ ఇంటర్వ్యూలో రాణించడానికి ఇంగ్లిష్‌ వ్యాకరణం, వాక్య నిర్మాణంపై పూర్తి పట్టు సాధించాలి. గ్రూప్‌ ఎక్సర్‌సైజెస్‌ విషయంలో సామాజిక అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. ఇందుకోసం దినపత్రికల్లోని ఎడిటోరియల్స్, ఇతర జనరల్‌ ఎస్సే పుస్తకాలు అభ్యసించడం ఉపయుక్తంగా ఉంటుంది. ఇలా ప్రతి అంశంలోనూ నిర్దిష్ట వ్యూహంతో అడుగులు వేస్తూ ప్రిపరేషన్‌ సాగిస్తే విజయావకాశాలను మెరుగు పరచుకోవచ్చు.
ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 2025, జనవరి 16
  • ప్రిలిమినరీ పరీక్ష (ఆన్‌లైన్‌): 2025 మార్చి 8, 15 తేదీల్లో
  • మెయిన్‌ ఎగ్జామినేషన్‌ తేదీలు: ఏప్రిల్‌/మేలో
  • సైకో మెట్రిక్‌ టెస్ట్‌: మే/జూన్‌లో
  • వెబ్‌సైట్‌: https://bank.sbi/web/careers/current-openings
Published date : 07 Jan 2025 10:14AM

Photo Stories