Skip to main content

Job Trends: కొత్త సంవత్సరంలో.. భరోసానిచ్చే కొలువులివే!

కోవిడ్‌ మహమ్మారి విజృంభణ తర్వాత ప్రపంచవ్యాప్తంగా జాబ్‌ మార్కెట్లో తీవ్ర మార్పులు నెలకొన్నాయి. స్థిరమైన కెరీర్‌ను అందించే ఉద్యోగాలకు డిమాండ్‌ పెరిగింది. డిజిటలైజేషన్, హైబ్రిడ్‌ కార్యాలయాలకు ప్రాధాన్యత ఏర్పడింది. చాలామంది తమ ఉద్యోగాలను విడిచి కొత్తవాటికోసం అన్వేషిస్తున్నారు. వేగంగా అభివృద్ధి చెందుతూ.. దీర్ఘకాలిక అవకాశాలను అందించే కొలువులపై ఉద్యోగార్థులకు అవగాహన తప్పనిసరి. కొత్త సంవత్సరంలో డిమాండింగ్‌ కొలువులు, స్థిరమైన కెరీర్‌ అందించేవాటిపై ‘లింక్డ్‌ ఇన్‌’ సంస్థ నివేదిక రూపొందించింది. గత ఐదేళ్ల ఉద్యోగ సమాచారం ఆధారంగా.. మన దేశంలో భవిష్యత్తుకు భరోసానిచ్చే కొలువులేంటో అంచనావేసింది. వాటి వివరాలు...
Job Trends
Job Trends

అఫిలియేట్‌ మార్కెటింగ్‌ స్పెషలిస్ట్‌

మార్కెటింగ్, అడ్వర్‌టైజింగ్, ఈ–లెర్నింగ్, ఇంటర్నెట్‌ రంగాల్లో ఈ ఉద్యోగాలు  లభిస్తాయి. అఫిలియేట్‌ మార్కెటింగ్‌ స్పెషలిస్ట్‌లు.. నెట్‌వర్క్స్‌ నిర్మించే లక్ష్యంగా ప్రోగ్రాములు, క్యాంపెయిన్లను రూపొందిస్తారు. వీరికి అఫిలియేట్‌ మార్కెటింగ్, అఫిలియేట్‌ నెట్‌వర్క్స్, డిజిటల్‌ మార్కెటింగ్‌లో నైపుణ్యాలుండాలి. రెండున్నరేళ్ల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు. న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరుల్లో ఎక్కువగా ఉద్యోగావకాశాలుంటాయి.

సైట్‌ రిలయబిలిటీ ఇంజనీర్‌

ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ సర్వీసెస్, కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్, ఇంటర్నెట్‌ రంగాల్లో ఈ ఉద్యోగాలు లభిస్తాయి. సైట్‌ రిలయబిలిటీ ఇంజనీర్లు.. సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్, ఐటీ కార్యకలాపాలపై పనిచేస్తూ సిస్టమ్‌ రిలయబిలిటీ, సామర్థ్యాన్ని పెంచడానికి ఆటోమేటెడ్‌ సాఫ్ట్‌వేర్‌టూల్స్‌ను రూపొందిస్తారు. వీరికి సైట్‌ రిలయబిలిటీ ఇంజనీరింగ్, కుబర్నెట్స్, అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌(ఏడబ్ల్యూఎస్‌) నైపుణ్యాలు అవసరం. అయిదేళ్ల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం లభిస్తుంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో అధిక ఉద్యోగావకాశాలుంటాయి.

మాలిక్యులర్‌ బయాలజిస్ట్‌

హాస్పిటల్‌ అండ్‌ హెల్త్‌కేర్, బయోటెక్నాలజీ, హెల్త్, వెల్‌నెస్‌ అండ్‌ ఫిట్‌నెస్‌ రంగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి. మాలిక్యులర్‌ బయాలజిస్ట్‌లు.. కణాల పనితీరు, ప్రవర్తనలను అర్థం చేసుకునేందుకు అధ్యయనం, ప్రయోగాలు, పరిశోధనలు చేస్తారు. వీరికి మాలిక్యులర్‌ బయాలజీ, డీఎన్‌ఏ ఎక్స్‌ట్రాక్షన్, పాలిమెరేజ్‌ చెయిన్‌ రియాక్షన్‌ (పీసీఆర్‌) నైపుణ్యాలు ఉండాలి. దాదాపు మూడేళ్ల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. ముంబయి, చెన్నై, బెంగళూరుల్లో ఎక్కువగా ఉపాధి అవకాశాలుంటాయి.

వెల్‌నెస్‌ స్పెషలిస్ట్‌

హెల్త్, వెల్నెస్‌ అండ్‌ ఫిట్‌నెస్, కంజ్యూమర్‌ గూడ్స్‌ మొదలైన రంగాల్లో ఈ ఉద్యోగాలు లభిస్తాయి. వెల్‌నెస్‌ స్పెషలిస్ట్‌లు.. వివిధ సంస్థల ఉద్యోగుల ఆరోగ్య, ఫిట్‌నెస్‌æ అంశాల్లో శిక్షణను అందిస్తారు. వీరికి ఉద్యోగుల ఆరోగ్యం, వెయిట్‌ మేనేజ్‌మెంట్, వెల్‌నెస్‌ కోచింగ్‌ నైపుణ్యాలుండాలి. అయిదేళ్ల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం లభిస్తుంది. ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరుల్లో విస్తృత అవకాశాలుంటాయి.

యూజర్‌ ఎక్స్‌పీరియన్స్‌ రీసెర్చర్‌

ఇంటర్నెట్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ సర్వీసెస్, డిజైన్‌ రంగాల్లో ఈ ఉద్యోగాలు లభిస్తాయి. యూజర్‌ ఎక్స్‌పీరియన్స్‌ రీసెర్చర్‌లు.. వినియోగదారుల ప్రాధాన్యాలు,  అలవాట్లను అధ్యయనం చేస్తూ.. వ్యాపార వ్యూహాలు, ఉత్పత్తుల అభివృద్ధి కోసం దోహదపడతారు. వీరికి యూజబిలిటీ టెస్టింగ్, యూజర్‌ ఎక్స్‌పీరియన్స్‌(యూఎక్స్‌), వైర్‌ఫ్రేమింగ్‌లలో నైపుణ్యాలు అవసరం. నాలుగున్నరేళ్ల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. బెంగళూరు, ముంబై, న్యూఢిల్లీల్లో అధిక ఉద్యోగావకాశాలుంటాయి.

చ‌ద‌వండి: Industry 4.0 Skills‌: బీటెక్‌ తర్వాత వెంటనే కొలువు కావాలంటే.. ఈ 4.0 స్కిల్స్‌ ఉండాల్సిందే!

మెషిన్‌ లెర్నింగ్‌ ఇంజనీర్‌

ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ సర్వీసెస్, కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్, ఇంటర్నెట్‌ రంగాల్లో ఈ ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. మెషిన్‌ లెర్నింగ్‌ ఇంజనీర్లు.. ఉత్పత్తులు, అప్లికేషన్లకు సంబంధించి సెల్ఫ్‌రన్నింగ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అల్గారిథమ్స్, సిస్టమ్స్‌ అభివృద్ధి చేసి అమలుచేస్తారు. వీరికి డీప్‌ లెర్నింగ్, మెషిన్‌ లెర్నింగ్, నేచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌(ఎన్‌ఎల్‌పీ) నైపుణ్యాలు ఉండాలి. మూడేళ్ల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం లభిస్తుంది. హైదరాబాద్, బెంగళూరు, ముంబైలో ఎక్కువ అవకాశాలుంటాయి. 

రిక్రూట్‌మెంట్‌ అసోసియేట్‌ 

ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ సర్వీసెస్, ఈ–లెర్నింగ్, స్టాఫింగ్‌ అండ్‌ రిక్రూటింగ్‌ రంగాల్లో ఈ ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి. రిక్రూట్‌మెంట్‌ అసోసియేట్‌లు సంస్థల్లో కొత్త ప్రతిభను ఆకర్షించడం, నియామకాలు చేపట్టడం తదితర బాధ్యతలు నిర్వహిస్తారు. వీరికి స్క్రీనింగ్, సోర్సింగ్, రిక్రూటింగ్‌ అంశాల్లో నైపుణ్యాలు అవసరం. మూడేళ్ల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యతనిస్తారు. బెంగళూరు, ఢిల్లీ, ముంబై తదిరత ప్రాంతాల్లో ఎక్కువ అవకాశాలుంటాయి.

డేటా సైన్స్‌ స్పెషలిస్ట్‌

ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ సర్వీసెస్, ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్, ఈ–లెర్నింగ్‌ రంగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి. డేటాసైన్స్‌ స్పెషలిస్ట్‌లు పెద్ద మొత్తంలో డేటాను సేకరించి, అర్థం చేసుకుని వినియోగదారుల, మార్కెట్‌ పోకడలను విశ్లేషిస్తారు. వీరికి మెషిన్‌ లెర్నింగ్, డేటా సైన్స్, పైథాన్‌(ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌)లో నైపుణ్యాలుండాలి. నాలుగున్నరేళ్ల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత లభిస్తుంది. బెంగళూరు, నూఢిల్లీ, చెన్నైల్లో అధిక ఉద్యోగావకాశాలుంటాయి.

చీఫ్‌ లీగల్‌ ఆఫీసర్‌

నాన్‌–ప్రాఫిట్‌ ఆర్గనైజేషన్‌ మేనేజ్‌మెంట్, కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రంగాల్లో ఈ ఉద్యోగాలుంటాయి. చీఫ్‌ లీగల్‌ ఆఫీసర్‌లు.. సంస్థకు చెందిన న్యాయ విభాగానికి నాయకత్వం వహిస్తారు. ప్రధాన విషయాల్లో సంస్థకు దిశానిర్దేశం చేస్తూ, చట్టపరమైన సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటారు. వీరికి కార్పొరేట్‌ లా, టీమ్‌ మేనేజ్‌మెంట్, లీగల్‌ అడ్వైజ్‌ అంశాల్లో నైపుణ్యాలుండాలి. మూడున్నరేళ్ల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. న్యూఢిల్లీ, ముంబై, చెన్నైలలో ఎక్కువ అవకాశాలుంటాయి.

చ‌ద‌వండి: Job Trends: ఫైనాన్షియల్‌ రంగం.. కొలువులు, అర్హతలు, నైపుణ్యాలు

ఈ–బిజినెస్‌ మేనేజర్‌

ఆయిల్‌ అండ్‌ ఎనర్జీ, కన్సూ్యమర్‌ సర్వీసెస్, ఇన్సూరెన్స్‌ రంగాల్లో ఈ ఉద్యోగాలు లభిస్తాయి. ఈ–బిజినెస్‌ మేనేజర్‌లు వివిధ మార్కెట్‌ప్లేస్‌లతోపాటు ఇ–కామర్స్‌లోనూ సంస్థ ఉత్పత్తుల విక్రయం, పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తారు. వీరికి ఈ–బిజినెస్, బిజినెస్‌ డెవలప్‌మెంట్, టీమ్‌ మేనేజ్‌మెంట్‌ నైపుణ్యాలు అవసరం. ఐదేళ్ల అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం లభిస్తుంది. న్యూఢిల్లీ, బెంగళూరు, చెన్నైలలో ఎక్కువ ఉద్యోగావకాశాలుంటాయి.

బ్యాక్‌ ఎండ్‌ డెవలపర్‌

ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ సర్వీసెస్, కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్, ఇంటర్నెట్‌ రంగాల్లో ఈ ఉద్యోగాలు లభిస్తాయి. ఫ్రంట్‌ ఎండ్‌ వెబ్, మొబైల్‌ అప్లికేషన్ల కోసం అవసరమయ్యే సర్వర్‌–సైడ్‌ టెక్నాలజీ, కోడ్‌ను బ్యాక్‌ ఎండ్‌ డెవలపర్‌లు రూపొందిస్తారు. వీరికి నోడ్‌ జేఎస్, మాంగోడీబీ, జావాస్క్రిప్ట్‌ నైపుణ్యాలుండాలి. దాదాపు మూడేళ్ల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యతనిస్తారు. న్యూఢిల్లీ, బెంగళూరు, ముంబైల్లో ఎక్కువ అవకాశాలుంటాయి.

మీడియా బయ్యర్‌

మార్కెటింగ్‌ అండ్‌ అడ్వర్‌టైజింగ్, ఇంటర్నెట్, కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ రంగాల్లో ఈ ఉద్యోగాలు లభిస్తాయి. మీడియా బయ్యర్‌లు వివిధ మీడియా చానెళ్లలో ప్రకటనల ప్రభావాన్ని అంచనావేస్తూ.. నిర్దిష్ట ప్రకటనలను ఏ సమయంలో ప్రసారం చేయాలో నిర్ణయిస్తారు. వీరికి మీడియా బయ్యింగ్, అఫిలియేట్‌ మార్కెటింగ్, ఆన్‌లైన్‌ అడ్వర్‌టైజింగ్‌ అంశాల్లో నైపుణ్యాలు అవసరం. మూడేళ్ల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరులో ఎక్కువ అవకాశాలుంటాయి.

స్ట్రాటజీ అసోసియేట్‌

అకౌంటింగ్, ఫైనాన్షియల్‌ సర్వీసెస్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ సర్వీసెస్‌ రంగాల్లో ఈ ఉద్యోగాలు లభిస్తాయి. డేటా విశ్లేషణ, టాస్క్‌ల ప్రాధాన్యతలతో సంస్థల్లోని ప్రాజెక్టులను అమలుచేసే ప్రక్రియలను స్ట్రాటజీ అసోసియేట్‌లు క్రమబద్ధీకరిస్తారు. వీరికి స్ట్రాటజీ, మార్కెట్‌ రీసెర్చ్, ఫైనాన్షియల్‌ మోడలింగ్‌ అంశాల్లో నైపుణ్యాలుండాలి. దాదాపు రెండున్నరేళ్ల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం లభిస్తుంది. న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరులో ఎక్కువ అవకాశాలుంటాయి.

బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ రిప్రజెంటేటివ్‌

ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ సర్వీసెస్, ఇంటర్నెట్, కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ రంగాల్లో ఈ ఉద్యోగాలుంటాయి. బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ రిప్రజెంటేటివ్‌లు ప్రారంభ కెరీర్‌ విక్రయదారులుగా ఉంటూ.. క్లయింట్‌లను గుర్తించడం, వారిని చేరుకునే బాధ్యతలను నిర్వహిస్తారు. వీరికి ఇన్‌సైడ్‌ సేల్స్, బిజినెస్‌ డెవలప్‌మెంట్, లీడ్‌ జనరేషన్‌ అంశాల్లో నైపుణ్యాలు అవసరం. మూడేళ్ల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యతనిస్తారు. న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరులో ఎక్కువ అవకాశాలుంటాయి.

సర్వీస్‌ అనలిస్ట్‌

ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ సర్వీసెస్, ఫైనాన్షియల్‌ సర్వీసెస్, హాస్పిటల్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ రంగాల్లో ఎక్కువగా ఈ ఉద్యోగాలుంటాయి. సర్వీస్‌ అనలిస్ట్‌లు వినియోగదారుల సేవలకు సంబంధించిన నివేదికలను, పోకడలను విశ్లేషిస్తారు. వీరికి ఫార్మకోవిజిలెన్స్, ఇన్‌సిడెంట్‌ మేనేజ్‌మెంట్, టీం మేనేజ్‌మెంట్‌ నైపుణ్యాలుండాలి. మూడున్నరేళ్ల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం లభిస్తుంది. హైదరాబాద్, న్యూఢిల్లీ, బెంగళూరులో ఎక్కువ అవకాశాలుంటాయి.

 

చ‌ద‌వండి: Exam Guidance: కొత్త సంవత్సరంలో.. వీటిపై ప‌ట్టు.. కొలువు కొట్టు !

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Published date : 03 Feb 2022 07:17PM

Photo Stories