Bank Exam Guidance: 146 స్పెషలిస్ట్ ఆఫీసర్ కొలువులు.. రాత పరీక్ష, సిలబస్ అంశాలు ఇవే..
- మొత్తం 146 స్పెషలిస్ట్ ఆఫీసర్ కొలువులు
- డిగ్రీ, ఎంబీఏ, సీఏ అర్హతతో దరఖాస్తుకు అవకాశం
- రాత పరీక్ష, ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా ఎంపిక
ప్రభుత్వ రంగ బ్యాంకులు.. ఇటీవల కాలంలో తాజా టెక్నాలజీ ఆధారంగా చేసుకుని సేవలందిస్తున్నాయి. సంప్రదాయ విభాగాలుగా భావించే క్రెడిట్ మేనేజర్ మొదలు ఐటీ, క్లౌడ్ టెక్నాలజీల్లోనూ ఆఫీసర్లు/మేనేజర్ల నియామకం చేపడుతున్నాయి. ఆయా అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
మొత్తం 146 పోస్టులు
ఇండియన్ బ్యాంకు.. తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా మొత్తం 146 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్ట్‌ల భర్తీ చేపట్టనుంది.
అర్హతలు వేర్వేరుగా
- వేర్వేరు విభాగాల్లో పోస్ట్‌లను పేర్కొన్న క్రమంలో.. అర్హతలను కూడా వేర్వేరుగా నిర్దేశించారు. అంతేకాకుండా పని అనుభవం కూడా ఉండాలని పేర్కొన్నారు. ఆయా పోస్ట్‌లను అనుసరించి బ్యాచిలర్ డిగ్రీ, బీటెక్/సీఏ/ఐసీడబ్ల్యూఏ/సీఎంఏ/ ఎంబీఏ ఉత్తీర్ణత ఉండాలి. వీటితోపాటు ఆయా పోస్ట్‌లను అనుసరించి మూడు నుంచి పదేళ్ల అనుభవం ఉండాలి. అన్ని పోస్ట్‌లకు ఎంబీఏ/పీజీడీఎం ఉంటే ప్రాధాన్యం లభిస్తుంది.
- వయసు: పోస్ట్‌లను అనుసరించి వయసు 21–45 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్‌సీ, ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు చొప్పున గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఇస్తారు.
స్కేల్–1, 2, 3, 4 వేతనాలు
అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్‌లను స్కేల్–1 (వేతన శ్రేణి రూ.36,000–రూ.63,840), మేనేజర్ పోస్ట్‌లను స్కేల్–2(వేతన శ్రేణి రూ.48,170–రూ.69,810), సీనియర్ మేనేజర్ పోస్ట్‌లను స్కేల్–3 (వేతన శ్రేణి రూ.63,840–రూ.78,230), చీఫ్ మేనేజర్ పోస్ట్‌లను స్కేల్–4(రూ.76,010–రూ.89,890)గా పేర్కొన్నారు.
రెండంచెల ఎంపిక ప్రక్రియ
స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్ట్‌ల భర్తీకి ఇండియన్ బ్యాంక్ రెండంచెల ఎంపిక విధానాన్ని అనుసరించనుంది. ఇందులో రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూలు ఉంటాయి. తొలిదశ రాత పరీక్షను మూడు విభాగాల్లో 100 మార్కులకు నిర్వహిస్తారు. ప్రొఫెషనల్ నాలెడ్జ్ /సంబంధిత సబ్జెక్ట్ (60 ప్రశ్నలు–60 మార్కులు); ఇంగ్లిష్ లాంగ్వేజ్ (20 ప్రశ్నలు – 20 మార్కులు); బ్యాంకింగ్ ఇండస్ట్రీ ప్రాధాన్యంగా జనరల్ అవేర్‌నెస్ (20 ప్రశ్నలు – 20 మార్కులు) విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఒక గంట 45 నిమిషాల వ్యవధిలో పరీక్ష ఉంటుంది.
ఇంటర్వ్యూకు 100 మార్కులు
రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా.. అన్ రిజర్వ్‌డ్ కేటగిరీలో ఒక్కో పోస్ట్‌కు ముగ్గురిని చొప్పున (1:3 నిష్పత్తిలో), రిజర్వ్‌డ్ కేటగిరీలో ఒక్కో పోస్ట్‌కు అయిదుగురిని చొప్పున (1:5 నిష్పత్తిలో) ఎంపిక చేసి.. పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. మొత్తం 100 మార్కులకు ఇంటర్వ్యూ ఉంటుంది.
తుది జాబితా.. వెయిటేజీ విధానం
నియామకాలను ఖరారు చేసే క్రమంలో వెయిటేజీ విధానాన్ని అనుసరిస్తారు. రాత పరీక్షలో మార్కులకు 80 శాతం వెయిటేజీ, ఇంటర్వ్యూ మార్కులకు 20 శాతం వెయిటేజీ కల్పిస్తారు. దానికి అనుగుణంగా తుది జాబితా రూపొందించి.. అందులో చోటు సాధించిన వారికి నియామకాలు ఖరారు చేస్తారు.
ప్రొబేషన్ నిబంధన
నియామకాలు ఖరారు చేసుకున్న వారికి ప్రొబేషనరీ పిరియడ్ ఉంటుంది. స్కేల్ 1 హోదాలో నియమితులైన వారు రెండేళ్లు, స్కేల్–2, 3, 4 హోదాల్లో నియమితులైన వారికి ఏడాది ప్రొబేషన్ ఉంటుంది. అదే విధంగా రెండేళ్ల పాటు బ్యాంకులో విధులు నిర్వర్తించేలా సర్వీస్ బాండ్ ఇవ్వాల్సి ఉంటుంది.
సీజీఎం స్థాయికి
ఆయా పోస్ట్‌లలో నియమితులైన వారు.. భవిష్యత్తులో జీఎం, సీజీఎం స్థాయికి పదోన్నతులు పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా ఐటీ, రిస్క్ మేనేజ్‌మెంట్ వంటి స్పెషలైజ్డ్ విభాగాల్లో సీనియర్ మేనేజర్ హోదాలో నియమితులైన వారు జీఎం స్థాయికి, చీఫ్ మేనేజర్స్ హోదాలో చేరిన వారు సీజీఎం స్థాయికి చేరుకోవచ్చు. అసిస్టెంట్ మేనేజర్స్‌గా నియామకం పొందిన వారు ఏజీఎం స్థాయి వరకు చేరుకునే అవకాశం ఉంది.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 2024, ఏప్రిల్ 1
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.indianbank.in/career
ఎంపిక ప్రక్రియలో సక్సెస్ ఇలా
- ప్రొఫెషనల్ నాలెడ్జ్ విభాగం కోసం ఎంచుకున్న స్పెషలైజేషన్‌కు సంబంధించి.. బ్యాచిలర్, పీజీ స్థాయి పుస్తకాలను అధ్యయనం చేయాలి. ముఖ్యమైన కాన్సెప్ట్‌లను అప్లికేషన్ అప్రోచ్‌తో అధ్యయనం చేయాలి. అంతేకాకుండా ఆయా విభాగాలకు సంబంధించి గత ప్రశ్న పత్రాలు, ఇతర పోటీ పరీక్షల ప్రశ్న పత్రాలను సాధన చేయడం కూడా ఉపయుక్తంగా ఉంటుంది.
- ఇంగ్లిష్ లాంగ్వేజ్‌లో మార్కుల కోసం బేసిక్ గ్రామర్‌తో మొదలు పెట్టి వొకాబ్యులరీ పెంచుకోవడం వరకు కృషి చేయాలి. రీడింగ్ కాంప్రహెన్షన్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, జంబుల్డ్ సెంటెన్సెస్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్ వంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
- బ్యాంకింగ్ రంగం ప్రాధాన్యంగా ఉండే జనరల్ అవేర్‌నెస్ విభాగంలో రాణించడానికి కరెంట్ అఫైర్స్‌తోపాటు బ్యాంకింగ్ రంగంలో ఇటీవల కాలంలో పరిణామాలు, బ్యాంకింగ్ విధానం, టెర్మినాలజీ, రెపో రేటు, రిస్క్ రికవరీ విధానాలు తదితర అంశాలపై దృష్టి సారించాలి.
- పర్సనల్ ఇంటర్వ్యూలో ప్రధానంగా అభ్యర్థుల అకడమిక్, వర్క్ ప్రొఫైల్‌పై ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి ఇప్పటి వరకు చేస్తున్న పనిలో సాధించిన విజయాలు, అవి సంస్థల అభ్యున్నతికి తోడ్పడిన తీరు, తమ నైపుణ్యాలను బ్యాంకింగ్ రంగంలో అన్వయించే తీరుపై సమాధానాలు ఇచ్చే విధంగా సన్నద్ధమవ్వాలి.
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Tags
- Indian Bank Recruitment 2024
- bank jobs
- Bank Jobs 2024
- Specialist Officer Jobs
- Specialist Officer Jobs at Indian Bank
- Bank Exam Guidance
- Indian Bank SO Recruitment 2024
- written exam
- Syllabus
- Jobs Interview
- Personal Interviews
- Professional Knowledge
- english language
- Banking Sector
- General Awareness
- latest notifications
- latest job notifications 2024
- latest govt jobs notifications
- central govt jobs 2024
- latest employment notification
- sakshi education latest job notifications