CBSE vs State Board: సీబీఎస్‌ఈ వర్సెస్ స్టేట్ బోర్డ్.. ఏది బెటర్!.. తెలుసుకోండి..

ప్రస్తుతం 10+2/ఇంటర్మీడియెట్ అర్హతగా జాతీయ స్థాయిలో నిర్వహించే అన్ని పరీక్షలు సీబీఎస్‌ఈ సిలబస్ ఆధారంగానే ఉంటున్నాయి. దీంతో సీబీఎస్‌ఈలో చేరితే మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరికొందరు మాత్రం జేఈఈ పరీక్షలను ఇంటర్మీడియెట్ బోర్డ్ సిలబస్‌తోనే బాగా రాణించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
సీబీఎస్‌ఈ గ్రూప్స్
సీబీఎస్‌ఈ +2 స్థాయిలో.. సైన్స్ స్ట్రీమ్‌లో మెడికల్, నాన్–మెడికల్ పేరుతో రెండు సబ్ స్ట్రీమ్‌ల విధానం అమలవుతోంది. నాన్–మెడికల్ స్ట్రీమ్‌లో.. విద్యార్థులు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్,ఇంగ్లిష్ సబ్జెక్ట్‌లతోపాటు ఏదైనా ఒక ఆప్షనల్ సబ్జెక్ట్‌ను చదవాల్సి ఉంటుంది. దీన్ని పీసీఎం గ్రూప్‌గా పిలుస్తున్నారు. మెడికల్ స్ట్రీమ్‌లో.. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లిష్ సబ్జెక్ట్‌లతోపాటు ఒక ఆప్షనల్ సబ్జెక్ట్‌ను చదవాలి. దీన్నే పీసీబీ గ్రూప్‌గా పేర్కొంటున్నారు.
చదవండి: తొలి రైల్వే వర్సిటీలో యూజీ, పీజీ అడ్మిషన్స్.. ఉద్యోగ అవకాశాలు ఇలా..
స్టేట్ బోర్డ్
రాష్ట్ర స్థాయిలో ఇంటర్మీడియెట్‌లో ఎంపీసీ, బైపీసీ, హెచ్‌ఈసీ, సీఈసీ గ్రూప్‌లు ప్రధానంగా నిలుస్తున్నాయి. వీటిలో చేరిన అభ్యర్థులు ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ తోపాటు గ్రూప్ సబ్జెక్ట్‌లుగా నిర్దేశించిన మూడు సబ్జెక్ట్‌లను చదవాల్సి ఉంటుంది. సీబీఎస్‌ఈ బోర్డ్ మాదిరిగా ఆప్షనల్ సబ్జెక్ట్‌ను ఎంపిక చేసుకునే అవకాశం స్టేట్ బోర్డ్ సిలబస్‌లో ఉండదు. ఇంజనీరింగ్‌లో చేరాలనుకునే విద్యార్థులు ఎంపీసీ(మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ); మెడికల్ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు బైపీసీ(బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలను ఎంచుకుంటున్నారు.
‘మెడికల్’ లక్ష్యమైతే
10+2/ఇంటర్మీడియెట్ తర్వాత ఎంబీబీఎస్‌లో చేరాలనుకునే విద్యార్థులు నీట్–యూజీ పరీక్షలో ర్యాంకు సాధించాల్సి ఉంటుంది. నీట్ లక్ష్యంగా చేసుకునే విద్యార్థులు సీబీఎస్‌ఈ బోర్డ్‌లో చేరితే మంచిదనే వాదన వినిపిస్తోంది. అదే విధంగా జేఈఈ–మెయిన్, అడ్వాన్స్‌డ్‌లలో మెరుగ్గా రాణించాలంటే కూడా సీబీఎస్‌ఈ బోర్డ్ మేలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈ పరీక్షల సిలబస్ అంతా సీబీఎస్‌ఈ కరిక్యులం ఆధారంగా రూపొందించడమే ఇందుకు కారణం. మరికొంతమంది మాత్రం స్టేట్ బోర్డ్ ఎంపీసీ విద్యార్థులు జేఈఈ–మెయిన్, అడ్వాన్స్‌డ్ పరీక్షల్లో ముందంజలో నిలిచేందుకు అవకాశముందని చెబుతున్నారు. దీనికి కారణం.. స్టేట్ బోర్డ్ స్థాయిలో మ్యాథమెటిక్స్ సిలబస్ విస్తృతంగా ఉండటమే. కానీ..సైన్స్ సబ్జెక్ట్‌లు(ఫిజిక్స్, కెమిస్ట్రీ) విషయానికొస్తే సీబీఎస్‌ఈనే బెస్ట్ అంటున్నారు.
చదవండి: ప్రస్తుత పరిస్థితుల్లో అకడమిక్ మార్కులతోపాటు ఈ స్కిల్స్‌కు ప్రాధాన్యం..!
అప్లికేషన్ అప్రోచ్
సీబీఎస్‌ఈలో అప్లికేషన్ అప్రోచ్‌తో బోధన సాగిస్తున్నారు. లెర్నింగ్ బై డూయింగ్ విధానంలో ప్రాక్టికల్ ఆధారిత, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్‌కు ప్రాధాన్యం ఉంటోంది. ఫలితంగా ప్రవేశ పరీక్షల్లో ఎలాంటి ప్రశ్నలు అడిగినా.. సమాధానం ఇచ్చే సంసిద్ధత లభిస్తోంది. అదే స్టేట్ బోర్డ్ విషయానికొస్తే.. వార్షిక విధానంలో నిర్వహించే ప్రాక్టికల్స్ మినహా.. మిగతా సమయంలో ప్రాక్టికల్ అప్రోచ్ ఆధారిత టీచింగ్, లెర్నింగ్ చాలా తక్కువగా కనిపిస్తోంది.
బోర్డ్ ఎంపిక.. ముఖ్యాంశాలు
- నీట్‌కు అనుకూలంగా సీబీఎస్‌ఈ బోర్డ్.
- జేఈఈకి అనుకూలంగా స్టేట్ బోర్డ్.
- ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల ఆధారంగా నీట్, జేఈఈ ప్రశ్నల రూపకల్పన.
- బోర్డ్ ఏదైనా ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలంటున్న సబ్జెక్ట్ నిపుణులు.
స్టేట్ బోర్డ్.. ఇలా
స్టేట్ బోర్డ్‌లో రెండేళ్ల ఇంటర్మీడియెట్‌లో తొలి రోజు నుంచే జేఈఈ–మెయిన్, అడ్వాన్స్‌డ్, ఎంసెట్ పరీక్షల కోణంలో బోధన సాగిస్తున్నారు. ఆయా పరీక్షల పాత ప్రశ్న పత్రాల సాధన, వీక్లీ టెస్ట్‌ల నిర్వహణ వంటి విధానాలతో విద్యార్థులు పుస్తకాలకే పరిమితమయ్యే పరిస్థితి నెలకొంది. ఫలితంగా వాస్తవ దృక్పథాన్ని, అప్లికేషన్ అప్రోచ్‌ను కోల్పోయే ఆస్కారం ఏర్పడుతోంది. దీంతో పరీక్షల్లో అప్లికేషన్ ఆధారిత ప్రశ్నలు ఎదురైనప్పుడు స్టేట్ బోర్డు విద్యార్థులు కొంత వెనుకంజలో ఉంటున్నారని చెబుతున్నారు.
చదవండి: ఉన్నత విద్యలో ప్రవేశానికి కనీస అర్హత మార్కులు..!
సిలబస్ మార్చినా
స్టేట్ బోర్డ్‌లో చదివే విద్యార్థులు సైతం జాతీయ స్థాయిలో నిర్వహించే పోటీ పరీక్షల్లో రాణించాలనే ఉద్దేశంతో నాలుగేళ్ల క్రితం ఇంటర్మీడియెట్ స్టేట్ బోర్డ్ సిలబస్‌లో మార్పులు చేశారు. ముఖ్యంగా ఎంపీసీ, బైపీసీ గ్రూప్‌లలో దాదాపు 80 శాతం సిలబస్ సీబీఎస్‌ఈ సిలబస్‌కు సరితూగే విధంగా మార్చారు. కానీ.. బోధన పరంగా అందుకు అనుగుణమైన మౌలిక సదుపాయాలు లేకపోవడం,టీచింగ్ సిబ్బంది కొరత వంటి సమస్యలు ఎదురవుతున్నాయి.
జేఈఈ.. స్టేట్ బోర్డ్
గత మూడేళ్ల జేఈఈ అడ్వాన్స్‌డ్, నీట్ యూజీ ఫలితాలను చూస్తే.. తెలుగు రాష్ట్రాల నుంచి ర్యాంకులు సాధించిన వారిలో అధికశాతం మంది స్టేట్ బోర్డ్ విద్యార్థులే ఉన్నారు. నీట్–యూజీలో టాప్ పర్సంటైల్ కోణంలో మాత్రం సీబీఎస్‌ఈ బోర్డ్ విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. దీనికి స్టేట్ బోర్డ్‌లో మ్యాథమెటిక్స్‌కు, సీబీఎస్‌ఈలో సైన్స్‌కు అధిక ప్రాధాన్యం ఉండటమే కారణమని చెబుతున్నారు.
సీబీఎస్‌ఈ నుంచి స్టేట్ బోర్డ్‌కి
తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి వరకు సీబీఎస్‌ఈ బోర్డ్‌లో చదివిన విద్యార్థులు సైతం ఇంటర్మీడియెట్‌లో స్టేట్ బోర్డ్‌ను ఎంచుకుంటున్నారు. జాతీయ స్థాయిలో నిర్వహించే జేఈఈ–మెయిన్, అడ్వాన్స్‌డ్‌లలో ఉండే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్టేట్ బోర్డ్ సిలబస్‌తో ముందంజలో నిలవొచ్చనే అభిప్రాయమే దీనికి కారణమని పేర్కొంటున్నారు.
![]() ![]() |
![]() ![]() |
బోర్డ్ ఏదైనా.. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలే
ఇంటర్మీడియెట్‌లో ఏ బోర్డ్‌ను ఎంచుకున్నా.. జాతీయ స్థాయిలో జేఈఈ, నీట్‌లలో రాణించాలంటే.. అకడమిక్ పుస్తకాలతో పాటు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను తప్పనిసరిగా అధ్యయనం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లోని టాపిక్స్‌తోపాటు ప్రతి యూనిట్ తర్వాత ఇచ్చే ఎక్సర్‌సైజ్‌లను ప్రాక్టీస్ చేయడం ద్వారా నీట్, జేఈఈలలో రాణించే సత్తా లభిస్తుందని స్పష్టం చేస్తున్నారు. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లోని అంశాల ఆధారంగా జేఈఈ, నీట్ ప్రశ్న పత్రాల రూపకల్పన జరుగుతుందని చెబుతున్నారు. కాబట్టి స్టేట్ బోర్డ్, సీబీఎస్‌ఈ బోర్డ్‌ల విద్యార్థులు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను అధ్యయనం చేయాలని సూచిస్తున్నారు.
ప్రాక్టీస్.. ప్రాక్టీస్
జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో రాణించేందుకు సిలబస్‌కు అనుగుణంగా ఆయా అంశాలను లోతుగా ప్రిపేర్ అవడంతోపాటు ప్రాక్టీస్‌పై దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. బేసిక్స్, కాన్సెప్ట్స్, అప్లికేషన్స్‌కు ప్రాధాన్యమివ్వాలని పేర్కొంటున్నారు. ఆయా ప్రశ్నలకు, వాటి ఫార్ములా ఆధారంగా పలు విధానాల్లో సమాధానం రాబట్టేలా ప్రాక్టీస్ కొనసాగించాలని చెబుతున్నారు.
ఏకరూప సిలబస్‌తో.. మేలు
నూతన విద్యా విధానం–ఉమ్మడి సిలబస్ అంశాన్ని సిఫార్సు చేసింది. దీనివల్ల అందరికీ సమాన అవకాశాలు లభిస్తాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీలలో అన్ని రాష్ట్రాల సిలబస్ ఒకే మాదిరిగా ఎన్‌సీఈఆర్‌టీ ఆధారంగా రూపొందించాలని; హెచ్‌ఈసీ, సీఈసీ, ఎంఈసీ తదితర గ్రూప్‌ల విషయంలో 70 శాతం ఉమ్మడి సిలబస్‌ను, 30 శాతం సంబంధిత రాష్ట్ర పరిస్థితులకు సంబంధించిన అంశాలను జోడించి రూపొందించాలని పేర్కొంది.
ఉమ్మడి సిలబస్ విధానం ఇంకా పూర్తిస్థాయిలో అమల్లోకి రాలేదు. అయితే సీబీఎస్‌ఈ, స్టేట్ బోర్డు.. రెండింటిలోనూ సానుకూల, ప్రతికూల అంశాలున్నాయని.. విద్యార్థులు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల ఆధారంగా ప్రిపరేషన్ సాగించడం ద్వారా జాతీయ స్థాయి పరీక్షల్లో రాణించే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.
Tags
- CBSE
- JEE Main
- JEE Advanced
- NEET-UG
- Engineering
- Medicine
- Entrance Tests
- NCERT Books
- Intermediate
- CBSE Groups
- Medical in science stream
- Non-medical Stream
- CBSE or state board which is better for future
- which is better cbse or state board after 10th
- Cbse vs state board which is better for science
- Education
- CBSE vs State Board