Skip to main content

Career Opportunities in Insurance Sector: బీమా.. కెరీర్‌కు ధీమా

ఇన్సూరెన్స్‌.. బీమా రంగంగా సుపరిచితం! లైఫ్‌ ఇన్సూరెన్స్‌ మొదలు.. నాన్‌-లైఫ్‌ ఇన్సూరెన్స్‌గా పేర్కొనే వెహికిల్, హెల్త్‌ ఇన్సూరెన్స్‌ వరకూ.. ఎన్నో బీమా పథకాలు! వీటికి పెరుగుతున్న ఆదరణ! ముఖ్యంగా కోవిడ్‌ మహమ్మారి అనంతరకాలంలో బీమా పాలసీలు భారీగా పెరిగాయనే గణాంకాలు. దీంతో ఈ రంగం మరింతగా విస్తరించనుందనే అంచనాలు! ఫలితంగా బీమా రంగం యువతకు ఉపాధి అవకాశాలకు చక్కటి మార్గంగా నిలుస్తోంది!! ఈ నేపథ్యంలో.. ఇన్సూరెన్స్‌ రంగంలో తాజా ట్రెండ్స్, ఉపాధి మార్గాలు, అవసరమైన నైపుణ్యాలు, అకడమిక్‌ కోర్సులపై ప్రత్యేక కథనం..
Health insurance statistics posts  Career Opportunities in Insurance Sector   Opportunities for youth
  • విస్తరిస్తున్న బీమా రంగం 
  • పెరుగుతున్న ఉపాధి అవకాశాలు 
  • ప్రత్యేక కోర్సులతో కొలువులు ఖాయం
  • అకడమిక్‌గా అందుకునేందుకు ఎన్నో మార్గాలు

కొత్తగా కెరీర్‌ ప్రారంభించిన వారు మొదలు మధ్య వయస్కుల వరకూ.. బీమా పాలసీలపై ఆసక్తి చూపుతున్నారు. ఇన్సూరెన్స్‌ అవసరాన్ని గుర్తించడమే ఇందుకు కారణం. ఫలితంగా ఈ రంగంలో కార్యకలాపాలు విస్తరిస్తూ..యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడంలో ముందంజలో నిలుస్తోంది అంటున్నారు నిపుణులు. 
ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్‌ అథారిటీ గణాంకాల ప్రకారం-ప్రస్తుతం మన దేశంలో లైఫ్‌ ఇన్సూరెన్స్‌ విభాగంలో 23, జనరల్‌(నాన్‌-లైఫ్‌) ఇన్సూరెన్స్‌ విభాగంలో 32, రీ-ఇన్సూరెన్స్‌ విభాగంలో 1, మొత్తం 56 సంస్థలు బీమా సేవలు అందిస్తున్నాయి.వీటి ద్వారా జీవిత బీమా, వాహన బీమా, ఆరోగ్య బీమా పాలసీలను అందిస్తున్నాయి. ఫలితంగా గత ఆర్థిక సంవత్సరంలో 40 బిలియన్‌ డాలర్ల వ్యాపారం ఒక్క లైఫ్‌ ఇన్సూరెన్స్‌ విభాగంలోనే జరిగింది. నాన్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ విభాగాల్లో దాదాపు 30 బిలియన్‌ డాలర్ల వ్యాపారం జరిగింది.

చ‌ద‌వండి: Career Opportunities: బీమా రంగంలో ఉద్యోగాలు... ప్రారంభంలోనే రూ.3లక్షల వేత‌నం

భారీగా ఉద్యోగాలు

ఇన్సూరెన్స్‌ రంగం భారీగా విస్తరిస్తున్న నేపథ్యంలో వాటి సమర్థ నిర్వహణకు మానవ వనరులకు డిమాండ్‌ పెరుగుతోంది. 2021లో ఈ రంగంలో దాదాపు 8 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించింది. సీఐఐ అంచనా ప్రకారం-2025 నాటికి దాదాపు 20 లక్షల మందికి ఈ రంగం ఉపాధి కల్పించనుంది. అదే విధంగా ఎన్‌ఎస్‌డీసీ అంచనా ప్రకారం-2021 నాటికి ఎనిమిది నుంచి తొమ్మిది లక్షల మందికి ఉపాధి దక్కింది. పలు స్టాఫింగ్, రిక్రూటింగ్‌ సంస్థల గణాంకాల ప్రకారం-ఈ ఏడాది బీమా రంగంలో భారీ స్థాయిలో నియామకాలు జరిగాయి. 

2032 నాటికి ఆరో పెద్ద దేశంగా

అంతర్జాతీయ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే.. 2032 నాటికి భారత బీమా రంగం ప్రీమియం మొత్తాల విషయంలో ఆరో పెద్ద దేశంగా నిలుస్తుందని స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రముఖ రీ-ఇన్సూరెన్స్‌ సంస్థ స్విస్‌ రె ప్రకటించింది. అంతేకాకుండా.. ఈ ఏడాది చివరికి 6.6 శాతం, 2023లో 7.1 శాతం వృద్ధి సాధిస్తుందని కూడా పేర్కొంది. దీనికి ప్రధాన కారణం.. బీమా రంగంలో కార్యకలాపాలు పెరగడం. ఫలితంగా ఈ రంగంలోని సంస్థలు వ్యాపార ప్రణాళికలను విస్తరిస్తూ.. కొత్త నియామకాలు చేపడుతున్నాయి.

ఇంటర్‌ టు ప్రొఫెషనల్‌

ఇన్సూరెన్స్‌ రంగంలో కొలువులకు ఇంటర్మీడియెట్‌ నుంచే అడుగులు వేసే అవకాశం ఉంది. ఈ రంగంలో స్పెషలైజ్డ్‌ ప్రొఫెషనల్స్‌ అవసరం కూడా పెరుగుతోంది. వేతనాలు ఆయా జాబ్‌ ప్రొఫైల్‌ను బట్టి నెలకు రూ.పది వేల నుంచి రూ.లక్ష వరకు లభిస్తున్నాయి.

చ‌ద‌వండి: Job Trends: ఫైనాన్షియల్‌ రంగం.. కొలువులు, అర్హతలు, నైపుణ్యాలు

సీఆర్‌ఎం

ఇన్సూరెన్స్‌ రంగంలో క్షేత్ర స్థాయిలో పాలసీదారులతో సంప్రదించే వారే.. కస్టమర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌(సీఆర్‌ఎం).వ్యక్తులకు బీమా ఆవశ్యకత తెలియజేయడం,వారితో పాలసీలు కట్టించడం వీరి ముఖ్యమైన విధి. కస్టమర్‌ రిలేషన్‌ ఎగ్జిక్యూటివ్స్‌..పార్ట్‌ టైమ్, ఫుల్‌టైమ్‌ రెండు విధానాల్లోనూ పనిచేసే అవకాశం ఉంది. వీరు కట్టించిన పాలసీలు,ప్రీమియంను పరిగణనలోకి తీసుకొని.. అయిదు నుంచి 30 శాతం వరకూ కమిషన్‌ రూపంలో బీమా సంస్థలు చెల్లిస్తున్నాయి. ఫుల్‌టైమ్‌ విధానంలో నెలకు రూ. 20 వేల వరకు సంపాదించుకునే అవకాశం ఉంది.

డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌/సీఆర్‌ హెడ్‌

డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ లేదా సీఆర్‌ఎం హెడ్‌లు.. సీఆర్‌ఎంల విధులను పర్యవేక్షించడం, వారికి ఏవైనా ఇబ్బందులు తలెత్తినప్పుడు క్షేత్ర స్థాయికి వెళ్లి వ్యక్తులను మెప్పించి.. ఇన్సూరెన్స్‌ తీసుకునేలా చేయడం వీరి ముఖ్య విధిగా ఉంటోంది. డిగ్రీ అర్హతతో భర్తీ చేసే ఈ కొలువులకు నెలకు రూ.40 వేల నుంచి రూ.70 వేల వరకు వేతనం లభిస్తుంది.

యాక్చుయరీ ఎగ్జిక్యూటివ్స్‌

బీమా సంస్థల్లో అత్యంత కీలకమైన హోదా.. యాక్చుయరీ ఎగ్జిక్యూటివ్‌. ఒక వ్యక్తి తీసుకునే పాలసీ మొత్తం, దాని ఆధారంగా చెల్లించాల్సిన ప్రీమియం, ఎంత కాలానికైతే అతనికి ప్రీమియం చెల్లించే సామర్థ్యం ఉంటుంది? వంటి అంశాలను వీరు లెక్కిస్తారు. దీని ఆధారంగానే సంస్థలు కొత్త పాలసీలను ప్రవేశ పెట్టినప్పుడు పాలసీ వ్యవధి, వయో వర్గం వారీగా చెల్లించాల్సిన ప్రీమియం, ఇన్సూరెన్స్‌ మొత్తం వంటి వాటిని తెలియజేస్తాయి. అందుకే యాక్చుయరీ ఎగ్జిక్యూటివ్స్‌కు తప్పనిసరిగా.. యాక్చుయేరియల్‌ సొసైటీ నుంచి సర్టిఫికెట్‌ పొందాలనే నిబంధన అమల్లో ఉంది. బీకాం, ఎంకాం గ్రాడ్యుయేట్లకు ఈ సొసైటీలో పేర్లు నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత సొసైటీ నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తే.. యాక్చుయేరియల్‌ సొసైటీ మెంబర్‌గా గుర్తింపు లభిస్తుంది. ఆ గుర్తింపు ఉంటే బీమా సంస్థల్లో ప్రారంభంలోనే నెలకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వేతనంతో కొలువు దక్కించుకునే అవకాశం ఉంది.

చ‌ద‌వండి: Actuarial Science: ఆకర్షణీయ కెరీర్‌.. యాక్చూరియల్‌ సైన్స్‌

అండర్‌ రైటర్స్‌

ఒక పాలసీ ప్రతిపాదన వచ్చినప్పుడు దాన్ని క్షుణ్నంగా పరిశీలించి.. ఆ పాలసీకి సదరు వ్యక్తి సరితూగుతాడో లేదో నిర్ణయించే వారే అండర్‌ రైటర్స్‌. ఈ విభాగంలో ప్రత్యేక అర్హత ఉన్న వారికే సంస్థలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇన్సూరెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా అందించే అసోసియేట్‌ డిప్లొమా ఉత్తీర్ణులకు బీమా సంస్థలు పెద్దపీట వేస్తున్నాయి. వీరకి నెలకు రూ.40వేల వరకు వేతనం లభిస్తోంది. 

రిస్క్‌ అనలిస్ట్స్‌

జనరల్‌ ఇన్సూరెన్స్‌ పాలసీల విషయంలో రిస్క్‌ అనలిస్ట్‌లు కీలకంగా వ్యవహరిస్తారు. ఏదైనా ఒక నిర్మాణానికి పాలసీ కోసం ప్రతిపాదించినప్పుడు.. ఆ నిర్మాణాన్ని స్వయంగా పరిశీలించడం, దాని నాణ్యత, లైఫ్‌టైమ్‌ వంటి వాటిని పరిగణనలోకి తీసుకుని.. వాటికి సంబంధించిన నివేదికను సంస్థకు అందించేది రిస్క్‌ అనలిస్ట్‌లే. ఈ నివేదిక ఆధారంగానే సదరు నిర్మాణానికి సంబంధించి పాలసీ మొత్తం పరంగా సంస్థ ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంటుంది. వీరు ఎక్కువగా క్షేత్ర స్థాయిలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

చ‌ద‌వండి: Banking, Financial Services and Insurance Sectors: బీఎఫ్‌ఎస్‌ఐ.. నియామకాల జోరు!

క్లెయిమ్స్‌ ఎగ్జిక్యూటివ్స్‌

పాలసీ క్లెయిమ్‌ల పరిష్కారంలో వీరి పాత్ర కీలకం. ముఖ్యంగా పాలసీ వ్యవధి పూర్తి కాకుండానే ఏదైనా ఘటన జరిగి.. బీమా చెల్లించాల్సిన సందర్భంలో క్లెయిమ్స్‌ ఎగ్జిక్యూటివ్స్‌ ఇచ్చే నివేదికపై ఆధారపడి సంస్థలు తుది నిర్ణయం తీసుకుంటాయి. సదరు బీమా మొత్తం కోసం వచ్చిన ప్రతిపాదనను పరిశీలించి.. డ్యామేజ్‌ విలువను లెక్కిస్తారు. ఆ మొత్తానికి బీమా పరిష్కారం లభిస్తుంది. వీరికి నెలకు రూ.40వేల వరకు వేతనం లభిస్తుంది.

టెక్‌ జాబ్స్‌

ఆధునిక పరిస్థితులకు అనుగుణంగా బీమా సంస్థలు టెక్నాలజీ ఆధారంగా‡ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. దీంతో ఇప్పుడు ఇన్సూరెన్స్‌ సంస్థల్లో టెక్నికల్‌ ఉద్యోగాలు కూడా లభిస్తున్నాయి. ఇటీవల కాలంలో సంస్థలు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, ఐఓటీ విధానాలను అనుసరిస్తున్నాయి. దీంతో ఏఐ అనలిస్ట్స్‌; డేటా అనలిస్ట్‌ వంటి కొలువులు లభిస్తున్నాయి. వీటితోపాటు సంస్థల్లో అనుసరిస్తున్న సాంకేతిక సదుపాయాల నిర్వహణకు నెట్‌వర్క్‌ ఇంజనీర్స్, సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్‌ ఇంజనీర్స్, ట్రబుల్‌ షూటర్స్‌ వంటి కొలువులను భర్తీ చేస్తున్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధిత విభాగాల్లో బీటెక్‌ లేదా స్పెషలైజ్డ్‌ సర్టిఫికేషన్‌ పొందిన వారికి సంస్థలు అవకాశం కల్పిస్తున్నాయి.

నియామకాలు ఇలా

స్పెషలైజ్డ్‌ హోదాలుగా పేర్కొనే రిస్క్‌ అనలిస్ట్, అండర్‌ రైటర్స్, క్లెయిమ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాల భర్తీకి ఇన్సూరెన్స్‌ కోర్సులను అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లలో క్యాంపస్‌ డ్రైవ్స్‌ నిర్వహిస్తున్నాయి. టెక్నికల్‌ ఉద్యోగాల కోసం ఐఐటీలు, ఇతర ప్రముఖ టెక్నికల్‌ ఇన్‌స్టిట్యూట్‌లను సంప్రదిస్తున్నాయి. మిగతా నియామకాల విషయంలో ప్రైవేట్‌ బీమా సంస్థలు అధిక శాతం జాబ్‌ కన్సల్టెన్సీలపై ఆధారపడుతున్నాయి.

చ‌ద‌వండి: Job Interview: ఐబీపీఎస్ ‘ పీవో ’ ఇంటర్వ్యూలో విజయానికి టిప్స్..

ప్రభుత్వ రంగ సంస్థల్లో

  • ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎల్‌ఐసీ, యునైటెడ్‌ ఇన్సూరెన్స్‌ తదితర ప్రభుత్వ రంగ సంస్థల్లో అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్, స్పెషలిస్ట్‌ ఆఫీసర్ల కోసం ప్రత్యేక నియామక పరీక్షలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తున్నాయి.
  • ఇన్సూరెన్స్‌ స్పెషలైజ్డ్‌ కోర్సులు అభ్యసించిన వారికి ఇన్సూరెన్స్‌ సంస్థలే కాకుండా.. ఇతర రంగాల్లోని కంపెనీల్లోనూ అవకాశాలు లభిస్తున్నాయి. థర్డ్‌ పార్టీ అడ్మినిస్ట్రేటర్స్, మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు, ఇన్సూరెన్స్‌ సంస్థలతో ఒప్పందం ద్వారా పరోక్షంగా ఆ సేవలందించే బ్యాంకులు, బీపీఓలు, కార్పొరేట్‌ హాస్పిటల్స్‌లోనూ కొలువులు సొంతం చేసుకోవచ్చు.

అకడమిక్‌ వేదికలు

ఇన్సూరెన్స్‌ రంగ సంబంధిత నైపుణ్యాలు అందించేందుకు పలు ఇన్‌స్టిట్యూట్‌లు కోర్సులను అందుబాటులోకి వచ్చాయి. 

  • నేషనల్‌ ఇన్సూరెన్స్‌ అకాడెమీ-పుణె; 
  • ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌-హైదరాబాద్‌; -ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌తోపాటు ఐపీఈ వంటి పలు బీ-స్కూల్స్‌ ఎంబీఏ, పీజీ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ఇన్సూరెన్స్‌ స్పెషలైజేషన్స్‌ను అందిస్తున్నాయి.

ఎన్‌ఐఏ-పుణె.. పీజీడీఎం నోటిఫికేషన్‌

  • ఇన్సూరెన్స్‌ ఎడ్యుకేషన్‌లో జాతీయ స్థాయిలో పేరున్న నేషనల్‌ ఇన్సూరెన్స్‌ అకాడమీ-పుణె.. 2023-25విద్యా సంవత్సరానికి సంబంధించి.. పీజీ డిప్లొమా ఇన్‌ బిజినెన్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌కు ఎంపిక ప్రక్రియ ప్రారంభించింది. 
  • 50శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తుకు అర్హులు. చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
  • బ్యాచిలర్‌ డిగ్రీతోపాటు క్యాట్‌-2022, లేదా సీమ్యాట్‌-2023లో స్కోర్‌ సాధించాలి.
  • వెబ్‌సైట్‌: pgdm.niapune.org.in
Published date : 08 Jan 2024 05:47PM

Photo Stories