Skip to main content

New Job Opportunities 2025 : వీళ్ల చూపు కూడా.. కొత్త ఉద్యోగాల వైపే... కార‌ణం ఇదే...!

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఎక్కువ మంది ఈ ఏడాది కొత్త ఉద్యోగం కోసం అన్వేషించనున్నారు. ఈ అన్వేషణ ఇంతకుముందెన్నడూ లేనంత కఠినంగా ఉండనున్నట్టు ప్రొఫెషనల్‌ నెట్‌వర్క్‌ ప్లాట్‌ఫామ్‌ లింక్డెన్‌ ఇండియా నిర్వహించిన అధ్యయనంలో తెలిపింది.
New Job Opportunities 2025

అర్హతలు ఉన్న నిపుణులను గుర్తించడం సవాలుగా 69 శాతం మంది హెచ్‌ఆర్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వచ్చిన దరఖాస్తుల పరిశీలన కోసం హెచ్‌ఆర్‌ నిపుణులు రోజులో 3-5 గంటల సమయాన్ని వెచ్చిస్తున్నారు. 49 శాతం మంది గతంలో కంటే ఎక్కువ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. అన్ని అర్హత ప్రమాణాలు సరితూగే దరఖాస్తుదారులు సగం కంటే తక్కువే ఉంటున్నట్టు 55 శాతం హెచ్‌ఆర్‌ నిపుణులు చెబుతున్నారు. 

జాబ్‌ మార్కెట్‌ కఠినంగా మారుతోంది. ఉద్యోగాన్వేషణ మరింత ఆలోచనాత్మకంగా ఉండాలని ఇది సంకేతమిస్తోంది. మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించడం ద్వారా సవాళ్లతో కూడిన ఉద్యోగ మార్కెట్‌లోనూ కొత్త అవకాశాలను సొంతం చేసుకోవడమే కాకుండా, కెరీర్‌లో మంచి వృద్ధిని చూడొచ్చు అని లింక్డెన్‌ ఇండియా సీనియర్‌ మేనేజింగ్‌ ఎడిటర్, కెరీర్‌ ఎక్స్‌పర్ట్‌ నిరజిత బెనర్జీ అన్నారు.

గతేడాది నవంబర్‌ 27 నుంచి డిసెంబర్‌ 16 మధ్య ఈ అధ్యయనం జరిగింది. ఇందులో 22,010 మంది నిపుణులు పాల్గొన్నారు. భారత్‌తోపాటు, స్పెయిన్, ఐర్లాండ్, బ్రెజిల్, యూఎస్, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, యూఏఈ, ఆస్ట్రేలియా, జపాన్, స్వీడన్, సింగపూర్, నెదర్లాండ్స్‌ తదితర దేశాల్లో అధ్యయనం కొనసాగింది.

మహిళలు మరిన్ని ఉద్యోగాలు ఇలా...?
ఎయిర్‌క్రాఫ్ట్‌ మెయింటెనెన్స్‌ ఇంజనీర్, రోబోటిక్స్‌ టెక్నీషియన్, క్లోజింగ్‌ మేనేజర్‌ ఈ ఏడాది భారత్‌లో ఎక్కువ వృద్ధి చెందే ఉద్యోగాలుగా లింక్డెన్‌ తెలిపింది. భారత్‌లో ప్రతి ఐదుగురు వృత్తి నిపుణుల్లో ముగ్గురు కొత్త రంగంలో, కొత్త విభాగంలో ఉద్యోగానికి సంసిద్ధంగా ఉండగా.. కొత్త అవకాశాలను సొంతం చేసుకునేందుకు వీలుగా నైపుణ్యాలను నేర్చుకోనున్నట్టు 39 శాతం మంది చెప్పారు. భవిష్యత్తులో ప్రతి ఉద్యోగానికి సంబంధించిన విలువను కృత్రిమ మేథ (ఏఐ) పెంచనున్నట్టు ఈ అధ్యయనం తెలిపింది. మహిళలు మరిన్ని ఉద్యోగ పాత్రల్లోకి అడుగుపెట్టున్నట్టు పేర్కొంది.

ఈపీఎఫ్‌ఓ సభ్యత్వంలో 4.88 శాతం పెరుగుదల ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (ఈపీఎఫ్‌ఓ)లో సభ్యత్వం నవంబర్‌లో 4.88 శాతం (2023 నవంబర్‌తో పోల్చి) పెరిగింది. ఉపాధి పెరుగుదలను సూచిస్తూ సమీక్షా నెల్లో ఈపీఎఫ్‌ఓలో 14.63 లక్షల నికర సభ్యత్వం నమోదయినట్లు తాజా పేరోల్‌ గణాంకాలు పేర్కొన్నాయి. ఇక 2024 అక్టోబర్‌తో పోల్చితే నికర సభ్యత్వం నెలవారీగా 9.07 శాతం పెరగడం గమనార్హం

నవంబర్‌లో నికర మహిళా సభ్యుల చేరిక 3.13 లక్షలు. అక్టోబర్‌తో పోల్చితే ఇది 12.16 శాతం అధికం. వార్షిక పెరుగుదల 11.75 శాతం. నెలలో 20.86 శాతం నికర సభ్యుల చేరికతో మహారాష్ట్ర ముందుంది. మహారాష్ట్ర తర్వాత ఐదు శాతానికిపైగా సభ్యత్వ నమోదులతో కర్ణాటక, తమిళనాడు, హర్యానా, గుజరాత్, ఢిల్లీ, తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌లు నిలిచాయి.

ఎక్కువ మంది కోరుకున్న జాబ్స్ ఇవే...
మంచి ఉద్యోగం అన్నది ప్రతిఒక్కరి కల. ప్రతి రంగంలోనూ ఎక్కువమందికి ఆసక్తిగా ఉన్న ఉద్యోగాలు కొన్ని ఉంటాయి. అలాంటి వాటిలో ఏ ఉద్యోగాలను ఎక్కువ మంది కోరుకుంటున్నారో తెలుసుకోవడానికి రెమిటీ (Remitly) అనే సంస్థ 186 దేశాల నుంచి గూగుల్‌ (Google) శోధనలను విశ్లేషించి ఒక అధ్యయనం చేసింది.

2024లో ఎలాంటి జాబ్ కావాలి.. ఎలా అవ్వాలి? (how to become) అని వ్యక్తులు ఎన్నిసార్లు సెర్చ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత జనాదరణ పొందిన కెరీర్‌లను ఈ అధ్యయనం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది శోధించిన ఉద్యోగం పైలట్ (pilot). దీని కోసం 4,32,000 కంటే ఎక్కువ శోధనలు ఉన్నాయి. చెక్ రిపబ్లిక్, ఈజిప్ట్,స్లోవేకియాతో సహా 25 దేశాల్లో ఇది అత్యుత్తమ కెరీర్ ఎంపిక. తర్వాత 3,93,000 శోధనలతో లాయర్ వృత్తి రెండవ స్థానంలో నిలిచింది. మునుపటి సంవత్సరాలతో పోలిస్తే ఆసక్తిలో బాగా పెరుగుదల కనిపించింది. ఇతర ఉన్నత ఉద్యోగాలలో పోలీసు అధికారి (2,72,000 శోధనలు), ఫార్మసిస్ట్ (2,72,630), నర్సు (2,48,720) ఉన్నాయి. గత రెండేళ్లలో పోలీసు వృత్తిపై ఆసక్తి 440 శాతం పెరిగింది.

యూట్యూబర్‌గా మారడం ఎలా...?
ప్రపంచవ్యాప్తంగా చాలా మంది కలలు కన్న సోషల్ మీడియా కెరీర్ యూట్యూబర్‌. యూట్యూబర్‌గా మారడం ఎలా అని 1,71,000 శోధనలు వచ్చాయి. యూకే, సింగపూర్, ఇండోనేషియాతో సహా 13 దేశాలలో అత్యధికంగా శోధించిన ఉద్యోగం ఇదే. అయితే 2022 నుంచి ఈ కెరీర్‌పై ఆసక్తి 11% తగ్గింది. ఇతర డిజిటల్ కెరీర్‌ల విషయానికి వస్తే.. కంటెంట్ క్రియేటర్‌ 52,000 శోధనలను, సోషల్ మీడియా మేనేజర్ 36,000 శోధనలను పొందాయి. టెక్ ఫీల్డ్ కూడా ఆసక్తిని ఆకర్షిస్తోంది. కోడింగ్ 48,000 శోధనలతో అధిక ర్యాంక్‌ను పొందింది.

డిమాండ్‌లో ఈ ఉద్యోగాలు
హెల్త్‌కేర్ అనేది ఎక్కువ మంది కోరుకునే కెరీర్ మార్గాలలో ఒకటి. 272,000 శోధనలతో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా శోధించి హెల్త్‌కేర్ జాబ్‌ ఫార్మసిస్ట్. ఇది ముఖ్యంగా జపాన్‌లో జనాదరణ పొందింది. ఇతర టాప్ హెల్త్‌కేర్ కెరీర్‌లలో ఫిజికల్ థెరపిస్ట్ (2,44,000 శోధనలు), టీచర్ (1,75,000), డైటీషియన్ (170,000) ఉన్నాయి.

పోలీసు ఉద్యోగాలు కూడా..
పబ్లిక్ సర్వీస్‌లో 2,72,730 శోధనలతో పోలీసు అధికారి ఉద్యోగం అగ్రస్థానంలో ఉంది. తర్వాత నర్సింగ్, మిడ్‌వైఫరీ, అగ్నిమాపక విభాగాలు ఉన్నాయి. డాక్టర్ కావాలనే ఆసక్తి పెరిగినప్పటికీ, నర్సింగ్, మిడ్‌వైఫరీ కెరీర్‌ల గురించి ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా శోధిస్తున్నారు.

దాదాపు 2,00,000 శోధనలతో అత్యధికంగా..
కళలు, వినోద ప్రపంచంలో, దాదాపు 2,00,000 శోధనలతో అత్యధికంగా శోధించిన సృజనాత్మక వృత్తి నటన. ఇతర ప్రసిద్ధ ఎంపికలలో వాయిస్ యాక్టింగ్‌, డీజే, సింగింగ్‌ ఉన్నాయి. ఫుట్‌బాల్ ఆటగాడిగా ఎలా మారాలి అని 95,000 శోధనలతో స్పోర్ట్స్ కెరీర్‌పై ఎక్కువ మంది ఆస​క్తి కనబరిచారు. ఇది కాకుండా వ్యక్తిగత శిక్షకులు, కోచ్‌ల వంటి ఫిట్‌నెస్-సంబంధిత కెరీర్‌లు ఆదరణ పొందాయి.

Published date : 25 Jan 2025 10:21AM

Photo Stories