Skip to main content

Civil Services (Preliminary) Examination 2023: ప్రిలిమ్స్‌ కటాఫ్‌.. 88-95!

సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌ -2023.. ఐఏఎస్, ఐపీఎస్,ఐఎఫ్‌ఎస్‌ సహా.. 19 కేంద్ర సర్వీసులకు గత నెల 28న నిర్వహించిన పరీక్ష! జాతీయ స్థాయిలో.. దాదాపు ఆరు లక్షల మంది హాజరైనట్లు అంచనా! ఇప్పుడు వీరంతా కటాఫ్‌ అంచనాపై తర్జనభర్జన పడుతున్నారు. మెయిన్స్‌కు అర్హత సాధిస్తామా.. ప్రిపరేషన్‌ ప్రారంభించాలా.. వద్దా?! అనే సందేహం ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో.. సివిల్‌ సర్వీసెస్‌ తొలి దశ ప్రిలిమినరీ పరీక్ష క్లిష్టత స్థాయి, కటాఫ్‌ అంచనా, రెండో దశ మెయిన్‌కు ప్రిపరేషన్‌పై విశ్లేషణాత్మక కథనం..
civil services preliminary exam cut off marks 2023
  • మోస్తరు క్లిష్టంగా సివిల్స్‌ ప్రిలిమ్స్‌
  • మెయిన్స్‌కు ముందస్తు ప్రిపరేషన్‌ మేలు
  • సెప్టెంబర్‌ 15 నుంచి మెయిన్‌ ఎగ్జామ్‌

1105 పోస్టుల భర్తీకి తొలిదశగా నిర్వహించిన సివిల్స్‌ ప్రిలిమ్స్‌-2023కు తెలుగు రాష్ట్రాల నుంచి 46వేల మందికిపైగా హాజరైనట్లు అంచనా. ప్రిలిమ్స్‌లో పేపర్‌-1 జనరల్‌ స్టడీస్‌ ఓ మోస్తరు క్లిష్టతతో ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండు పేపర్లుగా నిర్వహించే ప్రిలిమ్స్‌లో జనరల్‌ స్టడీస్‌ మార్కులనే.. మెయిన్స్‌కు ఎంపిక చేసేందుకు పరిగణనలోకి తీసుకుంటారు. దీంతో జీఎస్‌ పేపర్‌ మార్కుల అంచనాపైనే అందరూ దృష్టి సారిస్తున్నారు.

జాగ్రఫీ, ఎకానమిక్స్‌కు ప్రాధాన్యం

  • జీఎస్‌ పేపర్‌లో ఈ సారి జాగ్రఫీ, ఎకనామిక్స్‌కు కొంత ఎక్కువ ప్రాధాన్యం కనిపించిందని నిపుణుల అభిప్రాయం. జాగ్రఫీ, ఎకానమీల నుంచి 17 ప్రశ్నలు చొప్పున అడిగారు. ఆ తర్వాత స్థానంలో పాలిటీ, గవర్నెన్స్‌ నుంచి 16ప్రశ్నలు; ఎన్విరాన్‌మెంట్, ఎకాలజీ, అగ్రికల్చర్‌ నుంచి 14 ప్రశ్నలు; హిస్టరీ నుంచి 13 ప్రశ్నలు; కరెంట్‌ అఫైర్స్‌ నుంచి 14 ప్రశ్నలు; సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ నుంచి 9 ప్రశ్నలు అడిగారు. వీటిలో ఎస్‌ అండ్‌ టీ, జాగ్రఫీ విభాగాల ప్రశ్నలు కొంతగా క్లిష్టంగా ఉన్నాయని అభ్యర్థులు పేర్కొంటున్నారు.
  • కరెంట్‌ అఫైర్స్‌ విభాగం నుంచి డైరెక్ట్‌ కొశ్చన్స్‌ అడిగారు. దాదాపు 8 ప్రశ్నలు కరెంట్‌ అఫైర్స్, జీకేల నుంచి వచ్చాయి.

చ‌ద‌వండి: Civil Service Exam Preparation Tips: ప్రిలిమ్స్‌పై.. పట్టు సాధించేలా!

పేపర్‌-2 కూడా

అర్హత పేపర్‌గానే భావించే ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ పేపర్‌(జీఎస్‌ పేపర్‌-2) సైతం ఓ మోస్తరు క్లిష్టతతో ఉందని చెబుతున్నారు. ఈ పేపర్‌లో రీజనింగ్‌ నుంచి 13, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ నుంచి 27, బేసిక్‌ న్యూమరసీ నుంచి 40 ప్రశ్నలు అడిగారు. ఈ పేపర్‌కు అర్హతగా నిర్దేశించిన 33 శాతం మార్కులను సాధించడం కష్టం కాదని అంటున్నారు. 

అప్లికేషన్‌ అప్రోచ్‌

అన్ని విభాగాల్లోనూ అడిగిన ప్రశ్నలు ఆయా సబ్జెక్ట్‌ల కాన్సెప్ట్‌లపై క్లారిటీని పరీక్షించే వి«ధంగా ఉన్నాయి. దీంతోపాటు అప్లికేషన్‌ అప్రోచ్‌ ఆధారంగా సమాధానాలు ఇచ్చేలా ప్రశ్నలు అడిగారు. కాబట్టి ప్రామాణిక పుస్తకాల అధ్యయనం, సమకాలీన అంశాలు, నిజ జీవితంతో అనుసంధాన దృక్పథం ఉన్న అభ్యర్థులే సరైన సమాధానాలు ఇచ్చేందుకు ఆస్కారం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్‌సీఈఆర్‌టీ 11, 12 తరగతులకు సంబంధించిన పుస్తకాలను క్షుణ్నంగా అవగాహన చేసుకున్న అభ్యర్థులు సమాధానాలు ఇవ్వడంలో ముందంజలో ఉంటారని నిపుణులు పేర్కొంటున్నారు.

88-95.. కటాఫ్‌ అంచనా

మొత్తంమీద సివిల్స్‌ ప్రిలిమ్స్‌-2023లో కటాఫ్‌ మార్కులు 88 నుంచి 95 మధ్య ఉండొచ్చని నిపుణుల అంచనా. అభ్యర్థులు తమ సమాధానాలు సరి చూసుకుని.. ఈ మార్కుల శ్రేణిలో ఉంటే.. రెండో దశ మెయిన్స్‌కు ప్రిపరేషన్‌ ప్రారంభించొచ్చని సూచిస్తున్నారు. 

చ‌ద‌వండి: Groups Preparation Tips: 'కరెంట్‌ అఫైర్స్‌'పై పట్టు.. సక్సెస్‌కు తొలి మెట్టు!

మెయిన్స్‌లో మెరిసేలా

మెయిన్‌ పరీక్షలు సెప్టెంబర్‌ 15 నుంచి అయిదు రోజుల పాటు నిర్వహించనున్నారు. కటాఫ్‌ మార్కు­ల శ్రేణిపై స్పష్టత వచ్చిన అభ్యర్థులు.. ఇప్పటి నుంచే రెండో దశ మెయిన్స్‌పై దృష్టి పెట్టడం మేలు. మెయిన్‌లో మొత్తం ఏడు పేపర్లు ఒక్కో పేపర్‌కు 250 మార్కుల చొప్పున 1750 మార్కులకు ఉంటాయి. వీటికి అదనంగా అర్హత పేపర్లుగా ఇంగ్లిష్, రీజనల్‌ లాంగ్వేజ్‌ పేపర్లు ఉంటాయి. మెయిన్స్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా 1:2 లేదా 1:2.5 నిష్పత్తిలో చివరి దశ పర్సనాలిటీ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు. దీనికి 275 మార్కులు కేటాయించారు. ఇలా మొత్తం 2025 మార్కులకు సివిల్‌ సర్వీసెస్‌ తుది ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. 

పేపర్‌ 1(జనరల్‌ ఎస్సే)

అభ్యర్థులు తొలుత జనరల్‌ ఎస్సే పేపర్‌లో అడిగేందుకు అవకాశమున్న అంశాలను గుర్తించాలి. సమకాలీన అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. అంతర్జాతీయ పరిణామాలు, కరోనా విపత్తు ప్రభావాలు, వ్యాక్సినేషన్‌ విధానాలు, పర్యావరణ అంశాలు, జా­తీయ స్థాయిలో ఇటీవల చర్చనీయాంశంగా మారిన అంశాలను అభ్యసించాలి. వీటికి విశ్లేషణాత్మక సమాధానాలు రాసే విధంగా ప్రాక్టీస్‌ చేయడం ముఖ్యం.

పేపర్‌-2(జీఎస్‌-1)

హిస్టరీకి సంబంధించి సంగీతం, సాహిత్యం, నా­ట్యం, వాస్తు-శిల్పకళ, మత ఉద్యమాలు, తత్వాలు తదితర అంశాలపై క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. ఈ అంశాలను ప్రాచీన, మధ్య, ఆధునిక భారత దేశ చరిత్రలకు అనుసంధానిస్తూ చదవాలి. 18వ శతాబ్దం మధ్య కాలం నుంచి ఇప్పటి వరకు చోటుచేసుకున్న ప్రధాన సంఘటనల్ని పరిశీలించాలి. స్వాతంత్య్రోద్యమం గురించి ప్రత్యేకంగా చదవాలి. 
అదే విధంగా రాజ్యాంగం, పంచవర్ష ప్రణాళిక­లు, భూ సంస్కరణలు, నెహ్రూ విదేశాంగ విధానం, అలీనోద్యమం, హరిత విప్లవం తదితరాలపై దృష్టి సారించాలి. ప్రపంచ చరిత్రకు సంబంధించి.. పారిశ్రామిక విప్లవం, ప్రపంచ యుద్ధాలు, ఐరోపాలో నూతన రాజ్యాల ఆవిర్భావం, ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికాల్లో వలసవాదం, స్వాతంత్య్ర ఉద్యమాలను ప్రధానంగా చదవాలి. భూకంపాలు, సునామీలు, అగ్ని పర్వతాలు, తుపానులు వంటి వాటి గురించి శాస్త్రీయ అవగాహన పెంపొందించుకోవాలి. ప్రాంతీయ అభివృద్ధికి దోహద పడే సహజ వనరుల గురించి క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. 

పేపర్‌-3(జీఎస్‌-2)

మన దేశానికి సంబంధించిన ప్రజా పరిపాలన, రాజకీయ వ్యవస్థ, అంతర్జాతీయ సంబంధాల సమ్మేళనంగా ఉంది. భారత రాజ్యాంగం గురించి చదివే క్రమంలో 1858 భారత ప్రభుత్వ చట్టం దగ్గరి నుంచి 1947 స్వాతంత్య్ర చట్టం వరకు చదవాలి. 1919, 1935 భారత ప్రభుత్వ చట్టాలపై దృష్టి సారించాలి. రాజ్యాంగం మూల నిర్మాణాన్ని అర్థం చేసుకునేందుకు కేశవానంద భారతి, మినర్వా మిల్స్‌ కేసులను పరిశీలించాలి. కేంద్ర, రాష్ట్రాల మధ్య శాసన, కార్యనిర్వాహక, ఆర్థిక అధికారాల విభజన, భారత రాజకీయ వ్యవస్థలోని అర్ధ సమాఖ్య స్వభావంపై దృష్టిపెట్టాలి. 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాల ప్రభావాన్ని పరిశీలించాలి. ఆయా పథకాల పనితీరు, ఉద్దేశం, లక్ష్యం, ఫలితాలను అధ్యయనం చేయాలి.

పేపర్‌ 4(జీఎస్‌-3)

ఈ పేపర్‌లో టెక్నాలజీ; ఆర్థికాభివృద్ధి; బయో డైవర్సిటీ; ఎన్విరాన్‌మెంట్‌; సెక్యూరిటీ అండ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌లను అధ్యయనం చేయాలి. ప్రణాళికా పెట్టుబడుల్లో భాగంగా ప్రభుత్వ రంగ వనరుల సమీకరణకు ఆధారాలు, వాటి ధోరణులు, వివిధ రంగాల మధ్య వనరుల పంపిణీ తదితర అంశాలను క్షణ్నంగా చదవాలి. భారత్‌లో సమ్మిళిత వృద్ధి పాత్ర, ఆహార భద్రత, బడ్జెటింగ్‌ తీరుతెన్నులతో పాటు స్వాతంత్య్రం తర్వాత వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులను చదవాలి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ రంగంలో అభివృద్ధి, దైనందిన జీవితంలో దాని అనువర్తనాలపై దృష్టిపెట్టాలి.

పేపర్‌ 5 (జీఎస్‌-4)

ఈ పేపర్‌లో సిలబస్‌లోని ఎక్కువ అంశాలు ప్రభుత్వ పాలన(పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌)కు సంబంధించినవిగా ఉంటాయి. మరికొన్ని ఫిలాసఫీ, సైకాలజీకి చెందినవి. అభ్యర్థులు పరిపాలనలో నైతిక విలువల ఆవశ్యకతకు సంబంధించిన అంశాలపై దృష్టిసారించాలి. వ్యక్తిగత, సామాజిక సంబంధాల్లో ఈ విలువలు ఎలాంటి పాత్ర పోషిస్తున్నాయో తెలుసుకోవాలి. నైతిక శాస్త్రంలో ప్రధానంగా అప్లయిడ్‌ ఎథిక్స్‌(అనువర్తిత నైతిక శాస్త్రం)పై దృష్టి పెట్టాలి. ప్రధానంగా అభ్యర్థులు 'పబ్లిక్‌ సర్వీస్‌ ఎథిక్స్‌'కు సంబంధించిన అంశాలను చదవాలి. ప్రభుత్వ విధానాల అమలు, నిధుల ఖర్చు, విధుల నిర్వహణలో జావాబుదారీతనం, పారదర్శకతలో నైతికత ప్రాధాన్యాన్ని తెలుసుకోవాలి. మతం-నైతికత, వర్ణ వ్యవస్థ-నైతికత, కుటుంబం-నైతికత.. ఇలా వివిధ సామాజిక అంశాలను, సమకాలీన అంశాలతో అనుసంధానిస్తూ చదవాలి. నైతిక విలువలు పెంపొందించడంలో కుటుంబం, సమాజం, విద్యా సంస్థల పాత్ర ఏమిటో తెలుసుకోవాలి. మరో ప్రధాన అంశం ..ఆటిట్యూడ్‌ (వైఖరి). లక్ష్య సాధనలో, విధి నిర్వహణలో ఎంతో కీలకంగా నిలిచే వైఖరి విషయంలో ప్రత్యేక శ్రద్ధతో వ్యవహరించాలి.

చ‌ద‌వండి: Competitive Exams Preparation Tips: కోచింగ్‌ లేకుండానే... సివిల్స్, గ్రూప్స్‌!

ఆప్షనల్‌ సబ్జెక్ట్‌కు ఇలా

ఆప్షనల్‌ సబ్జెక్ట్‌కు సంబంధించి అభ్యర్థులు రెండు పేపర్లు రాయాల్సి ఉంటుంది. ఇటీవల కాలంలో ఫలితాలను పరిగణనలోకి తీసుకుంటే.. పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, జాగ్రఫీ, ఫిలాసఫీ, సైకాలజీ తదితర ఆప్షనల్స్‌ జనరల్‌ స్టడీస్‌కు కలిసొచ్చే విధంగా ఉన్నాయి. ఆప్షనల్‌ ఏదైనా సరే వాటిని ఆమూలాగ్రం అధ్యయనం చేయాలి. ప్రశ్నలు అడిగే ఆస్కారం ఉన్న అంశాలను గుర్తించి.. వాటిపై లోతుగా అధ్యయనం చేయాలి. అంతేకాకుండా గత కొన్నేళ్ల ప్రశ్న పత్రాలను పరిశీలించి, ప్రాక్టీస్‌ చేయడం కూడా ఉపయుక్తంగా ఉంటుంది.

900 మార్కులు లక్ష్యంగా

మెయిన్స్‌లో మొత్తం 1,750 మార్కులకు గాను 900 మార్కులు సాధించేలా కృషి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. నిరంతరం ప్రాక్టీస్‌ టెస్ట్‌లకు హాజరవుతూ వాటిలో కనీసం వేయి మార్కులు సాధించేలా యత్నించాలంటున్నారు. ఫలితంగా పరీక్ష సమయంలో కొద్దిపాటి పొరపాట్లు జరిగినా..900మార్కులను సాధించే సామర్థ్యం లభిస్తుందని సూచిస్తున్నారు.

Published date : 12 Jun 2023 07:28PM

Photo Stories