AP DEECET-2021: ఇంటర్‌తోనే ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశానికి మార్గం.. ప్రిపరేషన్ ఇలా..
ఇంటర్‌తోనే ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశానికి మార్గం..డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీ.ఈఎల్.ఈడీ). ఈ కోర్సులో ప్రవేశం పొందాలంటే.. డిపొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(డీఈఈసెట్)లో అర్హత సాధించాల్సి ఉంటుంది. ఏపీ డీఈఈ సెట్‌లో సాధించిన ర్యాంకు ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్‌లు(డైట్), ఎయిడెడ్, మైనారిటీ, అలాగే ప్రయివేట్ ఎలిమెంటరీ టీచర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌లో.. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సులో ప్రవేశం కల్పిస్తారు. ఈ కోర్సు కాలవ్యవధి రెండేళ్లు.
అర్హతలు
- ఇంటర్ లేదా తత్సమాన పరీక్షల్లో కనీసం 50శాతం మార్కులు సాధించిన అభ్యర్థులు ఏపీ డీఈఈసెట్ 2021కు దరఖాస్తుకు అర్హులు. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు కనీసం 45శాతం మార్కులు సాధించాలి. ఆయా కోర్సుల చివరి ఏడాది పరీక్షలు రాస్తున్న వారు కూడా దరఖాస్తుకు అర్హులే.
- ఇంటర్ ఒకేషనల్ కోర్సుల అభ్యర్థులు డీఈఈసెట్‌కు అర్హులు కాదు.
- వయసు: 01.09.2021 నాటికి 17ఏళ్లు నిండిన అభ్యర్థులంతా డీఈఈసెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్షకు సంబంధించి ఎలాంటి గరిష్ట వయోపరిమితి నిబంధన లేదు.
పరీక్ష విధానం
ఏపీ డీఈఈసెట్ పరీక్ష రెండు పార్ట్‌లుగా మొత్తం వంద మార్కులకు నిర్వహిస్తారు. పార్ట్–ఏ 60 మార్కులకు, పార్ట్–బీ 40 మార్కులకు ప్రశ్న పత్రం ఉంటుంది. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. ఈ పరీక్షను తెలుగు/ఇంగ్లిష్/తమిళం/ఉర్దూ మాధ్యమాల్లో నిర్వహిస్తారు. అభ్యర్థి తనకు నచ్చిన మీడియంలో పరీక్షను రాయవచ్చు.
పార్ట్–ఏ(60 మార్కులు)
- ఈ విభాగంలో టీచింగ్ అప్టిట్యూడ్–05,జనరల్ నాలెడ్జ్–05, ఇంగ్లిష్–05, తెలుగు–05, ఆప్షనల్ లాంగ్వేజ్(తెలుగు, ఇంగ్లిష్, తమిళం, ఉర్దూలో ఏదో ఒకటి)–10, మ్యాథ్స్–10, జనరల్ సైన్స్–10, సోషల్ స్టడీస్ నుంచి 10 చొప్పున ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు.
- సబ్జెక్ట్, లాంగ్వేజ్ ప్రశ్నలన్నీ 6–10 తరగతి స్థాయి సిలబస్ నుంచే ఉంటాయి.
పార్ట్–బీ (40 మార్కులు)
- దీనికి సంబంధించిన ప్రశ్న పత్రం అభ్యర్థులు చదివిన ఇంటర్ గ్రూప్, ఎంపిక చేసుకున్న విభాగాన్ని బట్టి మారుతుంది. మ్యాథమెటిక్స్/ఫిజికల్ సైన్స్/బయాలజీ/సోషల్ స్టడీస్ నుంచి 40 ప్రశ్నలు–40 మార్కులకు అడుగుతారు. –ప్రశ్నలు ఇంటర్ సిలబస్ స్థాయిలో ఉంటాయి.
కనీసం 35 శాతం మార్కులు
మొత్తం వంద మార్కులకు జరిగే డీఈఈసెట్‌లో.. ఓసీ/బీసీ అభ్యర్థులు కనీసం 35 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు కనీసం 25 శాతం మార్కులు పొందాలి.
ప్రిపరేషన్ ఇలా
- డీఈఈసెట్ అభ్యర్థులు ఎంపిక చేసుకున్న గ్రూప్‌ను అనుసరించి ఇంటర్ స్థాయి పాఠ్యపుస్తకాలను బాగా చదవాలి. పరీక్షల్లో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సబ్జెక్టులకు సమాన ప్రాధాన్యం ఉంది.
- అదే విధంగా పాఠశాల స్థాయి 8, 9, 10 తరగతుల మ్యాథ్స్, సైన్స్, తెలుగు, సోషల్, ఇంగ్లిష్ పుస్తకాలు తప్పకుండా చదవాలి.
- సిలబస్ ఎక్కువ కాబట్టి గత పరీక్షల ప్రశ్నల సరళిని నిశితంగా పరిశీలించాలి.
- ఇంటర్‌లో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సిలబస్‌లోని కీలకాంశాలపై దృష్టిపెట్టి చదవాలి.
- అలాగే 6 నుంచి 10వ తరగతుల సిలబస్‌లోని భావనలు, సూత్రాలు, సిద్ధాంతాలు రివైజ్ చేసుకోవాలి.
- తెలుగు, ఇంగ్లిష్ వ్యాకరణాంశాలు పదోతరగతి స్థాయివి నేర్చుకోవాలి. అలాగే టీచింగ్ అప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్ అంశాలను ప్రత్యేక శ్రద్ధతో సన్నద్ధమవ్వాలి. ఇప్పటి నుంచే ప్రణాళిక ప్రకారం చదివితే ఆశించిన ర్యాంకు సొంతం చేసుకోవచ్చు.
- చదివేటప్పుడు షార్ట్‌నోట్స్ తయారు చేసుకుంటే రివిజన్ సులువు అవుతుంది.
- గత ప్రశ్నపత్రాలు, మోడల్ పేపర్లను ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. దీనివల్ల చేసే పొరపాట్లను సవరించుకోవచ్చు.
సీట్ల కేటాయింపు ఇలా
- డీఈఈసెట్ కౌన్సెలింగ్ ద్వారా సీట్ల కేటాయింపు జరుగుతుంది. 85 శాతం సీట్లను స్థానికులతో భర్తీ చేస్తారు. మిగిలిన 15 శాతం సీట్లకు అందరూ పోటీపడవచ్చు.
- ప్రభుత్వ డైట్లలో వందశాతం, మిగిలిన సంస్థల్లో 80శాతం సీట్లు కన్వీనర్ కోటాలో కేటగిరి–ఏ కింద భర్తీ చేస్తారు. ప్రైవేట్, మైనార్టీ సంస్థల్లో 20 శాతం సీట్లు కేటగిరి–బీ కింద భర్తీ చేస్తారు.
సబ్జెక్ట్ వారీగా సీట్లు
- ఇంటర్‌లో చదివిన గ్రూపుల వారీగా డైట్లలో సీట్లు కేటాయిస్తారు. మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ ఒక్కో విభాగానికి 25 శాతం చొప్పున సీట్లు లభిస్తాయి.
- మ్యాథ్స్,ఫిజికల్ సైన్స్ సీట్లను ఎంపీసీ, బయలాజికల్ సైన్స్ సీట్లను బైపీసీ వారికి కేటాయిస్తారు. సోషల్ స్టడీస్ సీట్లకు మాత్రం సీఈసీ, హెచ్‌ఈసీ గ్రూపులవారు పోటీపడవచ్చు.
కోర్సు అనంతరం
విజయవంతంగా రెండేళ్ల డీఎడ్ కోర్సును పూర్తిచేసుకున్నవారు ఒకటో తరగతి నుంచి అయిదు తరగతుల విద్యార్థుల వరకు బోధించే అవకాశం కలుగుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో నియామకాలకు సంబంధించి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ వెలువడినప్పుడు... సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్‌జీటీ) పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన సమాచారం
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 15.10.2021
హాల్‌టికెట్స్ డౌన్‌లోడ్: 21.10.2021
డైట్ సెట్ పరీక్ష తేదీలు: 26.10.2021, 27.10.2021
వెబ్‌సైట్: https://cse.ap.gov.in , https://apdeecet.apcfss.in
చదవండి: BTech Cadet Entry Scheme: చదువు పూర్తికాగానే... రూ.లక్ష వేతనంతో కొలువు
7855 Clerk Posts: ప్రభుత్వరంగ బ్యాంకుల్లో.. క్లర్క్ కొలువుల పిలుపు