Skip to main content

TGPSC Group 1 86th Ranker Success Storie: నాన్నే నాకు రోల్‌ మోడల్‌..

TGPSC Group 1 86th Ranker Success Storie
TGPSC Group 1 86th Ranker Success Storie

టీజీపీఎస్సీ గ్రూప్-1లో 86వ ర్యాంకు సాధించిన మహ్మద్ విలాయత్ అలీ

గ్రూప్స్‌లో ఘన విజయం
హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నేలు గ్రామానికి చెందిన మహ్మద్ విలాయత్ అలీ ఇటీవల ప్రకటించిన టీజీపీఎస్సీ గ్రూప్-1 ఫలితాల్లో 489.5 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 86వ ర్యాంకు సాధించారు. జోనల్ స్థాయిలో బీసీ-ఈ కేటగిరీలో మొదటి ర్యాంకు సాధించి నిరుపేద యువతకు ఆదర్శంగా నిలిచారు.

దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి ఉన్నత శిఖరాలకు
విలాయత్ అలీ ఓ దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చారు. తండ్రి మహబూబ్ అలీ, తల్లి షమీమ్, నలుగురు సోదరీమణులతో కూడిన కుటుంబంలో పెరిగిన ఆయన చిన్నప్పటి నుంచే పేదరికాన్ని ఎదుర్కొన్నారు. తండ్రి కష్టాన్ని తగ్గించాలనే పట్టుదలతో విద్యలో మెరుగైన స్థాయికి ఎదగాలని సంకల్పించుకున్నారు.

కలెక్టర్‌ను చూసి ప్రేరణ పొందిన విలాయత్ అలీ
మామునూరు స్కూల్‌లో చదువుతున్నప్పుడు కలెక్టర్లు పర్యటించడం చూసి మహ్మద్ విలాయత్ అలీ ఇన్‌స్పైర్ అయ్యారు. కలెక్టర్ అయితే పేద ప్రజలకు సేవ చేయడంతో పాటు కుటుంబ స్థితిని మెరుగుపరచగలమని భావించి ఆ దిశగా ప్రయత్నం మొదలుపెట్టారు.

బీటెక్ నుంచి గ్రూప్స్ వరకు ప్రయాణం
2021లో బీటెక్ పూర్తి చేసిన మహ్మద్ విలాయత్ అలీ, కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగోలేక టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం పొందారు. అయితే గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలవడంతో, ఉద్యోగాన్ని వదిలేసి పూర్తి స్థాయిలో గ్రూప్స్ ప్రిపరేషన్ ప్రారంభించారు. వరంగల్ సెంట్రల్ లైబ్రరీలో కష్టపడి చదివి తొలి ప్రయత్నంలోనే 86వ ర్యాంకు సాధించారు.

కోచింగ్ లేకుండానే ఐఏఎస్ ప్రిపరేషన్
బీటెక్ చదువుతున్నప్పటి నుంచే ఐఏఎస్‌ మేటీరియల్ స్వయంగా తయారుచేసుకొని అధ్యయనం చేశారు. ఐఏఎస్, ఐపీఎస్‌లుగా ఎదిగిన వారిని చూసి ప్రేరణ పొందుతూ వారి ఇంటర్వ్యూలను గంటల తరబడి విశ్లేషించేవారు. స్వతహాగా స్ట్రాటజీలు రూపొందించుకొని చదివి ఉన్నత ర్యాంకు సాధించగలిగారు.

జోనల్ స్థాయిలో బీసీ-ఈ టాప్ ర్యాంక్
తెలంగాణ రాష్ట్ర స్థాయిలో 86వ ర్యాంకుతో పాటు జోనల్ స్థాయిలో బీసీ-ఈ కేటగిరీలో మొదటి స్థానం పొందడం మహ్మద్ విలాయత్ అలీకి పెద్ద గౌరవాన్ని తెచ్చిపెట్టింది. ర్యాంక్ ప్రకారం డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

తండ్రే రోల్ మోడల్
"నా తండ్రి మహబూబ్ అలీనే నా రోల్ మోడల్. ఆయన కష్టమే నన్ను నా లక్ష్యానికి నడిపించింది" అని గర్వంగా చెబుతున్న మహ్మద్ విలాయత్ అలీ, కుటుంబ సభ్యులను ఆనందంగా ఉంచడమే తన ప్రస్తుత లక్ష్యం అని అన్నారు.

Published date : 03 Apr 2025 03:57PM

Photo Stories