Skip to main content

Career Counselling Centres: ఇలాంటి విద్యార్థులకు మేలు చేసే కౌన్సెలింగ్‌!

కొత్తగా కాలేజీలో చేరిన విద్యార్థులు అక్కడి వాతావరణంలో ఇమడలేక ఇబ్బంది పడుతుంటారు. అదే సమయంలో చదువుల ఒత్తిడి, భవిష్యత్‌ గురించి బెంగ ఉండనేæ ఉంటుంది. ముఖ్యంగా ఐఐటీలు, ఐఐఎంలు వంటి విభిన్న ప్రాంతాల విద్యార్థులు చేరే ఇన్‌స్టిట్యూట్‌లలో ఈ సమస్య కొంత ఎక్కువే! విదేశీ యూనివర్సిటీల్లో అడుగుపెట్టిన విద్యార్థులదీ ఇదే పరిస్థితి. జాతీయ, అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఉంటారు. అకడమిక్‌గా కొత్త తరహా బోధన విధానాలు ఉంటాయి. దాంతో కొత్తగా క్యాంపస్‌లో అడుగుపెట్టిన విద్యార్థులు అకడెమిక్‌గా, కెరీర్‌ పరంగా ఆందోళన చెందుతుంటారు. ఇలాంటి వారికి ఉపశమనం కలిగించేలా.. ఆయా ఇన్‌స్టిట్యూట్‌లు కౌన్సెలింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. త్వరలో ఇంజనీరింగ్, మెడిసిన్‌ వంటి కోర్సుల్లో చేరే విద్యార్థులతోపాటు, స్టడీ అబ్రాడ్‌కు వెళ్తున్న విద్యార్థులకు ఉపయోగపడేలా.. ఆయా విద్యాసంస్థలు అనుసరిస్తున్న కెరీర్‌ కౌన్సెలింగ్‌పై విశ్లేషణాత్మక కథనం...
Career Counselling Career Guidance For students
Career Counselling Career Guidance For students
 • ఐఐటీలు, ఐఐఎంల్లో కెరీర్‌ కౌన్సెలింగ్‌ సెంటర్స్‌
 • విదేశీ యూనివర్సిటీల్లోనూ కౌన్సెలింగ్‌ సదుపాయాలు

ఐఐటీల్లో అడుగు పెట్టిన విద్యార్థుల్లో ఏటా సగటున అయిదు శాతం మంది చదువులు కొనసాగించలేక వెనుదిరుగుతున్నారనే గణాంకాలు;ఐఐఎంలలోనూ ఇదే పరిస్థితి. విదేశీ ఇన్‌స్టిట్యూట్‌లలోనైతే.. అక్కడి పరిస్థితులను ఆకళింపు చేసుకోలేక, వెనుదిరిగి రాలేక.. అవకాశాలు చేజార్చుకుంటున్న వారెందరో! చదువుల ఒత్తిళ్లు∙తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు జరుగుతున్నాయి. ఇలాంటి వారికి మేలు చేసేలా.. కెరీర్‌ కౌన్సెలింగ్‌ సెంటర్‌ల ద్వారా..అకడమిక్‌గా, వ్యక్తిగతంగా ఎలా వ్యవహరించాలనే విషయంపై విద్యార్థులకు కౌన్సెలింగ్‌ ఇస్తూ.. వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నాయి పలు యూనివర్సిటీలు,ఇన్‌స్టిట్యూట్‌లు. భవిష్యత్తు అవకాశాల గురించి ఆందోళనతోపాటు స్కిల్‌ గ్యాప్‌ సమస్యతో బాధపడుతున్న వారికి ఈ కౌన్సెలింగ్‌ సెంటర్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. 


సైకలాజికల్‌ కౌన్సెలింగ్‌

 • క్యాంపస్‌లో చేరిన విద్యార్థి.. కొత్త వాతావరణంలో ఇమిడిపోవాలంటే.. ముందుగా మానసికంగా ద్రుఢంగా ఉండాలి. ఆత్మవిశ్వాసం, ఆత్మస్థయిర్యం కలిగి ఉండాలి. దీన్ని గుర్తించిన ఐఐటీలు,ఐఐఎంలు ప్రత్యేకంగా కౌన్సెలింగ్‌–సెల్స్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాయి. వీటిద్వారా సమస్యలు ఎదుర్కొంటున్న విద్యార్థులకు నిపుణులైన మానసిక వైద్యులు..పరిష్కార మార్గాలు సూచిస్తున్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరిగేలా చర్యలు తీసుకుంటున్నారు.అకడమిక్‌ అంశాలకు సంబంధించి అకడమిక్‌ కౌన్సెలర్స్‌ద్వారా తగిన సలహాలు, సూచనలు ఇచ్చి తోడ్పాటు అందిస్తున్నారు. 
 • ముఖ్యంగా బీటెక్‌ మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థుల్లో ఒత్తిడి సమస్య ఎక్కువగా ఉంటోందని ఐఐటీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇంటర్‌/10+2 స్థాయిలో ఐఐటీ ఎంట్రెన్స్‌ల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పూర్తిగా పుస్తకాలకు అంకితమై.. సామాజిక పరిస్థితులపై అవగాహన పొందకపోవడమే కారణంగా చెబుతున్నారు. ఇలాంటి విద్యార్థులు ఐఐటీల క్యాంపస్‌ల్లో కనిపించే భిన్నమైన వాతావరణంలో ఇమడలేక ఇబ్బంది పడుతున్నారు. రెండేళ్ల క్రితం వరకు ఐఐటీల్లో డ్రాప్‌–అవుట్స్‌ రేటు దాదాపు పది శాతంగా ఉండేది. కౌన్సెలింగ్‌–కేంద్రాల ఫలితంగా గత రెండేళ్లుగా ఇది అయిదు శాతంలోపే ఉంటోందని ఐఐటీ వర్గాలు పేర్కొంటున్నాయి. 


కెరీర్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్స్‌
విద్యార్థులకు భవిష్యత్‌ అవకాశాల గురించి మార్గ నిర్దేశం చేసేందుకు ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లు.. కెరీర్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్స్, కెరీర్‌ సర్వీస్‌ సెంటర్ల పేరుతో ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేస్తున్నాయి. వీటిద్వారా విద్యార్థులకు వారు అభ్యసిస్తున్న కోర్సులకు అనుగుణంగా.. ఇండస్ట్రీ అవసరాలకు తగ్గట్టు నేర్చుకోవాల్సిన నైపుణ్యాల గురించి అవగాహన కల్పిస్తున్నాయి. స్కిల్‌ డవలప్‌మెంట్‌పై శిక్షణ కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నాయి. ఇండస్ట్రీ నిపుణులతో వెబినార్స్,సెమినార్స్‌ నిర్వహిస్తూ.. విద్యార్థులకు అందుబాటులో ఉన్న కెరీర్‌ మార్గాల గురించి తెలియజేస్తున్నాయి. ఇండస్ట్రీ నిపుణులతో మాట్లాడే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నాయి. ఫలితంగా విద్యార్థులకు వాస్తవ పరిస్థితులపై అవగాహన వస్తోంది. వ్యక్తిత్వ వికాసానికి కూడా ఆస్కారం లభిస్తోంది.


ప్లేస్‌మెంట్‌ కౌన్సెలింగ్‌
ఐఐటీలు, ఐఐఎంల్లో చేరితే..ప్లేస్‌మెంట్‌ పక్కా అనే అభిప్రాయం ఉంటుంది. విద్యార్థులు సైతం తమ భవిష్యత్తుకు ఢోకా ఉండదనే అభిప్రాయంతో ఉంటారు. వాస్తవానికి క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో విజయం సాధించే క్రమంలో.. ఐఐటీలు, ఐఐఎంల విద్యార్థులు ఎంతో ఒత్తిడికి గురవుతున్నట్లు చెబుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆయా ఇన్‌స్టిట్యూట్‌లు.. ప్లేస్‌మెంట్‌ కౌన్సెలింగ్‌ సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నాయి. వీటిద్వారా సదరు ప్లేస్‌మెంట్స్‌కు వస్తున్న సంస్థలు.. ఎంపిక ప్రక్రియ తీరుతెన్నులు.. పెంచుకోవాల్సిన నైపుణ్యాల గురించి ముందుగానే సంసిద్ధులను చేస్తున్నాయి. 


పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌
ఐఐటీలు, ఐఐఎంల్లో కౌన్సెలింగ్‌ సెంటర్లు.. విద్యార్థుల పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌పైనా దృష్టి పెడుతున్నాయి. విభిన్న ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు సరైన వ్యక్తిగత దృక్పథంపై నిపుణులు అవగాహన కల్పిస్తున్నారు. అలవర్చుకోవాల్సిన బిహేవియరల్‌ స్కిల్స్‌ గురించి శిక్షణ ఇస్తున్నారు. 


యాక్టివిటీ క్లబ్స్‌
ఐఐటీలు, ఐఐఎంలు.. విద్యార్థులు విభిన్న సంస్కృతుల్లో ఇమిడిపోయేలా.. యాక్టివిటీ క్లబ్స్‌ నిర్వహిస్తున్నాయి. వీటిద్వారా కల్చరల్‌ ఈవెంట్స్‌ నిర్వహించి.. విద్యార్థులను అందులో భాగస్వాములను చేస్తున్నారు. ఫలితంగా విద్యార్థుల్లో క్రాస్‌ కల్చరల్‌ స్కిల్స్‌ అలవడి.. త్వరగా అందరితో కలిసి పోయే అవకాశం ఏర్పడుతోంది. 


విదేశీ యూనివర్సిటీలు

 • అంతర్జాతీయ విద్యార్థుల కోసం అమెరికా, యూకే, కెనడా తదితర దేశాలకు చెందిన యూనివర్సిటీలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. క్యాంపస్‌లో అడుగుపెట్టక ముందే అక్కడి విద్యా విధానం, సంస్కృతి తదితర అంశాల గురించి విద్యార్థులకు తెలియజేస్తున్నాయి. అంతేకాకుండా విదేశీ యూనివర్సిటీలు.. కోర్సులు పూర్తి చేసుకున్నాక.. అక్కడ లభించే కెరీర్‌ అవకాశాల గురించి వివరించడం ద్వారా పలు దశల్లో తోడ్పాటునందిస్తున్నాయి.
 • ఉదాహరణకు అమెరికాలోని హార్వర్డ్‌ యూనివర్సిటీ.. కౌన్సెలింగ్‌ సర్వీసెస్‌ అండ్‌ అదర్‌ అసిస్టెంట్‌ పేరుతో.. విదేశీ విద్యార్థులకు కౌన్సెలింగ్‌ సదుపాయం కల్పిస్తోంది. అంతేకాకుండా విద్యార్థులు మానసిక ఒత్తిడిని అధిగమించేలా యూనివర్సిటీ హెల్త్‌ సర్వీసెస్‌ పేరుతో ప్రత్యేక కేంద్రాన్ని నిర్వహిస్తోంది. విద్యార్థులు అక్కడి క్యాంపస్‌ వాతావరణంలో త్వరగా ఇమిడి పోయేలా నిపుణులతో కౌన్సెలింగ్‌ ఇప్పిస్తోంది.
 • యూకేకు చెందిన ప్రముఖ విశ్వవిద్యాలయం.. కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ కూడా స్టూడెంట్‌ సర్వీసెస్‌ సెంటర్‌ పేరిట.. పర్సనల్, అకడమిక్, కెరీర్‌ కౌన్సెలింగ్, స్కిల్‌ డవలప్‌మెంట్‌ తదితర విషయాల్లో కౌన్సెలింగ్‌ సదుపాయాన్ని కల్పిస్తోంది.


స్టూడెంట్‌ సపోర్ట్‌ సెంటర్స్‌
విదేశాలకు చెందిన పలు యూనివర్సిటీలు ఇంటర్నేషనల్‌ స్టూడెంట్‌ సపోర్ట్‌ సెంటర్స్‌ను ఏర్పాటు చేసి.. అంతర్జాతీయ విద్యార్థులకు పలు రకాలుగా తోడ్పాటు అందిస్తున్నాయి. ముఖ్యంగా విద్యార్థుల్లో క్రాస్‌ కల్చరల్‌ స్కిల్స్‌ పెరిగేలా చర్యలు తీసుకుంటున్నాయి. ఫలితంగా వివిధ దేశాలకు చెందిన విద్యార్థులతో కలిసిపోయేలా చేస్తున్నాయి. దీంతో విద్యార్థులు అకడమిక్‌గా మంచి ప్రతిభ కనబరచడంతోపాటు వ్యక్తిత్వ వికాసానికి వీలు కలుగుతోంది. 


అలూమ్నీ అసోసియేషన్స్‌
ఆయా ప్రముఖ ఇన్‌స్టిట్యూట్స్‌/యూనివర్సిటీల్లో అడుగు పెట్టిన విద్యార్థులకు.. అప్పటికే సదరు విద్యాసంస్థలో కోర్సులు పూర్తి చేసుకొని.. ఉన్నత స్థాయికి చేరుకున్న పూర్వ విద్యార్థులు ప్రోత్సహిస్తున్నారు. మన దేశంలో ముఖ్యంగా ఐఐటీలు, ఐఐఎంల్లో ఇలాంటి అలూమ్నీ అసోసియేషన్స్‌ విద్యార్థులకు పలు రకాలుగా చక్కటి తోడ్పాటును అందిస్తున్నాయి. అమెరికాలో.. భారతీయ విద్యార్థులకు చెందిన దాదాపు యాభైకు పైగా అలూమ్నీ అసోసియేషన్లు.. ఆ దేశంలో అడుగుపెట్టిన భారతీయ విద్యార్థులకు పర్సనల్, అకడమిక్, కెరీర్‌ పరంగా తోడ్పాటునందిస్తున్నాయి. యూకేలో కూడా నేషనల్‌ ఇండియన్‌ స్టూడెంట్స్‌ అండ్‌ అలూమ్నీ యూనియన్, ఐఐటీ లండన్‌ అలూమ్నీ అసోసియేషన్‌ తదితర పూర్వ విద్యార్థుల సంఘాలు.. అక్కడి ఇన్‌స్టిట్యూట్‌లో కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు పలు రకాల కౌన్సెలింగ్‌ సదుపాయాలు కల్పిస్తున్నాయి.


‘కౌన్సెలింగ్‌’ బాట

 • ఇటీవల ఓ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం–ప్లస్‌ టూ విద్యార్థుల్లో 80 శాతం మంది తమకు కౌన్సెలింగ్‌ కావాలని కోరుకోవడం గమనార్హం.
 • ఈ కౌన్సెలింగ్‌ కూడా కేవలం వ్యక్తిగత అంశాలకే పరిమితం కాకుండా.. భవిష్యత్తు కెరీర్‌ అవకాశాలు, స్కిల్‌ గ్యాప్‌లకు సంబంధించి ఉండాలని పేర్కొన్నారు.
 • ప్రస్తుత పరిస్థితుల్లో యూజీ, పీజీ స్థాయిలో అకడమిక్, పర్సనల్‌ కౌన్సెలింగ్‌ ఆవశ్యకత పెరిగిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనికి అనుగుణంగానే ఇన్‌స్టిట్యూట్‌లు అడుగులు వేస్తున్నాయని పేర్కొంటున్నారు.


కౌన్సెలింగ్‌... ముఖ్యాంశాలు

 • ఐఐటీలు, ఐఐఎంలలో కౌన్సెలింగ్‌ సెల్స్‌ ఏర్పాటు.
 • పర్సనాలిటీ డెవలప్‌మెంట్, కెరీర్‌ డెవలప్‌మెంట్‌ అంశాలపై కౌన్సెలింగ్‌
 • స్ట్రెస్‌ మేనేజ్‌మెంట్‌ కోసం ప్రత్యేకంగా మానసిక వైద్యుల నియామకం
 • కౌన్సెలింగ్‌ కేంద్రాల ఫలితంగా తగ్గిన డ్రాప్‌–అవుట్స్‌.
 • అంతర్జాతీయ విద్యార్థులకు కౌన్సెలింగ్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న విదేశీ యూనివర్సిటీలు.
 • స్టూడెంట్‌ క్లబ్స్, యాక్టివిటీ క్లబ్స్‌ పేరిట అకడమిక్, కల్చరల్‌ ఈవెంట్స్‌ నిర్వహణ.ఒత్తిడి తగ్గించేందుకే
ఐఐటీల్లో అడుగు పెట్టిన విద్యార్థులు ఇక్కడ కనిపించే భిన్నమైన వాతావరణంలో ఇమడలేక ఒత్తిడికి గురవుతున్నారు. ఇది వారి అకడమిక్స్‌పై ప్రతికూల ప్రభావం చూపుతోంది. అందుకే ఐఐటీలు కౌన్సెలింగ్‌ సెంటర్స్‌ను ఏర్పాటు చేసి.. విద్యార్థులకు తోడ్పాటునందిస్తున్నాయి. దీంతో విద్యార్థులు ఆందోళన వీడి ఆహ్లాదకర వాతావరణంలో చదువుకొని.. రాణించేందుకు అవకాశం ఏర్పడుతోంది.
–ప్రొ‘‘ కె.శ్రీనివాస్‌ భాస్కర్, 
ప్రొఫెసర్‌ ఇంఛార్జ్‌– కౌన్సెలింగ్, 
ఐఐటీ–భువనేశ్వర్‌

 

 

Published date : 14 Sep 2021 05:23PM

Photo Stories